Previous Page Next Page 
జన్మభూమి పేజి 6

    అనుకున్నరోజు రానేవచ్చింది. ఒంటిగంటన్నరకి కేశవరావుగారి టాక్సీ వచ్చి గుమ్మంముందు ఆగింది. పాండురంగారావు ఎదురెళ్ళి మామయ్యకి, అత్తయ్యకి నమస్కరించాడు. సుగుణ వచ్చి పలకరింపుగా నవ్వింది.
    "హలో రంగా ఎలా వున్నారు అంతా. ఏమ్మా సుగుణా పిల్లలు, నీవు అంతా కులాసానా. పిల్లలేరి..." అంటూ పలకరించాడు. "బైదిబై రంగా వీరు మిస్టర్ అండ్ మిసెస్ మెహతా. ఆర్కిటెక్చర్ అండ్ డిజైనర్స్. యిల్లు చూపించి ఏమేమి మార్పులు చెయ్యాలో చూపించడానికి తీసుకొచ్చాను. "మా నెవ్యూ... పాండురంగారావు. ఇతనే ఇక్కడ వుండి, నా పొలాలు అవి చూస్తుంటాడు" పరిచయాలయ్యాక అందరిని ఇంట్లోకి ఆహ్వానించాడు పాండురంగ. ముందే లంచ్ కి వస్తాం. తయారుచేయించు అని ఉత్తరం రాయించడంతో అతిధులకోసం వంట ఏర్పాటు చేసింది సుగుణ.
    "ముందు భోజనాలు చేద్దామా మావయ్యా... రెండు గంటలు అవుతుంది."
    "ఆ... అలాగే, ఆకలేస్తుంది. వడ్డించేయమను..." అంటూ చేతులు కడుక్కున్నారు.
    మండువాలో పీటలు, అరటి ఆకులు వేసి వడ్డించింది సుగుణ.
    "ఓ వండర్ ఫుల్... మా ట్రెడిషనల్ స్టయిల్ మిస్టర్ మెహతా" కేశవరావు పీటల మీద కూర్చుంటూ అన్నారు.
    "మీ ట్రెడిషనల్ కాదు. మాదేసార్... పూర్వం అంతా యిలాగే తినేవారు. ఆరోగ్యానికిదే మంచిది సార్. అందుకే ఇదివరకటితరం వారికి కీళ్ళనొప్పులు, అర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వుండేవి కావు అనుకుంటా- కింద కూర్చుని, లేవడం ఆరోగ్య లక్షణం" మెహతా మెహతా అన్నారు.
    మా వంటలు బాగాలేదు గదా..." కేశవరావు పదార్థాలు చూసి అన్నారు.
    "నోనో సార్... చాలారోజుల తర్వాత యింత సాంప్రదాయరీతిలో యీ భోజనం చేయడం మాకు ఎంతో బాగుంది... మేం అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ భోజనం హోటల్లో చేస్తూనే వుంటాం..." సునీత అంది.
    "అక్కడే మిస్టేక్ అవుతున్నారు. సౌత్ ఇండియన్స్ ఫుడ్ అంటే అది చాలావరకు తమిళుల భోజనం. సాంబార్, రసం వగైరాలన్నీ. అచ్చ తెలుగు వంటకాలు ఈ వంకాయ కూర, ఈ గుమ్మడికాయ పులుసు, ఈ గోంగూర పచ్చడి ఇవి తెలుగు వంటలంటే- ఈ పులిహోర మా తెలుగు స్వంతం. అసలు మా సౌత్ ఇండియన్స్ ని అందరని కలిసి మద్రాసీలనేవారు మొన్నమొన్నటివరకు. ఏదో ఎన్.టి. రామారావు పుణ్యమా అని మా తెలుగువారికి ఓ గుర్తింపు వచ్చింది. కేవలం ఆ కారణం కోసమన్నా మేం అందరం రామారావుకి రుణపడి వుండాలి. కేశవరావు నవ్వుతూ అన్నారు.
    "కబుర్ల మధ్య సుష్టుగా అందరూ వంటలని మెచ్చుకుంటూ తిన్నారు."
    "సుగుణా! వంట బాగుందమ్మా" రాజేశ్వరి మనస్పూర్తిగా మెచ్చుకుంది. సుగుణ పల్లెటూరి అమ్మాయి. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. చామనఛాయ రంగులో పొందికగా ఉంటుంది. ముగ్గురు పిల్లల తల్లిలా కనబడదు. "నాకు ఈ వంటలు తప్ప ఏం రావు. వీళ్ళు తింటారో లేదో అనుకున్నాను" అంది బిడియంగా.
