Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 7


    "నా చిన్నప్పుడు మా అమ్మవెంట నాలుగైదుసార్లు రైలెక్కా తెలుసా...?" తిమ్మడి అమాయకమైన ముఖంవేపు చూస్తూ "సరే ఒప్పుకుంటున్నాను. చెప్పు చూద్దాం?"

    ఇంజనీర్ కి, సైంటిస్ట్ కి తిమ్మడు చెప్పగలడని ఏ మాత్రం నమ్మకం లేదు.

    "మొదటిసారి టిక్కెట్ కలెక్టర్ వచ్చినప్పుడు పాకిస్థానోళ్ళు దొంగ వెధవలు గదా బాత్ రూమ్ లో దూరారు. టిక్కెట్ చూసేవాడు బాత్ రూమ్ కూడా వదలడుగదా? తలుపుకొట్టి టిక్కెట్ అంటాడు. ఒకడు తలుపు కొద్దిగా తీసి ఒక టిక్కెట్ చూపిస్తే చాలు. బాత్ రూమ్ లో ఒక్కడే వుంటాడని అనుకొని వెళ్ళిపోతాడు-"

    తిమ్మడు ఓ క్షణం ఆగాడు.

    అప్పటికే సైంటిస్ట్, ఇంజనీర్ కొద్దిగా తుళ్ళిపడ్డా దాన్ని బయటకు కనపడనివ్వలేదు.

    హిందూ అదే చిర్నవ్వుతో చూశారా అన్నట్లు ఒక చూపు విసిరింది.

    "మరి రెండోది-?" కాస్త వ్యంగ్యంగా అడిగాడు సైంటిస్ట్.

    తిమ్మడు ఆలోచిస్తూండిపోయాడు.

    ముగ్గురిలోనూ ఉత్కంఠ- తిమ్మడు అది కూడా చెప్పగలడా లేడా అని.

    తిమ్మడు తిరిగి చెప్పడం మొదలెట్టాడు.

    "టిక్కెట్ కలెక్టర్ రాబోతున్నాడని తెలిసి ముందుగా పాకిస్థానీ వాళ్ళు బాత్ రూమ్ లో దూరారు. ఆ వెంటనే ఇండియన్స్ లేచారు. ఒకడు బాత్ రూమ్ లో దూరాడు. రెండోవాడు బాత్ రూమ్ లో దూరేముందు పాకిస్థానీ వాళ్ళు దూరిన బాత్ రూమ్ కి పక్కగా నిలబడి తన ముఖం కనిపించకుండా ఒక చేత్తో ఆ తలుపు కొట్టాడు. లోపలున్న పాకిస్థానీవాడు టికెట్ కలెక్టరే తలుపు కొడుతున్నాడనుకొని టిక్కెట్ వున్న చేతిని బయటకు చాపాడు. ఇండియన్ ఆ టిక్కెట్ తీసుకొని చటుక్కున ఎదురుగా వున్న బాత్ రూమ్ లోకి దూరి తలుపేసు కున్నాడు. ఆ తరువాత టిక్కెట్ కలెక్టర్ వచ్చి ఇండియన్స్ వున్న తలుపు కొట్టాడు. ఒకడు తను పాకిస్థానీ వాళ్ళ దగ్గర నొక్కేసిన టిక్కెట్ చూపించి తలుపేసుకున్నాడు. టిక్కెట్ కలెక్టర్ పాకిస్థానీ వాళ్ళున్న బాత్ రూమ్ డోర్ కొట్టాడు. 'టిక్కెట్' అని కలెక్టర్ అనగానే వాడు కోపంగా బయటకు వస్తాడు- ఇందాకే టిక్కెట్ ఇచ్చాను గదా అని. దాంతో గొడవ అయి ఇద్దరు పాకిస్థానీవాళ్ళు బయటపడి పోతారు."

    చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం అక్కడ అలుముకుంది.

    ముగ్గురి ముఖాలు చిత్తరువుల్లా అయ్యాయి. శిలాప్రతిమల్లా బిగుసుకుపోయి తిమ్మడివేపు చూస్తున్నారు. వారి ముఖాల్లో ఎనిమిదో వింతను చూస్తున్న దిగ్భ్రమ. సూర్యుడు పడమటే ఉదయిస్తాడని ఖండితంగా ఖగోళ శాస్త్రజ్ఞుడు చెబితే కలిగే ఆశ్చర్యం! మట్టి ముద్ద మేలిమి బంగారంలా తమ కళ్ళముందే రూపాంతరం చెందితే కలిగే విస్మయం!!!  

