Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 7

    "ఏమి దొరక్కనే కదా మీసాలు పట్టుకు ఆడిస్తున్నది?" అన్నాడు రాధాకృష్ణ మరోసారి. నవ్వులజల్లు కురిసింది గదినిండా. ఆ తర్వాతకూడా మీసాలు గడ్డాలు మీదనే కబుర్లు సాగాయి. దేముళ్ళకి దేవతలకి మీసాలు గడ్డాలు వుండవని శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి మీసాలు గడ్డాలు లేవుగాని వాళ్ళ తండ్రులకున్నాయని దేముళ్ళని ఆదర్శంగా తీసుకునే ఈ కాలం మగాళ్ళ మసలుతున్నారు. కాని యువతరం మన తాతలనే ఆదర్శంగా తీసుకుని హిప్పీలలా తయారవుతున్నారని...ఎన్నో రకాల సోదాహరణ వుదాహరణతో టైమ్ చూచుకోకుండా మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
    పెళ్లికొడుకు రాకకోసం ఆ దృష్టిలోనే వున్న ఆదిలక్ష్మమ్మ మాత్రం "టైము చూశారా? అతగాడు వచ్చేటైమ్ దాటికూడా పోతున్నది" అంది గుర్తుచేస్తూ.
    "అరె అయిదు కావస్తున్నది. సరీగా నాలుగున్నరకే వస్తానన్నారు." అన్నాడు రాధాకృష్ణ.
    "మాటల్లో సమయమే మర్చిపోయాము" అన్నారు వెంకట్రామయ్యగారు. మరోపావుగంట మాటిమాటికి వీధి వైపు జూస్తూ కూర్చున్నారు. అంతా సరీగ అయిదయింది.
    "ఇహ ఈపూటకి శ్యామ్ సుందర్ రాడేమో?" అనుకున్నారంతా.
    "మీకలా కావసిందేలే, గంటన్నరక్రితమే ఈ చీరలు నగలు గంగిరెద్దులా అలంకరింపజేసి నా ప్రాణం తీశారు. ఇంక నేకూర్చోలేను. ముందీ డ్రస్ విప్పి అవతల పారేస్తే ప్రాణం హాయిగా వుంటుంది. వాసంతి లేచి విసుగ్గా బెడ్ రూమ్ వైపు బయలుదేరింది.
    "అరె  అదేమిటే వాసంతీ? అరగంట ఆలస్యం అయిన తర్వాత అతను రాడని ఏమిటి? రావచ్చు ఆ చీర నగలు తియ్యకు" కంగారుపడిపోతూ అంది ఆదిలక్ష్మమ్మ.
    వెళుతున్న వాసంతి గిర్రున వెనుతిరిగి "అమ్మా ఓసారి పోనీకదా అని మీమాట విన్నాను. రెండోసారి మీబాధ జూడలేక ఈ వక్కసారికే అనే వప్పందంమీద మీ మాట విన్నాను. టైమ్ దాటిపోయింది. అతనొచ్చినా రాకపోయినా నా తప్పులేదు. నే డ్రస్ మార్చేది మార్చేదే. మీరంతా ఓపిగ్గా అలా కూర్చోండి ఓవేళ వస్తే నన్ను చూసి మెచ్చుకోకపోయినా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు సరా!" అని మారుమాట కాస్కారం యివ్వకుండా లోపలికెళ్ళిపోయింది.
    "మీరయినా చెప్పరేమిటండి?" అంది ఆదిలక్ష్మమ్మ.
    "ఏది వాసు? అదెప్పుడో వెళ్లిపోయిందామె?" ఏమనాలో తెలియక ఏదో సమర్ధింపుగా అనేశారు వెంకట్రామయ్యగారు.
    "మీరేదాన్ని చెడగొట్టారు. ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగింది" ఆదిలక్ష్మమ్మ రుసరుసలాడింది.
    "నే చెడగొట్టాను. నా గారాభం నాప్రేమ అలాంటివి. మరి నువ్వేం చేశావ్, కన్నతల్లివి...?" తల్లి అనేమాట నొక్కిపలుకుతూ అన్నారు వెంకట్రామయ్యగారు.
    రాధాకృష్ణ ,జానకి ముఖముఖాలు చూసుకున్నారు.
                                         6
    వాకిలి ముందు ఆటో ఆగిన శబ్దమయింది.
    రాధాకృష్ణ ఆ వెనుకనే వెంకట్రామయ్యగారు వాకిట్లోకి వచ్చారు.
    భారీగా వున్న ఓ యువకుడు. ఆటో డ్రైవర్ కి బాడుగ యిచ్చి పర్స జేబులో పెట్టుకుని వెనుతిరిగాడు.
    ఆటో దడదడలాడుతూ వెళ్ళిపోయింది.
    అంతకుక్రితం శ్యామ్ సుందర్ ని జూడని రాధాకృష్ణ వెంకట్రామయ్యగారు, ఇంటిముందు ఆటోదిగిన యువకుడు శ్యామ్ సుందర్ అవునా కాదా! అని ఆలోచిస్తూనే ఓ అడుగు ముందుకేసి గుమ్మందిగారు.
