"దిసీజ్ లైఫ్!" అనుకున్నాడు రవిచంద్ర సంతోషంగా. తను నిజంగా లక్కీ బగర్! చిన్నప్పటినుంచీ అంతే!
తన చదువు పూర్తయింది ఐస్ క్రీం కేక్ లాంటి ఉద్యోగం వచ్చింది. ఇంక పాలకోవా లాంటి పెళ్ళాం కావాలి! ఆ తర్వాత పనస తొనల్లాంటి పాపలు! ఒరే రవీ! నీదిరా జీవితం అంటే! లలలాం లలలాం లక్కీ ఛాన్సులే!
ఉత్సాహంగా నెక్ టైలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అతను.
ఉన్నట్లుండి ఆ డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో గుండుసూది కింద పడినా గుండె గుభేలు మనేటంత నిశ్శబ్దం అలుముకుంది.
అనుమానంగా వెనక్కి తిరిగిచూశాడు రవిచంద్ర.
కార్లో నుంచి దిగి, స్టోర్సులోకి అడుగుపెట్టింది ఒక మెరుపు తీగె. నిజంగా మెరుపు తీగే అంత సన్నగా ఉంది. అయితే మెరుపు తగ్గిన తీగెలా జ్వరం పడిలేచిన దానిలా ఉంది తను.
అయినా కూడా ఏం అందం? అంత చక్కటి కళ్ళని లియోనార్డో డా విన్సీ కూడా వెయ్యగలడా అని?
పరవశంగా చూస్తున్నాడు రవిచంద్ర.
డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో ఉన్నవాళ్ళందరూ కూడా మెంటల్ స్ట్రోక్ తగిలిన వాళ్ళలా మాట పడిపోయి, ఆ అమ్మాయి వంకే కళ్ళప్పగించి చూస్తున్నారు.
అటూ ఇటూ చూసి, టై సెక్షన్ పక్కనే ఉన్న టాయ్ సెక్షన్ లోకి వచ్చింది ఆ అమ్మాయి. బొమ్మలు పరిశీలించడం మొదలెట్టింది.
ఇంత అందమైన ఈ అమ్మాయి పేరేమయి ఉండవచ్చు? ఆ పేరు తన పేరుకి సూటవుతుందా? సపోజ్ సన్నగా, తీగెలా, గీతలా ఉన్న ఈ అమ్మాయి పేరు రేఖ అయివుంటే?
మిసెస్ రేఖా రవిచంద్రా! ఎంత బావుంటుంది ఆ పేరు! దాదాపు ఈ అమ్మాయంత బాగుండవచ్చేమో! నిజంగానే ఆ అమ్మాయి పేరు భానురేఖ అని తెలిసి వుంటే అతను ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ఉండేవాడే!
భానురేఖ అతన్ని గమనించలేదు. బొమ్మల సెలెక్షన్లో మునిగిపోయి ఉంది తను. కళ్ళు తిప్పుకోలేకుండా ఆ అమ్మాయినే చూస్తున్నాడు రవిచంద్ర.
భానురేఖ ఒక ఇంపోర్టెడ్ డాల్ సెలక్టు చేసుకుంది. తన పాత పింకీ బొమ్మలాగానే ఉంది ఇది. అయితే పింకీ పడుకోబెడితే కళ్ళు మూసుకోవడం, నిలబెడితే కళ్ళు తెరవడం మాత్రమే చేసేది. ఇది అలా కాదు. కళ్ళు మూస్తుంది, తెరుస్తుంది. నోట్లో ఉన్న పాలపీక తీసేస్తే ఏడుస్తుంది. నిలబెడితే "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అని నర్సరీ రైమ్స్ పాడుతుంది. బాటరీతో నడిచే ఆ బొమ్మకి వీపులో చిన్న టేపు ప్లేయర్, అందులో చిన్న కేసెట్ ఉన్నాయి.
ప్యాక్ చేసి ఇచ్చిన బొమ్మని తీసుకుని కర్చీఫ్ లో మూట కట్టిన పదిరూపాయల కట్ట భద్రంగా బయటకు తీసి, బిల్లు పే చేసింది భానురేఖ.