    నమ్మలేకపోతున్నారు ఇంకా-

    చూసింది జీర్ణించుకోలేకపోతున్నారింకా- తిమ్మడు చటుక్కున లేచాడు. ఆ పక్కనే వున్న హిందూ వ్యానిటీ బ్యాగ్ లోంచి ఐదురూపాయలు మాత్రమే తీసుకొని వేగంగా బయటకు దూసుకుపోయాడు.

    ఆ పోవటం సరాసరి ఒక హోటల్ కి వెళ్ళి తన కుక్కకు రెండు బన్ లు ముందు ప్యాక్ చేయించుకొని, ఆ తరువాత మిగిలిన డబ్బులన్నీ పెట్టి ఇడ్లీ సాంబారు తిన్నాడు. కొద్దిగా మాత్రమే ఆకలి తీరిన ఫీలింగ్... అసంతృప్తిగా బయటకు వచ్చాడు పొట్ట నిమురుకుంటూ.

    తిరిగి ఆలోచనలు... ఎలా...? ఎలా ఆ రెండువేల రూపాయలు సంపాదించాలి?

    ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసినా అంత డబ్బు పోగేయడం చాలా కష్టం. పైగా అది తన తిండికే సరిపోతుంది. ఇక్కడ, ఈ దేశంలో- తెలివితేటల వల్లే ఎక్కువ సంపాదించుకొనే ఛాన్స్ వుంది. కాని తన తెలివితేటలు దేనికి పనికొస్తాయి-?

    ఆ సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళలేదు తిమ్మడు.


                     *    *    *    *


    సిద్దప్ప తల్లికి ఇంకా తగ్గలేదు. ఉండుండి వస్తోంది కడుపులో నెప్పి. రిక్తహస్తాలతో తిమ్మడు సిద్దప్ప ఇంటికి వెళ్ళాడు. తలుపుమీద చేతులేస్తుండగా లోపల నుంచి బలహీనంగా ఒక మూలుగు వినిపించింది. అక్కడే ఆగిపోయాడు తిమ్మడు. అడుగు ముందుకు పడలేదు.

    వెంటనే వెనుదిరిగాడు. వడివడిగా నడుస్తూ రోడ్డెక్కాడు. అప్పటి అతని ఆలోచనలు వడకట్టని ఓ ముడిపదార్ధం.

    రోడ్డెంట వడివడిగా నడుస్తూ ఓసారి తన ఫాంటుజేబులో చేయిపెట్టి తడుముకున్నాడు. ఓ నాణెం చేతికి తగిలింది. ఆ నాణేన్ని బయటకు తీసి చూసాడు. దానిమీద యాభై అంకె కనిపించింది. దాంతో అతని ఆలోచనలు తాత్కాలికంగా దారితప్పాయి. దారెంట వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి టైమ్ తెలుసుకున్నాడు. రాత్రి 8-55.

    మరో అయిదు నిమిషాలకే తిమ్మడు మెజిస్టిక్ థియేటర్ ముందున్నాడు.

    అర్ధరూపాయి పెట్టి బెంచీ టిక్కెట్ తీసుకున్నాడు. సెకండ్ షో ప్రారంభం కావటానికి ఇంకా పదిహేను నిముషాలుంది. థియేటర్ ముందు షోకేసులు ముందు నిలబడి రాబోయే సినిమాల స్టిల్స్ చూస్తున్నాడు తిమ్మడు.

    ఆ థియేటర్ లో ఆడుతున్నది 'మనీ మేకర్స్' అనే ఇంగ్లీషు సినిమా కావడంతో కార్లలో వచ్చేవారి సంఖ్యే ఎక్కువగా వుంది.

    "ఖరీదైన కార్లలోంచి దిగుతున్న ఆడవాళ్ళ వేపే చిత్రంగా చూస్తున్నాడు తిమ్మడు. అమ్మో- ఎంత బంగారం-?! ఎంత ఖరీదైన బట్టలు-?! వీళ్ళకింత ఖరీదైనవి ఎలా వస్తున్నాయ్-? ఎలా అంత డబ్బు సంపాదించగలుగుతున్నారు-? తిమ్మడి మనసంతా ఆలోచనలతో, ఆశ్చర్యాలతో నిండిపోయింది.

