Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 7

   
                                          6
    పార్వతి స్కూలుకి వెళ్ళింది. ఆ రోజు శలవు అయినా హెడ్ మాష్టరు కబురుచేసినందున. వెళుతూ పిల్లల చేతిలో పావలా పెట్టింది. ఏదయినా కొనుక్కోమని, కాసేపు ఆడుకున్నారు.
    రఘు ఇంటికి కాపలావుంటే కిష్టుడూ, శకుంతలా పావలా తీసుకుని బడ్డీకొట్టుకి వెళ్ళి నాలుగు బిస్కెట్లు కొనుక్కువచ్చారు.
    "నువ్వూ అక్కయ్య, పెద్దవాళ్లు చెరో బిసికెట్టు తీసుకోండి. నేను చిన్నవాడినిగా, రెండు బిసికెట్టు నాకు" అన్నాడు రెండోతరగతి చదువుతున్న కిష్టుడు.
    "ఉహూ! పెద్దవాళ్ళకి పెద్ద పొట్టవుంటుంది. నేనూ, అన్నయ్య మూడు బిసికెట్లను సమానంగా తీసుకుంటాము. నువ్వు ఒకటే తిను చిన్నవాడివికాబట్టి"  అంది శకుంతల.
    కిష్టుడు పేచీకోరయితే, శకుంతల గడుగ్గాయి. రెండూ కానిది రఘు.
    "అలా కాదు ముగ్గురం మూడు బిసికెట్లు తిందాము. ఒకటి అమ్మకి వుంచుదాము. అప్పుడు లెఖ్క సరిపోతుంది." రఘూ మూడు బిస్కెట్లు యివతల పెట్టి ఒకటి కాగితంలో కడుతూ అన్నాడు.
    శకుంతల సరేనంటూ వెంటనే వప్పుకుంది.
    "అమ్మ తినదుగా, తరువాత నాకే పెడుతుందోచ్చ్" అన్నాడు కిష్టుడు.
    "తిన్నావంటే చంపేస్తాను. మొన్నా అంతే అమ్మకు మజ్జిగ లేకుండా మొత్తం గుమ్మరించుకు తాగాడు. అమ్మకు సరిపోవనేగా నేను తగ్గించుకు పోసుకున్నాను" శకుంతల పెద్ద ఆరిందాలా చేతులు తిప్పుతూ అంది.
    కిష్టుడు విన్నాడో లేదో బిసికెట్టు తినటంలో పడిపోయాడు.
    "మీరు వింటానంటే నేనొకటి చెబుతాను." అన్నాడు రఘూ ఇటికల గుట్టమీద కూర్చుని. వాడిదంతా పెద్దరికం తరహా.
    "చెప్పు, చెప్పు" అన్నారు యిద్దరూ ఒకేసారి ఉత్సాహంగా.
    "మనకు డబ్బులేదు. నాన్నగారు రారు. పంపరు అందుకేగా అమ్మ ఉద్యోగం చేస్తున్నది. మనకు అన్నం వండిపెట్టి స్కూలుకి వెళ్ళి మళ్లీ రాత్రికి చదువుకుంటూ చాలాసేపు వుంటుంది. మనకోసం అమ్మ యింత కష్టపడుతున్నది. అందుకని మనం అమ్మని ఏడ్పించకూడదు. అది కావాలి. ఇది కావాలి అని పేచీపెట్టకూడదు. మనం చూడకుండా అమ్మ ఎన్నోసార్లు ఏడ్చింది. అమ్మను ఏడ్పించిన వాళ్ళు చెడ్డవాళ్లు" ఓ నిమిషం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు.
    "నాన్నగారు మంచివారుకాదు, అందుకే అమ్మ ఏడ్చేది .అమ్మ ఉద్యోగం చేయకపోతే మనకు డబ్బు వుండదు. డబ్బు లేకపోతే అన్నం వుండదు. ఇల్లు వుండదు. బట్టలు కూడా వుండవు."
    "రాత్రిళ్ళు అన్నంపెట్టమని అడుక్కుంటూ బూచబ్బాయిలు వస్తారు అలాగా?" అన్నాడు కిష్టుడు.
    రఘు కళ్ళు మిలమిలలాడాయి. "ఆ__అలాగే బూచబ్బాయిలమయిపోతాము." అన్నాడు వెంటనే.
    కిష్టుడు కళ్ళముందు చలికి వణుకుతూ జోలె చినిగిన లాగూతో రోజూ అడుక్కోటానికి వచ్చే పదేళ్ళబ్బాయి కనిపించాడు. భయం వేసింది.
