"వద్దొద్దు! నన్ను మీ కేబిన్ లోనే ఉండనివ్వండి!" అంది అనూహ్య వణుకుతున్న గొంతుతో.
ఏం చెయ్యాలో తోచలేదు సాగర్ కి. జరిగిన దేమిటో అతనికి చూచాయిగా అర్థమావుతోంది. "సరే" అన్నాడు నెమ్మదిగా.
మిగతావాళ్ళకి ఇదంతా ఏమిటో అంతుబట్టలేదు. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ.
అనూహ్యని తన కేబిన్ లోకి తీసుకెళ్ళి, ఆమె కోసం కాఫీ ఆర్డర్ చేశాడు సాగర్. తర్వాత రేడియోవున్న రూంలోకి వెళ్ళి విశాఖపట్నం హర్భరుని కాంటాక్టుచేసి, అనూహ్య షిప్పులో ఉండిపోయిన సంగతి కరక్టే ననీ, ఆమెని పోర్ట్ బ్లాయర్ నుంచీ విమానంలో పంపిస్తామనీ మెసేజ్ పంపించాడు.
ఈ హడావిడిలో అందరూ కాసేపు సత్యనారాయణసింగ్ విషయం మర్చిపోయారు.
అది గుర్తొచ్చి రెయిలింగ్సువైపు చూశాడు సాగర్.
రెయిలింగ్సుమీద నుంచీ తలను వంచి, సముద్రంలోకి వాంతి చేసుకుంటున్నాడు సింగ్.
"సో, సీ సిక్ నెస్ తాలూకు మొదటి విక్టమ్!" అనుకున్నాడు సాగర్.
సముద్ర ప్రయాణంలో సీ సిక్ నెస్ రావడం చాలా మామూలు! సముద్రంమీద వెళ్ళే షిప్పు నిరంతరంగా అలలమీదికి ఎక్కుతూ దిగుతూ పయనిస్తుంది. లేదా అలల మధ్యగా అటూ ఇటూ ఊగుతూ వెళుతుంది.
ఈ రెండు రకాలైన కదిలికలూ కూడా ప్రయాణీకుల కడుపులని ఆప్ సెట్ చేసేసి, వాంతులు కలిగిస్తాయి. సీ సిక్ నెస్ కి లోనయిన వారి వరసగా వాంతులు చేసుకుంటూ, నిస్సత్తువగా పడుకుని ఉండిపోతారు రాటుదేలిన నావికులకీ, సముదప్రయాణం అలవాటపోయిన వాళ్ళకూడా సీ సిక్ నెస్ రావచ్చు, ఇప్పుడు సింగ్ కి వచ్చినట్లు.
సీ సిక్ నెస్ వచ్చినవాళ్ళు ఖాళీ కడుపుతో ఉండకూడదని అంటారు. ఏదైనా తింటూనే ఉండాలి. వికారంగా ఉండి, ఏమి నోట్లో పెట్టుకోబుద్ది వెయ్యకపోయినా కూడా, ఖాళీ కడుపు మీదా వాంతులయితే రక్తం కక్కుకునే ప్రమాదం ఉంది.
వికారం తగ్గడానికిగానూ, షిప్పులో అక్కడక్కడ డ్రమ్ములతో నిమ్మకాయ రసం పెట్టి ఉంటుంది. లేదా, కిచెన్ లో వేడి వేడి చారు సిద్దంగా వుంటుంది.
ఒక మగ్గుతో నిమ్మకాయ రసం తెప్పించి, సింగ్ కి ఇచ్చాడు సాగర్.
నిస్సత్తువగా, "థాంక్స్" చెప్పి వెళ్ళి తన మంచం మీద పడుకుండి పోయాడు సింగ్.
ఆ మధ్యాహ్నం సాగర్ బలవంతం మీద రెండు బ్రెడ్ స్లెయిస్ నూ, కొద్దిగా వెన్నా తిన్నది అనూహ్య. ఇంటిమీది బెంగతో నోరు తెరిస్తే దుఃఖం పొంగి పొర్లిపోయేటట్లు ఉంది ఆ అమ్మాయికి.