ఆమె తిరిగి వెళ్ళిపోయి, కార్లో కూర్చునే దాకా మంత్రముగ్ధుల్లా చూస్తూ ఉండిపోయారు జనం అంతా.
అప్పుడు కదిలాడు రవిచంద్ర. పెద్ద పెద్ద అంగలేస్తూ రోడ్డు మీదికి వచ్చి చూసేసరికి అప్పటికే కదిలి వెళ్ళిపోతుంది ఆ కారు.
నంబరు చూశాడు. '6666' నాలుగు ఆర్లు! అంటే ఇరవై నాలుగు!
అంటే సరిగ్గా తన వయసు! చిత్రంగా లేదూ ఈ కో ఇన్సిడెన్స్!
ఆ అమ్మాయిని మళ్ళీ తను కలుసుకోగలడా? ఎప్పుడన్నా? ఎక్కడన్నా?
షాపు అసిస్టెంటు పరిగెత్తుకొచ్చి ఇచ్చిన బిల్లు తీసుకుని, కౌంటర్లో డబ్బులు పే చేసి, టై ప్యాకెట్ తీసుకుని బయటికి వచ్చాడు రవిచంద్ర.
ఆ అమ్మాయి తన దృష్టి పథంలో నుంచి మాయమైపోయాక, కన్నొకటి ఊడిపడి పోయినట్లు ఏదో చెప్పలేని వెలితి!
నెమ్మదిగా నడుస్తూ తన రూము దారిపట్టాడు.
హఠాత్తుగా అతని కాళ్ళు ఒకచోట ఆగిపోయాయి. కళ్ళముందు ఒక నెంబరు ప్లేటు కనబడుతుంది.
'6666' నాలుగు ఆర్లు!
"లక్కీ బగర్ విరా నువ్వు!" అనుకున్నాడు రవిచంద్ర, ఆ రోజుకి రెండోసారి.
ఆ అమ్మాయి కారు ఒక పార్కు దగ్గర పార్కు చేసి ఉంది. డ్రైవర్ కారుని ఆనుకుని నిలబడి సిగరెట్టు కాల్చుకుంటున్నాడు. పార్కులోకి వెళ్ళాడు రవిచంద్ర. అతని కళ్ళు పార్కు అంతా గాలించేస్తున్నాయి. పార్కు మొత్తం తిరిగినా ఎక్కడా కనబడలేదు ఆ అమ్మాయి.
అసలు ఇక్కడికి వచ్చిందా? తను పొరపడ్డాడా? అప్పుడు కనిపించింది భానురేఖ! ఒక పూల పొద వెనక కూర్చుని ఉంది ఆమె. బొమ్మను ఒళ్ళో నిలబెట్టి, దాని తల నిమురుతూ, అది పాడుతున్న రైమ్స్ వింటుంది. "వాట్ ఐ విల్ బీ, వెల్ ఐ విల్ బీ హాపీ. క్వీసెరా, సెరా!" పాట వింటున్న భానురేఖ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
"మేరీస్ బాయ్ చైల్డ్, జీసస్ క్రీస్ట్...." అని ఇంకో పాట అందుకుంది బొమ్మ.
మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయాడు రవిచంద్ర. ఇందాక ఈ అమ్మాయి టాయ్ సెక్షనులో బొమ్మ కొంటూవుంటే ఎవరికో ప్రజెంటేషన్ కోసమేమో అనుకున్నాడు. తనకోసమే కొనుక్కుందా? వయసొచ్చిన అమ్మాయి, చిన్నపిల్లలా బొమ్మలతో ఆడుకోవడమేమిటి?
హఠాత్తుగా తలెత్తి అతన్ని చూసింది భానురేఖ. వెంటనే ఆమె కళ్ళలో భయం కనబడింది. బొమ్మను గాఢంగా గుండెలకు హత్తుకుంది.
"నా బొమ్మని లాక్కుంటే నాన్నగారితో చెబుతాను" అంది బెదిరిస్తున్నట్లు.
ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర. ఏమంటోంది ఈ అమ్మాయి? తెలివి ఉండే మాట్లాడుతుందా? లేకపోతే? అతనికి అనుమానం ఎక్కువవుతోంది.