    రాజేశ్వరి నవ్వుతూ యింగ్లీషులో సుగుణ మాటలు సునీతతో అంది. "చాలా...చాలా బాగుంది అండి"  హైదరాబాదులో వుండి నాలుగు తెలుగు ముక్కలు వంటపట్టించుకున్న సునీత వచ్చీరాని తెలుగులో అంటే అంతా నవ్వారు. భోజనాలయినాక అంతా లేచారు. రాజేశ్వరి యిల్లు వున్నంతలో శుభ్రంగానే వుంచారని సంతృప్తి పడింది.
    "మిస్టర్ మెహతా ఈ ఇల్లు మా తాతగారి కాలంలో కట్టింది. అంటే దగ్గిర దగ్గిర నూరు ఏళ్ళుంటుంది దీని వయసు. ఇల్లు పాత పడింది. ఇంకా వీళ్ళు ఈ ఇంట్లో వుండబట్టి పాడుపడలేదు. దీన్ని మీరసలు కట్టడం అంతా అలాగే వుంచి మోడర్న్ గా మార్చాలి... పదండి ఇల్లంతా మొత్తం చూపిస్తా" కేశవరావు వెంట అంతా నడిచారు.
    "చూశారా! ఈ వీధిలో అరుగులు యిలాగే ఉంచండి. అఫ్ కోర్స్ ప్లోరింగ్ చేయించాలి. వీటికి అందమైన గ్రిల్లు పెట్టించాలి. ఈ స్థంభాల పనితనం చూడండి. వీటిని పాలిష్ చేయించాలి. ఈ ముందు సావిడిని డ్రాయింగ్ రూమ్ గా మార్చాలి. యీ కిటికీల సైజు పెద్దది చెయ్యాలి. ప్లోరింగు మొత్తం మార్చాలి. గోడలు గట్టిగా వున్నాయి. వాటిని లప్సంతో స్మూత్ గా చెయ్యాలి. పైన పెంకులు కొత్తవి కప్పించి, లోపల ఫాల్స్ సీలింగ్ ధర్మోకోల్ కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడండి.
    "ఈ ముందు హాలు ఇరవైఐదు బై థర్టీన్ ఉండచ్చు... డ్రాయింగ్ రూమ్ పెద్దదే వస్తుంది సార్..."
    "ఇది ఎలా డెకరేట్ చేసేది మీ ఇష్టం. మంచి ఫర్నిచర్స్ కార్పెట్లు, పెయింటింగ్స్, ఇనీజీర్ ప్లాంట్స్... ఎలక్ట్రికల్ జ్ఫిటింగ్ మంచివి"
    "అదంతా మేం చూసుకుంటాం సార్. డోన్ట్ వర్రీ..." సునీత అందుకుంది.
    "ఇదిగో ఈ హాలు తరువాత మండువా, వాకిలి, హాలుకి ఎదురుగా భోజనాల గదిగా వాడేవారం మా చిన్నప్పుడు. మండువాకి ఇటు అటు ఎదురు ఎదురుగా ఇటు మూడు అటు మూడు గదులున్నాయి చూశారా. ఈ దక్షిణం వైపు మూడు గదులని కలిపి మాకు పెద్ద మాస్టర్ బెడ్ రూం, డ్రెస్సింగ్ రూముగా మాకు వుండాలి. మధ్యగోడలు తీసేయండి. గది పెద్దది చెయ్యండి. అటు ఉత్తరం వైపు మూడు గదులు మా పిల్లలిద్దరికీ చెరో రూము. ఒక రూము గెస్టు రూముగా. లేదంటే మా పిల్లలు వచ్చినప్పుడు పిల్లల రూముగా మార్చాలి. మిస్టర్ మెహతా, చూశారా యీ మండువాలో కర్ర స్థంభాల పనితనం. యీ బ్యూటీ చెడకుండా పాలిష్ చేయించాలి. యీ మండువా పైన యినప చట్రం ఫ్రేం తీసేసి 'స్టేయిన్ డ్ గ్లాస్' వేయించాలి. వెలుతురు వస్తుంది. రంగు రంగుల గ్లాసు వుంటే బాగుంటుంది. ఈ మండువాలో ఒకవైపు మంచి ఉయ్యాలబల్ల కావాలి. చూశారా రింగులున్నాయి. మా చిన్నతనాన యిక్కడ ఉయ్యాల బల్లమీద మధ్యాహ్నం వేళ మా తాతగారు పడుకునేవారు. మేం స్కూలు నుంచి వచ్చాక దగ్గర కూర్చోపెట్టుకుని భారతం, రామాయణం కథలు చెప్పేవారు. మిస్టర్ మెహతా ఇక్కడ చక్కటి నగిషీ యిత్తడి గొలుసులతో మంచి ఉయ్యాల కావాలి. ఈ మండువా వరండాలో ఒక కార్నర్ ఫేమిలి, సిటింగ్ రూమ్ చెయ్యండి.
