Previous Page Next Page 
సీతాచరితం పేజి 6


    అందుకు కలి "మహారాజా! బాగుంది. వాటిల్లోనే, వుంటాను. కాని ఈ నాల్గింటికి నెలవైన మరొక స్థానాన్ని నాకు కల్పించు" అన్నాడు. అందుకు పరీక్షిత్తు "అసత్యం, కామం, రజోగుణం, వైరం, ఈ నాల్గింటికి స్థానమైన సంపదలో - నివసించు" అని ఆదేశించాడు.


    సరే. కలి ఎందులో నివసించాడో మనకు అనవసరం. కాని ఈ కథ వల్ల మనకు తేలిందేమంటే సంపద అసత్యం, కామం, రజోగుణం, వైరం వీటన్నింటికి కారణమవుతుందని, సకల దుష్టకార్యాలకు కారణమైన సంపద వ్యక్తిపరంగా వున్నదానికంటే సమాజపరం కావడం, సమాజానికి శ్రేయస్కరం. సంపద సమాజవరం అయినపుడు ఏ ఒక్క వ్యక్తికి దానిమీద అధికారం లేదు. అది సమాజం యావత్తుకూ అవగా సకల ప్రజానీకానికి చెందుతుంది.


    సంపద వ్యక్తిపరంగా కలిగే కష్టనష్టాలు గురించి ఆలోచిద్దాం. ఇందుకు ఒక కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం! ఆ కుటుంబములో ఒక యజమానిగాక, తొమ్మిదిమంది సభ్యులున్నారనుకుందాం. యజమాని ఆర్జించినదాన్ని తన స్వంతానికి వాడుకొని అనేకమైన భోగాలు అనుభవిస్తాడు. కాని కుటుంబ సభ్యులకు తిండికూడా సరిగా పెట్టడు. అలాంటపుడు ఆ కుటుంబం ఎలా వుంటుంది? దైన్యంతో, దరిద్రంతో, ఆకలితో బాధపడుతుంటారు. యజమాని సర్వభోగాలనుభవిస్తూ కుటుంబ సభ్యులను కూటికి మాడ్చటం న్యాయమా? ధర్మమా? ఆస్తి వ్యక్తుల చేతుల్లో వున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. సమాజం సాంతం ఒక కుటుంబం అనుకుంటే, కొందరు సంపన్నులు భోగభాగ్యాలనుభవిస్తుండగా, మిగతా అశేష ప్రజానీకం ఆకలికి అలమటించడం సమాజానికి ఆరోగ్యదాయకం కాదు. ఆనారోగ్యమయిన సమాజం ప్రగతి సాధించదు.


    వ్యక్తిపరమయిన ఆస్థి, సమాజపరమయినప్పుడు ఏమవుతుంది? మళ్లీ ఆకుటుంబాన్నే ఉదాహరణగా తీసుకుంటే యజమాని సంపద లేక ఆస్థి కుటుంబపరం చేస్తే కుటుంబం సభ్యులకు ఆహారం, విద్య, ఆరోగ్యం సమకూర్చడానికి వీలవుతుంది. కుటుంబం కలకలలాడుతూ కనుల పండుగగా వుంటుంది. ఈ కుటుంబ పరిధి పెంచి సమాజానికి వర్తింపచేస్తే సమాజంలోని అన్ని వర్గాలు హాయిగా వుండడానికి వీలవుతుంది. ఆరోగ్యకరమయిన సమాజం ప్రగతిపథంలో పయనించడానికి అవకాశాలు ఏర్పడుతాయి.


    ఆస్థి సమాజపరమయిన సమాజాన్ని సోషలిస్టు సమాజమంటాం. ఈ సమాజంలో ఆస్థినిబట్టి ఏర్పడిన వర్గాలుండవు. యిది వర్గాలులేని సమాజం. యిందులో మనిషికి, మనిషికి మద్య ఆస్థుల అంతరాల అగాధాలు లేవు. ఆస్థికి దూరం చేశాం కాబట్టి, తోటివాడు మనిషిని మనిషిగానే గుర్తిస్తాడు. మనిషికి గౌరవం ఆస్థిని బట్టిగాక అతని ప్రతిభను బట్టి ఏర్పడుతుంది. కళాకారులు, రచయితలు, శాస్త్రజ్ఞులు, తమ ప్రతిభను బట్టి రాణింపగలరు గాని తమకున్న ఆస్థులనుబట్టి రాణించరు. కాబట్టి నిజమయిన విలువలు బయటపడి సమాజ శ్రేయస్సును తోడ్పడుతాయి. ఈ సమాజంలో ఆస్థికిగాక శ్రమకు, శ్రమ విలువకు ప్రాధాన్యత వుంటుంది. కాబట్టి దీన్ని "శ్రమస్వామ్యం" అన్నాం.


    శ్రమస్వామ్యం సమాజంలో సమాజ శ్రేయస్సును గురించిన బాధ్యత ఏ ఒక్కరిదీ గాదు. పూర్తి సమాజానికిది సమాజంలోని వ్యక్తుల శ్రేయస్సుకు సమాజం బాధ్యత వహిస్తుంది. వారికి విద్య జరపడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం, వారికి ఇల్లు సమకూర్చడం, ఉద్యోగాలు కల్పించడం, వార్ధక్యంలో వారి రక్షణ, ఇవన్నీ సమాజ బాధ్యత. ఇన్ని సౌకర్యాలు సమాజమే కల్పిస్తున్నప్పుడు వ్యక్తికి రక్షణ, భద్రత వుండి అతడు నిశ్చితంగా జీవితం గడపవచ్చు. అతనికి ఉద్యోగం కల్పించే బాధ్యత సమాజానిది, అతనికి యిల్లు వగైరా సౌకర్యాలు కల్పించే వారి ఆరోగ్యరక్షణ, వారి ఉద్యోగ బాధ్యత కూడ సమాజానిదే. అతనికి తనను గురించిగాని, తమ సంతానాన్ని గురించిగాని, ఎలాంటి చీకు, చింతా అక్కరలేదు. వ్యక్తి నిశ్చింతగా జీవితం గడపడం బహుశః ఈ సమాజంలోనే సాధ్యమేనా!


