Previous Page Next Page 
రుధిర మందారం పేజి 7

    చచ్చిపోయిన అతని ముఖం భయంకరంగా ఉంది. ముఖాన టవల్ కప్పాను.
    నా పిచ్చి'గాని రహస్యంని రహస్యంగానే దాస్తారు. వెంట తెచ్చుకోరు.
    "ముందు మీ ఇంట్లో ఏ పెట్టయినా ఉంటే చూడండి మిష్టర్ చూ! వీడిని దానిలో పెడదాం. తరువాత మావాడొకడికి ఫోన్ చేయాలి. వాడు ఈ నిమిషం నుంచే పని మొదలు పెడతాడు. అతను ఎక్కడ దిగింది తెలుసుకుంటాడు. అతని దగ్గర వుంది తెలుసుకోందే, ముక్కలుగా నరికామా? అది వీడి శరీరం మీదే ఉంటే నాశనం అవుతుంది. ఇహ ఎప్పటికీ నేనేం చేయలేను. అదంతే భూ స్థాపితమౌతుంది" అన్నాను.
    "అలా అయితే పెట్టె వుంది తీసుకువస్తాను. దానిలో శవాన్ని పెడదాము. మీరు ఫోన్ చేద్దురుగాని," చూ అన్నాడు.
    "అలాగే."
    చూ, చాంగ్, ఒకరి వెనుక ఒకరు బయటకు వెళ్ళారు. లల్లురాంని చూస్తూ కూర్చున్నాను. నా ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. 
    చూ, చాంగ్ లు పొడుగాటి కొయ్యపెట్టె మోసుకుని వచ్చారు. నేనూ, చూ కలిసి లల్లురాంని పెట్టెలో పెట్టి మూత వేశాము.
    "కిందకు వెళ్ళి ఫోన్ చేద్దాము పదండి" అన్నాను.
    చూ, చాంగ్, నేను రూమ్ లోంచి బైటకు వచ్చాము.
    రూముకి యధాప్రకారం తాళం వేశాను.
    "అదేమిటి, పది నిమిషాలలో ఫోన్ చేసి వస్తాము. తాళం దేనికి?" వాంగ్ యీచూ అన్నాడు.
    "తాళం వేయకుండా రూమ్ దాటి నాలుగడుగులు వేయడం ఎప్పుడయినా చూశారా? ఇది నా అలవాటు. నా అలవాటుకి విరుద్ధంగా ఏ పనీ చేయను. బద్దకించడం, అజాగ్రత్త నాకు ఎలర్జీ" అంటూ జేబులో కీ వేసుకుని కిందకు బయలుదేరాను.
    నాతోపాటు చూ, చాంగ్ లు కిందకు వచ్చారు.
    క్రెడిల్ మీద నుంచి రిసీవర్ అందుకుంటుంటే చూ, చాంగ్ లు నా పక్కనే నుంచున్నారు.
                                          6
    పడుకుని ఆలోచిస్తున్నాను. తలుపు పై "టిక్, టిక్" అనిన శబ్దం వినవచ్చింది.
    చటుక్కున లేచి కూర్చున్నాను.
    మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది.
    "ఎవరు?" చేతిలోకి పిష్టల్ తీసుకుని అడిగాను.
    "నేనే వాంగ్ యీచూ ని తలుపు తియ్యండి."
    వెళ్ళి తలుపు తీశాను.
    వాంగ్ యీచూ చేతిలో నల్లగా నిగనిగ లాడుతూ పిష్టల్ ఉంది. అది నా వైపు గురి పెట్టబడి ఉంది.
    పిష్టల్ పుచ్చుకున్న నా చేతిని పైకి ఎత్తాను.
    "ఏమిటి నీ ఉద్దేశ్యం?"
    "జాగ్రత్త కోసం. అంతే. మీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి."
    "దానికేం మాట్లాడవచ్చు. నే ముందే చెప్పాగా. ముద్దుకు ముద్దు, గుద్దుకు గుద్దు, నా సిద్ధాంతం."
