Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 7

    ఈమధ్య అలాకాదు. ఇంటిపట్టున వుంటున్నాడు. వేళపట్టున భోజనం చేస్తున్నాడు.

    "చిన్నప్పటి స్నేహితుడు ఒకడు కనపడ్డాడు. వాడి షాపులో చిన్న ఉద్యోగం ఒకటి యిచ్చాడు. సైకిల్ మీద వెళ్ళి వాడుచెప్పిన షాపులో సరకులు అందించి రావడమే ఉద్యోగం. పెద్దది కాదు. అయినా నెలకి వందా రెండువందలు చేతికివస్తాయి. వూరికినే కూర్చునే కన్నా కొంతవరకూ నయమే కదా!" అని కామాక్షితో చెప్పాడు.

    అది నిజమే అని ఇంట్లో అందరూ నమ్మారు. కామాక్షి నమ్మింది.

    వాళ్ళను నమ్మించడానికి కామాక్షికి అనుమానం రాని విధంగా, ప్రొద్దున్న కొన్ని గంటలు, సాయంకాలం, కొన్ని గంటలూ బయటికి వెళ్ళి వచ్చేవాడు పాండురంగం.

    అయితే, తన భర్త యిలా రాత్రిళ్ళు దొంగచాటుగా యింటిలోనుంచీ బయటకు వెళ్ళి పిల్లిలాగా ఏ తెల్లవారుఝాముకో యింటిలో దూరి మళ్ళీ మంచమెక్కి నిద్దరపోతున్నాడని, కామాక్షి గుర్తించింది. తరువాత రెండుసార్లు కావాలని నిద్ర ఆపుకొని తన అనుమానం నిర్ధారణ చేసుకుంది.

    రాత్రిళ్ళు భర్త దొంగచాటుగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు? అంత తనతో చెప్పకూడని రహస్యమేముంది? ఈ విషయం అడగాలా వద్దా? మంచి పని అయితే తనతో చెప్పే వెళ్ళేవారు. తనకికూడా తెలియకుండా రహస్యంగా వెళ్ళివస్తున్నారంటే ఏదో బలీయమైన కారణం వుండే వుంటుంది. అదేమిటో అడగాలా? వద్దా? అడిగితే బాధపడతాడు. అడగకపోతే విషయమేమిటో తెలియక తను బాధపడుతుంది.

    భార్య కష్టసుఖాల్లో భర్త, భర్త కష్టసుఖాల్లో భార్య పాలుపంచుకోవాలి కాబట్టి, తానిలా మనస్సులో పెట్టుకుని మధనపడే బదులు వెంటనే అడిగివెయ్యడమే మంచిది. ఈరోజు అడగాల్సిందే, అడిగి తీరాల్సిందే. కామాక్షి ఒక నిర్ణయానికి వచ్చింది.

    భర్త రాకకోసం ఎదురుచూస్తూ మేలుకునే వుండిపోయింది. పాండురంగం చల్లగా బయటకి జారుకోవటం తెలుసు. అయినా, అప్పుడు అతనిని అడ్డగించలేదు. అతను వెళ్ళిన తరువాత చాలాసేపు తర్జన భర్జన పడుతూ, ఆలోచిస్తూ, అప్పుడు కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది.

    పెళ్ళయిన కొత్తల్లో__

    తనూ, తన భర్తా ఎంత ఆనందంగా వుండేవాళ్లు. ఇరువురి మధ్యా ఒక్క విషయంలోనూ అభిప్రాయ భేదము వచ్చేది కాదు.

    పోను పోనూ జీవితం నిస్సారం అవుతుందనికానీ, ఎన్నో ఎదురుదెబ్బలు తినవలసి వస్తుందని కానీ, కష్టాలూ, కన్నీళ్లు వాటి గురించీ ఊహామాత్రం ఆలోచించలేదు. ఎక్కువ సంవత్సరాలు గడపకముందే జీవితంలో ఒక ఎదురుదెబ్బ తినవలసి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇంకా....

    కామాక్షి అలా ఆలోచిస్తూ వుండగానే, నాలుగు గంటలైపోయింది.

    పాండురంగం నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. కామాక్షి మంచంమీద కళ్ళుమూసుకుని పడుకుని వుండడం చూసి, తృప్తిపడి చడీ చప్పుడు కాకుండా తలుపు గడియ వేశాడు.

    పాంటూ, షర్టూ విడిచి వంకెన తగిలించి, లుంగీ కట్టుకుని మంచం దగ్గరకు వచ్చాడు.

    మంచం ఎక్కడ చప్పుడు అవుతుందో అన్నట్లు అతి నెమ్మదిగా మంచంమీద కూర్చున్నాడు.

    "నేను మేలుకునే వున్నాను" మంచంమీంచి లేచి కూర్చుంటూ అంది కామాక్షి.