    శ్రమస్వామ్య సమాజంలో నిరుద్యోగం వుండడానికి వీలులేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం సమాజం బాధ్యత. ధనస్వామ్య సమాజంలో నిరుద్యోగం పెరుగుతుండగా, శ్రమస్వామ్య సమాజంలో నిరుద్యోగఛ్ఛాయలు కూడ వుండవు. అది ఎలా సాధ్యమవుతుందో తెల్సుకుందాం.


    ధనస్వామ్యపు ఉత్పత్తిలో ప్రధాన లక్ష్యం లాభం. ఈ లాభం ఎవరి శ్రమ ఫలితం వలన వస్తుందో తెల్సుకున్నాం. ఈ లాభం సాంతం ఒక వ్యక్తికి, ఒక సంస్థకి చెందుతుంది. ఈ లాభాలు ఆర్జించడానికి నిరుద్యోగం ఏర్పడుతుంది. యిందుకు గురించి పూర్వపు ఉదాహరణ తీసుకుంటే, పదిమంది కార్మికులు వేయి యూనిట్లను ఉత్పత్తి చేయగలిగారనుకుందాం. శాస్త్ర పరిశోధనలవల్ల, యంత్రాల ప్రమాణాలు పెరిగి, ఈ వేయి యూనిట్లను 5 గురు వ్యక్తులే ఉత్పత్తి చేయగలరు. అలాంటప్పుడు స్వలాభార్జనకై ధనస్వామి మిగతా 5 గురిని బయటికి పంపేస్తాడు. అంటే 5 గురికి నిరుద్యోగం కల్పించాడని అర్దం. ఇదంతా ఎందుకోసం జరిగింది అంటే లాభం కోసం - యిదే పద్ధతి శ్రమస్వామ్యంలో వచ్చిందనుకుందాం. పదిమంది ఉత్పత్తి చేసే వేయి యూనిట్లు ఐదుగురే ఉత్పత్తి చేయగల్గినపుడు, మిగతావారిని నిరుద్యోగులుగా చేయడానికి వీలులేదు. ఎంచేతంటే ఉద్యోగం అందరికి గ్యారంటీ చేయబడింది. అలాంటపుడు శ్రమస్వామ్య సమాజంలో ఏం జరుగుతుందంటే, ఈ పదిమంది కార్మికుల పని గంటలను సగానికి తగ్గించడం జరుగుతుంది. ఒక విషయం ఆలోచించండి. శాస్త్ర పరిశోధనల వల్ల శ్రమస్వామ్యంలో శ్రామికుడు లాభపడతాడు. ధనస్వామ్యంలో ధనస్వామి లాభపడతాడు.


    నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం, అజ్ఞానం, అంధకారం ఎరుగనిది శ్రమస్వామ్యం. శ్రమస్వామ్య సమాజంలో శ్రమకు విలువవుంది. ప్రేమకు విలువ వుంది. అనురాగానికి విలువ వుంది. అనుబంధానికి విలువ వుంది. ఆత్మీయతకు విలువవుంది. కాని అసత్యం, కామం, రజోగుణం, వైరం ఈ నాల్గు దుష్టగుణాలకు స్థావరమైన సంపదకు విలువలేదు. ఇది మనిషికి విలువనిచ్చే సమాజం - మనసుకు విలువనిచ్చే సమాజం. ఈ సమాజంలో ప్రేమ ఫలిస్తుంది - పూస్తుంది - కాస్తుంది.


    శ్రమస్వామ్య సమాజంలో సాహిత్యం శ్రామికుల పరంగా ఉంటుంది. ఈ సమాజంలో వర్గాలుండవు. కాబట్టి సాహిత్యం ఏ ఒక్క వర్గ శ్రేయస్సుకు సీమితమై వుండదు. సమాజం సాంతం శ్రామికులదే కాబట్టి. సాహిత్యంలో శ్రామికులే చోటు చేసుకుంటారు. శ్రమస్వామ్య సమాజంలోని సాహిత్యం సమాజం మొత్తాన్ని ప్రతిబించేటట్లుగా వుంటుంది. సాహిత్య లక్ష్యం సమాజ శ్రేయస్సేగాని, ధనస్వామ్యుల లాభార్జనగాదు. ధనస్వామ్య సమాజంలో లాభార్జనకు గాను సాహిత్యాన్ని మత్తుమందులా వాడటం జరుగుతుంది. వ్యక్తిలోని బలహీనతను డబ్బుగా మార్చుకోవడం జరుగుతుంది. శ్రమస్వామ్య సాహిత్యంలో మానవునిలోని విశిష్టతను, వైలక్షణ్యాన్ని బయటపెట్టి మానవునిలోని మంచి విలువను పెంచడానికి ప్రయత్నిస్తుంది.


    రచయితలకు, కళాకారులను శ్రమస్వామ్యంలో వున్నంత గౌరవం మరే సమాజంలో వుండదు. కళల నిజమైన విలువను గ్రహించగల్గేది, శ్రమస్వామ్య సమాజం మాత్రమే.

 Previous Page Next Page