సునీత చురుగ్గా చూసింది. "మీ డాడీని రమ్మను" అంది ముభావంగా.
వడ్డిస్తున్న సునీతకి, తింటున్న రవీంద్రకి ఈ స్థితి ఇబ్బందికరంగా వుంది. పదేళ్ళు కాపురం చేసి, ఇప్పుడిలా ఒకే ఇంట్లో వుంటూ ఒకరికొకరు ఏమీ కానట్టు ఎలా వుండడం.... ఇంట్లో వున్న మనిషికి భోజనం పెట్టకుండా ఎలా! పిల్లలకి ఏం చెప్పాలి? సంగతి అర్థం చేసుకునే వయసు కాదు పిల్లలది. డాడీ, అంటూ మామూలుగా మాట్లాడుతూ అతని చుట్టూ తిరుగుతున్నారు. భోజనాలై పిల్లలు పడుకున్నాక.... చూడండి, ఇంట్లో మనిద్దరం ఒకరికొకరం ఏం కానట్లుండడం చాలా కష్టం. మీకు నాపట్ల ఏమీ లేకపోయినా ఓ స్త్రీగా, పదేళ్ళు కాపురం చేసిన భార్యగా మీకు అన్నం పెట్టకుండా నేను తినలేను. మీరేలాగో రంజనిని కావాలనుకున్నప్పుడు మీ మకాం అక్కడికే మార్చుకుంటే మన ఇద్దరి సమస్యలూ తీరుతాయిగదా" సునీత సూటిగా చూస్తూ అంది.
"అంటే నన్నింట్లోంచి వెళ్ళమని చెబుతున్నావా, ఇది నా ఇల్లని మర్చిపోకు."
"ఇది నా ఇల్లూ అని మీరూ మర్చిపోకండి. మీకెంత హక్కుందో నాకూ అంతే హక్కు వుందీ ఇంట్లో... ఈ కేసు తేలేవరకు భార్యాభార్తల్లాగా కాక, అపరిచితుల్లా ఇంట్లో మసలాలంటే కష్టం. మీ మకాం మార్చుకుంటే మీరూ హాయిగా వుండచ్చు, నేనూ నిశ్చింతగా వుండచ్చు... తెలిసీ తెలియని వయసులో వున్న పిల్లల ముందు చాలా ఇబ్బందిగా వుంది."
"నీ సలహాలు నాకక్కరలేదు. మొగుడు అక్కరలేదనుకున్నది నీవు. నా ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు నీకు లేదు.... వుండాలో, వెళ్ళాలో, ఎక్కడికెళ్ళాలో తేల్చుకునేది, మానేది నా ఇష్టం. నీ భోజనం కోసం నేనేం ఏడవలేదు...రేపటి నించి నాకోసం నీవేంచెయ్యద్దు ....." విసురుగా లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళి ధడాలున తలుపు మూసుకున్నాడు.
సునీత నిట్టూర్చి పిల్లల మధ్య పడుకుంది. ఎలాంటి స్థితి? ఎన్నడూ ఎదురు చూడని స్థితి వచ్చిపడింది.
ఒక మగవాడు ఒక్కసారిగా అంతలా ఎలా మారిపోగలడు! ఒక ఆడదాని కోసం కట్టుకున్న భార్యని, కన్న పిల్లల మీద మమకారాన్ని కూడా మరచి అంతలా ఎలా దాసులైపోతారో? ఆడదాని పొందు తెలీదా, ప్రేమ తెలీదా! అన్ని అనుభవాలు సంపూర్ణంగా దొరికినా ఇలా పక్కదార్లు ఎందుకు తొక్కడం!
ఓ పెళ్ళికానివాడు ఆడదానికోసం అర్రులు చాచాడంటే అర్థం చేసుకోవచ్చు...... పదేళ్ళు సంసారం చేసినవాడు అన్ని అనుభూతులు దొరికినా ఇలా పరాయి ఆడదాని పొందుకోసం కొట్టుకోవడం ఏమిటి..... మగవాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తరుచులు కావాలి కాబోలు! ఇంట్లో ఇల్లాలు పాతపడగానే కొత్త అందాలు ఆకర్షిస్తాయి కాబోలు! అందులో రంజనిలాంటి ఆడవాళ్ళు కవ్వింపులు, తుళ్ళింతలతో ఆకర్షిస్తూంటే, సులువుగా దొరికే ఆడది దొరికితే మరింత ప్రలోభంలో పడిపోతారు గాబోలు!
ఏది ఏమైనా హాయిగా సాగిపోతున్న తన సంసార నౌక ఒడిదుడుకుల్లో పడింది. ఇప్పుడే తను పాతతరం ఆడదానిలా బెంబేలుపడి ఏడ్చి రాగాలెట్టి నా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకోకుండా, ఒంటరిగా, ధైర్యంగా నిలబడి నావకి చుక్కాని పట్టి పిల్లలని ఒడ్డుకు చేర్చాలి. ఆ రంజనీ ఏమిటో నాలుగురోజులు గడిపితే అతనికే తెలుస్తుంది. అప్పుడు చచ్చినట్టు తిరిగివస్తాడు. కాని అప్పుడు తను కరిగిపోకూడదు. నిబ్బరంగా నిలబడాలి.. నిద్రపట్టేవరకు రకరకాల ఆలోచనలతో సతమతమైంది సునీత.
