నీలి రంగు యిష్టపడని ఆదిమ మహిళ పేజీ రెండు వందల నాలుగు.
పుస్తకంలో మొదటి పేజీలో వున్న ఈ వాక్యం చదివిన అవంతి ఆ పుస్తకంలోని రెండువందల నాలుగవ పేజీ తెరిచింది. అక్కడ మొదటి వాక్యం యిలా వుంది. నీలిరంగు యిష్టపడని ఆదిమ మహిళ వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు. పేరు నిలోబా. నీలిరంగు విషయంలో ఆమె....
అంత వరకే చదివింది. అవంతి. ఎందుకంటే ఆపై చదివే అవసరం లేదు. ఇరవై ఎనిమిది కోడ్ తెలిసిపోయింది, రెండూ ఎనిమిది కలిపితే పది. అంటే ప్రతి పదో అక్షరమూ తీస్తే నీలిరంగు బటన్ వుపయోగాలు అర్ధమవుతాయి.
అవంతి కాగితము కాలము తీసుకుని ప్రతి పదో అక్షరమూ రాస్తూ వుండిపోయింది.
అవంతి రాయటం పూర్తి చేసి ఒకటికి పదిసార్లు అది చదువుకుంది. సరీగ అప్పుడే బజర్ మోగటంతో కుర్చీలోంచి స్ప్రింగ్ లాగి పైకి లేచి ఆదిజాతులు వారి ఆచారాలు పుస్తకాన్ని తను రాసిన కాగితాన్ని బెడ్ కింద దాచి ఆ తర్వాత వెళ్ళి తలుపు తీసింది.
"మీరు యింట్లో వుంటారో వుండరో అనుకున్నాను" గుణవంతి లోపలికి వస్తూ అంది.
"ఇప్పుడు వున్నానా లేనా!" అవంతి నవ్వుతూ అడిగింది.
"మీరు తమాషాగా మాట్లాడుతారు. అందుకే నాకు నచ్చారు" గుణవంతి నవ్వుతూ అంది.
"మీరూ చారూ ఈ మాట మీకు మానెయ్యరా!"
"మీరు మాత్రం మానేశారా?"
ఇద్దరూ ఫక్కున నవ్వేసుకున్నారు. వాళ్ళ నవ్వు విని బక్కయ్య తల ఎత్తి చూశాడు. వెంటనే తల దించుకుని మళ్ళీ తను చేస్తున్న పనిలో నిమగ్నుడయ్యాడు.
అవంతి గుణవంతి మధ్య పాత స్నేహం లాంటిదేమీ లేదు. పక్కింట్లో పార్టీ సందర్భంలో రెండు నెలల క్రితం పరస్పరం పరిచయం అయింది. అవంతి కావాలనే గుణవంతితో స్నేహం కలుపుకుంది. అవంతితో రెండు నిమిషాలు మాట్లాడంగానే గుణవంతి కూడా దగ్గర అయింది.
అవంతికి బొత్తిగా తెలివని సంగతి ఒకటుంది.
ఒక విషయంలో గుణవంతితో స్నేహం చేయాలనుకుంది. స్నేహం కలుపు కుంది. గుణవంతీ అంతే అతి ముఖ్యమైన విషయం తెలుసుకోటానికి అవంతితో స్నేహం వక్కటే మార్గం అనుకుంది. అవంతితో ఎలా మాట కలుపుకోవాలి. ఎలా స్నేహంతో దగ్గర కావాలి, అని ఆలోచిస్తూ వుండగానే అవంతి ముందుకు వచ్చి మాట కలిపింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది గుణవంతికి.
తగిన సమయం కోసం ఇరువురూ కాచుకుని వున్నారు.
"మన స్నేహం యింకా బలపడిం తరువాత పరస్పరం పేరు పెట్టి పిలుచు కుందాము" అవంతి లోపలికి దారితీస్తూ అంది.
"మీ యిష్టం" అంది గుణవంతి.
ఇరువురూ బెడ్ రూమ్ లోకి దారి తీశారు.
గుణవంతి కుర్చీలో కూర్చుంటే అవంతి మంచం మీద కూర్చుంది.
"ఊ యింక విశేషాలు చెప్పండి." అవంతి అంది.
"లక్నో నుంచి మావారు ఈ వుదయం వచ్చారు" గుణవతి చెప్పింది.
"గుడ్ మళ్లీ వెళతారా వుంటారా!"
"ఈ తఫా నెల రోజులు వుంటారు."
"గుడ్"
"రేపు నా బర్త్ డే"
ఆ మాట వినంగానే అవంతి భ్రుకుటి ముడుచుకుంది. అంతలోనే తెప్పరిల్లి మామూలు అయింది. అవంతికి గుణవంతికి స్నేహం కలిసిన మొదట్లో ....
ఒకామె గుణవంతిని పలకరిస్తూ "మొన్న నీ పుట్టిన రోజునాడు కట్టిన పింక్ శారీ ఏ షాపులో కొన్నావ్?" అని అడిగింది. అవంతి ఒకసారి విన్న విషయం మర్చిపోదు.