    ఒక్కసారిగా పాండురంగం ఖంగుతిన్నాడు.

    గతంలో కామాక్షి రాత్రి పడుకుంటే, మధ్యలో బాత్ రూమ్ కి వెళ్ళటానికి కూడా లేచేది కాదు అయిదు అయిదున్నరకి నిద్రలేచేది. నిద్ర విషయంలో ఆమె అలవాటులో ఏ మార్పూ లేదు.

    అలాంటిది ఈమధ్య భర్త ఉద్యోగంపోయి, పుట్టిల్లు చేరి, జీవితం గురించి ఆలోచన చెయ్యడం. మనస్సుకి కష్టం కలగడం ఇలాంటి కారణాలవల్ల, చాలా రాత్రిళ్లు కామాక్షి నిద్రకి దూరమై, పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎన్నో గంటలు మేలుకునే వుంటుంది.  

    కానీ_

    ఈ విషయం__

    కామాక్షి తన భర్తకి చెప్పకుండా తనలోనే వుంచుకుంది. తనకి నిద్రపట్టడం లేదంటే అతను మరింత బాధపడతాడు. అంతకి మించి ఏం ప్రయోజనం లేదు కదా!

    కామాక్షి ఎప్పటిలాగానే ప్రతి రాత్రీ నిద్రపోతోంది అనుకుంటున్నాడు పాండురంగం. అందుకనే నిర్భయంగా బయటకి వెళ్ళి వస్తున్నాడు. కామాక్షి హఠాత్తుగా లేచి కూర్చుని. 'నేను మేలుకునే వున్నాను" అన్న తీరు అతణ్ణి పసిగట్టినట్లయ్యింది.

    "నువ్వు మేలుకునే వున్నావా కామాక్షి!" పాండురంగం అడిగాడు.

    "నిద్రపోతుంటే నేనెలా మాట్లాడుతాను?"

    "ఎంతసేపటి నుండీ మేలుకుని వున్నావ్?" ఆ మాట అడిగి "నిద్రపట్టకపోతేనూ అలా బయటకి వెళ్లి వచ్చాను" గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లుగా చెప్పాడు పాండురంగం.

    "మీకు నిద్రపట్టకపోతే మీకు తోడుగా నేనూ వచ్చేదాన్ని కదా, మీరు వెళ్ళడం చూశాను. అప్పటినుండీ మేలుకునే వున్నాను" మామూలుగా మాట్లాడుతున్నట్లుగా చెప్పింది కామాక్షి.

    పాండురంగానికి క్షణకాలం నోట్లోంచి మాట రాలేదు, అంతలోనే తెలివి తెచ్చుకుని, "ఇవాళే నిద్రపట్టక అలా వెళ్లాను."

    "మీకేంటి ఇంత మతిమరుపు వచ్చేసింది. మీరివాళే కాదు ఇంతక్రితం కూడా రెండు మూడు సార్లు రాత్రి పన్నెండు దాటిన తరువాత వెళ్లి తెల్లవారుఝామున నాలుగు నాలుగున్నరకి తిరిగి వచ్చేసేవారు" ఈరోజు వంట తేలికగా అయింది- అని చెప్పినంత తేలికగా ఈ మాట చెప్పింది కామాక్షి.

    కామాక్షి తనని మందలించడంలేదు. అదేమని గట్టిగా దబాయించి అడగలేదు. "మీరు దొంగచాటుగా బయటకి వెళ్లి రావటం నేను గమనిస్తూనే వున్నాను." అన్న విషయాన్ని చాలా తేలికగా మనస్సు నొచ్చుకోని విధంగా చెప్పింది. నిజమే! తను కామాక్షిని మోసం చేస్తున్నాడు.

    ఈ విషయంలో నిజం ఇదీ అని చెప్పలేడు. అబద్ధం ఇదీ అని ఆడలేడు.

    కానీ, నిజంచెప్పేకన్నా అబద్ధం ఆడడమే చాలా మంచి పని....

    పాండురంగం అలా ఆలోచిస్తూంటే "ఏమిటి ఆలోచిస్తున్నారు? నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా, అనా?" కామాక్షి తాపీగా ప్రశ్నించింది.

    "అవునవును నిజంగా అదే ఆలోచిస్తున్నాను. అబద్ధం చెప్పబుద్ధికావటం లేదు. నిజం చెబితే నీవు బాధ పడతావు. ఏం చెయ్యాలో అర్ధంకాక తర్జన భర్జన పడుతున్నాను" అన్నాడు పాండురంగం.

    "నిజమే చెప్పండి! ఆ నిజం చేదులాంటిదైనా నేను భరిస్తాను. అబద్ధం చెప్పి మాత్రం నన్ను బాధ పెట్టవద్దు. మీరు అబద్ధం చెప్పదలచుకుంటే అసలు చెప్పడమే మానేయండి" అంది కామాక్షి.

 Previous Page Next Page