Previous Page Next Page 
చెక్ పేజి 6


    వెళ్ళబోతున్న మామయ్య నన్ను చూసి ఆగి "ఏరా ! వస్తావా మాట్లాడేందుకు కూడా తోడు ఎవరూ లేరు" అని అడిగాడు.

 

    ఆ మాటలు విన్న నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంత రాత్రిపూట శవం కాపలా అంటే మాటలా ? అయితే రానని మామయ్యతో అనలేకపోయాను.

 

    "ఇంత రాత్రిపూటవాడెందుకు లెండి. చిన్న బిడ్డ. జడుసుకోగలడు" అంది అత్తమ్మ. మహాతల్లి. చల్లగా వర్ధిలమ్మా అని మనసులోనే ఆమెకు నమస్కరించాను.

 

    "నేనుండగా వాడికి భయమేమిటే. ఒంటరిగా వుండడానికి ఏవీ తోచదనే వాడ్ని పిలుస్తున్నాను. అందునా నేను లేకపోతే వాడిక్కూడా నిద్రరాదు. అక్కడైతే నాతోపాటు నిద్రపోవచ్చు"

 

    మామయ్య అన్నదీ నిజమే. నాకిక్కడ నిద్ర రాదు. అయితే శవం దగ్గర పడుకోవడమంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.

 

    "ఏరా బుజ్జీ!" చివరిసారి అడుగుతున్నట్టు అడిగాడు మామయ్య.

 

    "వస్తాను మామయ్యా."

 

    లేచి కూర్చున్నాను.

 

    "అయితే చొక్కా వేసుకో."

 

    చొక్కా వేసుకుని ఇంటి బయటకొచ్చేసరికి మామయ్య వసారాలోంచి సైకిల్ తీసి స్టాండ్ వేశాడు.

 

    అత్తమ్మ రెండు దుప్పట్లు, టార్చిలైట్ తీసుకొచ్చి ఇచ్చింది.

 

    టార్చీని చేతిలోకి తీసుకుని పరీక్షించాడు మామయ్య. అది గుడ్డిగా వెలుగుతోంది.

 

    తిరిగి దానిని కూడా నా చేతికిచ్చాడు.

 

    దుప్పట్లూ, టార్చీని తీసుకుని సైకిల్ వెనుక సీట్లో కూర్చున్నాను.

 

    సైకిల్ బయల్దేరింది.

 

    కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించనంత చీకటి. ఆఖరుకు నక్షత్రాలు కూడా లేవు. గాలి ఎక్కడో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకృతంతా స్థంభించిపోయింది.

 

    మామయ్య లేకుండా ఇంట్లో వుండడం భయమేసి బయల్దేరితే అంతకన్నా ఎక్కువ భయం గొలిపే విధంగా వుంది పరిస్థితి. ఆ రోజు ఏదో అనర్థం జరుగుతుందని బలంగా అన్పించింది.

 

    ఆ సైకిల్ దిగి పారిపోవాలనిపించింది. తమాయించుకున్నాను. ఆంజనేయ దండకాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను.

 

    నక్కలు చీకటిని చూసి కాబోలు ఏడుస్తున్నాయి. ఏవో పిట్టలు అప్పుడప్పుడూ శబ్దం చేస్తున్నాయి.

 

    సైకిల్ వూరుదాటి రోడ్డెక్కింది.

 

    "ఏరా బుజ్జీ! నిన్నెందుకు రమ్మంది. ఏదైనా మాట్లాడు" అన్నాడు మామయ్య. ఆయన మాటలంటే చెవి కోసుకుంటాడు. ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూనే వుండాలి. ఆ గుణంతోనే నన్ను లేపుకొచ్చాడు.

 

    శవం కాపలాకు వెళుతూ ఎగ్జిబిషన్ కు వెళుతున్నంత ఖుషీగా మాట్లాడమంటే అది వీలయ్యేపనా? నాకు నోరు అప్పటికే పిడచకట్టుకుపోయింది. అది దాహంకాదు. భయంతో ఒంట్లోని నీళ్ళన్నీ ఆవిరైపోయాయి.

 

    "ఇంతకీ బాగా చదువుతున్నావా ?" ప్రశ్నించాడు మామయ్య.

 

    "ఎక్కడ ప్రభూ చదువు. రాత్రిపూట నీ పిట్టల్ని వండడానికే లాంతర్ సరిపోతూ వుందే. ఇక పగలంటావా నీ పిల్లలు ఇంటిని కిష్కంధ కింద మార్చేస్తున్నారే. ఈ పరిస్థితుల్లో చదువుకోవడం కూడానా" అని మామయ్యను దులిపేద్దామనుకున్నాను. మామయ్య మీసాలు గుర్తొచ్చి మానేశాను.

 

    "టీచర్లు బాగానే చెబుతున్నారా!"

