Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 6

                                               సోయగాల స్నానం
   
    విరహగ్ని నీ రీతి కరిగె నామానసంబనిటు వెన్న గాచిన ఘృతంబు పాల బోల్వయను నీ పలు సేయుటికిదె యాన వాలన్నట్టు లానవాలు నెమ్మి నీరీతి నాకెమ్మోవి గ్రోలు మీపూని నీ వన్నట్టు పానకంబు తనవచో మాధుర్య మెనయునా ఇవి చూడు మన్నట్టు మేలి రసాయనములు నొప్పిగా గిన్నియల నుంచి యుప చరించి పాణి పంకజ కంకణక్వాణ మెసగ బువ్వసురటిని విసరుచు భోజనంబు కాంత సేయించెదన మనః కాంతునకు.

    బృహస్పతి స్వర్గానికి ఇంద్రుడు పిలపనంపితే వెళ్ళాడు. వెళుతూ తన భార్య తారకు అప్పగింతలు పెట్టాడు. ఎలా ఉండాలో నియమాలు షరతులు విధించాడు. తన ప్రియ శిష్యుడైన చంద్రుడ్ని జాగ్రత్తగా చూడమన్నాడు. అత్రి అనసూయల వర కుమారుడు సుకుమారుడు చంద్రుడు. అతని అందం చందం ఆ సరికే తార మనస్సు హరించింది. ఇంట్లో ఎవరైనా 'తారా మనోహర' అని పిలిస్తే ఎంతో ఆనందిస్తుంది. కనురెప్ప వేయకుండా చూస్తుంది. చూచి తలవూచి మెచ్చుకుంటుంది. మెచ్చి ఫక్కున నవ్వుతుంది. నవ్వి గిరుక్కున తొలిగి, అంతలో తళుక్కుమనేలా చూస్తుంది. చూచి దగ్గరకు రారమ్మని పిలుస్తుంది. పిలిచి ముచ్చట్లాడుతుంది. ఏకాంతం అంటూ దగ్గరికి రారమ్మని పిలుస్తుంది. పిలిచి ముచ్చట్లాడ్తుంది, ఏకాంతం అంటూ దగ్గరికి వస్తుంది. చెవిలో గుసగుసలు చెప్పినట్టు ముఖాన ముఖం చేరుస్తుంది. చెక్కిలి చెక్కిలి సోకి సొమ్మసిల్లి పోతోంది. ఆ స్థితిలో వెళ్ళాడు భర్త.... వెళుతూ అప్పగింతలు పెడ్తే ;ఆత్మ కుమారునిలా' (కన్న కొడుకులా అని పైకి - ఆత్మకు మారునిలా - మన్మధునిలా అని లో లోపల భావించి) చూసుకుంటానంటుంది. నీకు ప్రియమైన వానిని నేనూ ప్రియునిగా చూడవలదా అంటుంది - భర్త వెళ్ళాక చంద్రుడి సపర్యలు చేస్తుంది. అదిగో - అది ఈ సందర్భం.

    తార ఇలా ఉంటే చంద్రుడు అంతకు ముందే విరహంలో మాడిపోతున్నాడు. మన్మధాగ్నిచే దహించబడిన మానసాన్ని బ్రతికించే సంజీవినీ విద్య దీని మాటలు - అనుకుంటున్నాడు.

    ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ వాదము, ఏ వివేకము అనుకున్నాడు. ఈమెతో వాదిస్తే అదే తర్కశాస్త్రం ముఖానికి ముఖం చేర్చడమే యోగశాస్త్రం. పోకముడి విడవడమే మోక్షశాస్త్రం - ఇరువురు ఒకటి కావడమే అద్వైతం - మిగతా శాస్త్రాలు శాస్త్రాలుకారు. అర్ధం అనుకుంటున్నాడు. జీవితమే వ్యర్ధం అనుకునే స్థాయికి చేరాడు. అదిగో అప్పుడు గురువుగారు ఇంద్రుడి వద్దకూ వెళుతూ ఇతన్నప్పగించింది. 'సరసముగ గురు ప్రతిష్ట' చేయాలనుకుంటున్న చంద్రుడికి చక్కని అవకాశం దొరికింది.