    "నే చెప్పబోయేది ముఖ్యమైనది. ప్రాణాలతో పని," చూ అన్నాడు.
    "ముఖ్యమైన విషయమైనా, ప్రాణాలతో చెలగాటమయినా మన మధ్య పిష్టల్ ఉండరాదు మిష్టర్ చూ! నిన్ను నేనమ్మాను. నన్ను నీవు నమ్ము అంతే. ఇదిగో నా పిష్టల్ పక్కన పడేస్తున్నాను. నీవు పక్కన పడేసి సావధానంగా మాట్లాడవచ్చు," నా పిష్టల్ ని మంచం మీదకు విసిరేసి అన్నాను.
    "నే నీతో మాట్లాడినంత సేపు నా చేతిలో పిష్టల్ ఉంటే అభ్యంతరమా?"
    "నాకేం లేదు. కాని...నీవు చూడబోతే ఉజ్జీవి కాదనిపిస్తుంది." అంటూ చెయిర్ లాక్కుని కూర్చున్నాను.
    చూ ఎదురుగా కొద్ది దూరంలో నుంచున్నాడు చేతిలో పిష్టల్ ఉంచుకునే!
    చూ ఎంతో అవసరం అయితే తప్ప నా మీద పిష్టల్ ప్రయోగించడు. ఆ నమ్మకం వుంది.
    "మైకెల్ నాకు తెలుసు" నా కళ్ళలోకి గుచ్చి చూస్తూ అన్నాడు చూ.
    "ఆ!"
    "ఎందుకంత ఆశ్చర్యపోతావ్? సరీగా నీవు చెప్పిన గుర్తులు కలవాడే మైకెల్ అయితే వాడెక్కడికీ పోలేదు. ఉన్నాడు."
    "ఎక్కడ ?"
    "స్వర్గానికెళ్ళే దారిలో, మైకేల్ సంగతి మరచిపో. అతని వద్ద ఏం దాగుందో చెప్పు!"
    "నే చెప్పను. పిచ్చిగా మాట్లాడుతున్నావ్, చూ" కోపంగా అన్నాను.
    "పిచ్చిగా మాట్లాడటం లేదు. నీవద్ద రహస్యం ఉంది. చచ్చిన లల్లూరాంవద్ద రహస్యం ఉంది. రెండు ఒకటై నీ దగ్గర చేరుతాయి. నీ సొంతం అవుతాయి. అయినా మైకేల్ వద్దది కూడా కలిస్తేగాని పని పూర్తికాదు. అవునా?"
    "అవును? అసహనంగా అన్నాను.
    "నేనే మైకేల్ ననుకో. ఏం కావాలి?"
    "ఇస్తావా, ఏదడిగినా?"
    "ఆఁ."
    "నీవు మైకేల్ వికాదు! మైకేల్ శరీరం కావాలి. అతని వస్తువులు కావాలి."
    "అన్నీ ఆధీనం చేస్తే నా అవసరం నీకుండదు. కాబట్టి మైకేల్ వద్ద దాగిన రహస్యం చెప్పు. నీ రహస్యం నీదగ్గర ఉంచుకో. అప్పుడు ఇరువురం సమఉజ్జీలవుతాము."
    "మిష్టర్ చూ! నీవు చాలా తెలివిగలవాడివి. నావద్ద, మైకేల్ వద్ద, లల్లూరాం వద్ద మూడు తాళం చెవి ఆకారం గల బిళ్ళలున్నాయి. ట్రిక్ గా నొక్కితే తాళం చెవి తెరుచుకుంటుంది. చిన్న ప్లాన్ కాగితం దానిలో ఉంటుంది. ఆ ప్లాన్ కి తాళం చెవి కూడా కావాలి. ఒకటి తరువాత ఒకటి తాళం చెవులు ఉపయోగిస్తేనే నిధి స్వాధీనం అవుతుంది."

 Previous Page Next Page