 

    "ఆ!"

 

    ఏదో పురుగు నా చెంపల మీద వాలి పైకెగిరింది.

 

    "మీ నాన్న వారం రోజులుగా రాలేదు కారణమేమిటి?"

 

    "ఏమో మామయ్యా ! పొలం పనులేమో!"

 

    సైకిల్ ఎగుడు దిగుడుగా పోతూ వుంది. కంకరంతా లేచిపోయి గులకరాళ్ళు పైకి లేచివటం వల్ల సైకిల్ కుదుపులిస్తూ సాగుతూ వుంది.

 

    రోడ్డు పక్కనున్న ముళ్ళ పొదలు ముసుగేసుకుని కూర్చున్న మనుషుల్లా వున్నాయి. మైలురాళ్ళు తెల్లగా లేచి కూర్చున్న శవాల్లా వున్నాయి. జోరీగల శబ్దాలు రాత్రి గాఢత్వాన్ని సూచిస్తున్నాయి. ఆకాశం తారుతో స్నానం చేసినట్లు అతి నల్లగా వుంది.

 

    ముఖం మీద ఠప్ మని పడడంతో వులిక్కిపడ్డాను. సైకిల్ సీటు కమ్మీలను పట్టుకున్న నా చేతులు ఇంకా బిగుసుకున్నాయి.

 

    ముఖంమీద పడ్డది వానచుక్క.

 

    "ఏరా బుజ్జీ ! వాన వచ్చేట్టుంది. నిన్ను పిలుచుకురాకుండా వుంటే బావుండేదేమో!" అన్నాడు మామయ్య.

 

    ఆ మాటలతో ఇంకా భయమేసింది నాకు.

 

    అప్పుడప్పుడు చినుకులు గుండు సూదుల్ని గుచ్చుతున్నట్టు పడుతున్నాయి.

 

    దేనికో గుద్దేసినట్టు సైకిల్ ఒక్కసారి కుదుపిచ్చి ఆగింది.

 

    మామయ్య కింద కాలు పెట్టి సైకిల్ ను బ్యాలెన్స్ చేశాడు.

 

    సైకిల్ ఎందుకు ఆగిందో కూడా ఆలోచించలేకపోయాను. ఆ క్షణంలో గుడ్డివాడైపోతే ఎంతో హాయిగా వుంటుందనిపించింది.

 

    "సైకిల్ గుద్దుకుంది దేనికో కాదురా బుజ్జీ! శవానికి" అని నవ్వుతున్నాడు మామయ్య.

 

    శవానికి సైకిల్ గుద్ది, అది జోక్ గా నవ్వగలిగిన శక్తి ప్రపంచంలో మామయ్య ఒక్కడికే వుంది.

 

    అప్పటి నా పరిస్థితి మాటల్లో చెప్పలేను. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. నాకు తెలియకుండానే కళ్ళు అదురుతున్నాయి. సీట్ కమ్మీలను ఇంకా గట్టిగా పట్టుకున్నాను. మామయ్య వీపులో నా ముఖాన్ని దూర్చేయ్యాలనిపించింది.

 

    "ఎవరక్కడ" అని అరిచాడు మామయ్య. ఒక్కసారి నా ఒళ్ళు జర్క్ ఇచ్చింది. ఆయనకు నా ముఖం కొట్టుకుంది. అంత కటువుగా ఆయన ప్రశ్నించడం అదే మొదటిసారి.

 

    మామయ్య సైకిల్ దిగాడు. నేను మాత్రం సీటు నుంచి దిగలేదు.

 

    "రేయ్ బుజ్జీ ! దిగు" అని గదిమాడు మామయ్య.

 

    నేను కిందకు దిగి, నిక్కర్ పైకి లాక్కున్నాను.

 

    మామయ్య టార్చి వేశాడు.

 

    కిరోసిన్ దీపం వెలుగు ప్రవహిస్తున్నట్లు అది వెలిగింది.

 

    అంతలో ఓ ఆకారం మా ముందుకు రావడం కనిపించింది.

 

    నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను.

 

    "ఎవరయ్యా నువ్వూ !" మామయ్య గద్దించాడు.

 

    నోరు విప్పలేదు ఆ ఆకారం.

 

    నిక్కర్ తడిసిపోయిందేమోనని నా అనుమానం.

 

    కళ్ళు మరీ పెద్దవిచేసి చూస్తున్నాను.

 

    ఆ ఆకారం మరింత దగ్గరకొచ్చింది.

 

    ఎవరో ముసలాయన తలంతా పండిపోయింది. దాదాపు అరవై ఏళ్ళుంటాయి ఆయనకు.

 

    మామయ్య ఆయనవైపు పరిశీలించి చూసి "ఎవరయ్యా" అని శాంతంగా ప్రశ్నించాడు.

 Previous Page Next Page