    "మీరు...!" అంటూ ఆగిపోయాడు రాధాకృష్ణ.
    నేమ్ ప్లేట్ కోసం చూస్తున్న శ్యామ్ సుందర్ దృష్టి రాధాకృష్ణమీద పడింది. బోలెడు బిడియపడుతూ "వెంకట్రామయ్యగారియిల్లుయిదేనాండి!" అన్నాడు.
    ఇల్లు యిదేనని చెపుతువచ్చింది. పెళ్లిచూపుల పెళ్ళికొడుకు శ్యామ్ అని తెల్సుకుని ఇంట్లోకి ఆహ్వానించారు. చకచక మర్యాద మన్ననలు జరిగాయి.
    శ్యామ్ సుందర్ వయసు నిండా పాతికేళ్ళు వుంటుంది. ఎత్తరి మనిషి, రూపశి, క్రాఫయితే గుబురుగా వుందిగాని ముఖం అందంగా నున్నగా నాజూగ్గా వుంది. మగవాళ్ళల్లో పాలుకారే ముఖం నూటికి ఒకరికో యిద్దరికో వుంటుంది. అందగాడయిన మన్మధుడి మొహంలో ఆడపోలికలున్నాయట. శ్యామ్ మన్మధుడిలాంటి మగాడు. శ్యామ్ అంతా వాళ్ళ అమ్మ పోలిక. రంగూ అదే. ముట్టుకుంటే మాశిపోయేటట్లు పట్టుకుంటే కందిపోయేటట్లు వున్నాడు. సిగరెట్లు తగలేస్తాడో లేదోగాని పెదవులు ఎర్రగా తాంబూలం సేవించినట్లు వున్నాయి. వినయంగా మాట్లాడటం మృదువుగా నవ్వటం అలవాటు. పర్సనాలిటీ మాత్రం ముమ్మూర్తులా తండ్రిదే వచ్చింది.
    "క్షమించాలి. నాలుగున్నరకల్లా వస్తానని కబురు పంపాము. దారిలో బస్ టైర్ బరష్టుకావటంతో ప్రయాణంలోనే ఆలశ్యంఅయింది. నేఎక్కిన ఆటో డ్రైవరు కొత్తవాడుట. సరిగా అతనికి దారితెలియదు. నాకోసం ఎదురుచూసి మీరు విసుగు చెందివుంటారు." అన్నాడు శ్యామ్ సుందర్.
    "అదేం లేదు బాబూ!" అన్నారు వెంకట్రామయ్యగారు.
    "విసుగు చెందలేదుగాని మీరు రారేమో అని నిరాశ చెందాము." అన్నాడు రాధాకృష్ణ.
    శ్యామ్ సుందర్ అందంగా నవ్వాడు.
    "అబ్బాయి ముఖం పాలుకారుతూ వుంది కదూ జానకి!" అంది ఆదిలక్ష్మమ్మ.
    "ఉ" అని..."ఇదేమాట వాసంతితో అంటే ఇంట్లోనే పాలు దొరుకుతుంటే బూత్ పాలు దేనికి!" అంటుంది అనుకుని తనవూహకే చిన్నగా నవ్వుకుంది జానకి. 
    కొద్దిసేపు అయినతరువాత "వాసూని పిలువు జానకి" అన్నారు వెంకట్రామయ్యగారు.
    బెడ్ రూమ్ లోదూరి తలుపులు బిగించుకుని పడుకున్న వాసంతికి బైటమాటలు వినిపిస్తూనేవున్నాయి. శ్యామ్ గొంతుక విని "అబ్బాయి ఎలాగున్నాడో గాని మాటమాత్రం నిదానంగా, వినయంగా వుంది. అవతారం చూడటానికి బుద్ధావతారంలాగుంటుందేమో!" అనుకుంది.
    "వాసంతీ! తలుపుతియ్యి తల్లీ!" అంది ఆదిలక్ష్మమ్మ నెమ్మదిగా తలుపుమీద తడుతూ.
    "ఎందుకు?" తెలిసి అడిగింది వాసంతి.
    ఎందుకో చెప్పకుండానే ఓ వేళ నిజంచెప్పినా వాసంతి జవాబు ఎలావుంటుందో తెలిసిన ఆదిలక్ష్మమ్మ పక్కనేవున్న జానకివైపు తిరిగి దానిసంగతి నువ్వేచూడు అని కనుసౌజ్ఞతో తెలియజేసింది.
    "తలుపు తియ్యి వాసంతీ! మీ నాన్నగారు పిలుస్తున్నారు" అంది జానకి.
    తండ్రి పిలుస్తున్నాడని చెపితే మారుమాట్లాడకుండా వాసంతి తలుపు తీస్తుందని తెలిసి అలా అంది జానకి. అలాగే మారు మాట్లాడకుండ తలుపులు తీసి బైటకొచ్చింది వాసంతి.
    వాసంతిని చూస్తూనే జానకి ఉలిక్కిపడింది. ఆదిలక్ష్మమ్మ నిర్ఘాంతపోయింది.

 Previous Page Next Page