Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 7


    మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు సందు సందునా తిరుగుతున్నారు ఆంజనేయులు, ఆనందం.

 

    రూమ్స్ ఎక్కడా దొరకడం లేదు. గంటన్నర వెతగ్గా, ఒక సింగిల్ రూమ్ దొరకటంతో ఎలాగైనా దానిని పట్టాలని నిర్ణయించుకుని లోనికి నడిచారు ఇద్దరూ.

 

    "ఎవరు కావాలండి..." పెద్ద మావయ్యలాంటి భారీ కాయం సూటిగా వస్తూ అడిగేసరికి-

 

    "టులెట్ బోర్డు..." నసిగాడు ఆంజనేయులు. అంతకు ముందే వార్నింగిచ్చాడు ఆనందం.

 

    ఎన్ని అబద్దాలైనా ఆడాల్సిందే... ఇంట్లో దిగాల్సిందే అని. అందుకే ఆంజనేయులు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.

 

    "ఎక్కడ పన్చేస్తున్నారు..." వాలుకుర్చీలో కూర్చుంటూ అడిగాడు పెద్ద మావయ్య.

 

    "సెక్రటేరియట్ లో నండి" టక్కున అబద్ధం ఆదేశాడు ఆనందం.

 

    "సెక్రటేరియట్ లో ఏ డిపార్ట్ మెంటు?"

 

    "జనరల్ ఎడ్మినిస్ట్రేషన్"

 

    "పెళ్ళిళ్ళయాయా? ఇద్దరికీ?"

 

    "నాకవలేదండి... వీడికి మొన్ననే కుదిరిందండి... నాకు కులం పట్టింపులేదండి... అమ్మాయి చదువుకోకపోయినా పర్వాలేదు..." ఓరకంట ఇంట్లోకి చూస్తూ అన్నాడు ఆనందం. ఆయనకు గనక కూతురుంటే ఆ దెబ్బతో పడిపోతాడని లొట్టలేస్తూ.

 

    అదే సమయంలో ఇంటి వెనకున్న గార్డెన్ లోంచి ఓ వ్యక్తి వచ్చాడు. ఆయనకు అరవై ఏళ్ళ వయసుంటుంది. ఆయన్ని చూడగానే పెద్ద మావయ్య లాంటి వ్యక్తి లేచి నిలబడి-

 

    "రండి... రండి... మీ కోసమే వీళ్ళెవరో వచ్చారు. అసలు హౌస్ ఓనర్ ఈయనే... నేను టెనంట్ ని" అంటూ పక్క కెళ్ళి పోయాడు పెద్ద మావయ్యలాంటి వ్యక్తి నవ్వుతూ.

 

    ఫడేల్మని ఎవరో కొట్టినట్టయింది ఇద్దరికీ. ఆ షాక్ నుంచి తేరుకునే సరికి అయిదు నిమిషాల సేపు పట్టింది.

 

    ఆ ముసలయాన వాలుకుర్చీలో కూర్చుంటూ, అంతకు ముందు వ్యక్తి వేసిన ప్రశ్నలే వేశాడు. అవ్వే జవాబులు తడుముకోకుండా చెప్పారు ఇద్దరూ. "ఓ.కే. అన్నీ నాకు నచ్చాయి... ఆ గదిలో దిగేవాళ్ళెవరైనా, ఎలాంటి వాళ్ళయినా నాకభ్యంతరం లేదు. కానీ, తెల్లవారు జామున నాలుగు గంటలకు నీళ్ళొస్తాయి, ఆ నీళ్ళు పట్టాలి. నాకు నాలుగు జతల బట్టలున్నాయి, రెండేసి రోజుల కొకసారి ఆ బట్టలుతకాలి, నా పోర్షన్ మూడు గదులే, ఆ గదులన్నీ మీరే వూడ్చాలి, నేనా ముసలాడ్ని వండుకోలేను. ఉదయాన్నే శ్రమనుకోకుండా అత్తెసరు గనక పడేస్తే... ఇక బజారు పనులు ఎలాగూ చేస్తారనుకోండి, పెన్షన్ ఆఫీసు కెళ్ళడం, పోస్టాఫీసు కెళ్ళడం, ఇలాంటివన్నమాట..." చెప్పడం ఆపాడు ముసిలాయన.

 

    "ఇంకే పనులూ లేవాండి..." అమాయకంగా అడిగాడు ఆంజనేయులు.

 

    "మా అబ్బాయీ, కోడలూ, పిల్లలూ... ఎప్పుడో పండక్కీ పబ్బానికీ వస్తారు... అంతే"

 

    ఒళ్ళు మండిపోయింది ఆనందానికి.

 

    "దక్కన్ క్రానికల్లో ప్రకటనివ్వండి... పనిమనుషులు దొరుకుతారు. వస్తాం..." ఆంజనేయులు చెయ్యి పుచ్చుకొని బరబరా బయటికి లాక్కొచ్చాడు ఆనందం.

