Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 7

    ఇంటికి కొంచెం దగ్గరగానే వీధిపంపు వుంది. అక్కడే కొందరు స్నానాలు చేస్తున్నారు. మరికొందరు ఆ మూల నుంచి యీ మూలదాకా పళ్ళుతోముతూ ఖాండ్రించి ఆ పక్కనే ఉమ్మేస్తున్నారు. బుర్రన చీదేవాళ్ళు కొందరు. నానాగలీజుగా వుంది. అలా అక్కడున్నవాళ్ళ కళ్ళకేమీ కనిపించటం లేదు. ఆడుతూ పాడుతూ వయసుమళ్ళినవాళ్ళు ఆశికాలాడుతూ "అమ్మ" అన్నంత తేలికగా అమ్మనా బూతులు మాట్లాడుతూ పనులు పూర్తిచేసుకుంటున్నారు.

    రోజూలేని ప్రత్యేకత యేమిటంటే అమ్మాయిగారు అయిన ప్రియదర్శినిని వింతగా చూస్తూ...లేక మధ్య మధ్య ఓ చూపు చూస్తూ ఏదో గుసగుసలాడుకుంటూ పనిచేస్తున్నారు.

    పద్మినికి శరీరంమీద చీమలు, జెర్రులు పాకినట్లు వుంది. తనను తానే వూరడించుకుంటూ వుండిపోయింది. "తన డాడీకి వున్నట్లు వీళ్ళకి డబ్బువుంటే ఇంత కష్టపడరు కదా! ఇంత బీదరికం అనుభవించరు కదా! వీళ్ళ అవస్థలు ఒక్కసారి చూస్తేగాని డాడీకి తెలిసిరాదు...

    అలా పద్మిని ప్రియదర్శిని ఆలోచిస్తున్న వేళ టిఫిన్ క్యారియర్ లో ఇడ్లీలు ఇంకొన్ని సత్తు కెరియర్ లో పచ్చడి చంకన తగిలించుకున్న సంచీలో విస్తరాకులు చింపిన పేపరు కాగితాలతో ఇడ్లీలమ్మే సత్తిబాబుని వెంటబెట్టుకొచ్చింది అచ్చమ్మ.

    "అమ్మాయిగారూ! ఇడ్డిలీలు వచ్చేశాయి. ఎన్నికావాలో చెప్పేసేయండి. సత్తిబాబు ఇచ్చేస్తాడు" అంది అచ్చమ్మ.

    ఇడ్లీలమ్మే సత్తిబాబు వచ్చాడని తెలిసి ఎనిమిదేళ్ళ బుడ్డాడు వాళ్ళమ్మ రత్తమ్మ, సత్తిమల్లిగాడు, చుట్టల సూరమ్మ ఈగల్లావచ్చి అక్కడ వాలారు.

    చుట్టల సూరమ్మ అంటే చుట్టలు అనేసి సూరమ్మ ఇంటిపేరు కాదు. ఇంతలావు ఇంతెత్తువుండి దానికితోడు లావుపాటిపొట్ట జాకెట్ లేకుండా చీరమాత్రమే కట్టుకునే సూరమ్మ తూరుపోళ్ళమనిషి. కట్టుకున్న వాడిని వదిలేసివచ్చి ఇక్కడ వుండి కూలినాలి చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నది. రాయిలాంటి ఆడది రాళ్ళు కూడా తిని హరించుకోగలిగిన ఆడది. అస్తమానం చుట్ట తాగటం, పొగాకు నమలటం అలవాటు. ఆ పేటలో ఆరుగురు సూరమ్మలు ఉన్నారు. అందుకని గుర్తుకోసం చుట్టల సూరమ్మని పేటలో వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సూరమ్మ వస్తున్న గుర్తుగా ముందు చుట్ట కంపు వచ్చి ఆ వెనుక సూరమ్మ వస్తుంది.

    గుప్పు గుప్పున చుట్టపొగ వదులుతూ రైలింజనులాగ వచ్చిన సూరమ్మ అమ్మాయిగారిని చూసి నోట్లో చుట్టతీసి ఆర్పి రొంటిన దోపుకుంది.

    "దండాలండీ అమ్మాయిగారూ!" అంది సూరమ్మ.

    "పె...పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు" కంగారుగా అంది పద్మిని.

    "ఏంటో" అంటూ బుర్రగీక్కుంది సూరమ్మ.

    ఇడ్లీలమ్మే సత్తిబాబు ఇడ్లీలున్న కెరియర్ మూత తెరుస్తూ "ఎవరికెన్ని ఇడ్లీలున్న కేరియర్ మూత తెరుస్తూ "ఎవరికెన్ని ఇడ్లీలు కావాలి. అరువా, రొక్కమా" అన్నాడు. రొక్కమయితే కాస్త చట్నీ ఎక్కువ రాలుస్తాడు. అరువయితే లెక్క రాసుకోటం వుంటుంది. చంచాడు చట్నీ తగ్గుతుంది.

    "అమ్మాయిగారు ఇస్తారు" గొప్పగా చెప్పింది అచ్చమ్మ.