నీళ్ళని చీల్చుకుంటూ అండమాన్ ద్వీపాలవైపు సాగిపోతోంది షిప్పు.
చీకటిపడింది. అప్పుడే చంద్రోదయం అయింది వెన్నెల సముద్రానికి వెండిపూత పూస్తున్నట్లు వుంది.
రెయిలింగ్సుని అనుకుని చంద్రుడిని చూస్తూ నిలబడి వున్నాడు సాగర్.
"వెన్నెల ఎందుకింత వేడిగా వుంది?" అంది ఒకస్త్రీ కంఠం.
వెనక్కి తిరిగి చూశాడు సాగర్.
స్వరూపరాణి నిలబడి వుంది. అతి పల్చటి నైట్ గౌను వేసుకుని వుంది. ఆమె పరిమళం వస్తుంది ఆమెనించి. దాదాపు అతన్ని తాకుతూ నిలబడింది.
ఇబ్బందిగా పక్కకి జరిగాడు. అతనితో పాటే ఆమె కూడా జరిగింది.
"మీ బాస్ కి సీ సిక్ నెస్ తగ్గలేదు" అంది విసుగ్గా. "పొద్దున్నంచీ అలా పడుకునే వుండిపోయాడు. రాత్రంతా కూడా అలా దుంగలా పడుకునే ఉంటాడనుకుంటాను. అందమైన వెన్నెల రాత్రులంటే ప్రాణం నాకు. అవి వృధా అయిపోతే విలవిల్లాడిపోతుంది. నా ప్రాణం!"
అతను ఇబ్బందిగా నవ్వి___"ఒక్కసారి ఇంజన్ రూంలోకి వెళ్ళి వస్తాను" అని కదలబోయాడు.
అతనికి అడ్డంగా నిలబడి, అతని కళ్ళలోకి చూసింది స్వరూపరాణి ఆమె కళ్ళలో ఆహ్వానం నగ్నంగా కనబడుతోంది.
జుగుప్స కలిగింది సాగర్ కి. నిన్న సింగ్ తో ఇవాళ ప్రొద్దున్న అనూహ్యతో, ఇప్పుడు తనతో సరాగాలా ఈవిడకి? ఏపి__డిసి, కరెంటులాంటిదన్నమాట ఈ ఉన్మాద స్త్రీ? అవసరానికి ఆడయినా మొగయినా సరేనన్నమాట.
ఛీ!
మునికాళ్ళ మీద నిలబడి, అతని మెడచుట్టూ చేతులేసింది స్వరూప.
అతను వదిలించుకోబోయాడు.
వెంటనే పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ లో మాటలు ఇనబడ్డాయి ప్రమాదాన్ని సూచిస్తూ అలారం బెల్లు మ్రోగింది.
"s.o.s. మెసేజ్ సర్! s.o.s. మెసేజ్ సర్!"
's.o.s.' అంటే సేవ్ అవర్ సోల్స్ అని అర్థం చెబుతారు. అది ఎంతవరకూ కరెక్టో తెలియదుగానీ, తాము ప్రమాదంలో వున్నట్లు సూచించడానికి ఆ మూడు అక్షరాలనీ సంకేతంగా ఉపయోగిస్తారు చాలా మంది.
ప్రమాదంలో ఉన్నది ఎవరు ఇప్పుడు?
5
ఆ షిప్పు పంపిన సమాచారాన్ని బట్టి, అక్షాంశ, మధ్యంశ రేఖల ఆధారంగా అది ఉన్న స్థానాన్ని కరెక్టుగా నిర్ణయించాడు సాగర్. అది తమ షిప్పుకి పడమరగా యాభై నాట్ల దూరంలో ఉంది.
అంటే, మూడు గంటలు వెనక్కి ప్రయాణం చెయ్యాలి మళ్ళీ.
