మూడో కొడుకు శంకర్, చిన్నప్పుడు తెలివిగా శ్రద్ధగా చదివినా, పెద్దవుతున్నకొద్దీ చదువులోకంటే ఆటలలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ చదువు అశ్రద్ధచేయసాగాడు. జగన్నాధంగారు తన ఆశయానికది విరుద్దమయినా అలా చూస్తూ వూరుకోలేక కొడుకుని మందలించడం, కట్టడిచేయడం ప్రారంభించారు. చదువు మొదట్లో శంకర్ తండ్రికి కాస్త భయపడి ఏదో చదువుతూ బొటా బొటి మార్కులతో ప్యాసవుతూ వచ్చాడు. తరవాత తండ్రి కోపం, కేకలు అలవాటయి, వాటినిలెక్కపెట్టడం మానేశాడు. ఎప్పుడూ స్నేహితుల్ని పోగువేసుకుని క్రికెట్ మాచ్ లు ఆడుతూండేవాడు. జగన్నాథంగారు కొడుకు వరస చూపి నీళ్ళు కారిపోయారు. మూడవ వాడు ఏ చదువూ లేకుండా పాడయి పోతున్నా డన్న చింత ఆయన్ని పట్టుకుంది.
"ఆఖరివా డవడంతో మరికాస్త ముద్దుచేసి పాడుచేశా"రంది. పార్వతమ్మ. "పిల్లల అభిరుచుల్ని ప్రోత్సహించాలని, కొడుకు చిన్న తనంలోనే అంత బాగా ఆడుతున్నాడని పొంగిపోయి వాడికి బాటులు. బంతులు కొనిచ్చి మీరే పాడుచేశా"రని దెప్పింది.
ఏమయితేనేం శంకర్ ఇంటర్ వరకు ఎలాగో చదివాడు. ఆ తరవాత హఠాత్తుగా నే నింక చదవనని చదువు మానేశాడు. తండ్రి దిక్కుతోచక బెంగపడ్డాడు. పార్వతమ్మ నెత్తి, నోరు కొట్టుకుని ఏడ్చింది. కొడుక్కి చెప్పి చెప్పి విసిగెత్తింది. ఏం చెయ్యలేక వాడి ఖర్మం అని ఏడ్చి వూరుకున్నారు జగన్నాధంగారు. తనే చనువు ఇచ్చి పాడుచేశానేమో అన్న భావం ఆయన్ని దహించేది.
ఓ సంవత్సరం అంతా వూరికే యిష్టం వచ్చినట్టు తిరిగాడు శంకర్. క్రికెట్ ఆడి ఆడి ఆ ఆటమీదకూడా విసుగుపుట్టి అదీ మానేశాడు. హఠాత్తుగా ఓరోజు ఏం బుద్ధి పుట్టిందో ఎయిర్ ఫోర్సులో చేరుతా నన్నాడు. జగన్నాధంగారు నిర్లిప్తంగా విని వూరుకున్నారు. కొడుకు చేష్టలతో మనస్సు విరిగిన ఆయన తనకు సంబంధించని విషయం అన్నట్టు పట్టించుకోలేదు. పార్వతమ్మ తల్లి ప్రాణంమాత్రం అలా వూరుకోలేకపోయింది. 'ఆ ఉద్యోగాలు ప్రమాదకరమైనవి వ'ద్దని, బుద్ధిగా ఇంకేదన్నా చదువుకోమని ఎంతగానో బ్రతిమాలింది.
బుర్రకి పుట్టిన బుద్దిని మార్చుకోలేని శంకర్ తల్లిదండ్రుల మాట కాదని ఎయిర్ ఫోర్సుకి అప్లికేషను పెట్టాడు. టెస్టులన్నిటిలో నెగ్గి, ట్రైనింగ్ అయి ఉద్యోగస్థు డయాడు. ప్రస్తుతం ఢిల్లీలో వున్నాడు. వింగ్ కమాండర్ గా! కొడుకు ఏదో విధంగా పైకి వచ్చి నందుకు తండ్రి సంతోషించాడు. పార్వతమ్మ మాత్రం ఏ విమాన ప్రమాదం గురించి విన్నా భయపడుతోంది.
కొడుకుల విషయంలోనే కాక జగన్నాథంగారి ఆలోచనలు, ఆశయాలు కూతుళ్ళ విషయంలోకూడా తలక్రిందులు, తారుమారు అవుతూ వచ్చాయి.
పెద్దకూతురు శకుంతల చదువు ఆయన అనుకున్నట్టు డిగ్రీ కోర్సుదాకా రాకముందే ఇంటర్ పరీక్షలుకూడా అవకముందే ఆపేయవలసి వచ్చింది. అప్పటి పరిస్థితులనిబట్టి.
