Previous Page Next Page 
హైజాక్ పేజి 6

"శాలిని నా ఒక్కడికోసమే ప్రైవేటుగా డాన్స్ చేస్తుంది. అదిచాలు ఈ వెధవ జీవితానికి. నేను రెడీ బాస్!" అన్నాడు విక్టర్.
"నాకు డబ్బు దొరికితే చాలు. ఇంకేమక్కరలేదు? ఎంత రావచ్చు గురువా?" అన్నాడు ఇక్బాల్ ఆశగా.
"మన ఓపిక. ఎంత అడిగితే అంత వస్తుంది" అన్నాడు శతృఘ్న. "పది కోరలు అడుగుదాం! చిత్తు కాయితాల చెత్త ఇండియన్ కరెన్సీలో కాదు, అమెరికన్ డాలర్లలో!"
"షాట్ గన్!" అన్నాడు విక్టర్, ఆశ్చర్యం, అభిమానం కలిపిన గొంతుతో. అతనికి అప్పుడప్పుడే మత్తు దిగిపోతోంది. తాగిన మైకంలో తను మాట్లాడిన మాటలు అత్యంత ప్రమాదభరితమైన ప్రణాళికగా రూపుదిద్దుకుంటున్నాయని అప్పుడే మెల్లమెల్లగా అర్థం అవుతోంది అతనికి.
'షాట్ గన్' అనేది శతృఘ్నకి కాలేజీ రోజులనుంచీ ఉన్న నిక్ నేమ్. వాళ్ళు ముగ్గురూ క్లాస్ మేట్స్.
"షాట్ గన్, నీ తెలివినీ, నీ తెగువనీ చూసి నేను ఆశ్చర్యపడిపోవడం ఇది మొదటిసారి కాదు షాట్ గన్! యూ ఆర్ ఏ జీనియస్! రియల్లీ!"
కసిగా నవ్వాడు శతృఘ్న. "తెలివి! తెలివితేటలు ఎవడిక్కావాలిరా ఈ వెధవ ఇండియాలో? రెండును రెండుతో రెండు వందలసార్లు హెచ్చిస్తే ఎంత వస్తుందో తడుముకోకుండా చెప్పే హ్యూమన్ కంప్యూటర్ లాంటి వాడూ, ఏ సంవత్సరమైనా సరే నెలా, తేదీ చెబితే దానికి సరి అయిన తెలుగు సంవత్సరం, నెలా, వారం, తిథి, నక్షత్రం ఏమవుతాయో తక్షణం చెప్పగలిగే మేధావీ - గణితబ్రహ్మ, అంకవిద్యాసాగర్, విశ్వసాంఖ్యాచార్య లాంటి బిరుదులూ, పతకాలూ సంపాదించిన లక్కోజి సంజీవరాయ శర్మ పొద్దుటూరులో పొద్దు పొడిచిన దగ్గరనుంచీ పొద్దువాలేదాకా తిండికోసం వెతుక్కుంటూ మలమలమాడుతూ ఉంటాడురా. ఇంకో దేశంలో అయితే ఆయనకి బ్రహ్మరథం పట్టి, ఏ లోటు లేకుండా చూసేవాళ్ళు. అలాంటి తెలివైన వాళ్ళెందరో అడుగడుక్కీ ఉన్నారురా ఇక్కడ! సొసైటీలో అట్టడుగుకి చేరిపోయి అడుక్కుతింటున్నారురా! ఈ దేశంలో తెలివితేటలు ఎవడికీ అఖ్ఖర్లేదురా! నక్కజిత్తులు కావాలిరా! కుక్క బుద్ధులు కావాలిరా!"
అతను ఉద్వేగంగా మాట్లాడుతుంటే మౌనంగా అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయారు ఇక్బాల్, విక్టర్.
సిగరెట్ అంటించి పొగ వదిలాడు శతృఘ్న. మెల్లిగా పైకి లేస్తున్న ఆ పొగ మేఘంలా కనబడింది. ఆ మేఘాలలో ఎయిర్ బస్ విమానాన్ని ఊహించుకుంటూ పకడ్బందీగా ప్లాన్ చెయ్యడం మొదలెట్టాడు అతను.
మరో గంట గడిచాక పజిల్ లోని చివరి ఆధారానికి జవాబు తట్టినట్లు అతని ప్లాను తాలూకు చివరి చిక్కు ప్రశ్నకి సమాధానం తట్టింది.