    "నా కాడ పైసలున్నయిలేరా సత్తిగా! ఆరిడ్డిలీలు ఇచ్చేయి" అంది సూరమ్మ.

    "అరువు రాసుకోరా తమ్ముడూ! నాకొకటి నా కొడుకు కొకటి ఇవ్వు" అంది రత్తమ్మ.

    "నాకు రెండు కావాలే అమ్మా" కాళ్ళు నేలకేసి తపతపకొడుతూ అడిగాడు బుడ్డాడు.

    సత్తి మల్లిగాడు న...న...న...అనకుండా రెండు వేళ్ళు చూపించాడు రెండు ఇడ్లీలు కావాలనే అర్ధంతో.

    "మనం ఎన్ని తీసుకుందాం అమ్మాయిగారూ" అచ్చమ్మడిగింది ఆత్రంగ.

    "నీ ఇష్టం" అంది పద్మిని ఏదో వాసన వికారం కలిగిస్తుంటే అదేమిటో తెలియక అటు ఇటు చూస్తూ.

    అది సూరమ్మ తాలూకా చుట్టవాసన.

    "రెండు తీసుకుందామా నాలుగు తీసుకుందామా అమ్మాయిగారూ!" కాస్త భయపడుతూనే అడిగింది అచ్చమ్మ.

    "నీ ఇష్టమన్నా కదా! సరే నాలుగు తీసుకో"

    నాలుగు ఇడ్లీ తీసుకుని చెరి రెండూ తిందామని పద్మిని అనుకుంది. వాళ్ళింట్లో ఇడ్లీ పెద్ద సైజువి దూదిలా మెత్తగా మంచులా తెల్లగా వుంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ...

    "నాలుగు తీసుకో" అని పద్మిని అనంగానే చింకి చాటంత ముఖం చేసుకుని గర్వంగా ఫోజుకొట్టి "అమ్మాయిగారికి నాలుగు నాకు నాలుగు ఇడ్డిలీలు ఇవ్వు" అచ్చమ్మ అంది.

    సత్తిబాబు సంచిలోంచి కాగితం ముక్కలు విస్తరాకులు తీశాడు. చకచక కాగితం ముక్కలమీద ఆకులు పరిచి టకటక ఇడ్లీలు తీసి లెక్కగపెట్టి గబగబ వాటిమీద పల్చగవున్న పచ్చడి చంచాతో పోశాడు.

    "తినండి అమ్మాయిగారూ" అంటూ వినయంగా అందించింది అచ్చమ్మ.

    ఆ ఇడ్లీలు ఆ పచ్చటి తాలూకా రూపురేఖలు చూసి తెల్లబోయింది పద్మిని ప్రియదర్శిని.

    కోటీశ్వరుడు మధుసూదనరావు ఏకైక గారాల తనయ సుందర సుకుమార ముగ్ధమనోహర ఆ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింతరువాత అలాంటి అద్భుత మనోహరమైన ఇడ్లీ చూడలేదు.

    రూపాయి బిళ్ళకన్నా కాస్త పెద్దసైజులో కాస్త గోధుమరంగు తిరిగి ముతక ఖద్దరు గుడ్డలాగా వుంది ఇడ్లీ. చట్నీ సంగతి చూద్దామా అంటే ఒలికిపోయిన రంగులాగా ఇడ్లీ మీద పాకుతున్నది.

    పద్మిని ఆలోచించే టైములేకుండానే చేతిలోకి తీసుకుంది పద్మిని. తిన్నదా లేదా అని కూడా చూడలేదు. అచ్చమ్మతో సహా అందరూ ఎవరిడ్లీలని వారు వూదిపారేశారు. బుడ్డాడు అయితే ఇడ్లీ తినేసి అటు ఆకుని ఇటు వేళ్ళని నాకుతూ ఇంకా ఆశగా ఆబగ ఇడ్లీలున్న టిఫెన్ క్యారియర్ వేపు చూస్తూ నుంచున్నాడు.

    "బాగున్నాయి కదూ అమ్మాయిగారూ" అంటూ పద్మినిని చూసి గతుక్కుమంది ఆమె.

    పద్మిని ప్రియదర్శిని చేతిలోని ఇడ్లీ ఎలా పెట్టినవి అలా వున్నాయి.

    "అదేంటి అమ్మాయిగారూ, తినలేదు. తినండి ఎంత బాగుంటాయో" అందామె.

    ఏం మాట్లాడాలో తెలియలేదు పద్మినికి. ఇక్కడ ఇడ్లీలు ఇలాగే వుంటాయి కాబోలు అనుకుంది. అందరివేపు చూసింది.

    "మీరంతా తినండి" అంది.

    "తినేశాం" కోరస్ గా అన్నారంతా.

    "అయితే నాతో పాటు మరోసారి తినండి" అంది పద్మిని.

    "అమ్మో! అనలే అరువు, ఇంకేం తింటాం. అంతడబ్బులు మాకాడ వుండాలి కదా అమ్మాయిగారూ" అంది రత్తమ్మ. 

 Previous Page Next Page