టెలిఫోన్ గోల
భోంచేసి సోఫాలో కూర్చుని తీరుబడిగా వక్క నముల్తున్న అంబాజీరావుకి ఏమీ తోచినట్టు అనిపించలేదు. ఆరోజు శలవురోజు. దానికి తోడు ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళావిడ పిల్లల్ని తీస్కుని గుడికి వెళ్లింది. అందుకే అతనికి ఏమీ తోచిచావడంలేదు.
ఏం చేద్దామబ్బా?!... అని ఆలోచించాడు కాస్సేపు.
ఏదైనా నవల చదివితే?!
రాక్స్ లోని నవలలు చూస్తూ ఉంటే వాటిల్లో క్షుద్రరచయిత పిశాచిరావు రాసిన 'భూతప్రేమ' నవల కనిపించింది.
ఆ నవల తను చదవలేదు.
చదువుదామని దాన్ని తీసి మంచం మీద బోర్లా పడుకున్నాడు. అతని కళ్లు అక్షరాల వెంబడి పరుగుతీయసాగాయ్.
నాలుగు పేజీలు చదివాడో లేదో భళ్లున వాంతి చేసుకున్నాడు.
"పాడు నవల!...తిన్నదంతా బయటికి వచ్చేసింది... మళ్ళి తినాలో ఏంటో...పాడు!!... దీనికంటే దీని ఒరిజినల్ ఇంగ్లీషులోనే చదివితే బాగుండేది!!..."
పిశాచిరావుని తిట్టుకుంటూ లేచి మళ్ళి భోజనం చేసి వక్కపలుకు వేస్కున్నాడు.
ఆ తరువాత భయపడ్తూ భయపడ్తూ మరో నవల రాక్ లోంచి తీసాడు అంబాజీరావు. ఈసారి మంచంమీద వెల్లకిలా పడుకుని చదవడం మొదలుపెట్టాడు.
మొదటి చాప్టర్...
జాకెట్ ఫర్ మని చిరిగిపోయింది...లంగా ఫటక్...ఫటక్...
.........
మొదటే రేపుసీనుతో ప్రారంభం అయింది ఆ నవల-
"ఓ... ...క్"మళ్ళీ వాంతి చేసుకున్నాడు.
"ఛీ ఛీ ... ఇలా ఎన్నిసార్లు తినాలో ఏంటో! గదంతా పాడయింది..." విసుక్కుంటూ లేచి చెంబుతో నీళ్ళు, చీపురూ తెచ్చి గడిడ్ క్లీన్ చేసి మరోసారి భోంచేసి హాల్లోకి వచ్చాడు.
అతని చూపు ర్యాక్ లో వున్న నవలల వంక పడింది.
భయంగా వాటివంక చూస్తూ చెంపలు వేసుకున్నాడు.
ఏం చేయాలి అన్న విషయం మీద అంబాజీరావు మళ్ళి ఆలోచించడం మొదలు పెట్టాడు.
హఠాత్తుగా అతనికి తన స్నేహితుడు వెంకట్రావు గుర్తుకువచ్చాడు.
"వాడిని కల్సి చాలా రోజులైంది... ఓసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటేనో..." అనుకున్నాడు.
అనుకున్నదే తడువుగా డైరిలోంచి వెంకట్రావు టెలిఫోన్ నెంబర్ తీసి డయల్ చేశాడు.
అవతలి నెంబర్ రింగయి రెండు క్షణాల తరువాత ఫోన్ ఎత్తారు.
"హలో...కౌన్ బోల్ రహాహై?" అంది అవతలి కంఠస్వరం.
"ఓర్నీ...హిందీ బాగానే నేర్చుకున్నావే!!" ఆశ్చర్యంగా అన్నాడు అంబాజీరావు.
"క్యా బాత్ హై?...ఆ?" సీరియస్ గా అడిగింది అవతలి కంఠం.
"చాల్లే బోడి స్టయిలూ నువ్వూ... ఇంకా హిందీలో మాట్లాడ్డం మాని తెలుగులో మాట్లాడు... సన్నాసి వెధవా..." హాస్యాలాడ్తూ అన్నాడు అంబాజీరావు.
"కౌన్ రే బద్మాష్?... క్యా బోల్తాహై...ఆయ్..."
