Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 6

    ఉలికిపడి కన్నులు విప్పాడు స్వప్నకుమార్. అల్లరి ఏడుపు ప్రారంభించాడు. వాణికోసం ఎదురు తెన్నులు చూస్తూ సోఫాలో కూర్చున్న స్వప్న రవంత కన్నుమూశాడు. పగలంతా తిరిగి అలసట! చల్లని కొండగాలులు శరీరాన్ని తాకుతున్నాయి. అందునించి వెంటనే అతని రెప్పలు బరువుగా వాలాయి.
    కృష్ణ మారాం చేయటం ప్రారంభించగానే అతనికి మెలకువ అయింది. ఉలికిపడి లేచాడు 'వాణి ఇంకా తిరిగి రాలేదేమిటి?'
    గడియారం వంక చూస్తే సమయం పన్నెండు గంటలయింది. అతడు చివాలున సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. గుండె దడదడలాడింది. వరండాలోకి వచ్చి చూస్తే కారు వస్తున్న జాడలేవీ కనిపించలేదు. ఎవరో కొరడాతో వెన్నుమీద చరచినట్లు అయింది.
    "అయిదారు కిలోమీటర్లు వెళ్లి రావటానికి అర్ధరాత్రి అయిందాకా ఏం చేస్తున్నట్లు!" అతడు లైటువేసి వరండాలోకి రావటం గమనించిన వాచ్ మన్ పరుగు పరుగున వచ్చాడు. అతడికీ భయంగానే ఉంది.
    "ఇందాక అనగా కారు తేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిగారు ఇంకా తిరిగి రాలేదేమిట, సార్!" అన్నాడు.
    స్వప్నకుమార్ కనుబొమలు ముడిపడినాయి. ఆంతర్యం కల్లోలిత సాగరంలా అయింది.
    వెంటనే తన మిత్రుడు అయిన ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్ఞాపకానికి వచ్చాడు. ఫోను ఎత్తి తన మిత్రుడితో సంప్రదించాడు స్వప్న.
    అంతా విన్న ఎండోమేట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భయంతో నోరు తెరిచేశాడు.
    "నేను వస్తున్నాను, నువ్వేమీ కంగారుపడకు" అని స్వప్నకు ధైర్యం చెప్పి తాను మాత్రం రవంత సేపు భయంతో బిగుసుకుపోయాడు.
    మిత్రుడు వచ్చేంత వరకూ వరండాలో అలాగే నిలిచిపోయాడు స్వప్న. అతని మనసు అగ్నిపర్వతంలా ఏ క్షణాన అయినా ప్రేలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఏడ్చే ముందు పసిపాప ముఖంలో విచిత్రమైన విరుపులు కనిపించినట్లుగా అయింది. అతని ముఖం.
    హడావిడిగా కారు దిగి వచ్చాడు ఎండోమెంట్స్ ఆఫీసర్.
    "ఏమైంది, స్వప్నా!" అన్నాడు వస్తూనే.
    "ఇంకా రాలేదు." పొడిగా చెప్పాడు స్వప్న. మరింత మాట్లాడాలని ప్రయత్నిస్తే మాటలకు బదులుగా మనోవేదన బయట పడుతుందని త్వరగా అరక్షణం అలాగే నిలిచిపోయిన ఆఫేసర్ వెనువెంటనే చైతన్యం తెచ్చుకున్నాడు.
    ఫోన్ ఎత్తి పోలీసులకు కబురు పెట్టాడు. రాతిబోమ్మలా అయిపోయిన స్వప్నను కదిలించకుండా అన్నీ పనులూ తానే చకచక సాగించుకుపోయాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదలటంతో శ్రీశైలంలో ఆవాసముంటున్న ప్రముఖులంతా కదలిపోయారు.   
    డామ్ దగ్గర కార్యకలాపాలను నిర్వహించే ఇంజనీర్లు కూడా కొందరు వచ్చారు. సెన్స్ జర్నల్స్ లో వాణి వ్రాసిన అనుభవాలను చదివి అతిగాఢంగా  మనసులో ముద్రించుకున్న వారుకూడా వారిలో కొందరు ఉన్నారు. అందరికి వాణి గురించిన వివరాలు, సాహసాలు తెలిశాయి.
    అందునించి అందరూ తెల్లవారేంత వరకూ విశ్వ ప్రయత్నం చేసి కారు ఎక్కడుందో తెలుసుకున్నారు. కాని వాణి జాడ రవంత అయినా తెలియలేదు.
    ఈ విషయం విన్న స్వప్నకుమార్ దుఃఖాన్ని భరించలేక ముఖాన్ని చేతుల్లో దాచుకుని గదిలోకి పారిపోయాడు. చూడవచ్చిన ఎస్. ఐ, ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్ లు అతనిణిఓదార్చాలని ప్రయత్నిచారు.
    తెల్లవారుతూ ఉండగా వృద్ధుడైన కొండదొర మోదుగుపూలు తెచ్చాడు. తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు.
    ఆ పగలంతా వాణి క్షేమం కోసం శ్రీశైలస్వామి మారేడు దళాలతో, మోదుగుపూలతో, క్షిరదారలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడినాయి.
    వైరు అందుకున్న కేశవరావుగారు ఆ సాయంత్రానికి వచ్చేసారు.
                                                                                  ౩                                                                         
    కేశవరావుగారు ఈ  మధ్య కాలంలో బాగా కుంగిపోయి ఉన్నారు. వాణి తనను ఒంటరిని చేసి భర్తతో పాటుగా వెళ్ళిపోయింది. జీవితంలో తనకింకా ఏమీ మిగలలేదనిపించిదాయనకు. ధనార్జన అనే వ్యసనంతో తన బాధను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారాయన.
    వాణి తన తండ్రిని చూచేందుకు ఎప్పుడైనా వస్తే ఆయనకు జీవితంలో వెలుగు వచ్చినట్లు అవుతుంది. చుట్టం చూపుగా వచ్చిన ఆమెను తనతో ఉండిపోమ్మని ఒత్తిడి చేస్తారాయన.
    "డాడి! స్వప్న నొచ్చుకుంటాడేమో! ఈ ఊళ్లోనే ఉంటున్నాం కదా! ఏ క్షణంలో అయినా రావచ్చు. చాలా చిన్న మార్పు గురించి మీరెందుకు ఇంతలా కుంగిపోతారు" అని అడుగుతుందామే.
    కేశవరావుగారు ఖిన్నులైపోతారు.
    "అమ్మా! నీవు ఇల్లు విడిచి మరొకరి మనిషివైపోయావంటే నా శరీరంలో పంచప్రాణాలు నన్ను వదిలిపోయినట్లే. నా ఇంటిలోని వెలుగు అంతా చీకటిగా మారిపోయినట్లే అనుకుంటారాయన. కాని పైకిమాత్రం ఏమీ అనరు వాణి అభిప్రాయాలకు సూచనప్రాయంగా అయినా ఎదురుచెప్పటం వారికి ఇష్టమైన పని కాదు.
    మాటలతో మరపుకు రాణి బాధలు, ఏ విధంగానూ తీరిపోని మనోవేదనలు మనిషిని వేన్నాడుతున్నప్పుడు మనిషి ఏదో ఒక వ్యసనానికి బానిస అవుతాడు. అలాగే కేశవరావుగారు మరచిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
    ప్రప్రధమంగా వాణి బిడ్డనెత్తుకుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఎన్నడూ పొందని ఆనందాన్ని పొందారు. ఆమెకు స్వాగతం పలికేందుకు మొత్తం నగరాన్ని కదిలించిన హడావిడి చేశారు.

 Previous Page Next Page