Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 7
మున్నుడి
చెవులు విప్పి మనసు విప్పి
కనులు విచ్చి వినవయ్యా
కేథలిక్కు కెన్నెడీ
బోల్షివిక్కు మున్నుడి
అరువు లిచ్చి కరువు తెచ్చి
ఋణం పెట్టి రణం తెచ్చి
జనం ధనం ఇంధనమై
చరణ కరాబంధనమై
జనన జరా మరణ దురా
క్రమణల సంగ్రంథనమై
ఒకనా డొహో అని పిం
చుక తిరిగిన ధనిక వాద
మికపై వెగటై జిగటై
మరణంలో మశౌతుంది
వినవయ్యా కెన్నెడీ
విశాలాంధ్ర మున్నుడి
* * *
కేథలిక్కు కెన్నెడీ
జీవితమే నిన్నది
భావనలే మొన్నవి
క్యూబా ఏమన్నది
లావోస్ ఏమన్నది
కాంగో నిలుచున్నది
ఐసన్ హోవర్ చేసిన
మోసం తాలూకు అసలు
వేసం ఈనాడు
ఎగిరివచ్చి నిజం సైకి
లెక్కి వచ్చి జనం తిరుగు
బాటుచేసి ఆకలేసి
పిడికెడు కబళం కావా
లని యడిగిన తరుణంలో
లుముంబాను తిన్నావు
కుటుంబాలు కొన్నావు
అమెరికాల కాలు విరిగె
ఆఫ్రికాకు నోరు తిరిగె
ఆసియాకు ఆశరగిలె
ఆస్ట్రో ఆఫ్రో ఏష్యన్
కాస్ట్రోలకు కనులు విరిసె
ఏమంటావ్ కెన్నెడీ
ఈ శ్రీశ్రీ సన్నిధి
చంపేస్తానని నీకో
సందేహం ఉండవచ్చు
సర్దేస్తానని నీకో
సమాధాన ముండవచ్చు
నీ టాంకులు నీ బాంబులు
విమానాలు విధానాలు
శ్మశానాలు చూస్తాయి
ప్రశాంతినే హరిస్తాయి
నీ సలహాదారులతో
నీ కలహాచారులతో
పెంటగనుల తుంటరులను
వెంటబెట్టుకుని వస్తే
రాకెట్లను విసురుతాం
నీ కట్లను విప్పుతాం
జాకెట్లను సవరించి
పాకెట్లను సరిదిద్ది
నీ మతాన్ని నీ హితాన్ని
నీ గతాన్ని కెలుకుతాం
చీకట్లను తరుముతాం
నీ హిట్లరు పాతదనం
చావాలని కసరుతాం
విన్నావా కెన్నెడీ
శ్రీ శ్రీ శ్రీ మున్నుడి
_ విశాలాంధ్ర - 21.4.1961
Previous Page
Next Page