* * *
"ఏమిటమ్మా శారదా! అసలు బొత్తిగా కనబడడం మానేశావు. నెల రోజులయింది ఇంటికి వచ్చి. ఊళ్ళో వున్నావన్న పేరేగాని కనబడనే కనబడవు. లలితా, శారదొచ్చింది" నారాయణమూర్తిగారు సంతోషంగా కూతురి చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకొచ్చారు.
"ఒరేయ్ రాహుల్, రా బాబూ, ఎలా చదువుతున్నావు" మనవడిని దగ్గరికి లాక్కుని ప్రేమగా తల నిమిరారు.
"ఎలా వున్నారు నాన్నా, అసలు టైమే దొరకడంలేదు ఈ మధ్య. కిందటి ఆదివారం వద్దామని బయలుదేరేసరికి ఏదో పొరుగూరు కేసువాళ్ళు వచ్చారు. పాపం అంతదూరాన్నించి వచ్చారు నిరాశపరచడం, మళ్లీ రమ్మనడం ఇష్టం లేక వుండిపోయాను. ఆదివారం వస్తేనే మీరూ, నీరూ అందరూ దొరుకుతారు. ఆ ఒక్క ఆదివారం ఏదన్నా అడ్డంకి వస్తే అంతే....." నాన్నా, ఎలా వుంది మీ అమ్మాయి 'ఉషోదయం' నవ్వుతూ అంది శారద.
"ఆయనకేమమ్మా. ఆ ముద్దుల కూతురితో కూర్చుంటే రాత్రీ పగలు తేడా తెలీదాయనకి. అందులో ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక మరీ దానిముందే రోజంతా.
"నీరద ఏదమ్మా ఇంట్లో లేదా..." చెల్లిలికోసం చుట్టూ చూస్తూ అంది శారద.
"ఎవరిదో ఇంటర్వ్యూ తీసుకోవాలని శ్రీనివాస్, అది కలిసి వెళ్ళారు. వచ్చేస్తుందిలే. రాత్రికి భోజనంచేసి వెళ్ళకూడదూ?" ఆశగా అడిగారు ఆయన. అంతలో గుర్తుకువచ్చినట్టు "ప్రకాష్ కూడా రావల్సింది. చాలా రోజులైంది వచ్చి, ఆదివారం మధ్యాహ్నం అన్నా పని పెట్టుకోకుండావుంటే...."
"నాన్నా! లాయర్లకి, డాక్టర్లకి పేరొచ్చేవరకే, తరువాత వద్దన్నా వచ్చిపడతాయి కేసులు. మిగతా రోజులకంటే ఆదివారం క్లయింట్స్ ఎక్కువ వస్తారు. ఆయనతో పెట్టుకుంటే లాభంలేదని వచ్చేశాను."
"అలా అయితే భోజనంచేసి వెడుదువుగానిలే, ఎలాగో ఆలస్యంగా వస్తాడు గదా ఇంటికి" లలితమ్మ అంది.
"వద్దమ్మా, భోజనానికేం వుంది. అత్తయ్యగారికి చెప్పిరాలేదు...." శారద ఇబ్బందిగా అంది. మాటల్లోనే నీరద లోపాలకి వస్తూనే "అక్కా" అంటూ ఆప్యాయంగా అక్కగారిని చుట్టేసింది.
"అదేం కుదరదు, నేనిప్పుడే వచ్చాను, మనం చాలా మాట్లాడుకోవాలి. నీవు భోజనంచేసి వెళ్ళాల్సిందే. నేను అత్తయ్యగారికి ఫోనుచేసి చెప్పేస్తాను. శ్రీనివాస్ దిగబెడతాడులే...." నీరద మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ చేసి సత్యవతమ్మకి చెప్పేసింది.
"కూర్చో వాసూ, మా పెద్దమ్మాయి శారద తెలుసుగా..." నారాయణమూర్తి శ్రీనివాస్ వంక కూర్చోమని సంజ్ఞ చేస్తూ అన్నారు.
శ్రీనివాస్ శారదకి నమస్కారం పెడుతూ... "చూశానండి. కాని పరిచయం లేదు. నేనిప్పుడు వచ్చినా లేరు ఈవిడ" అన్నాడు నవ్వుతూ.
మంచి సౌమ్యమైన మొహం, చిరునవ్వు, వినయం, సంస్కారం అన్నీ వున్నాయనిపించింది శారదకి. మంచివాడులా వున్నాడు అనుకుంది శారద.
"ఏమిటక్కా ఊళ్ళో వుండి కూడా అసలు కలుసుకోలేకపోతున్నాం మనం" అంది. రాహుల్ ని దగ్గరికి లాక్కుని బుగ్గల మీద ముద్దు పెట్టింది.