Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 7


                                                                          రికార్డ్

    లింగరాజు గుండెలు బాదుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.
    హాలు మధ్యలో నిలబడి "బేర్.."మన్నాడు.
    అతని భార్య సత్యవతి కంగారుగా అతని దగ్గరికి వచ్చింది.
    "ఏమైందండీ... ఎందుకలా ఏడుస్తున్నారు?" చొక్కాకాలరు పట్టి ఊపేస్తూ అడిగింది.
    ఆ ఊపడంలో లింగరాజు చొక్కా పర్రున చిరిగింది. లింగరాజు ఏడుపాపి ఓసారి తన చొక్కా ఆశ్చర్యంగా చూస్కున్నాడు.
    "హర్రే!...చొక్కా భలే చిరిగిందే!!... ఏది మళ్ళీ నా కలరుపట్టి పీకుతూ ఊపు" భార్యని అడిగాడు లింగరాజు.
    సత్యవతి మళ్ళీ అతని చొక్కా కాలరుపట్టి గాట్టిగా ఊపింది.
    అతని చొక్కా  మళ్ళీ పర్రున చిరిగింది.
    లింగారాజుకి హుషారు పుట్టింది. "హర్రే.. హర్రే... భలే చిరిగిందే నా చొక్కా?! హిహి ...ఏదీ మళ్ళీ చింపాలమ్మా..." అన్నాడు సంబరంగా.
    "ఉహూ నేను చింపను!..." అంది సత్యవతి.
    "చింపమంటున్నానా?..." కాస్త విసుగ్గా అన్నాడు లింగరాజు కళ్ళు చిట్లించి భార్యవంక చూస్తూ.
    "నేను చింపనంటున్నానా?..."అయితే విసుగుతో అంది సత్యవతి.
    "ఏం?...ఎందుకని చింపవు?... నేనేమైనా నీ చీరని చింపుకోమని అంటున్నానా?... నా చొక్కాని చింపమంటున్నానుగానీ... త్వరగా చింపు..."
    "అమ్మా...ఇంకా చింపుతే అది నాకేందుకైనా పనికొస్తుందా అని?... నేను చింపనుగాక చింపను..."
    లింగరాజు భార్యవంక ఆశ్చర్యంగా చూశాడు. "నా చొక్కా నీకు ఎలా పనికొస్తుంది?"
    భర్త అమాయకత్వానికి సత్యవతి ఫక్కున నవ్వింది.
    "భలే...మీరు భోంచేసే కంచం ఎక్కడిదీ?... మీరు తాగే గ్లాసు ఎక్కడిదీ?...అన్నం,పులుసూ,ఉడకేసే గిన్నెలు ఎక్కడివీ...ఆఖరికి ఆఫీసుకి మీరు తీస్కెళ్ళే టిఫిన్ బాక్సు ఎక్కడిదీ?...అన్నీ మీ చొక్కాలు,ఫ్యాంట్లు స్టీలు సామాన్లవాడికేసి సంపదించినవేగా?... మరీ ఎక్కువగా చింపేస్తే స్టీలు సామన్లవాడు ఆ చొక్కాని తీస్కుంటాడా?ఇప్పుడు ఆ చొక్కాని వాడికిస్తే ఓ స్టీలు గరిట ఇస్తాడు ఇంచక్కా..." సంబరంగా అంది సత్యవతి.
    "స్టీలుగరిట పోతేపోయిందిగాని నా చొక్కా చింపు ముందు..." గట్టిగా అరిచాడు లింగరాజు.
    "నేను చింపను..."మొండిగా అంది సత్యవతి.
    "చింపకపోతే నీకు విడాకులిచ్చేస్తా...నిన్నొదిలేస్తా"జుట్టు పీక్కుంటూ అన్నాడు లింగరాజు.
    "అట్టాగైతే నేనెంచాక్కమీకంటే మంచోడిని చేస్కుంటా...తెల్సా?" కళ్ళు తిప్పుతూ అంది సత్యవతి.
    లింగరాజు ఓసారి బాధగా "ఈ..." అని అరిచి తల గోడకేసి కోట్టుకోవడం మొదలెట్టాడు.
    మీరట్టా తల గోడకేసి బాదేస్కుంటుంటే మీ ఫోటోకి దండెయ్యాల్సి వస్తుంది...ముందు ఆ తల బాదుకోడం ఆపండి..."అంటూ సత్యవతి భర్త తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆపింది."మీ చొక్కాని పీలికలు పీలికలుగా చింపేస్తాగాని అసలు మీ చొక్కాని ఎందుకు చింపమంటున్నారో కాస్త వివరంగా చెప్పరా?..."
