Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 7

    అయినా తల్లి దగ్గర తెగేసి చెప్పినట్లు చెప్పలేకపోయింది జ్యోతి.
    "జ్యోతీ! నా ఉద్యోగం ఏమిటి?"
    హఠాత్తుగా టాఫిక్ మార్చేసరికి జ్యోతి తెల్లపోతూ చూసింది.
    "ఊఁ.... జవాబు చెప్పు" కాస్త తీవ్రం అయింది అతని గొంతు.
    జ్యోతి బెదిరి నెమ్మదిగా జవాబు యిచ్చింది.
    "నా జీతం ఎంత?" మళ్ళీ అడిగాడు.
    జ్యోతి కలవరపడుతూ చూసింది.
    నీకు తెలియదా? అయితే చెపుతాను విను. ఎనిమిదివందలఏభై. ప్రావిడెంట్ ఫండు, టాక్సులు, ఇన్సూరెన్స్ ఇవన్నీపోయి నా చేతికి వచ్చేది ఆరువందల ఏభై.
    ఆ ఆరువందలలో ఆరుగురం బతుకుతున్నాం. ఇంటద్దె నూటపాతిక. మిగిలిన దాంతో ఎలా గడుపుతోందో మీ అమ్మకి తెలుసు. ఆపైన మీ చదువులు, జీతాలు, బట్టలు, సినిమాలు అవీ వుండనే వున్నాయి. నీవు ఒక్కర్తివే మాకు పిల్లవిగావు - ఇప్పుడు నీ పెళ్ళి చేయాలంటే నేను అప్పు చేయాలి.
    పాతికేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా పాతికవందలు కూడా మిగల్చలేకపోయాను.
    నీ పెళ్ళికి చేసిన అప్పు తీరడానికి కొన్ని ఏళ్ళు జీతంనుంచి కట్ అవుతుంటే ఇంకా ఇబ్బందులుపడుతూ గడపాలి మేము. ఆ అప్పు తీరీతీరకుండానే పద్మ పెళ్ళి చేయాలి.
    ఇంకా గోపి చదువుంది. ఇవన్నీ నా గొడవలు.... మా ఇబ్బందులు ఏవో మేం పడతాం. నీ పెళ్ళి చేస్తే ఒక బాధ్యత అన్నా తీరుతుందని నా ఆశ. ఇప్పుడు చెప్పు - నా తాహతుకి నేనింతకంటే మంచి సంబంధం తీసుకురాగలనా?
    తీసుకురావచ్చు - మరీ అంత కట్నం ఇస్తే నీవడిగే వెయ్యిరూపాయల జీతగాడు దొరకొచ్చు. అప్పుడు ఇక మేం ఏం తినాలి? మిగతావాళ్ళ భవిష్యత్ ఏమిటి? ఇవన్నీ ఆలోచించావా?
    కోరికలు అందరికీ వుంటాయి. కాని మన తాహతు గుర్తించాలి. ఏమంటావు?" సూర్యనారాయణ ఇంత సౌమ్యంగా నచ్చచెప్పడం జానకికే ఆశ్చర్యం అన్పించింది.
    జ్యోతి తల వంచుకుని అంతా వింది. తండ్రి కేకలువేయకపోవడంతో కాస్త ధైర్యం వచ్చింది.
    "నాకు పెళ్ళి వద్దు.... బి.ఏ. కాగానే ఉద్యోగం చేస్తాను" అంది నెమ్మదిగా.
    సూర్యనారాయణ కూతురివంక సూటిగా చూసాడు.
    "ఉద్యోగం - నీలాంటి బి.ఏ.లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు. నీకంటె గొప్ప చదువులు చదివి, ఫస్టుక్లాసులో పాసయిన వాళ్ళు ఉద్యోగంకోసం కాళ్ళరిగేట్టు తిరుగుతున్నారని నీకు తెలుసా? చదువుకున్నావు - చుట్టూ లోకం చూస్తున్నావు.... అయినా ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడుతున్నావు?
    నీకు ఉద్యోగం ఇప్పించే పరపతి నాకేం లేదు. నీ అంతట నీవు తెచ్చుకోవాలి. సరే - ఏడాదికో, రెండేళ్ళకో సంపాదిస్తావు. తర్వాత - ఉద్యోగంతో నీ సమస్య మాకు తీరిపోతుందా?