వెంటనే లేచి, మొహానికి సబ్బు పట్టించి సంవత్సరాల నుంచీ తనకి ట్రేడ్ మార్కులా ఉన్న గుబురు గెడ్డాన్ని షేవ్ చెయ్యడం మొదలెట్టాడు అతను.
తర్వాత ముగ్గురూ కలిసి ఒక ఖరీదయిన బట్టల దుకాణానికి వెళ్ళారు. స్టయిలిష్ గా ఉన్న బట్టలు తలొక జతా కొన్నారు. మంచి సూట్ కేసులు రెండు కొన్నారు.
రూముకి తిరిగివచ్చి కొత్తబట్టలు వేసుకుని, ఇండియన్ ఎయిర్ లైన్స్ బుకింగ్ ఆఫీసుకి వెళ్ళారు.
అప్పటికి సరిగ్గా పధ్నాలుగు రోజుల తర్వాత, ఢిల్లీ వెళ్ళే ఫ్లయిట్ లో టిక్కెట్లు కావాలని అడిగారు. అదే ఫ్లయిట్ లో హీరోయిన్ శాలిని ఢిల్లీ వెళుతోంది.
రిజర్వేషన్ క్లర్క్ కంప్యూటర్ ని కన్సల్ట్ చేశాడు. టైపు రైటర్ కి పైన టెలివిజన్ అమర్చినట్లు ఉంది ఆ కంప్యూటరు. అతను టకటక మీటరు నొక్కుతుంటే ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శతృఘ్న.
స్ర్కీను మీద అక్షరాలు కనపడ్డాయి. ఫ్లయిట్ లో ఖాళీలు ఉన్నాయని చెప్పింది కంప్యూటరు.
'సో ఫార్ సో గుడ్!' అనుకున్నాడు శతృఘ్న, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ.
మూడు 'ఓకే' టిక్కెట్స్ ఇచ్చాడు క్లర్కు.
బయటికి వస్తుంటే చెప్పలేనంత ఎగ్జయిట్ మెంట్ కలిగింది ముగ్గురికీ.
ఆరోజు సాయంత్రం తనొక్కడే బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్ళాడు శతృఘ్న. ఆ పరిసరాలతో పరిచయం పెంచుకోవడం అతని ప్లానులో ఒక భాగం.
ఎయిర్ పోర్టు లాంజ్ లోకి వెళ్ళాలంటే టిక్కెట్టు కొనాలి. అలా కాకపోతే, విమానాశ్రయానికి ఒకవైపున పెద్ద టెర్రేస్ లాగా ఉంది. దాని మీదికి మెట్లున్నాయి. ఇష్టమయిన వాళ్ళు టెర్రేస్ మీదికి వెళ్ళి, విమానాల రాకపోకలను చూడవచ్చు.
రాత్రి సరిగ్గా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి, బ్రహ్మాండమయిన తిమింగలంలా ఉన్న ఢిల్లీ ఎయిర్ బస్ విమానం రన్ వే మీద వేగం పుంజుకుంటూ పరిగెత్తి, గాలిలోకి లేస్తుంటే, అతని చేతిమీద దట్టంగా ఉన్న వెంట్రుకలు ఎగ్జయిట్ మెంట్ తో లేచి నిలబడ్డాయి.
ఇవాళ్టికి సరిగ్గా పద్నాలుగు రోజుల తర్వాత, ఈ విమానం హైజాక్ చెయ్యబడుతోంది.
ఈ సంగతి ఈ ప్రపంచంలో కేవలం తమ ముగ్గురికి మాత్రమే తెలుసు!!
ఎలా హైజాక్ చెయ్యబడుతుందనే విషయం వాళ్ళిద్దరికి కూడా తెలియదు - తను ఒక్కడికి తప్ప!!!
ఆ క్షణంలో తనే దేవుడయినట్లూ, విధిని తనకు తోచిన విధంగా శాసించగల సామర్థ్యం ఉన్న వాడయినట్లూ భావన కలిగింది అతనికి.
చెప్పలేనంత థ్రిల్ అనిపించింది.


                                                      *    *    *    *

 Previous Page Next Page