అంబాజీరావు ఖంగు తిన్నాడు...'కొంపదీసి ఆ మాట్లాడుతుంది వెంకట్రావు కాదా?'
"హలో... వెంకట్రావుగారు లేరాండీ...జీ...వెంకట్రావు నైనైజీ?" అవస్థపడ్తూ హిందీలో అడిగాడు.
"ఇదర్ వెంకట్రావ్, గింకట్రావ్ కోయి నహీహై...రాంగ్ నెంబర్...మై చమన్ లాల్ హూ..." అంటూ పెట్టేసాడు అవతలి వ్యక్తి.
అంబాజీరావు మరోసారి డయల్ చేసాడు.
అవతల ఫోన్ రింగయింది...కొన్ని క్షణాల్లో ఫోన్ ఎత్తారు.
"హలో..."అంది అవతలి కంఠం.
"హలో ...వెంకట్రావేనా?" అడిగాడు అంబాజీరావు.
"హర్రే బద్మాష్...ఫిర్ సే ఫోన్ కియా ...ఫోన్ రక్ దో సాలే... కామ్ కుచ్ నహీహై క్యా... హమేషా రాంగ్ నెంబర్స్ ఫిరాతే ..." అట్నుంచి అరుస్తున్నాడు చమన్ లాల్.
అంబాజీరావు కంగారుగా ఫోన్ పెట్టేసాడు.
అతనికి అనుమానం వచ్చి డైరీలోని నెంబర్ వంక మరోసారి చూసాడు. అది వెంకట్రావు నెంబరే.
అంటే తను సరియైన నెంబర్ కకే చేస్తున్నాడు గానీ అది రాంగ్ నెంబర్ కి వెళ్తున్నదన్నమాట.
వెంటనే చేస్తే మళ్ళీ చమన్ లాల్ నెంబర్ తగుల్తుందేమోనని భయపడి కాస్సేపాగి మళ్ళీ డయల్ చేసాడు.
అవతలివైపు ఫోన్ మోగలేదుగానీ వేరే లైనేదో కల్సింది. ఎవరో ఇద్దరు మగవాళ్లు మాట్లాడుకుంటున్నారు. అంబాజీరావు ఆ సంభాషణని వినసాగాడు.
"...చెప్పు...మాల్ అందిందా?" ఒక వ్యక్తి గొంతు?
"ఆ... అందింది..."రెండో వ్యక్తి గొంతు బొంగురుగా పలికింది.
"సరుకంతా సరిపోయిందా?"
అంతా సరిపోయింది...పోలీసులు అనుమానం వచ్చి మన వ్యాన్ ని వెంబడించారట. కానీ మన వ్యాన్ డ్రైవర్ తెలివిగా వాళ్ల కళ్ళుకప్పి వచ్చాడు..."
"వెరీగుడ్...ఆ యూసఫ్ గాడు పిచ్చి వేషాలేమైనా వేస్తున్నాడా?"
"ఇప్పటిదాకా మామూలుగానే ఉన్నాడుగానీ...వాడిని నమ్మలేం...శత్రు ముఠాలో చేరినా చచేరిపోవచ్చు..."
"అలాగయితే ఈ రాత్రికే వాడిని చంపెయ్యి" కర్కశంగా పలికింది ఆ కంఠస్వరం.
అంబాజీరావు కెవ్వుమని అరిచాడు.
"అన్ని హత్యలు చేసినవాడిని యూసఫ్ గాడిని చంపమంటే అలా అరిచావేం?!" ఆశ్చర్యంగా అడిగింది ఆ కంఠస్వరం.
"ఇప్పుడు కెవ్వుమని అరిచింది నేను కాదు" జవాబు చెప్పింది రెండో కంఠం.
"అలాగయితే ఎవరు అరిచారు?"
"ఎవరో మన మాటలు వింటున్నారు..."
"చాలా ప్రమాదమే.. ఆ వింటున్నవాడి నెంబర్ ట్రాప్ చేసి వాడిని కూడా చంపెయ్యగలవా?..."
అంబాజీరావుకి కంగారు పుట్టింది.
మనసులోనే కెవ్వుమని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసాడు.
అతని గుండెలు దడదడలాడాయి.
"కొంపదీసి వాడెవడో ఇంటికి వచ్చి నన్ను చంపెయ్యడు కదా?..." అనుకున్నాడు.
