అయితే, ఇండియాలో కూడా ఒక ప్రాచీనకాలపు రాకుమారి తాలూకు మమ్మీ ఉందని వదంతి ఒకటి ప్రచారంలో ఉంది. ఈజిప్టు రాజవంశీయులలాగే ఆ మమ్మీని పోతపోసిన నిలువెత్తు బంగారు విగ్రహంలో ఉంచి సమాధి చేశారని చెప్పుకుంటారు. దీనికితోడు మరొక కథ కూడా వాడుకలో ఉంది."
కాసేపు తదేకంగా సందీప్ మొహంలోకి చూశాడు భూతాలరాజు. తర్వాత ఖాండ్రించి ఉమ్మేసి, ఎవరో వస్తున్నారన్నట్లు సైగ చేశాడు. బూట్ల చప్పుడు వినబడింది. సెంట్రీ వచ్చి, ఒకసారి సెల్ లోకి పరీక్షగా చూసి, వెళ్ళిపోయాడు.
"పొగాకు లేకపోతే మానె, సిగరెట్టూ పీకె అన్నా ఉందా?" అన్నాడు భూతాలరాజు.
"ఉండాలి. కానీ లాగేసుకున్నారు" అని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు సందీప్.
"హేలే తోకచుక్క ప్రతి డెబ్భయ్ అయిదు సంవత్సరాలకీ ఒకసారి దర్శనమిస్తుంది.
ఆ తోకచుక్క కనబడినప్పుడల్లా ఈ రాకుమారి మమ్మీ ప్రాణంతో లేచి తిరుగుతూ, కోరిన కోరికలు తీరుస్తుందనీ, తోకచుక్క మాయమైపోగానే నిశ్చలంగా అయిపోయి మళ్ళీ డెబ్భయ్ అయిదేళ్ళ వరకూ అలానే ఉండిపోతుందనీ, ఈలోగా ఆ మమ్మీని సమీపించిన వారుగానీ, ఆమె ప్రశాంతతకు భంగం కలిగించిన వారు ఘోరమైన చావు చస్తారని చెప్పుకుంటూ ఉంటారు ఆ అడవులలోని జనం.
చిత్రమేమిటంటే, సరిగ్గా ఇలాంటి నమ్మకమే ఈజిప్టు దేశంలో కూడా ఉండేది. ప్రాచీన కాలపు ఈజిప్షియన్ రాజులను 'ఫేరో' అనేవాళ్ళు. ఆ ఫేరోల సమాధులని తెరిచినవారూ, కొల్లగొట్టిన వారూ దారుణంగా మరణించి తీరతారనీ, అది ఫేరో శాపమనీ చెప్పుకుంటారు జనం. దానికి తగినట్లుగానే, టూట్ ఆంఖ్ అమున్ సమాధిని మొదటిసారిగా తెరిచిచూసిన లార్డ్ కార్నర్ వాన్ అనే ఆయన, ఆ తర్వాత కొద్దికాలానికే మరణించాడు. ఇది 'కర్స్ ఆఫ్ ద ఫేరో' - ఫేరో శాపం నిజంకావడం వల్ల - అని నమ్మే జనం ఉన్నారు. కాదు, ఇది కేవలం కాకతాళీయం అని వాదించేవారూ ఉన్నారు.
అలాంటి శాపమే ఈ రాకుమారి మమ్మీకి ఆపాదించబడటం చాలా ఆసక్తికరం.
మా నాన్నగారు ప్రొఫెసర్ శేషాద్రి ఆర్కియాలజిస్టు, హేతువాది. ఆయన ఈ శాపాలో, గీపాలూ ఇవన్నీ నమ్మకపోయినా, అసలు ఈ రాకుమారి మమ్మీ అనేది నిజంగా ఉందో లేదో, ఉంటే ఈజిప్షియన్ ఆచార వ్యవహారాలూ, నమ్మకాలూ మనదేశంలోకి ఎలా వచ్చాయో, పరిశోధించాలని తన యూనిట్ తో సహా బయలుదేరారు.
ప్రాచీనకాలపు ఈజిప్షియనులు ఇండియా నుంచ్ వలసవెళ్ళిన ద్రావిడులని ఒక వాదం బయలుదేరింది ఈ మధ్య. దీనికి దృష్టాంతరాలుగా రెండు విషయాలని చూపిస్తున్నారు. ఒకటి : చాలామంది ద్రావిడులలాగే ఈజిప్షియన్లు కూడా 'అడ్డపంచ' లాంటి దుస్తులే ఎక్కువగా ధరించేవారు. రెండు " ద్రావిడులకి ఏఏ పళ్ళ జబ్బులు ఎక్కువగా వస్తాయో, అలాంటి పళ్ళ జబ్బులే ఈజిప్షియన్ మమ్మీలలో కూడా కనబడ్డాయంటారు.
ఈ రెండు లక్షణాలే కాక, మరో విశేషం కూడా ఉంది. ద్రావిడుల పేర్లలాగే కొన్ని ఈజిప్షియన్ పేర్లు కూడా 'న్' తో అంతమవడం. కరుణాకరన్, రవీంద్రన్ లాగా అవినాటిన్, ఆన్ ఖ్ అమూన్ వంటి పేర్లు.
అడవిలో దారి చూపించడానికి ఒక గైడ్ ని నియమించుకుని తన యూనిట్ తో సహా బయలుదేరి వెళ్ళారు మా నాన్నగారు.
ఒక కీకారణ్యం మధ్యలో ఉన్నాయిట రాకుమారి మమ్మీ, బంగారు విగ్రహం. అష్టకష్టాలు పడి మమ్మీ చేరుకుంది ఆ బృందం. దాదాపు మూడొందల కిలోల బరువున్న ఆ మేలిమి బంగారపు విగ్రహాన్ని చూసేసరికి యూనిట్ లోని మిగతా సభ్యుల కళ్ళు చెదిరాయి. మమ్మీని అక్కడ వదిలేసి, విగ్రహాన్ని కరిగించి అందరం గుట్టుచప్పుడు కాకుండా పంచుకుందామని మా నాన్నగారికి చెప్పారు.
ఆ కుట్రకి మా నాన్నగారు ఒప్పుకోలేదు. అతనిని తొలగించుకోవడానికి వాళ్ళు మా నాన్నగారిని కిరాతకంగా చంపేశారు. నిగ్రహాన్ని పెకిలించబోతుండగా భయంకరమైన తుఫాను వచ్చింది. పిడుగులు పడ్డాయి. దగ్గరలోనే ఉన్న ఒక అగ్నిపర్వతం బ్రద్దలయింది. ఆ విశ్వాస ఘాతకులందరూ సలసల మరిగే లావాలో చిక్కుకొని మిడతల్లాగా మాడిపోయారు.