Previous Page Next Page 
జీవనయానం  పేజి 7


    ఈ విషయం హైదరాబాదులో కార్చిచ్చులా వ్యాపించింది. జనం తండోపతండాలుగా ఫలక్ నుమా చుట్టు చేరారు. దేవాలయాల్లో మసీదుల్లో ప్రార్థనలు చేశారు.

 

    ప్రార్థనలు ఫలించలేదు. 11 ఆగస్టు 1911 మధ్యాహ్నం ఫలక్ నుమాలో ఒకవాలు కుర్చీలో కూర్చొని మహబూబ్ అల్లాను చేరాడు. ఆ కుర్చీ ఫలక్ నుమాలో ఇప్పటికీ ఉంది.

 

    అప్పటి ప్రధాని మహారాజా కిషన్ పర్షాద్ చాకచక్యంగా మూడుగంటలలో మీర్ ఉస్మానలీఖాన్ను రాజుగా ప్రకటించాడు. లాంఛనంగా అవసరం అయిన ఆంగ్లేయుల ఆమోదం కూడా పొందలేదు. ఇప్తఖార్ - ఉల్ - ముల్క్, సుల్తాన్ యావర్ జంగ్ చార్ మినార్ మీదికి ఎక్కాడు. నగారాలు మ్రోగించడం జరిగింది. అతి ప్రధానమైన వార్త వినడానికి వేల జనం గుమి గూడారు. చార్మినార్ మీది నుంచి సందేశం వినిపించింది.

 

    "మన ప్రియతమ ప్రభువు, మహాఘనత వహించిన మహబూబ్ ఆలీఖాన్ బహదూర్ ఈ మధ్యాహ్నం గతించారు. మహాఘనత వహించిన మీర్ ఉస్మానలీఖాన్ బహద్దూర్ నిజాం ప్రభువు అయినారు."

 

    1911లో మీర్ ఉస్మానలీఖాన్ హైదరాబాదు రాజ్యానికి ప్రభువు అయినాడు.

 

    1911లో భారతదేశపు రాజధాని కలకత్తానుంచి ఢిల్లీకి మారింది.

 

                                              రెండు


    పూర్వగాథలు

 

    విశిష్ఠాద్వైత సిద్ధాంత ప్రవక్త - ప్రచారకులు - గొప్ప సంఘ సంస్కర్త - శ్రీమద్రామానుజులు క్రీస్తుశకం 1017-1137 మధ్య జీవించాడు. తిరుక్కొట్టుయూర్ నంబి పంచములు. రామానుజులు తిరుమంత్ర ఉపదేశం నంబి వద్ద పొందదలచారు. నంబి రామానుజులను పదిహేడు సార్లు తిప్పారు. పద్దెనిమిదవసారి ఉపదేశించారు. తిరుమంత్రం అతి  రహస్యం. ఇతరులకు ఉపదేశించరాదు అన్నారు.

 

    శ్రీమద్రామానుజులు తిరునారాయణపురం వెళ్లారు. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతున్నది. వేలమంది కూడారు. అనేక కుల మతాలవాళ్లు ఉన్నారు. శ్రీమద్రామానుజులు దేవాలయ గోపురం ఎక్కారు. తన గురువు అతి రహస్యంగా ఉంచమన్న తిరుమంత్రాన్ని సమస్త జనులకు ఉపదేశించారు.

 

    'ఓం  నమోనారాయణాయ - జపించండి, తరించండి.' అని ఎలుగెత్తి అనేకసార్లు చాటారు.

 

    తిరుక్కొట్టుయూర్ నంబి రామానుజులను పిలిపించారు. "గురువు ఆజ్ఞను ఉల్లంఘించినావు. ఫలితము తెలియునా?" అని అడిగారు.

 

    "స్వామి! తెలియును. రహస్యమైన మంత్రమును సదస్యము చేసిన నాకు రౌరవనరకము వచ్చును. అందరు జనుల విముక్తి కొరకు నేను రౌరవమునకు పోవుటకు సిద్ధమే" అన్నారు, రామానుజులు.

 

    రామానుజుని త్యాగమునకు గురువు పొంగిపోయినారు. రామానుజుని గట్టిగా కావిలించుకున్నారు. ఆనంద బాష్పములు రాలగా అన్నారు:

 

    "సద్గురుండవు నీవెపో జనుల కెల్ల
    మా కొరంతయు దీరె నీ మహిమ కతన."

