"పిల్లలూ...దేవుడూ...చల్లనివారే...
కల్లకపట మెరుగనీ...
కరుణా మయులే!"
నీ పిండాకూడు! తొరగా ముగించరా! ఇంటికెళ్ళి పెగ్గేసుకు పడుకోవాలి. ఏ.సి. అలవాటయి పోయాక ఈ మండుటెండలు భరించడం మహాకష్టంగా వుంది.
మళ్ళీ బుర్రలో ఆలోచనలు...భయాలు...
తన ఢిల్లీ ట్రిప్పుకి ఫలితం ఉంటుందా? ఈ చెత్త శాఖలో నుంచి తనని మార్చి కల్పవృక్షం లాంటి మరేదయినా మంచి శాఖలో ఇస్తారా లేదా? హోం మినిస్ట్రీనో, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖనో, పవరూ, రాబడీ ఉండే శాఖ ఏదయినా సరే...
ఇన్నాళ్ళ నుంచి మినిస్టర్ బలరామిరెడ్డి తనకు మెయిన్ సపోర్ట్! ఈ మధ్య అతను కూడా ఎడమొహం పెడమొహంగా వుంటున్నాడు.
ఎందుకనీ?
తన మీద మోజు తీరిపోయిందేమో!
క్యాబినెట్లో కొత్తగా ఒక పాతికేళ్ళ పడుచుని తీసుకుంటున్నారు. అదెంత ఆర్భాటం చేస్తుందో! తన పొజిషన్ ఏమవుతుందో? జయలలితలా పట్టాభిషేకం చేయించుకునే యోగం తన జాతకానికి ఉందో లేదో! డైవర్స్ గొడవ ఏమవుతుందో? కొడుకు చేతిలో పడ్డ తన బ్లూ ఫిల్మ్ కేసెట్ చివరికి ఎవరి దగ్గరికి చేరుతుందో?
త్వరగా ఇంటికెళ్ళి కనీసం ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తేగానీ ఈ భయాలకు కాసేపు గ్యాప్ రాదు.
ఈలోగా సభ అధ్యక్షుడు ప్రకటించాడు.
"ఇంతసేపూ మనం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన మంత్రిగారి ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది. బాలల సంక్షేమం కోసం ఆమె ధారాళంగా పథకాలు శాంక్షను చేస్తారని ఆశిస్తున్నాను."
లేచి నిలబడింది విజయకుమారి.
మంచి ఒడ్డూ, పొడుగూ ఉన్న విగ్రహం ఆమెది. పుష్టిగా ఉన్న ఒంపులు, మత్తుగా ఉండే కళ్ళూ.
ప్రజల కోసం పాటుబడే మనిషిలా అసలు అనిపించనే అనిపించదు ఆమెని చూస్తే.
ఈ రోజుల్లో అనేకమంది నాయకులు అంతే! అప్పుడే జైల్లో నుంచి విడుదల అయి వచ్చిన మొహాల్లా వుంటారు. లేదా, పోలీస్ స్టేషన్ లో వుండే రౌడీ షీటర్ల ఫోటోల్లా వుంటారు.
కానీ విజయకుమారి మాత్రం కేబరీ డాన్సర్ లా వుంటుంది.
సభకి నమస్కరించి ప్రసంగం మొదలెట్టింది.
"ప్రసంగం చేస్తాను కానీ అధిక ప్రసంగం చెయ్యను"
(సభలో నవ్వులు)
"నా ఆదర్శం ఒకప్పటి తమిళనాడు నాయకుడైన కామరాజనాడార్. ఎంత సింపుల్ గా బతికేవాడాయన! ఆయన చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్ళిపోయాక, ఇంటికి తాళం వెయ్యాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఏం సంపాదించుకున్నాడని! ఏం దాచాడని తాళాలు వెయ్యాలి! ఇంట్లో కొన్ని పుస్తకాలు, రెండు లుంగీలూ, రెండు చొక్కాలూ తప్ప ఇంకేమీ లేవు! అలా వుండాలి మనం. ఆయనలా నిరాడంబరంగా అందరూ ఉండగలిగిననాడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం! దేశం క్లిష్ట పరిస్థితిలో వుంది. మీరందరూ నడుములు బిగించి త్యాగాలు చేసి దేశమాతకు సేవ చేయాలని అభ్యర్థిస్తున్నాను.
