అరుణాచలం వరండా మెట్లు ఎక్కుతూనే "మన దగ్గర పెద్ద కొట్లాట జరుగుతోంది. నువ్వు, అమ్మాయి త్వరగా బయలుదేరండి" అని ఆందోళనగా అరుస్తూనే కూతురి కోసం ఇంట్లోకి దూసుకుపోయాడు.
షాపు దగ్గర ఏం జరిగింది?
భర్త ఎందుకిలా వణికిపోతున్నాడు?
షాప్ దగ్గర గొడవ జరిగితే పోలీసులకు ఫోన్ చెయ్యకుండా ఇంటి కెందుకు పరుగెత్తుకొచ్చారు....?
తనూ, అమ్మాయి వెళ్ళి ఏం చేసేట్టు?
ఆలోచిస్తూనే ఆదిలక్ష్మి వరండాలోంచి వేగంగా ఇంట్లోకి నడిచింది. అప్పటికే అరుణాచలం కూతురికేం చెప్పాలో తెలీదు కానీ మేఖల తండ్రికంటే వేగంగా బయటకు పరిగెత్తింది.
అరుణాచలం లోపలకు రాబోతున్న భార్యను బయటకు వెళ్ళమన్నట్లు సంజ్ఞ చేస్తూ కిటికీలో వున్న తాళాన్ని అందుకుని బయటకు వచ్చి హడావుడిగా తాళం వేసి ఆటో కేసి దూసుకుపోయాడు.
ఆ ముగ్గురూ ఎక్కిన మరుక్షణం ఆటో షాప్ కేసి బయలుదేరింది.
* * * * *
గూండాగిరితో పోగేసుకున్న డబ్బుని లెక్కపెట్టుకుంటున్న అచ్యుత్ రూమ్ లోకి అతని అనుచరుడొకడు వేగంగా దూసుకువచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
డెవలప్ అగ్రికల్చరల్ లేండ్ రెండొందల ఎకరాలు కొనేందుకు డబ్బు లెక్కచూసుకుంటున్న అచ్యుత్ అసహనంగా అనుచరుడి కేసి చూశాడు.
"ఛీ....ఛీ.....లెక్క తప్పిపోయింది" అన్నాడు అచ్యుత్ కోపంగా చేతిలో వున్న కరెన్సీని దివాణం మీదకు విసిరేస్తూ.
అతను యింకా ఆయాసంతో చెప్పాలనుకుంది చెప్పలేక పోతున్నాడు.
"చిన్న చిన్న గొడవల్ని నాదాకా తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? మరలా ఎక్కడ జరిగింది గొడవ?" చిరాకుపడుతూ దివాణం మీద సర్దుకు కూర్చున్నాడు అచ్యుత్.
రెండు మూడు నిమిషాలకు తేరుకున్న అనుచరుడు.
"భరత్ నగర్ సెంటర్ లో పెద్ద గొడవ జరుగుతోంది" అన్నాడు ఆందోళనగా.
"ఊ..... జరిగితే.....ఏమిటి....? అది కొత్తా మనకి?" పదాలని వత్తి పలుకుతూ వ్యంగ్యంగా అన్నాడు అచ్యుత్.
"మామూలు గొడవ కాదు"
"మామూలు గొడవల్ని పట్టించుకునే స్థాయిని మనం ఎప్పుడో దాటి పోయాం"
"మన వాళ్ళను చితకగొట్టేస్తున్నారు."
అతను చెప్పడం పూర్తికాకముందే అచ్యుత్ విసురుగా లేచి అతని దవడ మీద కొట్టాడు కోపంగా.
"ఎవర్రా మనవాళ్ళని చితగ్గొట్టేది? ఈ నగరంలో ఎవరికీరా అన్ని దమ్ములు?" కళ్ళెర్ర జేస్తూ అడిగాడు.
"తెలీదు నేనెప్పుడూ వాళ్ళను చూడలేదు. అందరూ కాలేజీ కుర్రాళ్ళు, వాళ్ళందరికి ఒక నాయకుడున్నాడు.
అతనే మన కేతువుని ముందుగా కొట్టాడు."
అప్పటికిగానీ అచ్యుత్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు.