 

    శ్రీమద్రామానుజులు కుల మతాలకు అతీతంగా ప్రవర్తించారు. పదకొండవ శతాబ్దంలోనే హరిజనులను ఆలయ ప్రవేశం చేయించిన సంఘసంస్కర్త వారు.

 

    వంశపారంపర్యంగా మేము శ్రీమద్రామానుజుని అనుయాయులం. విశిష్ఠాద్వైతులం. వైష్ణవులం.

 

    శ్రీమద్రామానుజులకు ప్రధాన శిష్యులు ఇద్దరు. ఒకరు దాశరథి, రెండవవాడు కూరేశులు.

 

    ఆనాడు కాంచీపురాన్ని పరిపాలించిన చోళరాజు 'క్రిమి కంఠుడు.' అతడు శైవమతాలంబి. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కాని, క్రిమికంఠుడు వైష్ణవాన్ని రూపుమాప దలచాడు. రామానుజుడు ఆదిశేషుని అవతారం. వారిని ఎదిరించడం ఇతరులకు అసాధ్యం. అందువలన రామానుజునికి హాని తలపెట్టదలచినాడు. శ్రీరంగంలో ఉన్న రామానుజుని తీసుకొని రమ్మని భటులను పంపించాడు.

 

    రాజ భటులు శ్రీరంగంలో రామానుజుని ఆశ్రమం చేరుకున్నారు. తాము వచ్చిన పని చెప్పారు. అప్పుడు రామానుజులు లేరు. దాశరథి, కురేశులు ఉన్నారు. వారు రాజు పిలిపించిన కార్యం గ్రహించారు. రామానుజుని రక్షించ నిశ్చయించారు. తమలో ఒకరు రామానుజుని వేషంలో భటుల వెంట వెళ్లాలి. ఒకరు ఇక్కడ రామానుజుని రక్షణకు ఉండాలి. కూరేశులు భటుల వెంట వెళ్లడానికి నిశ్చయం అయింది. వారు రామానుజుని వేషం వేసుకున్నారు. భటుల వెంట వెళ్ళారు.

 

    కూరేశులు కంచిలో రాజసభకు చేరుకున్నారు. సభ వారిని రామానుజులుగనే పరిగణించింది. అనేకమంది విద్వాంసులు - సభాసదుల సమక్షంలో రాజు రామానుజుని -

 

    "శివాత్పరతరం నాస్తి" అనమన్నాడు. "శివుని మించినవాడు లేడు."

 

    రామానుజుడు అందుకు అంగీకరించడు. ఆమాట అనడు. అది అందరికి తెలుసు. ఎంచేతంటే విష్ణువును మించినవాడు లేడు అనేది రామానుజ సిద్ధాంతం. అయినా, అతడు ఏమి అంటాడో అని ఆతృతగా ఎదిరి చూచారు.

 

    "ద్రోణమస్తి తతః పరమ్" అన్నారు కూరేశులు.

 

    రాజు సహితంగా సభ సాంతం ఆ మాటలకు ముందు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే -

 

    "శివ" అనేది ఒక ధాన్యపు కొలత. దీనిని లీటరు అనుకుందాం. ద్రోణం" అంతకన్న పెద్ద కొలత. అయిదు లీటర్లను కొందా.

 

    అనంతరం శివుని కించపరచినందులకు రాజు సహితంగా సభసాంతం కూరేశుని మీద కోపాగ్ని కురిపించింది.

 

    "వీని కన్నులు పెరకండి" అని రాజు భటులకు ఆజ్ఞాపించాడు.

 

    రాజ భటులు కూరేశుని అడివిలోకి తీసికెళ్ళారు. కళ్ళు పెరికేశారు. కూరేశుడు అందుకు బాధపడలేదు. రాజభటుల పాదాలమీద సాష్టాంగపడ్డాడు. అన్నాడు:  

 

    "భటులారా! మీరు నాకు నిజమైన మిత్రులు. ఇంత కాలంగా ఉన్న నా రెండు కనులను పెరికివేశారు. అని నా నిరంతర శత్రువులు. భగవంతుని దర్శించనీయక పాడు పదార్థాలను చూపించాయి . ఇహ నాకు భగవద్దర్శనమే - అన్యంలేదు!" అని ఆనందంతో గంతులు వేశారు!!