    ఉద్యోగంలో నీకు వచ్చే జీతం ఏపాటి? మహా అయితే మూడువందలు. ఆ మూడువందలతో నీ కాళ్ళమీద నువ్వు నిలబడగాలవా? ఉద్యోగము చేసినా ఈ దేశంలో ఆడపిల్ల వంటరిగా బతకాలంటే ఎన్ని ఇబ్బందులు? అవి ఎదుర్కోగలవా?
    ఉద్యోగం చేసినా ఎప్పటికో అప్పటికి పెళ్ళి చేసుకోవాలిగదా? అప్పుడే నిన్ను వరించేసి ఎవరో వస్తారన్న నమ్మకం నీకుందా?
    నువ్వీ చదువు చదివి, ఉద్యోగానికి రెండేళ్ళు వేచి, ఉద్యోగంచేస్తూ ఎప్పుడో చేసుకుంటానంటే అంతవరకు వేచివుండలేను నేను. నేను రిటైరయ్యే లోపల పద్మ పెళ్ళితో సహా జరగాలి.
    నీకు ఉద్యోగం చేసే ఉద్దేశమే వుంటే నీ డిగ్రీ చేతికొచ్చిన దగ్గర నుంచి నీ బాధ్యత నాకు తీరిపోయిందనుకుంటాను. అప్పటినించి నీ వూసు పట్టించుకోను.
    నీ బతుకుతెరువు వెదుక్కునే బాధ్యత నీది మహా అయితే డిగ్రీ వచ్చిన ఓ ఆరునెలలు నీకు తిండి పెట్టగలను. అంతకంటె నీ బరువు నేను మోయలేను...." సూర్యనారాయణ స్థిరంగా, గంభీరంగా చెప్పుకుపోతున్నాడు.
    జ్యోతి బిత్తరపోతూ చూసింది. జ్యోతి అనుకున్నట్లు గాక, తండ్రి అలా మాట్లాడుతూంటే తెల్లబోయింది.
    "ఏం అలా చూస్తావు? మాట్లాడు - నీకు పెళ్ళికావాలో, ఉద్యోగమే చేస్తావో ఆలోచించి తేల్చి చెప్పు. పెళ్ళి చేసుకుంటానంటే ఈ సంబంధం నీకు నచ్చకపోతే మరోటి చూస్తాను.
    కాని ఒక్కటి గుర్తుంచుకో - ఇంతకంటె స్థితిమంతున్ని మాత్రం తేలేను. మరొక సంబంధం అయితే వాళ్ళకి నువ్వు నచ్చాలి. నువ్వువాళ్ళకి నచ్చేవరకు నేను సంబంధాలు వెతకాలి. ఆ వెతకడంలో ఎంత ఆలశ్యం అవుతుందో నాకు తెలియదు.
    ఆఖరికి ఓపికలేక ఇంతకంటె తక్కువదే జతపడచ్చు. ఇంతకీ నీ మొహాన ఎవరు రాసిపెట్టి వుంటే వాళ్ళే వస్తారు అన్నది గుర్తుంచుకో..... సరే! నేను పెళ్ళిచేసుకోను, ఉద్యోగమే చేసుకుంటాను అంటే ఆ మాట చెప్పు.
    మరి నీ పెళ్ళిమాట ఇంట్లో తలపెట్టను.... నీ ఉద్దేశం బాగా ఆలోచించి అమ్మకు చెప్పు. నీమీద కోపంతో ఇదంతా చెప్పలేదనీ, నే మేలు కోరే చెప్పాననీ గమనించు.
    నువ్వు పెద్దదానివి. నీకిష్టంలేని పెళ్ళి బలవంతంగా చేసే మూర్ఖుడనుకాదు. కాని నీకు వయసు వచ్చినంతగా బుద్ధి వికసించిలేదని తెలుస్తూంది. అందుకని ఇదంతా చెప్పాను. బాగా ఆలోచించుకో...." సూర్యనారాయణ కుర్చీలోంచి లేచి తువ్వాలు పట్టుకుని బాత్ రూంలోకి వెళ్ళి పోయాడు.
    జ్యోతి పెదవి కొరుక్కుంటూ అక్కడే కూర్చుండిపోయింది.
   ఎన్ని మాటలన్నారు? కోతిమొహాన్ని తీసుకొచ్చి వద్దంటే ఇన్ని మాటలంటారా? వాళ్ళెవరికి తీసుకొచ్చినా చచ్చినట్టు కట్టుకోవాలనిగాబోలు వుద్దేశ్యం.

 Previous Page Next Page