"కేతువుని కొట్టాడా." ఉరుముతూ అన్నాడు అచ్యుత్.
"అవున్సార్....కొట్టడమే కాదు ఎగిరెగిరి గుండెల మీద తన్నాడు."
అచ్యుత్ ఉలిక్కిపడ్డాడు.
అలాంటి తిరుగుబాటుని అతనెప్పుడూ ఊహించలేదు. కనీసం కలలోనైనా,
"ఎక్కడ జరుగుతోంది గొడవ?"
"భరత్ నగర్ సెంటర్ ప్రక్కనే"
అచ్యుత్ వేగంగా ఫోన్ దగ్గరకు వెళ్ళి ఏదో నంబర్ రింగ్ చేస్తూ "వాళ్ళెంతమందున్నారు?" అన్నాడు సీరియస్ గా.
"దాదాపు పాతికమంది"
"మన వాళ్ళెంతమంది..." అని ఓ క్షణం ఆగి.
"హల్లో" అన్నాడు అచ్యుత్.
ఫోన్ లో ఆ వేపు నుండి ఎవరో రెస్పాన్స్ ఇస్తున్నారు.
"రాహువున్నాడా?" అచ్యుత్ కంఠం గంభీరంగా ఉంది.
"లేడా? ఎక్కడికి వెళ్ళాడు....?" చిరాకు పడుతూ అడిగాడు అచ్యుత్.
"ఢిల్లీ వెళ్ళాడు" ఆ వేపు నుండి వినిపించింది.
"ఢిల్లీనా? ఎందుకు?"
"ప్రతి పార్టీకి కొందరు గూండాలుండటం అవసరం అని కొన్ని పార్టీలు గుర్తించాయి కదా. ఎమ్.ఎల్.ఎనో ఎం.పి.నో ట్రై చేద్దామని వెళ్ళాడు" అచ్యుత్ ఫోన్ కట్ చేసాడు విసురుగా.
ఓ క్షణం ఏదో ఆలోచిస్తుండి పోయాడు అచ్యుత్.
ఆ వెంటనే మరోచోటికి ఫోన్ చేసి ఏదో చెప్పాడు చిన్నగా.
ఇక్కడ అచ్యుత్ ఫోన్ పెట్టేలోపే అక్కడి నుండి ఓ పది మంది నరరూప రాక్షసులు చేతికి దొరికిన వాహనం, ఆయుధం అందుకుని భరత్ నగర్ కేసి దూసుకుపోయారు.
"మన వాళ్ళు మరో పదిమంది అక్కడికి బయలుదేరారు. అందిన వాడ్ని అందినట్లు నరికి అవతలకి పడేయండి. ఇప్పుడు మనం దెబ్బ తిన్నామంటే కలెక్షన్స్ పడిపోతాయి. పెట్టుబడి లేని వ్యాపారం అంత తేలిగ్గా మరొకటి దొరకదు వెళ్ళు" అన్నాడు అచ్యుత్ శాసిస్తున్నట్లు.
అతను వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అచ్యుత్ కరెన్సీ నోట్ల ముందు కూర్చున్నాడే గానీ వాటిని లెక్కించడంలో మనస్సును లగ్నం చేయలేకపోయాడు.
అచ్యుత్ కి ముఫ్ఫై ఏళ్ళుంటాయి.
ఆరోగ్యంగా, బలంగా ఉంటాడు.
కళ్ళెప్పుడూ మండుతూ అగ్ని గోళాల్లా ఉంటాయి.
అస్తమానం తాగడం వల్ల కాదు. ఆ కళ్ళ తీరే అంత. అలా అని మందు ముట్టడని కాదు.
మరీ ప్రమాదకరమైన పనులు చేపట్టే ముందు ఒంటరిగా తాగుతాడు. ఆ పనిలో విజయవంతమైతే అందరితో కలిసి తాగుతాడు. తాగినా తాగినందువల్ల మత్తు మెదడు కెక్కినా, అనుక్షణం అప్రమత్తంగా వుంటాడు. తను వున్నది ఆదమరచి ఉండే వృత్తి కాదని అతనికి బాగా తెలుసు.