    "ఎందుకా?...రికార్డ్!!రికార్డ్ సృష్టించడం కోసం!!...నువ్వలా నా చొక్కాని పరపరా చింపేశావనుకో!భర్త చొక్కాని ఏక బిగిన చింపిన భార్యగా రికార్డు సృష్టించి నువ్వు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కుతావు..."అన్నాడు లింగరాజు.
    "అమ్మో...అమ్మో...నిజ్జంగా నాకంత పేరొచ్చేస్తుందా?...అట్టాగైతే చొక్కాతోపాటు మీ ప్యాంటు, బనీసు,డ్రాయరు అన్నీ చింపేస్తే ఇంకెంత పేరొస్తుందో!!..." భర్త వంక చిలిపిగా చూస్తు చేతులు పంజాల్లా పెట్టి అడుగులు ముందుకు వేయసాగింది సత్యవతి.
    లింగరాజు భార్యవంక చికాకుగా చూశాడు.
    "ఇప్పుడు నువ్వు నా చొక్కా ప్యాంట్లని చింపినా నా తోలు వలిచేసినా లాభం లేదు.ప్రెస్సు వాళ్ళని పిలిచి వాళ్ళముందు చింపితే వాళ్ళు పేపర్లులో నీ గురించి గొప్పగా రాస్తారు...అప్పుడు ఆ కటింగ్స్ అన్నీ గిన్నిస్ బుక్ వాళ్ళకి పంపితే వాళ్ళు నీ పేరుని వాళ్ళ పుస్తకంలో ప్రింటుచేస్తారు..."
    "ఓ అలాగా?" అమాయకంగా మొహంపెట్టి అంది సత్యవతి.
    లింగరాజుకి సదన్గా ఇందాకటి విషయం గుర్తుకొచ్చి మళ్ళీ భోరున ఏడ్చాడు.
    "రికార్డు సృష్టించడం కోసం మీ చొక్కా ప్యాంట్లను చింపుతలెండి. మీ తోలేం వల్చెయ్యను... ఏడవకండీ..." బుజ్జగించింది సత్యవతి.
    "నేనేడుస్తుంది అందుకేం కాదు" అన్నాడు లింగరాజు కళ్ళు తుడుచుకుంటూ.
    "మరి?"
    "మా ఆఫీసులో ఒకడి పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది తెల్సా? ఊహూ...ఊహూ..." కుమిలిపోయాడు.
    "ఎందుకు ఎక్కింది?"
    "వాడేమో ఇరవైనాలుగ్గంటల పాటు ముక్కులో వేలుపెట్టి తిప్పుకున్నట్ట!! అందుకని వాడి పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది???"
    సత్యవతి గుండెల మీద చేతులు వేస్కుని కళ్ళు పెద్దవి చేస్తూ అంది."అమ్మో!... ఇరవై నాలుగ్గంటలు, ముక్కులో వేలు పెట్టి తిప్పితే ముక్కు మంటెక్కిపోతుంది... హెంత కష్టమో!!... అందుకనే గిన్నిస్ బుక్ లోకి అతని పేరు ఎక్కింది!!"
    "ఉహు...ఉహు...నోట్లో చొక్కా ఎత్తిపెట్టుకుంటూ దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నించసాగాడు లింగరాజు.
    "ఊర్కే వేరేవాళ్ళని చూసి అట్టా ఏడవకపోతే మీరుకూడా ఏ వెధవపనో చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కోచ్చుగా?" భర్తని మందలించింది సత్యవతి.
    "ఏం చెయ్యమంటావ్??" ఏడుపాపి అడిగాడు లింగరాజు.
    "మీ ఆఫీసతను ముక్కులో వేలుపెట్టి తిప్పడుగా...మీరు చెవిలో వేలుపెట్టి ముప్పయి ఆరుగంటలపాటు తిప్పండి..." సలహా ఇచ్చింది సత్యవతి.
    "ఆ పని గన్నియ్ బాబు అనేవాడు ఇదివరకే చేసి రికార్డు సృష్టించాడు" నీర్సంగా అన్నాడు లింగరాజు.
    "పోనీ కంట్లో వేలుపెట్టి తిప్పకూడదూ?"
    "ఏం...నేను లొట్టకన్నువాడిగా మారిపోవాలనా నీ ఉద్దేశం?..."కోపంగా అరుస్తూ అన్నాడు లింగరాజు.
    "మరేం చేస్తారబ్బా..."కళ్ళు పైకి పెట్టి ఆలోచించింది సత్యవతి.
    "ఆ!...మీరు ముందుకి బదులు వెనక్కి నడిచి రికార్డు సృష్టించండి..." రెండు క్షణాల తరువాత సంతోషంతో కేకేస్తూ చెప్పింది.
