Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 6

    మనోహర్ ఆమెకేసి మింగేసేంత కోపంగా చూశాడు.
   
    మనోహర్ కళ్ళలో కదలాడిన భావాన్ని చదివేసిన మాయాదేవి చిన్నగా పెదవుల మాటునే నవ్వుకుంది.
   
    "నువ్వెందుకు ఈ పని చేశావు - అనే ప్రశ్న మేము వెయ్యకుండానే గొప్ప వాదనని నీ రక్షణకోసం తయారుచేసుకున్నావు. చాలా తెలివికలదానివి. ఇంతకీ నువ్వు చేసినది తప్పని ఒప్పుకోవు. అంతేనా....?" ప్రశ్నించారు జస్టిస్ మెహతా.
   
    ఇక్కడిలా వుండగా కోర్టు బయట ఆవరణలో వున్న రిపోర్టర్ లు, జర్నలిస్ట్ లు, స్త్రీ వాదులు లోపల ఏం జరుగుతుందో తెలియక వుత్కంఠ అంచున నించున్నవారిలా అసహనంగా అటు-ఇటు తిరుగుతున్నారు.
   
                                       *    *    *    *
   
    అక్కడలా కోర్టులో వాదనలు జరుగుతుండగా, ఇక్కడ మనోహర్ ఇంట్లో అతని తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, మేనమామ, మేనత్త పిచ్చిపట్టిన వాళ్ళలా అయిపోయారు.
   
    మనోహర్ కోర్టుకెళ్ళిన దగ్గర్నుంచి తిండి తిప్పలు లేకుండా సోఫాలకు అతుక్కుపోయి తీవ్రమైన డిప్రెషన్ కి లోనయ్యారు.
   
    "నా మటుకు నేను ఎప్పుడూ ఇలాంటి కేసు వినలేదు, కనలేదు. ఎంత అప్రదిష్ట....? మీ కొడుకులాంటి కొడుకుని ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు...." ఈసడించుకుంటున్నట్టుగా అన్నది మనోహర్ మేనత్త.
   
    ఆమె పేరు విశాలాక్షి. పేరులో తప్ప ఆమె ఆలోచనలో విశాలత్వం వుండదు.
   
    "అక్కడికేదో నువ్వు ప్రపంచాన్ని చూసినట్టు, చదివినట్టు, అర్ధం చేసుకున్నట్టు మాట్లాడకు.....పక్క వాళ్ళెవరైనా వింటే నువ్వేదో ప్రపంచాన్ని చుట్టి వచ్చాననే అపోహకు లోనయ్యే ప్రమాదముంది. మొన్నటి వరకు నీ బతుకు, నా బతుకు జగ్గన్నపేటకు అంకితం. ఈ వేళేదో హైదరాబాద్ రాగానే అదేదో బోధి వృక్షంలాగా లోకజ్ఞానం ఒంటబట్టినట్టు నటించబాకు. ఏ ఒక్కరినీ ఇంకొకరితో ఎప్పుడూ పోల్చకూడదు. నీకు నచ్చిందే ప్రపంచానికి నచ్చాలని వాదించటం మంచిది కాదు. నా మేనల్లుడు మనోహర్ ఎప్పుడూ తప్పుచేయడు.
   
    ఒకవేళ చేసినా ఆ తప్పుని దాచుకునే ప్రయత్నం అంతకంటే చేయడు. అసలేం జరిగిందో, ఎందుకు జరిగిందో అందులో ఎవరి ప్రోద్బలం వుందో తెలుసుకోకుండా సూర్యాకాంతంలా విరుచుకుపడటం అంత మంచిది కాదు. తోమని అంటుల్లాగా మిగిలిన తిట్లేమైనా వుంటే నన్ను తిట్టు...." అంటూ విసురుగా సోఫాలోంచి లేచి అటు-ఇటు తిరగసాగాడు.
   
    భర్త మాటలతో విశాలాక్షికి కోపం నషాళానికి అంటింది.
   
    "నా మేనల్లుడు- మేనల్లుడే నా కొడుకు- మేనల్లుడే అల్లుడు- నా మేనల్లుడే నా సర్వస్వం- అంటూ ఇంతకాలం దీర్ఘాలుతీస్తూ వున్న ఆస్థిని హారతి కర్పూరంలా చేశారు. ఉన్న ఒక్కగానొక్క కూతురుకి ఇరవై రెండేళ్ళు వచ్చాయి. ఇప్పుడిక మిగిలింది ఒక పాత కొంప, పశువుల పాక, రెండెకరాలు మాగాణి. వీటితో కూతురి పెళ్ళి చేయగలననుకుంటున్నారా?" ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అంది విశాలాక్షి.
   