    కిష్టుడికి మంచి బట్టలు కావాలి. అన్నంలో పప్పు, నెయ్యి, పెరుగూ వుండాలి. చిరుతిండి కావాలి. ఎప్పుడూ తిండికి పీచీయే. ఓరోజు బూచి అబ్బాయిని చూపి రఘు చెప్పాడు. "ఎవరైనా అన్నం పెడితే తప్ప వాళ్ళకు అన్నం వుండదు. చాలాసార్లు అన్నం దొరక్క మంచినీళ్ళు తాగి పడుకుంటారు" అని. కిష్టుడికి అన్నీ గుర్తుకువచ్చాయి.
    "అన్నయ్యా! ఇహనుంచి నేను అమ్మను ఏడ్పించను. నువ్వు కూడా అమ్మను ఏడ్పించకూడదు." అన్నాడు కిష్టుడు శకుంతలవైపు తిరిగి.
    "అమ్మని నేనేం ఏడ్పించను. నువ్వే అన్నింటికీ పేచీ." అంది మూతి తిప్పి శకుంతల.
    "పండక్కి సిల్కు పరికిణీ కావాలని ఏడ్వలేదేమిటి?" కిష్టుడు అన్నాడు.
    "అమ్మను ఏడ్పించలేదు. నేనే ఏడ్చాను."
    కిష్టుడికి ఏంమాట్లాడాలో తెలియక మౌనం వహించాడు.
    "మనం ముగ్గురం పోట్లాడుకోకూడదు. మంచిపిల్లలు పోట్లాడుకోరు. కొట్టుకోరు అని అమ్మ చెప్పింది గుర్తుందా?"
    గుర్తుందంటూ శకుంతలా కిష్టుడు తలలూపారు.
    అప్పుడే యింట్లో కాలుపెట్టిన పార్వతి ఆశ్చర్యపోయింది, నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లలనుచూచి.
    తల్లిని చూస్తూనే కిష్టుడు బిసికెట్టు పొట్లం తీసుకుని రివ్వున పరుగెత్తుకుంటూ వచ్చాడు. "బిసికెట్టు నీకోసం వుంచాము తినమ్మా!" అన్నాడు పొట్లంవిప్పి బిసికెట్టు తీస్తూ.
    "నాకెందుకు కిష్టూ! బిసికెట్టు నువ్వే తిను" అంది పార్వతి.
    "ఉహూఁ! నీకోసం వుంచాము. నువ్వు తినాల్సిందే".
    బిసికెట్టు సమానంగా పంచుకొన్న విషయం రఘు చెప్పాడు. పిల్లల తృప్తికోసం సగం ముక్కతిని మిగతాది ముగ్గురికీ పంచియిచ్చింది పార్వతి.
    ఆరోజు కిష్టుడు దేనికీ పేచీపెట్టలేదు.
    ఇంటిపనంతా అయిన తరువాత పిన్నికి ఉత్తరం రాసింది ఘాటుగా. తరువాత కిష్టుడి పక్కలోకొచ్చి పడుకుంది పార్వతి.
    "హెడ్ మాష్టరు మంచివాడు కాబట్టి సరిపోయింది. ఒంటరిగా తను యీ రాక్షసమూక మధ్య ఎంతకాలమని నిలబడగలిగేది? పురుషుడి అండలేనిదే అందరిదృష్టిలో హీనురాలే. తాను పునిస్త్రీ కాబట్టి తనని భర్త విడిచేశాడా? భర్తను తను విడిసేసిందా? ఆరా తియ్యని వాళ్ళు లేరు. మెత్తగా వుంటే ఎంతయినా ఏడ్పించుతారని అనుభవంమీద గ్రహించి అందరితో కఠినంగా మెలుగుతుంటే గడుసు, మొండి పొగరుమోతు, పేర్లు తగిలించి ఆనందిస్తున్నారు. పరాయివాళ్ళని అనుకోటం ఎందుకు. సాక్షాత్తు పిన్ని, తనని అర్ధంచేసుకుందా" ఉత్తరాలమీద ఉత్తరాలు కురిపించింది. సంపాదన ఎంత? ప్రైవేట్లు చెపుతున్నావా? ఎంత దాస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లు అతగాడికి రాశావా? అవసరం వచ్చింది పాతికరూపాయలు పంపు. ఇలా ఉత్తరం అంతా నిండి వుంటుంది. నువ్వెట్లా వుంటున్నావు? పిల్లలెలా వుంటున్నారు? ఒక్క ముక్క వుండదు.

 Previous Page Next Page