"మాది వరదయ్యపాలెం బాబూ ! ఇందాకే యాక్సిడెంట్ జరిగింది పాపం ఎవరో కుర్రాడు చచ్చిపోయాడు. నిండా ముప్పై ఏళ్ళు కూడా వుండవు. బస్సు వెధవ గుద్ది పారిపోయాడు."
"మరి నువ్వెందుకున్నావిక్కడ?"
"ఏం లేదు బాబూ. శవాన్ని నక్కలో, తోడేళ్లో లాక్కుపోతాయని కాపలా వున్నాను బాబూ. శవాన్ని ఏవైనా జంతువులు పీక్కుతిన్నాక దహనం చేయకూడదు బాబూ. అది ప్రపంచానికి అరిష్టం. అందుకే ఇక్కడ వున్నాను బాబూ. తమరెవరు?"
"నేను బుచ్చిరెడ్డిపాలెం ఔట్ పోస్ట్ కానిస్టేబుల్ ని. శవం కాపలాకు వచ్చాను. తెల్లవారాక శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్ళాలి. డ్యూటీమీద వచ్చాను"
అప్పటికి నా అదురు తగ్గింది.
"డ్రస్ చూసే అనుకున్నా బాబూ తమరు పోలీసని."
"నువ్వేం చేస్తుంటావ్ పెద్దాయనా?"
"అప్పుడెప్పుడో టైలరింగ్ చేసేవాడ్ని. ఇప్పుడేం చేయడం లేదు బాబూ."
నేను బిక్కు బిక్కుమంటూ చూశాను ఆయనవేపు.
నా చూపులను పసిగట్టినట్టున్నాడు "ఈ అబ్బాయ్ ఎవరు?" అనడిగాడు మామయ్యను.
"మా మామయ్య కొడుకు" జవాబు చెప్పినా తల నిమిరాడు మామయ్య.
"ఈ వేళప్పుడు అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు బాబూ?"
"నాకు తోడుగా తీసుకొచ్చాను. మాట్లాడేందుకు మనిషి కూడా వుండడని వెంట పిలుచుకొచ్చాను" చెప్పాడు మామయ్య.
"సరే బాబూ! వస్తాను. మీరొచ్చారు గదా. ఇక శవానికి నా కాపలా అక్కర్లేదు" అని చేతులు జోడించాడు ముసలాయన.
"ఇంతకీ నీ పేరు?"
"పరంధామయ్య" అన్నాడు. ఆ గొంతులో ఎంతో వినమ్రత కనిపించింది.
మామయ్య గొంతు సవరించుకుని "చూడు పరంధామయ్యా ! నాకు తోడు మనిషి లేకపోతే క్షణం గడవదు. వీడా పిల్లముండాకొడుకు. వీడితో ఏం మాట్లాడను! కాసేపు వుండు వెళుదువు గానీలే" అర్థిస్తున్నట్టు అడిగాడు.
నాకు తెలుసు మామయ్య ఆయన్ను వదలడని. మామయ్యకు కబుర్లాడడం అంటే తగనిపిచ్చి. ప్రపంచంలో కబుర్లన్నీ కావాలి ఆయనకు. ఆ పిచ్చితోటే చిన్న పిల్లాడ్ని అనైనా చూడకుండా ఇంత దూరం నన్ను తీసుకొచ్చాడు.
"అలానే బాబూ! నాకు అక్కడ తోచదు. శవాన్ని వదిలిపెట్టి వచ్చానని మనసు మరీ పీకుతుంది" అని తన సమ్మతిని తెలిపాడు పరంధామయ్య.
మామయ్య తోడు దొరికాడన్న గొప్ప సంతోషంతో కింద దుప్పట్లు పరిచాడు.
"రా పరంధామయ్య!" ఎంతో లాలనతో పిలిచాడు మామయ్య పక్కనే నేను కూర్చున్నాను.
అప్పటికి నాకు కొంత వణుకు తగ్గింది.
"శవం మరీ రోడ్డు మీదుంది కానిస్టేబుల్ బాబూ. మళ్లీ ఏదైనా వాహనం వచ్చి గుద్దేయవచ్చు" మామయ్యతో అన్నాడు పరంధామయ్య.
ఆయన మా మామయ్య కంటే ధైర్యవంతుడనిపించింది. వాళ్ళిద్దరి మధ్య వుండడం వల్ల నాకు కొంత భయం తగ్గింది.
"అది నిజమే పరంధామయ్య రా! పక్కకు జరుపుదాం" అని మామయ్య లేచాడు.
ఇద్దరూ అటెళ్ళారు.
"రేయ్ బుజ్జీ! శవం పైన లైట్ పడేట్టు టార్చ్ వేయరా" అన్నాడు మామయ్య.
