Previous Page Next Page 
మగబుద్ధి పేజి 7


    ఈయనెవరో స్త్రీ ద్వేషిలా వున్నాడని నిర్ధారించుకున్నాడు నరేష్.

 

    "శక్తి పోతుందని సెక్స్ లో పాల్గొనలేకపోతే సృష్టి ఎలా జరుగుతుంది సార్?"

 

    అది ఇంటర్వ్యూలా లేదు కాబట్టి ధైర్యంగా ఆ ప్రశ్న వేశాడు.

 

    "అదేనయ్యా దేవుడి పక్షపాతం. అందుకే తెలివిగల మగవాడెవడూ స్త్రీని ముట్టుకోడు. ఉదాహరణకు నేనే. ఆడపిల్ల అందానికి మురిసిపోయి, పడకమీద పడుకున్నామా మన ఆయుష్షు మంచుముక్కలా కరిగిపోతుంది. అలాంటి ప్రమాదం జరక్కుండా నేను జాగ్రత్తపడిపోయాను. నాకు పెళ్ళయింది. పెళ్ళాముంది. మరి పడక అవసరం లేకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావ్ అని నువ్వు అడగొచ్చు. దానికి ఓ కారణముంది. పెళ్ళాం అనే జీవి లేకపోతే జీవితం పట్ల మమకారం పెరిగిపోతుంది. మమకారం ఎక్కువైతే మృత్యువు ముసుగు దొంగలా మనల్ని నిరంతరం భయపెడుతుంటుంది. జీవితం మీద మమకారం తగ్గాలంటే పెళ్ళాం తప్పనిసరి" అని కుర్చీలో పూర్తిగా వెనక్కు వాలి నవ్వుతున్నాడు మారుతీరావు.

 

    ఇంకొక్క క్షణం అక్కడున్నా తనకూ స్త్రీ వైరాగ్యం పట్టుకుంటుందన్న ఆందోళన మొదలైంది నరేష్ కు.

 

    "నీ ముఖం చూస్తుంటేనే నీకు ఆడపిల్లమీద యావ ఎక్కువ వున్నట్టు అనిపిస్తోంది నాకు. నీలాంటివాడు నలభై ఏళ్ళకే బాల్చీ తన్నేస్తాడు. అర్థాయుష్షు మగాడు నా కంపెనీకి వద్దు. యుకెన్ గో."

 

    అతను ఠక్కున పైకిలేచి "వస్తాను సార్" అని బయటపడ్డాడు.

 

    ఒక్కసారి గుండెల్నిండా గాలి పీల్చుకున్నాడు. ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయి 'వీ'కెన్ జాకెట్ పట్టుకుని అతని చూపులు రెండు మూడు ఫీట్స్ చేశాయి.

 

    "సో- తనమీద మారుతీరావు ప్రభావం పడలేదు నేను నేనే. ఆడపిల్ల కనిపిస్తేనే కళ్ళు అటు వాలిపోతున్నాయి. థాంక్ గాడ్" అనుకుంటూ ముందుకు నడిచాడతను.

 

    అప్పుడే కారు దిగిన మారుతీరావు భార్య స్మిత తనను కాంక్షతో చూడడం అతను గమనించలేదు.

 

                              *    *    *    *    *

 

    సావిత్రీ ఫార్మాస్యుటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ భవనం అది. పదెకరాల స్థలంలో పరుచుకున్న ఆ కంపెనీ అధినేత శ్రీనివాసరావు.

 

    అప్పుడు టైమ్ పదిగంటలైంది. కంపెనీలోని చిన్న సైరన్ పెద్ద గొంతుకతో కార్మికుల్ని ఐదునిమిషాలసేపు పిలిచి, వూరుకుండి పోయింది. కార్మికులు బిలబిలమంటూ గేటు తీసుకుని లోపలకు ప్రవేశిస్తున్నారు.

 

    పదిగంటలా ఒక్క నిముషానికి ఆ ఆఫీస్ లోకి నీలంరంగు కంటెస్సా కారు వచ్చింది అందులోంచి శ్రీనివాసరావు దిగారు. అంతవరకు భయభక్తులతో కారు డోర్ తెరిచి పట్టుకున్న బంట్రోతు పక్కకు తప్పుకున్నాడు. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ అడుగు ముందుకేశాడు.

 

    కంటెస్సా కారు అక్కడ్నుంచి బయలుదేరి తన ఇనుప గూటిలోకి వెళ్ళి నిలబడింది.

 

    గూర్ఖా బూట్లను నేలకేసి కొట్టి సెల్యూట్ చేశాడు. శ్రీనివాసరావు అతన్ని చూడకుండా సాగిపోయారు.