సీ సిక్ నెక్ నెస్ తో లేకలేక మంచం మీదే పడుకుని ఉన్న సింగ్ కి చెప్పాడు ఈ వార్తా.
"నోనో!" అన్నాడు సింగ్ కంగారుగా. "మనం ముందుకు పోవలసిందే!నో టైం!"
ఆశ్చర్యంగా చూశాడు సాగర్. "కానీ సర్! వాళ్ళు డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపుతుంటే నిర్లక్ష్యం చేసి ఎలా వెళ్ళిపోగలం! ఒకవేళ మనమే అలాంటి విషమ పరిస్థితిలో చిక్కుకుంటే ఏమవుతుందో ఆలోచించండి?"
"చుట్టుపక్కల ఇంకేవో షిప్పి ఉండకుండాపోవు! మనం ముందు కెళ్ళిపోదాం!"
నిశితంగా సింగ్ మొహంలోకి చూశాడు సాగర్ అండమాన్ చేరాలని ఎందుకింత తొందర ఈయనకి? ప్రొఫెసర్ ముచ్చట తీర్చాలనా? పెళ్ళాం మోజు తీర్చాలనా?
"సారీ సర్!" అన్నాడు స్థిరంగా "ప్రమాదంలో పడిన షిప్పుని రక్షించడం మన కర్తవ్యం! ప్రొఫెషనల్ ఎదిక్స్! వాటిని త్రోసి రాజనలేం మనము."
సింగ్ కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. "సీ యంగ్ చాప్! నేను ఈ షిప్పుకి యజమానినని మర్చిపోకు!"
"తెలుసు! కానీ నేనూ ఈ షిప్పుకి కేప్టెన్ ని! ఐయామ్ ద మాస్టర్ ఆఫ్ ద షిప్! షిప్పు సముద్రంమీద ప్రయాణం చేస్తున్నన్ని రోజులూ నేను దీనికి సర్వాధికారినని మీకు గుర్తు చెయ్యవలసిన అవసరం లేదనుకుంటాను."
సాగర్ చెబుతున్నది నిజమే అని తెలుసు సింగ్ కి అందుకే ప్రయత్న పూర్వకంగా కోపాన్ని అణుచుకున్నాడు. "ఓకే! యూ విన్! నీ ఇష్టప్రకారమే కానియ్!
అనవసరమైన గొడవ ఏమీ లేకుండా తప్పిపోయినందుకు సాగర్ సంతోషించాడు.
షిప్పుని వెనక్కి మళ్ళించారు.
మూడు గంటల ప్రయాణం తర్వాత లీలగా కనబడింది ఒక షిప్పు దాని కిందనుంచీ చమక్ చమక్ మని మెరుపులు వస్తున్నాయి అప్పుడప్పుడూ.
రెండు షిప్పులూ బాగా దగ్గరయ్యాయి.
ఆ రెండో షిప్పు కేప్టెన్ రేడియో మెసేజ్ పంపించాడు సాగర్ కి.
"షిప్పుకి కింద చిల్లిపడింది నీళ్ళు లోపల కొచ్చేస్తున్నాయి. దాన్ని పూడ్చడానికి సాయంత్రంనుంచీ అండర్ వాటర్ వెల్డింగ్ చేస్తున్నారు మా వాళ్ళు."
అతను షిప్పులోకి ఎక్కగానే మళ్ళీ మెసేజ్ పంపించాడు కేప్టెన్.
"వెల్డింగ్ చెయ్యడం అసాధ్యం అంటున్నారు మా వాళ్ళు షిప్పు అబాన్ డన్ చేస్తున్నాము దయచేసి మమ్మల్ని మీ షిప్పులోనికి ఎక్కనివ్వండి."
"ష్యూర్! ష్యూర్!" అన్నాడు సాగర్.
అతని కళ్ళముందే ఎదుటి షిప్పు అంగుళం అంగుళం చొప్పున మునిగిపోవడం మొదలెట్టింది.
త్వరత్వరగా రెండు షిప్పులనీ కలుపుతూ 'జాక్ స్టే' అనే తాడు బ్రిడ్జిలాంటిది వేశారు.