    ఈ వెనకవైపున వున్న పెద్దహాలు భోజనాల గదిగా వాడేవారు. అప్పుడు అందరూ జాయింట్ ఫ్యామిలీలు. పెద్ద చిన్న అంతా కలిసి పదహారుమందిమీ వరుసగా పెద్ద, చిన్నపీటలు వేసి మనందరికీ ఒకసారి, ఆడవాళ్ళ అందరూ ఒకసారి భోజనాలు చేసేవారం.
    యీ హాలు డైనింగ్ హాలు చేయండి. టేబుల్, కబోర్డ్స్, క్యాబినెట్స్, ఫ్రిజ్ అన్నీ ఏర్పాట్లు ఉండాలి. మంచి రోజ్ వుడ్ క్యాబినెట్లు చేయించండి. ఇదిగో ఈ ఎడంవైపు గది వంటగది - వంటగది మొత్తం మార్పులు చెయ్యాలి. మోడర్న్ గాడ్ గెట్స్ కుకింగ్ రేంజ్ - మైక్రో ఓవెన్, గ్రైండర్లు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. గ్రానైట్ ప్లాట్ ఫాం, స్టీల్ సింక్. టైల్స్ గోడలకి... మీకు నేను చెప్పనక్కరలేదు కదా... ఇదిగో ఈ కుడివైపు గది స్టోర్ రూము దేవుడుగదిగా వుండేది...ఇప్పుడు అలాగే వుడెన్ కబోర్డ్సు చేయించి మంచి మందిరం పెట్టండి.
    ఇంక ముఖ్యంగా బాత్ రూంలు కొత్తగా కట్టాలి. మాస్టర్ బెడ్ రూంకి బాగా పెద్దది బాత్ టచ్ అది వుండాలి. అన్ని గదులకి అటాచ్డ్ బాత్ లు, మోడర్న్ సిట్టింగ్స్, మంచి ప్లంచింగ్ మెటీరియల్ వాడండి. ఇంటిచుట్టూ స్థలం వుంది కనుక ఎటాచ్డ్ బాత్ లు ఎలా కట్టాలి అన్నది చూసుకోండి - ప్రహరీగోడ పడిపోవడానికి సిద్ధంగా వుంది. పూర్తిగా కట్టి మంచి ఐరన్ గేటు పెట్టాలి. వెనక ధాన్యం కొట్టు దాన్ని సరెంట్ కార్టర్స్ కట్టండి. బాత్ రూంతో సహా...ఇటుక, సిమెంటుపని కాగానే తోటపని - అంతా తాను వేయించాలి - మంచి కుండీలు మొక్కలు, ఇన్ డోర ప్లేంట్స్ వుండాలి. ఇలా పెరట్లోకి రండి- చూశారా మూడు మామిడి, రెండు కొబ్బరి, ఒక సపోటా, జామ ఈ చెట్లన్నీ ఏదీ కొట్టకూడదు. అవి అలా వుంచి తోటంతా బాగుచేయించి ముందు మంచి గార్డెన్ వెనుక మేం వచ్చాక కిచెన్ గార్డెనుకి వీలయినట్టుగా అది వేయించాలి..." ఆగకుండా అరగంటసేపు అంతా చూపించి తనకి కావాల్సిన వివరాలు యిచ్చాడు కేశవరావు.
    "చూడండి మిస్టర్ మెహతా మేము గత ముప్పైఐదేళ్ళుగా అమెరికాలో వుండి అక్కడి సుఖాలకి అలవాటుపడ్డాం. ఇక్కడ మేం వుండగలిగాలి అంటే ఇంటి సౌఖ్యం ముందు కావాలి అని నా నమ్మకం - ఆ స్టాండర్ దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ఇంటిని నివాసయోగ్యంగా, కళాత్మకంగా తీర్చిదిద్దాలి. ఎట్ ది సేమ టైమ్. మా తాత ముత్తాతల ఇంటిలో వున్నానన్న తృప్తి కావాలి నాకు. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు - ఈ తోటలో, దొడ్లలో పడి మా పిల్లలం ఎంత అల్లరి చేస్తూ ఎంజాయ్ చేసేవారమో..." పాత స్మృతుల జ్ఞాపకంలో ఆయన పడిపోయారు.

 Previous Page Next Page