    వాళ్ళనే పరిశీలనగా చూస్తున్నాడు. కార్లోంచి దిగిన ఆడవాళ్ళంతా స్టయిల్ గా థియేటర్ వరండాలోకి వచ్చి అందరిలా స్టిల్స్ చూడడం లేదు. అటూ, ఇటూ వున్న బాల్కనీ మెట్లకు దిగువ భాగాన గోడల్లో ఫిక్స్ చేసిన నిలువెత్తు అద్దాల ముందు నిలబడి తమ అలంకరణలను సరిచేసుకుంటున్నారు. కొందరు తమ వ్యానిటీ బ్యాగ్స్ లోంచి చిన్న అద్దాల్ని బయటకు తీసి తమ పెదవుల్ని సుతారంగా కదిలిస్తూ లిప్ స్టిక్ రాసుకుంటున్నారు. మరికొందరు నిలువెత్తు అద్దాలముందు నిలబడి తమ చెక్కిళ్ళపై పఫ్ తో గులాబీ రంగు పౌడర్ ని అంటీ అంటనట్లు అద్దుకుంటున్నారు.

    ఎవరికీ ఆ థియేటర్ పై, అక్కడున్న జనంపై, షోకేసుల్లో వున్న స్టిల్స్ పై దృష్టిలేదు.

    అంతలో సినిమా ప్రారంభం కాబోతున్నదని హెచ్చరిస్తూ బెల్ మ్రోగింది. అందరూ గేట్స్ వేపు హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఒకర్నొకరు తోసుకుంటూ.

    తిమ్మడు ఇంకా ఈ లోకంలోకి రాలేదు. ఖరీదైన కార్లను, అందులోంచి దిగుతున్న ఖరీదైన ఆడవారినే ఆసక్తిగా చూస్తున్నాడు.

    మరోసారి బెల్ మ్రోగింది.

    తిమ్మడు తను వెళ్ళవల్సిన గేటువేపు బయలుదేరాడు. అప్పుడే వేగంగా వచ్చిన రెండు కార్లు సరాసరి గేటు ముందుకువచ్చి ఆగాయి. అందులోంచి ఏడెనిమిదిమంది ఆడవాళ్ళు దిగారు, వారివేపే చూస్తూ ముందుకు నడుస్తున్న తిమ్మడు చటుక్కున ఆగిపోయాడు. అప్పటికే సినిమా ప్రారంభమయిందని వార్ని చూడగానే గేట్ మెన్ వినయంగా చెప్పాడు.

    కానీ వారిలో సినిమా మొదలయిపోయిందనే ఆతృత కనిపించలేదు సరికదా తాపీగా మెట్లెక్కబోతూ ఓ క్షణం ఆగి అద్దాల ముందుకెళ్ళి ఓసారి తమను తాము అద్దాల్లో చూసుకుంటూ రేగిన జుత్తును, పెదాల్ని, చెక్కిళ్ళను సరిచూసుకొని అప్పుడు మెట్లవైపు సాగిపోయారు.


                     *    *    *    *


    రాత్రి ఒంటిగంట సమయం.

    ఆ రాత్రి నీరవంలో అపర శివుడిలా దూసుకుపోతున్నాడు తిమ్మడు. అతను వేసే అడుగులో నడక కనిపించడం లేదు. పరుగు కనిపిస్తోంది.

    కళ్ళలో పట్టుదల, కదలికలో ఉత్సాహం కనిపిస్తున్నాయి.

    అతని కళ్ళముందు సిద్దప్ప తల్లే కదలాడుతోంది. తన తల్లికంటే మిన్నగా ఆదరించే ఆమె కనిపిస్తోంది. తనకు దాచుకున్నది బయటకు తీసి, తన ఆకలిని దాచుకుని సిద్ధప్పకు, తనకు దగ్గరుండి తినిపించిన సంఘటనలు ఎన్నో...

    తన తల్లి దగ్గరయినా కాస్త భయపడతాడు గాని, సిద్ధప్ప తల్లి దగ్గర భయం వుండదు- బాగా కోపం వస్తే ఇద్దర్నీ పిచి వెధవల్లారా ఎలా బతుకూతార్రా....? చదువుకున్న వాళ్ళకే ఈ గడ్డమీద గంజి దొరకటం లేదు. మీరెలా...? అంటూ ఆమె తమవేపు చూస్తూ వేసే ప్రశ్న వెనుక వ్యక్తమయ్యే వ్యథ, ఆమె కళ్ళ లోతుల్లో కనిపించే నిస్సహాయత... నిర్లిప్తత.... ప్రేమ... అభిమానం... ఆప్యాయత వెనుక దారుణమైన శారీరక హింస. కడుపులో పెరుగుతున్న పుండు- వుండుండి కదిలిపోతూ ఆమెను నరకానికి అతి చేరువకు తీసుకెళ్ళి వదులుతుంది.

    వెంటనే ఆపరేషన్ చేయించకపోతే బతకదని నిర్మొహమాటంగా చెప్పే డాక్టర్. ఆ డాక్టర్ కళ్ళలో కనిపించే డబ్బుకై వెంపర్లాట...

