Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 7

    తన క్రింద ఉద్యోగులందరికీ మూడు నెలల బోనస్ ప్రకటించారు. పురుడు పోసి బిద్దతోపాటుగా వాణిని క్షేమంగా ఇంటికి పంపిన డాక్టరమ్మకు బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించారు.
    వాణి తిరిగి వెళ్ళిపోయిన తరువాత ఆ ఇల్లు దేవుడులేని ఆలయంలా, చంద్రుడులేని ఆకాశంలా కన్పించసాగిందాయనకు. తిరిగి వ్యాపారం పనులలో ఊపిరి సలపకుండా తల దూర్చేశారు.
    విరామ మెరుగని పరిశ్రమ ప్రారంభించారు. ఆయన ఇంటిపట్టున చిక్కకపోగా, ప్రతి ఉదయమూ డాక్టర్ కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తోంది వాణి. ఇటీవల ఆయన శరీర స్థితిగతులు రవంత దిగాజారినాయని కూడా తెలుసుకుందామె.
    ఈ స్థితిలో ఉండగా శ్రీశైలం రావలసిందని వాణి నించి కబురు వచ్చింది. అందుకాయన అంగీకరించలేదు.వారి స్వేచ్చకు అడ్డుగా తాను ఉండటం అనవసరమని భావించి తిరస్కరించారు.
    వారు వెళ్ళిన మూడవనాడు వాణి అంతర్ధానమైందన్న వార్తను అందుకుని వారి నవనాడులు కుంగినాయి. వాణి వెతికేందుకు ప్రైవేట్ దిటేక్టివ్ లను, కొందరు నేర పరిశోధక విభాగం అధికారులను వెంట బెట్టుకుని వచ్చినారాయన.
    ఆయనతో పాటుగా మొత్తం ఐదు కార్లు పది మంది పటాలం వచ్చారు. వారంతా విడిది దగ్గర దిగగానే విషయమంతా తెలుసుకుని, ఆమెను తిరిగి పట్టుకుని పధకాలను రూపొందించారు.
    మొత్తం శ్రీశైల పర్వతాలలోని ప్రతి అంగుళం గాలించేందుకు ప్రణాళిక తయారు చేశారు క్షణాలమీద స్థానిక పోలీసులతో సంప్రదించి రంగంలోకి దిగిపోయారు. అత్యున్నతమైన స్థాయిలో అన్వేషణ ప్రారంభమైనది.
    అన్నికోణాలకు సెర్చిలైట్లు దూసుకుపోతున్నాయి. కేశవరావుగారు మాత్రం కుంగిపోయి చిన్న బాలునిలా ఏడ్చేయటం ప్రారంభించారు.
    స్వప్నకుమార్ ని, వారిని ఓదార్చేందుకు ఎండోమెంట్స్ ఆఫీసర్ కు శక్తి చాలలేదు. చిన్ని కృష్ణ ప్రత్యేకమైన భవనంలో అపురూపమైన ఏర్పాట్లతో అద్భుతమైన రక్షణ వలయంలో ఉంచబడ్డాడు.
    పాముల మల్లిగాడు కోసం గాలింపు ప్రారంభమైంది. అందరూ అన్నీ విధాలా అన్వేషణ కొనసాగించటం ప్రారంభించారు.
         మొత్తం శ్రీశైలంలో ఎన్ని దేవతామూర్తులున్నాయో అన్నింటికీ అర్చనలు ఏర్పాటు చేయబడినాయి. శ్రీశైలస్వామి అయిన మల్లిఖార్జునస్వామికి అనవరత క్షిరదారలతో శాంతి చేయించవలసిందిగా ప్రార్ధించారు కేశవరావుగారు.
    వాణి అనే ఒక అద్భుత స్త్రీమూర్తిని అన్వేషించేందుకు శ్రీగిరి శిఖరాల మీద హెలికాఫ్టర్లు తూనీగల్లా తిరుగాడసాగాయి. టి.వి. లు, రేడియోలు, పత్రికలు కేంద్రికరించబడినాయి. ఇది మొత్తం ప్రజలకు అత్యంత ఆసక్తిదాయకమైన విషయంగా, ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సవాలుగా మారిపోయింది.
    కోటి రూపాయలైనా ఖర్చు పెట్టేందుకు సంసిద్ధుడైన ఒక తండ్రి బిడ్డను దక్కించుకోకపోతే ఇంక రక్షణ ఎవరికుంటుంది? అందునుంచి తెలుగు నేత్రం విస్పారితమైంది. తెలుగు జీవితం ఒక్క క్షణం రాపడి నిలిచిపాయింది.