ఆ మాటలకు అదిరిపోయాను. శవంపైన లైట్ వేయాలంటే నా గుండె కడుపులోకి జారిపోయింది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. నేరకపోయి వచ్చానురా భగవంతుడా అని మనసులోనే అనుకున్నాను. పట్టుకుని టార్చి వేశాను.
అటు చూడకూడదనుకుంటూనే చూశాను.
టార్చిలైట్ గుడ్డి వెలుతురులో శవం కనిపించింది.
మామయ్య కాళ్ళు పట్టుకోవడంతో, పరంధామయ్య తల పట్టుకున్నాడు. ఇద్దరూ శవాన్ని లేపి రోడ్డు పక్కగా పడుకోబెట్టారు. శవం వుంచిన స్థలంలో గుర్తుకోసం రాళ్ళు పెట్టాడు మామయ్య.
వాళ్ళిద్దరూ తిరిగి నా పక్కన కూర్చున్నారు. మామయ్య రావడంతో చల్లనైపోయిన శరీరం తేరుకోవడం ప్రారంభించింది.
"ఇంతకీ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది పరంధామయ్యా?" మామయ్య అడిగాడు.
"ఖచ్చితంగా తెలియదు బాబూ! తొమ్మిది గంటల ప్రాంతాన జరిగిందనుకుంటాను."
"ఇంతకీ ఇతనెవరో తెలుసా?"
"తెలీదు బాబూ! ఏ కన్నతల్లి బిడ్డో. ఇలా అర్థాంతరంగా దిక్కు లేని చావు రాసి పెట్టుంది అతనికి."
"అంతే. ఖర్మ తీరితే జీవుడు పైకెగిరి పోవాల్సిందే" మామయ్య తన ఫిలాసఫీని వినిపించాడు.
"జీవుడు ఎగిరిపోయినా, కర్మ కాండ తీరేవరకు శరీరం కూడా ముఖ్యమే బాబూ! అందుకే శవాన్ని వదలి పెట్టను మనసొప్పక ఇక్కడే వుండిపోయాను" అన్నాడు పరంధామయ్య.
ఆయనే మళ్ళీ "నేను కాపలా లేకపోతే శవాన్ని ఈ పాటికి నక్కలు పలహారం కింద తినేసేవి బాబూ" అన్నాడు.
"అవునా!" ఆశ్చర్యంతో నోరు తెరిచాడు మామయ్య.
భయంతో నిద్ర రావడంలేదు. రోడ్డు ఆ వైపు నుంచి నల్లటి త్రాచుపాములు నా మీదకు వస్తున్నట్టే వుంది. తేళ్లు నాపై జరజరా పాకుతూ కుట్టడానికి నా శరీరంలో సరైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్టే వుంది. దెయ్యాలు నన్ను తినెయ్యడానికి కాలం బ్రెష్ మీద చీకటి పేస్ట్ వేసుకుని పళ్ళు తోముకుంటున్నట్టే అనిపిస్తోంది.
మామయ్య, పరంధామయ్య మాత్రం ఏవేవో మాట్లాడుకుంటూనే వున్నారు.
ప్రకృతిలో కొద్దిగా చలనం ప్రారంభమైంది. చీకటి కరిగిపోలేదు గానీ పలుచబడుతోంది. పక్షులు వెలుగుకి స్వాగతం చెప్పడానికి గొంతు సవరించుకుంటున్నాయి. నక్కలు చివరసారి ఏడుస్తున్నాయి.
"టైమ్ ఎంతైంది బాబూ?" అడిగాడు పరంధామయ్య.
"మూడు దాటింది" మామయ్య జవాబు చెప్పాడు.
"మూడు దాటిందా?" కంగారుగా అడిగాడు ఆయన.
"అవును పరంధామయ్య, మరో రెండు గంటలకి పూర్తిగా తెల్లారిపోతుంది. నువ్వు మీవూరికి వెళ్ళిపోవచ్చు."
"లేదు బాబూ నేను వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది" పరంధామయ్య ఆందోళనగా చెప్పాడు.
"ఇప్పుడేం వెళతావులే, మరో రెండు గంటలు ఆగు."
"లేదు బాబూ! నే వెళ్ళాలి."
నాకు పరంధామయ్య వెళ్ళడం ఇష్టం లేదు. ఇద్దరికన్నా ముగ్గురుండడం కొంత ధైర్యాన్ని పెంచుతుంది. రాత్రి పరంధామయ్య లేకుంటే నేను మరింత భయంతో గడ్డకట్టుకుపోయి వుండేవాడ్ని. ఆయన్ని మా కోసం భగవంతుడు పంపిన దూతలా అనుకున్నాను.