    తిమ్మడు ఒక్కసారి తల విదిలించి ఆ వీధి మలుపు తిరిగాడు. అప్పుడే ఓ ఫారెన్ కారు కీచుమన్న శబ్ధంతో మలుపు తిరిగింది. తిమ్మడు మరొక్క క్షణం ఆలస్యం చేసుంటే విమానంలాంటి ఆ కారు చక్రాల కిందుండేవాడు.

    తిమ్మడు శబ్దం వినిపిస్తూనే ఎగిరి ఫుట్ పాత్ మీదకు దూకాడు.

    ప్రియాంక దాన్ని గమనించినా నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోయింది.

    తిమ్మడు చటుక్కున వంగి ఒక రాయిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికే కారు చాలా ముందుకెళ్ళిపోయింది.

    తిమ్మడు కసిగా వళ్ళు పటపట కొరుకుతూ సడన్ గా పరుగందు కున్నాడు. క్షణాల్లో ఆ కారుకు చేతివాటు దూరానికొచ్చాడు. వేగం తగ్గకుండా చూసుకొంటూ చేతిని గాల్లోకి లేపాడు. తిమ్మడి చేతిలో రాయి బుల్లెట్ లా వెళ్ళి ఆ కారు అద్దాలకు తగల్లేదు. అద్దంలా మెరిసే దాని బాడీకి తగిలి పిడికెడంత చొట్టను చేసింది.

    ఆ శబ్దానికి తృళ్ళిపడ్డ ఆమె కారుకు సడన్ బ్రేక్ వేసి ఆపి క్రిందకు దిగింది. నిర్మానుష్యంగా వున్న ఆ రోడ్డుమీద ఒకే ఒక వ్యక్తి నింపాదిగా నడుచుకుంటూ తనవేపే వస్తూ కనిపించాడు.

    ఆ కారంటే ప్రియాంకకు ప్రాణం. కారు లైట్స్ వేసి చుట్టూ తిరిగి అద్దాలవేపు చూసుకుంది.

    "పగిలితే అద్దం వేయించుకుంటావ్. అది తేలిగ్గా నాలుగు డబ్బులు మర్చిపోయే దెబ్బ. తెలివిగలవాడు అద్దాల్ని పగలగొట్టడు. అందమైన దాని బాడీని గురిచూస్తాడు. ఆ చొట్టను ఎంత ఖర్చుపెట్టినా నువ్వు సరిచేయలేవు. చేయగలిగినా పూర్వం అందం వుండదు. నీ పొగరుబోతు డ్రైవింగ్ కి నేనిచ్చిన ముద్దది. కాస్త ఘాటుగా వుందనుకుంటాను?" నవ్వుతూ అడిగాడు చొట్టను చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్న ప్రియాంకవేపు చూస్తూ.

    ఆమె చటుక్కున తలెత్తింది.

    ఆమె కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. ఆ సంఘటన సరిగ్గా ఆ వీధి ఎలక్ట్రిక్ పోల్ క్రిందే జరిగింది. ఇప్పుడామెను తిమ్మడు స్పష్టంగా చూడగలుగుతున్నాడు.

    కోపంతో ఆమె ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

    "బుజ్జిముండ చాలా అందంగా వుంది. డ్రైవింగ్ కూడా అలా వుంటే బావుండుగదా?" పైకే అనేశాడు తన అభిప్రాయాన్ని.

    ప్రియాంక విస్మయంగా చూస్తుండిపోయింది.

    తిమ్మడు నిర్లక్ష్యంగా ముందుకెళ్ళిపోయాడు.

    కారులో తనొక్కతే వుంది. తనతోపాటు సినిమాకొచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే దిగిపోయారు. అదీ... ఒకందుకు మంచిదే అయింది. వారి ముందు జరిగే అవమానం తప్పిపోయింది.

    మరో నిమిషానికి తిమ్మడు హిందూ రూమ్ ముందున్నాడు.

    తలుపు కొట్టాడు.

    ఆ శబ్దానికి హిందూ చటుక్కున లేచి కూర్చుంది. మరలా వినిపించింది శబ్దం. లేచివెళ్ళి తలుపుతీసి తిమ్మడ్ని చూసి ఆశ్చర్యపోయింది.

    ఆ వేళప్పుడు... తిమ్మడు... తన రూమ్ కి... తిమ్మడ్ని సందేహించలేదు కాని రాకలోని అంతరార్ధాన్ని పసికట్టలేకపోయింది.

    తను పక్కకు తప్పుకొని తిమ్మడికి దారిచ్చి గదిలో లైట్ వేసింది.

    నీళ్ళు కావాలన్నట్టు సైగ చేశాడు.

 Previous Page Next Page