Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 6


    "నేను కవయిత్రిని కదా! ప్రాసకోసం అలా అన్నాలే!" గొప్పగా చెప్పింది సుందర సుకుమారి.


    "ఇలా మాటలతో వృధాగ కాలక్షేపం చేస్తారా లేక విషయానికొస్తారా!" గద్దించింది వందన.


    "విషయానికే వస్తున్నాను. నేను తిండి తినకపోతే మా బామ్మ చచ్చేంత భయం. అంతకుతప్ప ఇంక నేనేం చెప్పేది లేదు. నేను మీతో ప్రయాణమై రావాలంటే ఆ ఉపాయమేదో నువ్వే చూడు. మా బామ్మని ఒప్పించే భారం కూడా నీదే" బరువు బాధ్యతలన్నీ వందన మీద పెట్టి చేతులు దులిపేసుకుంది సుందర సుకుమారి.


    "మన పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతుంటారులే. "మంత్రసాని తనానికి వప్పుకొన్న తర్వాత అన్నీ చెయ్యాల్సిందే"నని ఆ ఉపాయమేమిటో నేనే చూస్తాను" అంటూ అప్పటికప్పుడే ఆలోచనలో పడిపోయింది వందన.


    "చూడు....చూడు" అని చెప్పేసి ముగ్గురు మౌనంగా వుండిపోయారు.


    అయిదు నిమిషాలు గడవకముందే అద్భుతమైన... అమోఘమైన ఆలోచన వచ్చింది వందనాదేవికి. "రేపు నేను వీళ్ళిద్దరిని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను. మీ బామ్మతో మాట్లాడాలి" యమ సీరియస్ గా చెప్పింది వందనాదేవి.


    "రేపు మా ఇంటికొస్తావా! ఎందుకు? బామ్మతో మాట్లాడటానికా? మంచిగ మాట్లాడినా లాభంలేదు. పోనీ పోట్లాడటానికా! అది అసలు లాభం లేదు. నేను నోరు తెరిచి కవిత్వం వినిపించానంటే ఎంత లావు మనుషులు పరుగెత్తుతారు. మా బామ్మ నోరు తెరిచిందంటే ఎదుటివాళ్ళు గబుక్కున మాయమైపోతారు. నీవు మాట్లాడి లాభం లేదు... పోట్లాట లాభం లేదు."


    "నేను మాట్లాడను... పోట్లాడను. మనందరం కలిసి చిన్న నాటకం ఆడదాం. ఆ నాటకం చూసి మీ బామ్మ భయంతో పూర్తిగా తగ్గిపోయి మన దోవకి వస్తుంది..."


    "నాటకమా! అదేంటా?" అంది సుందర సుకుమారి.


    తనకొచ్చిన ఆలోచన ముగ్గురికి విడమర్చి చెప్పింది వందన.


    వందన చెప్పింది ముగ్గురికి నచ్చింది. "బావుంది అలా చేద్దాం" అన్నారు.


    "ఒసేయ్! ఈ నాటకంలో ముఖ్యపాత్రని నేను. ఉపపాత్రలు మీరు. పన్నెండయ్యేసరికల్లా మీరు మా ఇంటికి వచ్చేసెయ్యాలి. లేకపోతే నేను చచ్చూరుకుంటాను" అంది సుందర సుకుమారి.


    "నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు సరేనా" అంది వందన.


    "అయినా నా భయం నాదికదా!"


    "అయితే తమరు నిక్షేపంగా చనిపోవచ్చు సుందర సుకుమారి గారూ! ఎందుకంటే మీనోరు వూరుకోదు కదా! వరసపెట్టి జనన మరణాల మీద కవితలు చదివిపారేస్తారు. ఆ కవితలు వినలేక యమధర్మజుండు "ఈ పిల్లదాని తీసికెళ్ళి భూలోకంలో పడేసిరండర్రా" అని తన కింకరులకి చెపుతాడు. సు...సు...గారి కవితాలహరి పుణ్యమా అని చచ్చిబతికిపోతుంది అది. అవునా చెలులారా!" వందనాదేవి గంభీరంగా అడిగింది.


    "అవును అవును" వస్తున్న నవ్వుని బిగపట్టుకుని వంతపాడేరు రాణి, ప్రమదలు.


    వాళ్ళ వుషారు చూసి తానూ వుషారుపడిపోయి అప్పటికప్పుడే ఓ కవిత అల్లిపారేసి రాగయుక్తంగా పాడింది సుందర సుకుమారి.


    "జననానికి కావాల్సిన స్థలం కొన్ని అంగుళాలు.


    మరణించాక కావాల్సిన స్థలం కొలత ఆరడుగులు.


    జననమరణాల మధ్య మనిషికి కావాల్సిన స్థలం మాత్రం ఈ విశాల ప్రపంచంలో విశ్వాన్ని అధిగమించేటంత.


    ఎందుకంటే వాడు మనిషి.


    ఎందుకంటే వాడు స్వార్థపరుడు,అత్యాశాపరుడు...


    "సు...సు...గారూ! మేము లేచిపోతున్నాం. ఇంక కవిత్వం చాలించి తమరు..." అంటూ వందనాదేవి లేచింది.


    వెంటనే రాణి, ప్రమద లేచారు.


    "అవ్వ...మీరు ఆడపిల్లలు కాదటే. లేచిపోవటమేమిటే. ఇలా మా బామ్మదగ్గర మాట్లాడారంటే నన్ను మీతో టూర్ కి పంపించడం మాట అటుంచి ముందు స్నేహం మానిపిస్తుంది. బికేర్ ఫుల్" అంది సుందర సుకుమారి.


    "ఇది తెలుగుసినిమాల ప్రభావమే తల్లీ! హిందీ ఇంగ్లీషు సిన్మాలు చూస్తే మన భాష ఇంతపాడై పోయి చావదు. నామాట మీరు వింటారా! తెలుగు సినిమా రావటం ఆలస్యం పోలోమంటూ బయలుదేరుతారాయె. తల్లికూతుర్ని వుసుక్కుంటూ "ఇక్కడనుంచి లేచిపోవే" అందనుకో, అందులో కూడా విపరీతార్థమే వినిపిస్తుందాయే. ఛీ...ఛీ..." అంది వందన.


    "ప్రతిమాటా డబల్ మీనింగే. పోనీ పేరు చూద్దామా అంటే అవి అంతకన్నా అధ్వాన్నంగా ఏడుస్తున్నాయి. "ఊరంతా శోభనం" ఒక సినిమా పేరయితే "నాలంగా నీలుంగీ" మరో సినిమా పేరు అంది ప్రమద.


    "తీసేవాళ్ళకి బుద్దిలేదు. ఆ సినిమాలు చూసేవాళ్ళకైనా బుద్ధులుండాలి కదా!" అంది రాణి.


    "మనం కూడా చూస్తున్నాము కదే...!" సుందర సుకుమారి అంది.


    "అందుకే కదా ఇలా తిట్టుకోవటం. తిమ్మిన తరువాత చిరంజీవ అనుకున్నట్లు...సినిమా చూసొచ్చి తిట్టుకుంటామన్నమాట"


    వందన మాటలకి ముగ్గురు నవ్వారు. అప్పటికి నలుగురు పార్కులోంచి బయటికి వచ్చారు. మర్నాడు కల్సుకునేలా అనుకుని ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు.

 Previous Page Next Page