ఆ షిప్పులోని నావికులందరూ సాగర్ షిప్పులోకి ఎక్కేశారు.
"అందరూ వచ్చేశారా?" అంటూ తన మనుషులందరినీ లెక్కపెట్టుకున్నాడు ఆ రెండో కేప్టెన్. వెంటనే అతడి మొహంలో ఆదుర్దా కనబడింది.
"అరె! సింహాద్రి ఏడీ? సింహద్రీ! సింహద్రీ!__"
అప్పుడొక చిత్రం కనబడింది.
మునిగిపోతున్న షిప్పులోని ఒక నావికుడు జుట్టు పీక్కుంటూ, పెద్దగా ఏడుస్తూ, షిప్పులోని కింద అంతస్తులోకి దిగుతున్నాడు!
ఎందుకలా చేస్తున్నాడు అతడు?
అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు.
వాళ్ళందరిలోకీ ముందుగా తేరుకున్నది సాగరే. అతను చటుక్కున కదిలి, స్ట్రేజాక్ మీదకు ఎక్కి, మునిగిపోతున్న నౌకలోకి వేగంగా వెళ్ళి పోయాడు. పెద్ద పెద్ద అంగలతో రెండేసి మెట్ల చొప్పున దిగేస్తూ, దిగువ వైపు ఉన్న కేబిన్స్ ని చేరుకున్నాడు.
అప్పటికే అక్కడ మోకాళ్ళ లోతున వచ్చేశాయి. నీళ్ళు.
ఆ షిప్పులో ఉండిపోయిన సెయిలర్ సింహాద్రి తన కేబిన్ లో దూరి, సంధి ప్రేలాపనలా ఏదేదో గొణుక్కుంటూ, అదుర్ధాగాస్క్రూ డ్రైవర్ తో కేబిన్ గోడలకి ఉన్న చెక్క పానెల్ లో ఒకదానివి ఊడదియ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.
"హలో మిస్టర్ !!" అన్నాడు సాగర్ బిగ్గరగా. "షిప్పు మునిగి పోతోంది! బయటికి వచ్చేయ్!"
షిప్ లో నీటిమట్టం నిమిషానికో అంగుళం చొప్పున పెరిగిపోతోంది. అతని నడుముదాకా వచ్చేశాయి నీళ్ళు.
సెయిలర్ సింహాద్రి అతని మాటలు చెవిన పెట్టలేదు. వెక్కిళ్ళు పెడుతూ, పానెల్ ని పీకేసే ప్రయత్నంలో ఉన్నాడు.
అతనికి భయంవల్ల మెంటల్ షాక్ తగిలి, మనస్థిమితం తప్పి పోయిందేమో అని అనుమానం వచ్చింది సాగర్ కి.
బహుశా ఆ సెయిలర్ తనంతట తానుగా బయటికి రాకపోవచ్చు. బలవంతంగా బయటికి లాక్కురావాలి!
ఎక్కువ వ్యవధిలేదు నీళ్ళు భుజాలదాకా వచ్చేశాయి!
సాగర్ కి ఒకటి స్ఫురించింది. ఈ నీళ్ళలో గనక తను ఆ సెయిలర్ కి అందితే, అతను భయంతో, గాభరాతో తనని ఉడుంలా పట్టేసుకోవచ్చు. అలా గనక జరిగితే, అతన్ని రక్షించే మాట అలా ఉంచి, తను కూడా ఇక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
అందుకని, వెనక నుంచి అకస్మాత్తుగా అతన్ని సమీపించి, జుట్టు అందుకుని బయటకు ఈడ్చుకు రావాలి.
అడుగు ముందుకు వేశాడు.
తన వెనక ఇంకో మనిషి నిలుచుని ఉన్నాడని అప్పుడు మొదటి సారిగా గమనించాడు ఆ సెయిలరు. గిరుక్కున వెనక్కి తిరిగి, తన చేతిలోకి స్క్రూడ్రైవరుని ఆత్మరక్షణకోసం కత్తిలా ఎత్తి పట్టుకున్నాడు.