    మనసంతా చంద్రుడి మీద మాటలేమో మగనితో పయనమవుతున్నాడు బృహస్పతి. పైగా అలకలుదువ్వరాదు---సరస్నానాలు భుజింపరాదు, శరీరానికి గంధం పూయరాదు - పూలు పెట్టుకోరాదు. తిలకం దిద్దరాదు - అంటూ "నాధుడు" వూళ్లోలేనివేళ "సాధ్వి" యేయే అలంకారాలు చేసుకోరాదో బోధిస్తాడు. సురసుర మంటుంది. తారకు - నేనెక్కువా - ఆ యజ్ఞాలు ఎక్కువా? ఎప్పుడూ వ్రతాలు, తీర్ధాలు, యజ్ఞాలు అంటూ పొద్దుపుచ్చారు. నా యవ్వనమంతా ఇలా కరిగిపోయింది అయినా "మన్మధకృతువుకన్నా వేరోక జన్మముందా?" అంటూ ఆయజ్ఞాన్ని గూర్చి వివరిస్తుండగా భార్యకు బుద్ధులు చెప్పి వెళ్ళిపోతాడు. బృహస్పతి మనసులోని మర్మం బయల్పడనీయదు తార తన మనసంతా అతని మీదే ఉన్నట్టుగ నటించి వీడ్కోలు చెబ్తుంది. అటు భర్త వెళ్ళీ వెళ్ళగానే-

    చంద్రుడికి తానే తలంటి తలారా స్నానం చేయించి అన్నీ సింగారించి భోజనం పెడ్తుంది. తన సోయగాలు ప్రకటిస్తుంది. అన్నీ గమనించిన చంద్రుడికి మతిపోయింది. అయినా నిగ్రహించుకుంటాడు. భయమూ భక్తీ పెంచుకుంటాడు. ఇక తప్పదని తారే తెగిస్తుంది. చంద్రుడి బింకం జంకు చూసి "చంద్రా! నీ అందం చూసి మోహపడినా" నంటుంది. దోసిలొగ్గుతుంది. చంద్రుడు హితోపదేశం చేస్తాడు. మగడే దేవుడు - అంటాడు.
    మగని నతిక్రమించుటలు మానిని కిం దగదంటి వొప్పితిన్ మగడు మగండనంగ మది మక్కువ యెవ్వని యందొ కంటికింపగునత డెవ్వడో యతడె యాతని గాదని యన్యు గూడినన్ తగదిది కాముకీ జనుల ధర్మము మర్మము నే నెరుంగుదున్ - అని కాముకీ జనుల ధర్మం బోధిస్తుంది - మీ తాత కన్న కూతురయినా సరస్వతిని చేసుకున్నాడు. నీ బావ తన మేనత్త రాధతో రాసకేళి తేలాడు. మీ గురువు వదిన అనే వరుస పాటించలేదు. నీ సహాపాఠి ఇంద్రుడు అహల్య జారుడు - మీ వాళ్ళంత ఇలాంటి వాళ్ళే మరచి పోయావా - అయినా ఎవరో అబలుల్లాగా మాట్లాడ్తా వేంటోయ్ - పురాణాలు, ధర్మాలు, శాస్త్రాలు ఎవరికి? చేతకాని వారికి - ఇది విను.

    లోకములోన కొంద రబలుల్ సతులం తనియింప లేకయ
    స్తోక మనీష నన్య పురుషుల్ తమ కాంతలనంట కుండ తా
    టాకుల లోన వ్రాసిరి పరాంగన గూడిన పాపమంచు అ
    య్యాకుల పాటు చూచి యిపుడాకుల పాటె నయంగ నేటికిన్ -

    అంతేకాదు చంద్రా! నాకు కులం వద్దు. శీలం వద్దు. ఆ మగడూ వద్దు. ఆ కాపురమూ వద్దు - చుట్టాలు పక్కాలు వద్దు - నామనో వల్లభా! నీవు కావాలి! నీతో కాపురం కావాలి!

    అలా అడిగిన తారకు చంద్రుడు దాసను దాసుడయ్యాడు.

    ఆ తర్వాత? ఏమైంది??
   
                                                         ---*---

 Previous Page Next Page