తన తండ్రి కుక్కచావు చస్తూ తనకిచ్చి వెళ్ళింది ఆస్తిపాస్తులు కావు. పరువు ప్రతిష్టలు కావు. అక్రమాన్ని, అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, రౌడీతనాన్నీ గూండాగిరిని, వారసత్వంగా అప్పజెప్పి వెళ్ళాడు.
ఈ రోజుల్లో అవి కూడా ఆస్తులే.
డైరెక్టుగ ఆస్థులు కాకపోయినా ఆ ఆస్తుల్ని సంపాదించి పెట్టే అస్త్రాలు.
ఆ తర్వాత తనెంతో కష్టపడి (అది కష్టమేనా?) రిస్క్ తీసుకొని అహోరాత్రులు శ్రమించి రౌడీ పదవిని నిలబెట్టుకున్నాడు.
అలాంటి అదృష్టాన్ని ఇప్పుడు మరొకడు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళి పోతానంటే ఇంకేమైనా వుందా? పదవిలో ఉన్న జడ్జి రిటైరైతే విచారణ కమిటీలకు చైర్ మెన్ చేసి గౌరవిస్తుంది ప్రభుత్వం.
పదవిలో ఉన్న ఐ.ఎస్.ఎస్, ఐ.పి.ఎస్., ఆఫీసర్స్ పదవి విరమణ చేస్తే వారి అనుభవాలని ఉపయోగించు కునేందుకు ప్రయత్నాలు జరుగుతాయి.
ఒక ఉద్యోగి రిటైరైతే ఫించనిచ్చి గౌరవిస్తారు.
ఒక వీరజవాన్ రిటైరైతే పొలం, పుట్రా యిచ్చి గౌరవిస్తారు.
అదే రాజకీయవేత్త, రౌడీ, నైతిక విలువలను లేనివాడు రిటైరైతే తరిమి తరిమి కొడతారు జనం. ఆ ఆలోచన రాగానే అచ్యుత్ అప్పటి కప్పుడే తన నిర్ణయం మార్చుకొని భరత్ నగర్ కేసి బయలుదేరాడు.
అతను బయలుదేరడు సాధారణంగా.
అదే జరిగితే ఒక అగ్నిపర్వతం అంతర్వాహిణిలా సాగివస్తున్నట్లే లెక్క.
* * * * *
ఆటో ఆ వీధి మలుపు తిరుగుతుండగానే దూరంగా తమ షాపు ముందు జరుగుతున్న యుద్దకాండని గుర్తించి ఆందోళన చెందారు ఆదిలక్ష్మి, మేఖల.
"ఇప్పుడైనా చెబుతారా? ఏం జరుగుతోందక్కడ?" ఆదిలక్ష్మి భయపడుతూ అడిగింది.
"అచ్యుత్ మనుష్యులు మామూళ్ళ కోసం వచ్చారు. పోయిన సంవత్సరం వెయ్యినూట పదహార్లు అడిగారు. ఇచ్చాను. ఈ సంవత్సరం నాలుగు వేల నూటపదహార్లు అడిగారు ఎక్కడి నుండి తేను? అందుకే లేవన్నాను. ఎందుకివ్వాలన్నాను అంతే గడువు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరో మన బాబుకి తెలియజేశారు. వాడు వచ్చిపడి వాళ్ళు ఎటువంటి వాళ్ళో కూడా తెలుసుకోకుండా తిరగబడిపోయాడు. వాడికి తోడు వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చి పడ్డారు. వాళ్ళు మంచివాళ్ళు గాదు వాళ్ళతో మనకు గొడవొద్దు. ఆ డబ్బు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపో అన్నాను. వినలేదు మీరు భయపడకండి నాన్నగారని వాళ్ళమీద తిరగబడ్డాడు. వాడ్ని ఎలా ఆపాలో తెలీక, కాళ్ళు, చేతులు ఆడక పరిగెత్తుకు వచ్చాను. నువ్వన్నా వెళ్ళి వాడ్ని ఆపాలి. లేదంటే మన కుటుంబం మొత్తాన్ని నరికిపోగులు పెడతాడు అచ్యుత్...."