    ఆమె మాటలకు మనోహర్ తండ్రి సూర్యప్రకాశరావు, తల్లి అన్న పూర్ణమ్మ మొఖాలు చుక్క నెత్తురు లేనంతగా పాలిపోయాయి.
   
    "నేను ఆ రోజే చెప్పాను. వున్నదంతా తగలేసి నీ మేనల్లుడ్ని చదివిస్తే రేపు మన బిడ్డ బతుకు ఏమవుతుందని- విన్నారా.....? లేదు.....హైస్కూల్ పరీక్షలయ్యేసరికి రెండెకరాలు, ఇంటర్మీడియట్ అయ్యేసరికి మరో రెండు ఎకరాలు, డిగ్రీకి మరో మూడెకరాలు, ఎంబిఏకి మరో నాలుగెకరాలు, ఇలా ఆస్థులు అమ్ముకుంటూ వచ్చారేగానీ బిడ్డ పెళ్ళి గురించి ఆలోచించారా....? ఇంత చేస్తే రేపతను మన బిడ్డను చేసుకోకపోతే మనమే గంగలో దూకాలని కూడా అడిగాను....డానికి మీరేమన్నారు.....? నా మేనల్లుడు అలాంటివాడు కాదు, నా అక్క అలాంటిది కాదు, నా బావ స్వార్ధపరుడు కాదు అని కథల మీద కథలు అల్లి చెప్పారు.
   
    ఇప్పుడేం చేస్తారో చెయ్యండి...." అంటూ పైటతో కళ్ళు తుడుచుకుంటూ తల విసురుగా తిప్పింది విశాలాక్షి.
   
    "నువ్వు కొద్దిగా ఓపిక పడతావా....? నాకు మాత్రం నా కూతురు భవిష్యత్ గురించి ఆందోళన వుండదా....? అసలు ఇంతకీ తప్పు మనోహర్ చేశాడా....? మాయాదేవి చేసిందా....? అదేదో తేలకుండా వాడ్ని పట్టుకు నిందిస్తావేంటి....?" విసుగ్గా అన్నాడు కుటుంబరావు.
   
    దాంతో మూతి ముడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయింది విశాలాక్షి. వెళుతున్న భార్యవేపు చూస్తూ నిట్టూర్చాడాయన.
   
    "వాడు కోర్టుకెళ్ళే వరకు తెలీదా.....? అసలు ఇలాంటి విషయాల్లో రచ్చకెక్కడం ఏమాత్రం భావ్యంగా వుంటుంది.....వాడు మంచివాడే....కాదనను.....కృతజ్ఞతకి అర్ధం తెలిసిన వాడనే నా నమ్మకం. అయినా ఇలా చెయ్యటం అన్నది నాకెందుకో రుచించటం లేదు" మనసు కష్టపెట్టుకుంటూ అన్నాడు కుటుంబరావు.
   
    "వాడింత కాలం వివేకవంతుడనే నేనూ అనుకున్నాను. వివేకవంతుడు ఒక మాట విని రెండు మాటలు అర్ధం చేసుకుంటాడు. నా నుంచి పది మాటలు విని కూడా, ఒక్క మాట అర్ధం చేసుకోలేదు వాడు. అర్ధం చేసుకుని వుంటే ఈ రోజు కోర్టుకెళ్ళేవాడు కాదు. రేపట్నుంచి నేనెలా తలెత్తుకు తిరగాలో నాకర్ధం కావడంలేదు" బాధగా అన్నాడు సూర్యప్రకాశరావు.
   
    ఆయన భార్య అన్నపూర్ణమ్మకు ఏడుపు ఒక్కటే తక్కువగా వుంది.
   
    "అంతా మాయ.....మాయకు కిటుకు కూడా మాయే. ముందు ఆ అమ్మాయిని నివారిస్తే ఎలా వుంటుంది...?" సాలోచనగా అన్నాడు కుటుంబరావు.
   
    "ఏమో....నాకేమీ అర్ధం కావటం లేదు...." అన్నాడు సూర్యప్రకాశరావు భారంగా.

 Previous Page Next Page