    "ఆ పని కూడా ఇదివరకు ఎవడో చేశాడు..."
    "పోనీ పే..ద్ద మీసాలు పెంచండి!"
    "మీసాలు పెంచేసిన వాడున్నాడు, గడ్డాలూ పెంచేసినవాడున్నాడు."
    "పోనీ చెవుల్లో ఒత్తుగా వెంట్రుకలు పెంచుతేనో??" సంబరంగా అడిగింది సత్యవతి.
    "అదికూడా ఓ ఏబ్రాసిగాడు చేసేశాడు."
    "పోనీ మీరు గోళ్ళు పొడువుగా పెంచండి."
    "లాభం లేదు... అదీ అయిపోయింది." నీర్సంగా జవాబు చెప్పాడు లింగరాజు.
    "అర్రే!...ఏంటబ్బా ఇదీ?... ఏం చెప్పినా అది అయిపోయిందని అంటున్నారు!!..." బాధగా అంది సత్యవతి.
    "మరేమనుకున్నావ్... గిన్నిస్ బుక్ లోకి ఎక్కడానికి రకరకాల పనులు చేస్తుంటారు... ఒక జంట వదలకుండా ఇరవై నాలుగ్గంటలపాటు ముద్దులు పెట్టుకుని గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు...తెల్సా?...' అన్నాడు లింగరాజు భార్య వంక చూసి కళ్ళెగరవేస్తూ.
    వెంటనే అతనికి ఒక బ్రిలియంట్ అయిడియా వచ్చింది. అతని మొహం విప్పారింది.
    సత్యవతి చెవిలో తన ఆలోచన గురించి చెప్పాడు."మనం అలా చేస్తేనో?" చిలిపిగా అడిగాడు.
    "ఛీ..పాడు..వద్దు బాబూ..."అంది రెండు చేతుల్తో మొహాన్ని కప్పుకుంటూ సత్యవతి.
    "మరేం చెయ్యలబ్బా!!..."ఆలోచించాడు లింగరాజు.
    వాళ్ళు గిన్నిస్ బుక్ ఎదురుగా పెట్టుకుని చూస్తే దాంట్లో అన్ని రకాల రికార్డులూ ఉన్నాయి. కొత్తగా ఎటెమ్ట్
చేయడానికి వాళ్ళకి ఏమీ కనిపించడంలేదు.
    ఆఖరికి జుట్టు పీక్కున్నవాడిదీ, గడ్డి తిన్నవాడిదీ,రెండ్రోజులు నేలమీద పాకుకుంటూ వెళ్ళిన వాడిదీ, నాల్రోజులు కంటిన్యూయాస్ గా ఏడ్చినవాడిదీ...ఇలా అన్ని రకాల రికార్డులూ ఉన్నాయ్...
    లింగరాజుకి కాస్సేపు ఏమీ పాలు పోలేదు గానీ హఠాత్తుగా అతనికి ఒక బ్రిలియంట్ అయిడియా వచ్చింది.
    "నేనిప్పుడే వస్తా..." అని భార్యకి చెప్పి జనరల్ స్టోర్స్ కి పరుగుతీశాడు.
    "బాబూ ...ఓ పది ఆముదం సీసాలు ఇస్తావా?..."లింగరాజు షాపువాడిని అడిగాడు.
    షాపువాడు లింగరాజుకి పది ఆముదం సీసాలు ఇచ్చాడు. లింగరాజు వాడికి డబ్బులు పేచేశాడు.
    "సార్!... పది ఆముదం సీసాలు ఎందుకు సార్?" షాపువాడు అడిగాడు.
    "రికార్డు సృష్టించడానికి!!" గర్వంగా అన్నాడు లింగరాజు.
    ఆ రోజు ఎట్లాగూ కొళాయిలో నీళ్ళు వదిలే రోజే కాబట్టి ఫరవాలేదు!!
                              *  *  *
    (ఏవైనా గేమ్స్ లోగానీ, స్పోర్ట్స్ లోగాని ఇతర లలితకళల్లోగాని రికార్డు సృష్టిస్తే దాన్ని గిన్నిస్ బుక్ లో వేస్తే అందం చందంగానీ...కుంటినవాడిదీ,దగ్గిన వాడిదీ,గోళ్ళూడగొట్టుకున్నవాడిదీ రికార్డు కింద వేస్తే అలాంటి పిచ్చి పిచ్చి రికార్డులు సృష్టించడానికి చాలా మంది పిచ్చివాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలే వేస్తారు - రచయిత)

 Previous Page Next Page