ఈ కాలంలో బియ్యేలు ఎమ్ యేలు ఆడపిల్లలకి కూడా కనీస చదువులు అయిపోయాయి. కాని పాతిక ముఫ్ఫై ఏళ్ళ క్రితం ఆడపిల్ల చదువంటే కాస్త కష్టమైన సంగతే! ఆడపిల్లకి చదువంటే ఏదో చాకలి పద్దులు రాసుకోడానికో, వ్రత కథలు చదువుకోడానికో సరిపోతే చాలన్నట్టు ఏ ఫస్టు ఫారం దాకానో, థర్డు ఫారం వరకో చదివించేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లని మెట్రిక్ వరకు చదివిస్తే గొప్పే! అలాంటిది డిగ్రీకోర్సులు చదివే ఆడపిల్లలుంటే అదో ఆశ్చర్యమే! కాలేజీ చదువులు చదివే ఆడపిల్లలు నూటికి ఒకరుంటే గొప్ప సంగతే! ఎవరైనా కాస్త అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాలేజీ చదువులు చదివిస్తే అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఊళ్ళో వాళ్ళ గుసగుసలు, నిందలు ఎదుర్కోవలసిరావడమే కాక. ఆపిల్ల పెళ్ళి కూడా ఒక సమస్యగా తయారయేది.
ఆ రోజుల్లో ఆడపిల్లలకి ప్రత్యేకం స్కూళ్ళు, కాలేజీలు లేవు. కాలేజి మొత్తం మీద నలుగురో అయిదుగురో ఆడపిల్ల లుండే వారు మహా అయితే.
జగన్నాధంగారు పార్వతమ్మ మాట కాదని ఆమె గొణుగుడు లెక్కచేయకుండా శకుంతల స్కూల్ ఫైనలు ప్యాసు కాగానే కాలేజీలో చేర్పించారు. కాలేజీలో మొత్తం ఐదుగురు ఆడపిల్లల్లో నలుగురు క్రిష్టియన్ అమ్మాయిలు. అందంలో శకుంతలే అందగత్తె అవడంవల్ల మొగపిల్ల లందరి దృష్టీ శకుంతల మీదే వుండేది. శకుంతలనే ఎక్కువ ఏడిపించేవారు అందరూ.
క్లాసంతటికీ తను ఒక్కర్తే ఆడపిల్ల అవడంతో ఎంతో బెరుగ్గా వుండేది శకుంతలకి. మగపిల్లలు పేరు పెట్టి ఏడిపిస్తున్నా. క్లాసులో పిల్లికూతలు, అరుపులు సాగించినా బోర్డు మీద పేరు, బొమ్మ గీసి ఏడిపించినా చదువుమీద ఉత్సాహం కొద్దీ అలాంటివన్నీ లక్ష్యపెట్టేది కాదు.
"అలాంటివన్నీ నువ్వు పట్టించుకోకమ్మా, వెర్రివెధవలు ఏదో కూసుకుంటారు, నువ్వు లక్ష్యపెట్టకు!" అని శకుంతల యింటికి వచ్చి తండ్రితో చెప్పితే ఆయన నిర్లక్ష్యంగా ఆ మాటలను త్రోసి పారవేసి, కూతురికి ప్రోత్సాహం యిచ్చేవారు.
పార్వతమ్మ మాత్రం మధ్యమధ్య సణుగుతూ వుండేది.
"ఇవాళ ఎవడో వెనకనుంచి శకుంతల జడ పట్టుకు అల్లరి చేశాడని సూరమ్మగారి మనవడు ఆవిడతో చెప్పాడుట. ఆవిడ నా దగ్గిరకి వచ్చి గంటల కొద్దీ వల్లించింది. 'ఆడపిల్లకి కాలేజీ చదువేమిటమ్మా, ఆయనకీ తెలియక పోతే మీరేనా చెప్పొద్దా. మగపిల్లలు యిలా యాగీ చేస్తూంటే రేపు పొద్దున అమ్మాయికి పెళ్లెలా అవుతుంది?...పదహారేళ్ళు వచ్చి, సమర్తాడిన పిల్లకి పెళ్ళి లేకుండా యింకా యీ సతుకు లెందుకమ్మా! సతికిన చదువుచాలు, వెంటనే పెళ్ళిచేసేయండి. బాబుగారితో గట్టిగా చెప్పి' అని ఓ గంటసేపు నీతులు బోధించింది సూరమ్మగారు. నా తల కొట్టేసినట్లయింది"అంది పార్వతమ్మ ఓ రోజు.