"ఆ...అయినా నా ఫోన్ నెంబర్ వాళ్లెలా ట్రేస్ చేస్తార్లే..."
మళ్ళీ తనకి తను ధైర్యం చెప్పుకున్నాడు.
ఒక అయిదు నిముషాలాగి గుండె దడ తగ్గాక మళ్ళీ ఫోన్ చేసాడు వెంకట్రావు కోసం.
ఈసారి ఇంకెవరో మాట్లాడ్తుంటే ఆ లైను కలిసింది. ఇంకేం కొంపలు మునిగే మాటలు వినాల్సి వస్తుందో అని పెట్టెయ్యబోయాడు గానీ ఆడగొంతు వినబడ్డంతో ధైర్యంతోనూ, కుతూహలంతోనూ వాళ్ల మాటలు వినసాగాడు.
"ఊ...నూనె కాగిందా?..." అడిగింది ఆడ గొంతు..
"కాగిందనే అనుకుంటున్నా..." అంది మగగొంతు.
"నా ఖర్మకొద్దీ దొరికారు... నేనేమో ఆఫీస్ లో పనిచెయ్యడం_మీరేమో ఇంట్లో వంట చెయ్యడం!!... నూనె నుండి పొగలు వస్తున్నాయా?" విసుగ్గా అడిగింది ఆడగొంతు.
"ఆ ...వస్తున్నాయ్..." జవాబు చెప్పింది మగ గొంతు.
"అయితే నూనె కాగినట్టే...దాంట్లో ఆవాలు తగలెయ్యండి!..."
"అలాగే..."
అంబాజీరావునెత్తి కొట్టుకుని ఫోన్ డిస్ కనెక్టుచేసి మళ్ళీ రింగ్ చేసాడు.
మళ్ళీ ఆ వంటల కార్యక్రమమే కల్సింది.
"అమ్మా తల్లీ...కాస్త ఫోన్ డిస్కనెక్టు చేస్తావా తల్లీ... నువ్వు ఫోన్ పెడ్తే తప్ప నా నెంబరు కలిసేలా లేదు.
"నువ్వెవడివయ్యా మధ్యలో కలిశావ్...ఫోన్ పెట్టేయ్ ముందు..."
"నువ్వే పెట్టేయ్యమ్మా తల్లీ... నేను ఫోన్ చేస్కోవాలి!!"
"వీల్లేదు... పులుసు అయ్యేదాకా ఫోన్ పెట్టేదిలేదు" ఖచ్చితంగా చెప్పింది ఆవిడ.
"పులుసు ఎప్పుడు అవుతుంది?"
"ఇంకో పావుగంట పడ్తుంది."
విసుగ్గా ఫోన్ పెట్టేసాడు అంబాజీరావు. ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ నెంబరు తిప్పాడు. "హలో..."అంది అవతలి కంఠం.
"ఒరియ్ వెంకట్రావేనా?" అడిగాడు అంబాజీరావు.
"ఆ...వెంకట్రావునే...ఎవరు...ఏంటి సంగతులు?"
"అంబాజీరావుని మాట్లాడుతున్నా...నీతో మాట్లాడి చాలాకాలం అయిందని ఫోన్ చేసా..."
"అంబాజీరావు?... అసలు మీకు ఏ వెంకట్రావు కావాలి!
"లంకచుట్ట వెంకట్రావ్!" చెప్పాడు అంబాజీరావు.
"సారీ...రాంగ్ నెంబర్... నేను డొంకరాయ్ వెంకట్రావుని!!..." ఫోన్ పెట్టేసాడు అతను.
అంబాజీరావు తల పట్టుకున్నాడు. అప్పుడే గుడికి వెళ్లిన పెళ్లాం పిల్లలు ఇంటికి వచ్చారు.
"నేనిప్పుడే వస్తా..." కాళ్లలో చెప్పులు దూరుస్తూ అన్నాడు అంబాజీరావు.
"ఎక్కడికీ?" అడిగింది అతని భార్య.
"వెంకట్రావుతో మాట్లాడాలి"
"అదేమిటి?.... ఫోన్ చేసి మాట్లడోచ్చుగా!" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
ఆమె మాటలు వినిపించుకోలేదు అంబాజీరావు. అప్పటికే అతను రోడ్డుమీదకి వచ్చేసాడు.
* * *