కామరాజనాడార్ గారు తొందరపడి ఏమీ అనేవారు కాదు. అందరు చెప్పిందీ సావధానంగా విని "పార్కలాం!" అనేవారు. అంటే "చూద్దాం" అని అర్థం! తర్వాత వీలయినప్పుడు తగిన విధంగా సమస్యలని పరిష్కరించేవారు.
నేనూ అదే చెబుతున్నాను. మీ సమస్యలన్నీ విన్నాను. నేటి బాలలే రేపటి పౌరులని నాకు తెలుసు! చూద్దాం! ఏది సాధ్యమయితే అది చేద్దాం" అని సభకు నమస్కరించి, వేదిక దిగడం మొదలెట్టింది.
వెంటనే ఆమె చుట్టూ రక్షణ వలయంలో పోలీసులు చుట్టుముట్టేశారు. 'నా ప్రజలు, నా ప్రజలు' అని నిమిషానికి నాలుగు సార్లు అంటుంది గానీ, మినిస్టర్ విజయకుమారికి ప్రజలంటే ప్రాణ భయం. పక్కన పోలీసులు లేకుండా ప్రజల మధ్యకి వచ్చే సాహసం ఏనాడూ చెయ్యదు ఆమె.
పోలీసులు అందరినీ అదిలించి, దారి చేస్తుండగా అందరికీ నమస్కరిస్తూ వెళ్ళి కారు దగ్గర నిలబడింది మినిస్టర్ విజయకుమారి.
ఆ కారు హిందుస్తాన్ కౌంటెస్సా. అంతకు ముందు అంబాసిడర్ కారు వుండేది ఆమెకి. రచ్చ చేసి, దాన్ని వదిలించుకుని, ఈ పెద్ద కౌంటెస్సాని వారంరోజుల క్రితమే శాంక్షన్ చేయించుకుంది మినిస్టర్ విజయకుమారి.
కారు ఎక్కబోతూ అప్పుడే ఆ రాజా అనే పిల్లాడినీ, పీటలాంటి వాడి బండినీ చూసినట్లు గొప్ప ఎక్స్ ప్రెషన్ ఇచ్చి, హఠాత్తుగా ఆగిపోయింది.
మొహంలో భరించలేని బాధని ప్రదర్శిస్తూ, "పాపం! ఈ పిల్లాడికి అంగవైకల్యం వుందా?" అంది.
"రెండు కాళ్ళూ చచ్చుబడిపోయినాయమ్మా!" అన్నాడు రాజా అనే ఆ పిల్లాడు.
వెంటనే హాండ్ బాగ్ లో నుంచి పది రూపాయల నోటు తీసింది మినిస్టర్ విజయకుమారి. బొటనవేలూ, మధ్య వేలుతో ఆ నోటుని తడిమి, అది ఒక నోటేననీ, పొరబాటున తను రెండు నోట్లు ఇచ్చెయ్యడం లేదనీ తేల్చుకుని, నోటు పిల్లాడి చేతిలో పెట్టింది.
వెంటనే ఒక పది కెమెరాలు క్లిక్ మన్నాయి. ఆమె దాతృత్వాన్ని వీడియో టేపు మీదికి ఎక్కించాడు ఒక వీడియో గ్రాఫర్.
పబ్లిసిటీ ఏర్పాట్లు బాగానే జరిగాయని నమ్మకం కుదిరాక కారెక్కింది మినిస్టర్ విజయకుమారి.