 

    రాజ భటులు అది చూచారు. స్పందించారు. కూరేశుని పాదాలను ఆశ్రయించారు.

 

    మహాత్ములు - వంచన:

 

    అదేకాలంలో వరంగల్లును కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి పాలిస్తున్నాడు. తెలుగు వారిని ఒకే ఛత్రం కిందికి తెచ్చిన ఘనత కాకతీయులది. జైన మతాన్ని తను రాజ్యంలో నామ రూపాలు లేకుండా చేసిన నికృష్టతకూడా కాకతీయులదే! పరమతస్తులు మన దేశంలో దేవాలయాలు కూల్చారని - రాజకీయ లబ్ధికోసం - గొంతులు చించుకునేవారు; ఒక్కసారి మనం బౌద్ధ జైనాది మతాలను నాశనం చేయడం గ్రహిస్తే మంచిది. ఈ మతాలను రూపుమాపడానికి మనం మూకహత్యలు చేశాం. రక్తం పారించాం. ఆలయాలను కూల్చాం. లేదా, మార్చాం.

 

    ఈ నాటి వీరభద్ర ఆలయాలు దిగంబర జైనులని అని గ్రహించడం కష్టం కాదు.

 

    కాకతీయులు శైవులు. వారు శైవమత ప్రచారానికి ఎంతో సాయం చేశారు. ఎన్నో ఆలయాలు -కట్టించారు. అయితే, కాకతీయ వంశం ఒక శైవుని శాపం వల్లనే అంతం అయిందనే ఒక కథ ప్రచారంలో ఉంది.

 

    శైవుల్లో రెండు రకాలు. ఒకరు లింగధారులు. అంటే, ఎల్లప్పుడూ లింగం ధరించే ఉంటారు. ఒకరు లింగం ధరించనివారు. కాకతీయులు లింగం ధరించని శైవులు.

 

    హనుమ కొండ సమీపంలో ఒక లింగధారి ఆరాధ్య మహర్షి ఉండేవాడు. అతడు శివస్వామి. అతడు గుహలో ఉంటాడు. సూర్యునిలో నారాయణుడు ఉంటాడు. కాబట్టి అతడు సూర్యుని చూడడు. అతనిది అసూర్యంపశ్యవ్రతం. అతడు సూర్యుడు అస్తమించిన తరువాత బయటికి వస్తాడు. ఒక జొన్నగింజ నాటుతాడు. అది మరునాటి రాత్రికి జొన్నకంకి అవుతుంది. అది తింటాడు. తెల్లవారుతుండగా గుహలోనికి వెళ్లిపోతాడు.

 

    శివస్వామిని గురించి ప్రతాపరుద్రునికి తెలిసింది. రాజుకు శివస్వామిది విపరీత ప్రవర్తన అనిపించింది. తమను దర్శించమని శివస్వామికి వార్త పంపాడు. 'లింగధారి కాని వాడిని తాను చూడను.' అని చెప్పి పంపాడు శివస్వామి. ప్రతాపరుద్రునికి పట్టుదల పెరిగింది. పండితులను పంపాడు. సంప్రదింపులు సాగించాడు. తనతో మాట్లాడినంతసేపు ప్రతాపరుద్రుడు లింగాన్ని పట్టుకొని ఉండాలి అనే షరతు విధించాడు శివస్వామి. ప్రతాపరుద్రుడు అందుకు అంగీకరించాడు.

 

    ప్రతాపరుద్రుడు శివస్వామిని వేయిస్తంభాల గుడిలో కలుసుకున్నాడు. పండితులు - మతాచార్యులు - మంత్రులు - పుర ప్రముఖులు కూడారు.

 

    రాత్రి సమయం. ప్రతాపరుద్రుడు లింగాన్ని పట్టుకుని కూర్చున్నాడు. శివస్వామి అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు. సభసాంతం మంత్రముగ్ధంగా వింటున్నది.

 

    ప్రతాపరుద్రుడు లింగాన్ని వదిలేశాడు.

 Previous Page Next Page