"టేకిట్ ఈజీ! రేకిట్ ఈజీ!" అన్నాడు సాగర్ అనునయంగా "నీకేం భయంలేదు! నాతో వచ్చెయ్! కమాన్!" అతను జాగ్రత్తగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నాడు.
ఎవరికీ కనబడని ప్రదేశంలో భద్రంగా పిల్లలని పెట్టిన కుక్క ఆ ప్రదేశాన్ని సమీపిస్తున్న వాళ్ళని బెదిరించటానికి పళ్ళు బయట పెట్టినట్లు భీకరంగా నోరు తెరిచాడు సెయిలర్. ఒడుపుగా లంఘించి సాగర్ మీదకు వచ్చాడు.
సకాలంలో పక్కకి తప్పుకున్నాడు సాగర్.
సింహాద్రి మళ్ళీ అతనివైపు తిరిగి, స్క్రూ డ్రయివరుతో శక్తికొద్ది పొడిచాడు. అది సాగర్ భుజంలో రెండు సెంటీమీటర్ల లోతున ఖస్సున గుచ్చుకుని, చీలుస్తూ వెళ్ళింది. భుజం మీద నిప్పుకణికె పెట్టినట్లు మంటకలిగింది సాగర్ కి.
షిప్పులోని నీరు ముఖందాకా వచ్చింది. కళ్ళు తెరిచి ఉంచడమే కష్టతరమైపోతోంది.
సెయిలర్ స్క్రూ డ్రయివరుని మళ్ళీ సాగర్ మొహంవైపు విసురుగా తెచ్చాడు- కళ్ళలో పొడవటానికి గురి చూస్తూ.
నీటిమట్టం ఇంకా పెరిగింది. సాగర్ జుట్టు నీళ్ళలో తడుస్తోంది.
ఇంక లాభం లేదని నిశ్చయించుకున్నాడతను. ఎదుటి మనిషికి తను రక్షించబడడం ఇష్టంలేదు. పైగా అతని చేతిలో పదునయిన ఆయుధం వుంది.
ఆ దురదృష్టవంతుడిని చివరిసారిగా చూసి "గుడ్ బై మై ఫ్రెండ్!" అని విచారంగా వెనక్కి తిరిగాడు సాగర్. ఈదుతూ పైకి వచ్చేశాడు.
ఆ సెయిలర్ అక్కడే ఉండిపోయి, దుఃఖంతో వెర్రెత్తిపోయిన వాడిలాగా వలవల ఏడుస్తూ కొయ్య పానెల్ ని ఊడబెరకడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు 'వేగుచుక్క, వేగుచుక్క' అని కలవరిస్తున్నాడు మధ్యమధ్యలో.
ఆ మిస్టరీ ఏమిటో అర్థంకాలేదు సాగర్ కి ఆలోచిస్తూనే షిప్పు రెయిలింగ్స్ దగ్గరికి వచ్చేసి, స్ట్రేజాక్ మీదగా తన షిప్పులోకి వచ్చేశాడు.
షిప్పులోని జనమంతా అక్కడే గుమిగూడి ఉన్నారు.
అంతమందిలోనూ సాగర్ కి గాయమయిందని వెంటనే గుర్తించింది అనూహ్య ఒక్కతే.
"బాస్ రే! ఏమయింది మీకు?" అన్నది ఆదుర్ధాగా అతని భుజం వైపు చూస్తూ.
తేలిగ్గా చప్పరించాడు సాగర్. "నాకు తగిలిన గాయం చిన్నదే గానీ, ఒక నిండుప్రాణం అనవసరంగా పోతోందే అని విచారిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయాను" అని ఆ రెండో షిప్పు కేప్టెన్ వైపు తిరిగాడు సాగర్. "ఆ మనిషి ఎందుకంత అసహజంగా ప్రవర్తించాడు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా......"