    కేశవరావుగారి విశ్వరూపాన్ని దర్శించిన ఎండోమెంట్స్ ఆఫీసర్ విభ్రాంతుడైనాడు. స్వప్నకుమార్ నిశ్చేష్టుడైనాడు.
    ఇంతటి మహత్తర యత్నమంతా మూడురోజులపాటు కొనసాగింది. కాని రవంత అయినా ఫలితాంశం కనిపించలేదు. కేశవరావుగారికి బి.పి. నూట అరవై పెరిగిపోయింది. ఆయన పలవరించడం ప్రారంభించారు.
    "వాణీ! వాణీ! నా వాణీ!"
    రెండు గంటలకొకసారి ఆయన స్మృతి కోల్పోవడం ప్రారంభించారు డాక్టర్ల సలహా మీద ఆ చోటు విడిచి పోవాలని నిర్ణయమయింది. దాదాపు స్పృహలేని స్థితిలో ఆయన ఇంటికి తీసుకుపోబడినారు. స్వప్నకుమార్ నిస్సహాయుడయిపోయి బాబుతో ఆయనను అనుసరించి వచ్చేశాడు.
    అన్వేషణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
                                                                 0          0         0
    ఆ గుహలోపల చీకటి గుయ్యారంగా ఉంది. తేమగా కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. సమయం ఎన్ని గంటలయిందో తెలియదు. అప్పుడే కల్లువిప్పిన వాణి దాహంతో నాలుక విరిచుకుపోవటాన్ని గుర్తించుకుంది.
    ఆమె సాహసాన్ని, తెలివితేటల్ని చూచి ఉన్నవారు కావటం నించి నాగాలు ఆమెకు మంచినీరులో ఏదో పసరు కలిపి తాగించారు. దానితో ఆమె స్మృతి కోల్పోయి డెబ్బై రెండు గంటల తరువాత ప్రధమంగా కన్నులు విప్పి చూచింది అప్పటికి నాలుక విరుచుకుపోతోంది. పెదవులు పాలిపోయినట్లు పొడిగా అయినాయి.
    తన బాధను వ్యక్తీకరిస్తూ సన్నగా మూలిగిందామే. ఆమెలో తిరిగి చైతన్యం వచ్చిందన్న సూచనకు ఆధారం కన్పించగానే పక్కన అలికిడి అయింది. అటువంటి సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారేమో కదలి ఆమె దగ్గరగా వచ్చింది.
    "మన్నించమ్మా పట్నవాసం దొరసానీ! నిన్ను ఇలా తెసుకురావలసి వచ్చిందంటే అది చాలా బాధగానే ఉన్నది. కాని నీకు తెలుసు కదా! షైజాదొర పట్టు పట్టినాడంటే విడువడు. నాగాభూమినించి వచ్చిన తరువాత అతడు ఆంధ్రప్రదేశంలో చాలా అపురూపమైన మూలికల్ని సాధించాడు. సప్తధాతు సంజీవని సాధించటంలో నీవు సాయం చేశావు కదా! అతడి ఆదేశాన్ని అనుసరించి నిన్ను ఇలా బంధించాల్సి వచ్చింది. కాని నీమీద మాకు చాలా గౌరవ ప్రపత్తులు ఉన్నాయని నీవు గుర్తుంచుకో!" అన్నది రేనో.
    వాణి నవ్వు తెచ్చుకోవాలని పాలిపోయిన పెదవులు విరిచింది. కాని అది వృధా ప్రయత్నమైపోయింది. ముఖంలోని కాంతి అంతా తగ్గిపోయింది.
    మంచినీటిలో కలిపి ఇచ్చిన మూలికల ప్రభానం ఇంకా ఆమె శారేరం మీద రావంతగా పని చేస్తూనే ఉన్నది. రేనో నోటికి అరచేయి అడ్డు ఉంచుకుని కువ్వుమని కూత పెట్టింది. ఆ సూచనలను అర్ధం చేసుకున్న వేలుపలివారు గుహకు అడ్డుగా ఉంచిన పెద్ద శిలా శకలాన్ని తొలగించినారు. అందరూ లోనికి వచ్చారు. వారంతా నాగాలే!

 Previous Page Next Page