 

    "ఈ లెక్కన మనకు ఇల్లు దొరకడం దుర్లభాతి దుర్లభం" అన్నాడు ఆనందం.

 

    "చూద్దాం... పైన దుర్యోధన దేవుడు లేడా..." అన్నాడు ఆంజనేయులు.

 

    "నా దగ్గర ఆ దుర్యోధనుడి ఊసు ఎత్తొద్దని చెప్పాను. తోలు వలిచేస్తాను... మాట్లాడకుండా... పద" అని.

 

    రెండు కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ నడిచాక వాళ్ళకో దివ్య భవనం కనిపించింది. అది ముత్యాల ముగ్గు సిన్మాలో బిల్డింగ్ లా వండర్ ఫుల్ గా వుంది.

 

    పెద్ద గోడలు, పెద్ద గేటు, పెద్ద తోట, ఆ తోటలో బోల్డన్ని మొక్కలు, ఆ బిల్డింగ్ వేపు చూస్తూ నోరెళ్ళబెట్టాడు ఆంజనేయులు.

 

    "ఒరే... ఇందులో ఎన్ని వందల గదులున్నాయో చూడు... ఒక్క గదన్నా ఇస్తారేమో కనుక్కుందామా?"

 

    "అది ఏ సాయిబుగారి బిల్డింగో! అద్దెకిస్తారా? అని అడిగేవనుకో... బిర్యానీ చేసేస్తారు జాగ్రత్త" అన్నాడు ఆనందం.

 

    "ఎంక్వయిరీ చేస్తే నష్టవేం లేదుగదా... పక్కింట్లో అడుగుదాం. ఆ బిల్డింగు ఎవరిదో, ఏవిటో తెలుస్తుంది గదా... ముందురా..." అని ఆ బిల్డింగుకి కొంచెం దూరంలో వున్న ఓ ఇంటివేపు నడిచాడు ఆంజనేయులు.

 

    ఆ ఇంటి ముందో నేమ్ ప్లేట్ ఉంది.

 

    దాని మీద జి. గురుమూర్తి, ఎడ్వకేట్ అని రాసుంది.

 

    కాలింగ్ బెల్ నొక్కబోయి ఆగిపోయాడు ఆంజనేయులు.

 

    అప్పటికే లోన్నించి గట్టిగా ఓ గొంతు వినిపిస్తోంది.

 

    "మైలార్డ్! పెళ్ళంటే నూరేళ్ళ పంట. పెళ్ళయిన వెంటనే కన్న వారిని వదిలిపెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని, వెంట వచ్చిన భార్య ఆలనా, పాలనా చూసే బాధ్యత కట్టుకున్న భర్తదే. వేద మంత్రాలతో వివాహానికి ఎంత పవిత్రత కల్పించారో, హిందూ వివాహ చట్టంలో కూడా అంతే భద్రత కల్పించారు. చట్టరీత్యా ఏది వివాహం అన్నదానికి కొన్ని నిర్దుష్టమైన సూత్రాలున్నాయి. అవి చాలా పటిష్టమైనవి, గొప్పవని మనవి చేస్తున్నాను."

 

    "అంత గట్టిగా అరుస్తూ చెప్తున్నాడేమిటి?" అన్నాడు ఆంజనేయులు బిత్తరపోతూ.

 

    "ఇది ఇల్లుకాదేమో! సిటీ సివిల్ కోర్టుని ఇందులో నడుపుతున్నారేమో?" ఒకింత కంగారుగా అన్నాడు ఆనందం.

 

    మళ్ళీ రెండోసారి మైలార్డ్ దగ్గర మొదలై, మనవి చేస్తున్నాననే దగ్గర ఆగిపోయింది.

 

    "బెల్లు కొట్టు చూద్దాం" అన్నాడు ఆనందం తనూ ఆశ్చర్యపోతూ.

 

    కాలింగ్ బెల్ కొట్టాడు ఆనందం.

 

    రెండు నిమిషాల తర్వాత ఒక వ్యక్తి తలుపు తెరిచి 'ఎవరు కావాలి' అని అడిగాడు.

 

    "లాయర్ జి. గురుమూర్తిగారు...."

 

    "రండి..." తలుపు తీసిన వ్యక్తే లాయరనుకున్నారు. కాదు.

 

    ఆ ఇద్దర్నీ లోన ఆఫీసు గదిలోకి తీసికెళ్ళాడు ఆ వ్యక్తి.

 

    అక్కడ లాయర్ డ్రెస్ లో ఒక వ్యక్తి నిలబడుతున్నాడు. అతనికి కొంచెం దూరంలో బెంచీమీద ఒక ఇరవై ఏళ్ళ పల్లెటూరి అమ్మాయి, ఆ పక్కన ఒక యాభై ఏళ్ళ పురుషుడు, అంతే వయసున్న ఒక స్త్రీ కూర్చున్నారు.

 Previous Page Next Page