Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 7

    తిరిగి అతని ఆలోచనలు భార్య మీదకు మళ్ళాయి.
    భార్యను తలచుకుంటే అతని గుండెలు బరువెక్కుతాయి.
    భారంగా నిట్టూర్చి, పచ్చికలో చతికిలబడ్డాడు శ్రీకర్.
    వెండి మబ్బులు పరుగులెత్తుతున్నాయి ఎక్కడికో. ఆకాశంలో రెండు జంట గువ్వలు స్వేచ్చగా, హాయిగా సుఖ తీరాలకు పరుగులు పెడుతున్నాయి. ఆ గువ్వల జంటను చూస్తుంటే అతని మదిలో శంకర్ - నీలవేణి మెదిలారు.
    అలా జంటగా తిరిగే అదృష్టం తనకేది?
    "క్రొత్తగా పెళ్ళి అయింది. చక్కగా భార్యను వెంట తీసుకుని సినిమాలకు, పార్కులకు తిరగాల్సింది. ఆనందాన్ని పంచుకోవాల్సిన భార్యా భర్తలం అప్పుడే విడిపోయాం. కాదు, తనే ఆ అవమానాన్ని, తిరస్కారాన్ని భరించలేక వచ్చేశాడు.
    తన సంతోషం మూడునాళ్ళ ముచ్చటైపోయింది. తన కలలన్నీ చెదిరిపోయాయి. కట్టుకున్న గాలిమేడలు కూలిపోయాయి. విధి వలన కాదు_దురదృష్టం వలనగాదు__అహంభావంతో, అజ్ఞానంతో జ్యోతి ఆ పని చేసింది. కట్టుకున్న భర్తని గౌరవించే పాటి సంస్కారం ఆవిడలో కొరవయింది.
    ఆలోచిస్తున్న శ్రీకర్ మనసు గతంలోకి పరుగుపెట్టింది.
                                       7
    ఆ వేళ కాలేజీ ఫంక్షన్! విద్యార్ధులంతా హడావిడిగా తిరుగుతున్నారు. కాలేజీ ఆవరణంతా శుభ్రం చేయించారు. వేదిక కట్టారు, రంగుదీపాలు అలంకరించారు. అక్కడంతా సందడిగా వుంది. ఫంక్షన్ సందర్భంగా విద్యార్ధుల నాటికలు, పద్యాలు, పాటలు, గేయాలు, నృత్యాలు మొదలగు కార్యక్రమాలు వున్నాయి. అంతా ప్రిపేర్ అయివున్నారు.
    ఫంక్షన్ మొదలయింది. ప్రిన్సిపాల్ గారు అధ్యక్షుణ్ని ముఖ్య అతిధిని వేదికమీదకు ఆహ్వానించారు. ఆ ఊరి పెద్దల్ని కొందర్ని వేదికమీదకు రప్పించారు.
    అధ్యక్షుని తొలిపలుకులు ముగిశాయి.
    ముఖ్య అతిథి అరగంటసేపు ఆ కాలేజీ సాధించిన ప్రగతి గురించి-పాలక వర్గాన్ని గురించి ధారావాహికంగా మాట్లాడాడు. ఆయన వాగ్ధాటికి అంతా ముగ్ధులైపోయారు.
    తరువాత విద్యార్ధుల కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి.
    ముందుగా బి.ఏ. మొదటి సంవత్సరంవాళ్ళు "తేనెకళ్ళు" నాటిక చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలకు పాత్రులయ్యారు. మరికొందరు పాటలు పాడారు. కొందరు పద్యాలు చదివారు. ఈసారి శ్రీకర్ వంతు వచ్చింది. అతను గేయం చదవాలని కాగితంమీద వ్రాసుకుని తెచ్చాడు. మైకుముందు నిలబడి గొంతు విప్పాడు శ్రీకర్. నిలువెత్తు విగ్రహంలా నీవు నిలుచుంటే నా కళ్ళకు నింగినుండి జారిన రెండునక్షత్రాల్లా కనిపించాయి నీ కళ్ళు. నీ నయన తార వలోనంతో, ఓ నవసుందరీ  సర్వ సౌందర్య ప్రపంచం స్పష్టంగా కనిపించింది నాకు. నిన్ను చూసిన కళ్ళతో మరే అన్నులమిన్ననూ చూళ్ళేను.
    నీ దాసుడిగా మారాలని వుంద.
    నీ కౌగిట్లో నను చేసుకో బందీ.
    కరతాళ ధ్వనులమధ్య గేయం ముగించాడు శ్రీకర్. గేయంలోని భావం_అతను చదివిన తీరు జ్యోతికి బాగా నచ్చాయి. ఆమె భావ కవిత్వమంటే ఎక్కువ మక్కువ చూపుతుంది.
    ఫంక్షన్ అయిపోయాక శ్రీకర్ని కలసి ప్రత్యేకంగా అభినందించింది.