 

    పాలగచ్చు వరండాలో నడిచిపోతుంటే ఎదురుపడ్డవాళ్ళు వంగి నమస్కారాలు చేస్తున్నారు. కొందర్ని చూసి తల వూగించి, మరికొందర్ని చూసి నవ్వి ఆయన తన రూమ్ లోకి నడిచారు.

 

    ఆయనకు ఏభైఏళ్ళ వయసున్నా చూడడానికి నలభైఏళ్ళ వాడిలా కనిపిస్తాడు. ఎర్రగా, పొడవుగా, కాస్ట్ లీగా వున్న ఆయన్ను చూస్తూనే శ్రీలక్ష్మి బిడ్డను కుబేరుడు పెంచుకున్నట్టు అనిపిస్తుంది.

 

    ఆయన ఇరవైఏళ్ళ క్రితం తన భార్య పేరుమీద హోటల్ వ్యాపారం ప్రారంభించాడు. మాట తప్పని గుణం, లౌక్యం, ధైర్యం వున్న ఆయన అంచెలంచెలుగా పెరిగి ఈరోజు రాష్ట్రంలోని పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు పొందాడు. ఆయన ఫార్మాస్యూటికల్స్ కంపెనీ బంగారు బాతు. ఆయన రోజూ దాని దగ్గర ఓ బంగారు గుడ్డు పెట్టించుకుంటున్నాడే తప్ప, దానిని కోసేసుకోలేదు. ఆ ఫ్యాక్టరీలో జలుబు దగ్గర్నుంచి క్యాన్సర్ వరకు అన్ని మందులూ తయారవుతూ వుంటాయి.

 

    ఆయన తన రివాల్వింగ్ ఛైర్ లో కూర్చోగానే అటెండర్ వచ్చి నిలబడ్డాడు.

 

    "హార్లిక్స్" అన్నాడాయన.

 

    అటెండరు ఆగదికే అటాచ్ అయిన మరో చిన్నగదిలోకి వెళ్ళాడు. అక్కడ చిన్న గేస్ స్టౌవ్ తో సహా అన్నీ వున్నాయి. అప్పటికే వేడిపెట్టిన పాలలో హార్లిక్స్ కలిపి, తీసుకొచ్చాడు అటెండరు.

 

    దాన్ని తాగుతూ ఆయన ఫైల్స్ ను చూడడంతో మునిగిపోయాడు.

 

    సరిగ్గా పదినిముషాలకు ఆ ఆవరణలోకి విజయ ప్రవేశించింది. ఆమెకు ముప్ఫై ఏళ్లుంటాయి. ఆమె బాడీలో అన్నీ పెద్దవే. పెద్దవిగా ఉన్న తన అవయవాలను మరింత పెద్దవిగా కనిపించేటట్టు డ్రస్ చేసుకుంటుంది.

 

    కళ్ళకు కాటుకు రాసుకోవడంతో విశాలమైన ఆమెకళ్ళు మరింత విశాలంగా కనిపిస్తున్నాయి. పెదవులకు లిప్ స్టిక్ రాసుకోవడంతో అవి మరింత ఎర్రగా మెరుస్తున్నాయి. బుగ్గలకు 'చీక్ రెడ్' అద్దుకోవడం వల్ల అవి వుబ్బినట్టు అనిపిస్తున్నాయి. లోనెక్ జాకెట్ వేసుకోవడం వల్ల ఆమె గుండెలు బయటకు దూకుతున్నాయి. బొడ్డుకింద చీరకట్టుకోవడంవల్ల ఆ ప్రాంతమంతా బంగారు మైదానంలానూ, ఆ బొడ్డు ఎవరో అక్కడ పెట్టిన ఇసుక గూడులానూ వుంది.  

 

    ఆమె శ్రీనివాసరావుకు పర్సనల్ అసిస్టెంట్. అందుకే గూర్ఖావాడు తన ఓనర్ కు చేసినట్టు భయభక్తులతో ఆమెకూ సెల్యూట్ చేశాడు. ఆమె కూడా తన బాస్ తరహాలోనే అతనివైపు చూడలేదు.

 

    వరండాలోకి ఆరోజే కొత్తగా చేరిన క్లర్క్ ఆమెకు ఎదురుపడి "నమస్తే మేడమ్... ఇంటినుంచి నడిచొస్తున్నట్టున్నారు ఆటోలోనో, రిక్షాలోనో రాలేకపోయారా?" అని అడిగాడు.

 

    "ఈ ఆఫీసుకు కొత్తా?" అడిగింది ఆమె వయ్యారంగా.

 Previous Page Next Page