    "మీ గేయం భావాత్మకంగా చాలా చక్కగా వుంది." అని మెచ్చుకోలుగా అంది. ఆ మాటలకు శ్రీకర్ సిగ్గుపడ్డాడు కొద్దిగా.
    "ఏదో నోటికి వచ్చింది రాసాను. ఇది గేయమో, కవిత్వమో తెలీదు నాకు..." అన్నాడు శ్రీకర్.
    "ఎలా వ్రాసినా బావుంది. కానీ భాష ఇంకా పటుత్వంగా వుంటే మరింత బాగా రాణించేది" అని జ్యోతి అన్నది.
    తన గేయం మెచ్చుకున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు శ్రీకర్.
    జ్యోతికి కాలేజీ బ్యూటీగా పేరుంది! లక్షాధికారి గోవర్ధనంగారి ఏకైక సంతానం. ఆయనకు కూతురంటే పంచప్రాణాలు. ఆమె కోరితే దేవుడ్నికూడా కొనివ్వగలడు. అంతటి ప్రేమ ఆయనకు.
    ఇక జ్యోతి-అందరి ఐశ్వర్యంతోపాటు రవ్వంత అహంభావం, గర్వం కూడా వుంది. తనకిష్టంలేకపోతే యెవరితోనూ మాట్లాడదు. చులకనగా తీసి పారేస్తుంది. అవతల వ్యక్తి నచ్చితే వాగేస్తుంది ఇక అతన్ని వదిలిపెట్టదు.
    శ్రీకర్ ఆమెకు నచ్చాడు. శ్రీకర్ మంచి అందగాడు. ఆరడుగుల పొడుగు వుంటాడు. ధృడమైన శరీరంతో ఆరోగ్యంగా వుంటాడు. మంచితనం అతని సొత్తు. యెప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ వుంటాడు. అతని నవ్వులో యేం మహత్యముందో ఆ కాలేజీలో అతనంటే అందరూ ఇష్టపడతారు. అందరూ ఇష్టపడటం వేరు. లక్షాధికారిబిడ్డ జ్యోతి ఇష్టపడటం వేరు.
    జ్యోతి ఒక ప్రత్యేకమైన మనిషి.
    ఆమె ఇష్టాలుకూడా ప్రత్యేకమైనవే!
    ఆమె ఎప్పుడైతే శ్రీకర్ మీద ఇష్టాన్ని ప్రదర్శించిందో మిగతా విద్యార్ధులంతా శ్రీకర్ మీద అసూయచెందారు. వుండదా మరి! పాలరాతిబొమ్మ వలపు పొందాలని ఎందరో, ఎన్నాళ్ళనుంచో తహతహ లాడుతున్నారు. ఇవ్వాళ హఠాత్తుగా ఆ ఛాన్సు శ్రీకర్ కొట్టేయడంతో మిగతా వాళ్ళకు బాధగా వుండదూ?
    "మొత్తానికి అదృష్టం వరించిందోయ్!" అని స్నేహితులు అభినందించారు. 
     "దేనికి?"
    "జ్యోతి నిన్ను ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ పొందడం గొప్ప వరం."
    "కావచ్చునేమో! నాకలాంటి ఆశలులేవు-" అన్నాడు శ్రీకర్.
    "కోతలు కొయ్యకోయ్! మొదట్లో ఇలా అన్నా ఆమెమాటలకు కరిగిపోతావ్, వలపు బాణాలకు చిత్తయిపోతావ్. జ్యోతి అంటే యేమనుకున్నావ్ -"
    ఆ మాటలకు శ్రీకర్ చిన్నగా నవ్వి వూరుకున్నాడు.
    ఆవేళ కాలేజీ వదిలాక జ్యోతి శ్రీకర్ని వెదుక్కుంటూ వచ్చింది.
    "ఈ దినం సాయంత్రం మీరు మా ఇంటికి టీకి రావాలి అని నవ్వుతూ ఆహ్వానించింది జ్యోతి
    అతను విస్మయం చెందాడు.
    ఆవిడ యెందుకు తనను ఇంటికి టీకి ఆహ్వానిస్తున్నదో అర్ధంకాలేదు.
    "క్షమించండి. సాయంత్రం నాకు వేరే పనుంది" రానంటే ఆవిడ ఏమనుకుంటుందోనని అలా అబద్దమాడాడు శ్రీకర్.
    ఆమె నిరుత్సాహపడిపోయినట్లు చూసింది.
    "పోనీ! రేపు వీలవుతుందా?" ఆశగా అడిగింది.
    శ్రీకర్ ఇరుకున పడ్డాడు. ఆమె ఆహ్వానాన్ని మన్నించలేక పోతున్నాడు. కలవాళ్ళతో పరిచయాలు,  స్నేహాలు అతనికి ఇష్టంలేదు. కాదంటే ఆమె నొచ్చుకుంటుంది.    

 Previous Page Next Page