Previous Page Next Page 
మగబుద్ధి పేజి 6


    ముక్కలుగా కట్ చేసిన ఫ్లమ్ కేక్ లు వున్న ట్రేలా పొడవుగా పరుచుకున్న ఆ భవనాన్ని చూస్తూనే ఈ ఉద్యోగం తనకు రాదని గట్టిగా అనిపించింది.

 

    పచ్చటి లాన్ మధ్యలో వున్న తారు రోడ్డంట నడిచి ముందుకెళ్ళాడు. ద్వారం దగ్గర ఖాకీ బట్టలేసుకున్న వ్యక్తి ఆగమన్నట్టు సైగ చేశాడు. నరేష్ నిలబడ్డాడు.

 

    చేతిలో ఫైల్ ను పట్టుకుని వున్న అతన్ని చూసి "ఇంటర్వ్యూకి వచ్చావా ఈ వరండాలోంచి నడిచెళ్ళి చివరకు వెళ్ళండి అక్కడున్న హాల్ లో కూర్చోండి" అని చెప్పాడు గూర్ఖా.

 

    అలానేనని తలవూపి లోపలకు అడుగుపెట్టాడు.

 

    అతను వెళ్ళేసరికి అక్కడ ఐదుగురు యువకులు నర్వెస్ గా ఫీలవుతూ కూర్చుని వున్నారు.

 

    ఆడపిల్ల స్ట్రక్చర్ చూడడానికి అలవాటైన అతనికళ్ళు వాళ్ళకెదురుగ్గా బెరుగ్గా కూర్చున్న అమ్మాయిపై వాలి, ఆమె వేసుకున్న 'వి' నెక్ జాకెట్ ను పట్టుకున్నాయి.

 

    "ఎవరో ఈ అమ్మాయి? అచ్చు స్టెత్ మరిచిపోయి వచ్చిన డాక్టర్ లా వుంది. 'వి'నెక్ జాకెట్టు ఈమెకు బాగా నప్పింది" అనుకుంటూ కూర్చున్నాడు.

 

    "ఇంటర్వ్యూలు మొదలయ్యాయా?" నెమ్మదిగా అడిగాడు నరేష్ పక్కనున్న యువకుణ్ని.

 

    "ఆఁ" అంతకంటే ఏమీ మాట్లాడలేనట్టు దీర్ఘం తీశాడు ఆ యువకుడు.

 

    "నరేష్ అనేపేరు పిలిచారా?"

 

    "లేదు" ఆ యువకుడు మాటిమాటికి ముఖాన్ని కర్చీఫ్ తో తుడుచుకుంటూ వుంటే, ఆ పక్కనున్న అతను

క్షణానికోసారి వాచీ చూసుకుంటున్నాడు.

 

    నరేష్ మాత్రం ఎదురుగ్గా కూర్చున్న అమ్మాయితో అందమైన భాగమేదో పరిశీలిస్తున్నాడు.

 

    ఇంటర్వ్యూలు అలవాటైపోవడం - ఎలానూ ఉద్యోగం రాదన్న నమ్మకం అతన్ని టెన్షన్ నుంచి విముక్తుడ్ని చేశాయి.

 

    బెల్ మోగింది.

 

    "నరేష్" తలుపు దగ్గరున్న బంట్రోతు అరిచాడు.

 

    ఉలిక్కిపడి లేచాడు. ఎంత అలవాటైనా ఆ క్షణం వచ్చేసరికి గుండె వేగంగా కొట్టుకుంటూ వుంది. అరచేతుల్లోనూ, పాదాల్లోనూ చెమట వూరింది.

 

    స్ప్రింగ్ డోర్ తెరిచి తలను లోపలకు జొనిపాడు.

 

    డిమ్ లైట్ వెలుగుల్లో ఆ గది మొసళ్ళ మడుగులా వుంది. డాల్ఫిన్ చేపలకు ఫ్యాంటూ, షర్టూ, కోటు తొడిగి కుర్చీలో కూర్చోపెట్టినట్టు ఓ వ్యక్తి వున్నాడు. ఇంటర్వ్యూ అంటే ఓ నలుగురయిదుగురు వుంటారని కంగారుపడుతున్న నరేష్ ఒక్కరే వుండడంతో కాస్తంత ధైర్యంగా లోపలకు అడుగుపెట్టాడు.  

 

    స్ప్రింగ్ డోర్ అతని వెనుక నిశ్శబ్దంగా మూసుకుంది.

 

    "గుడ్ మార్నింగ్ సర్" పొలైట్ గా చెప్పాడు నరేష్.

 

    "ఎస్ సిడౌన్" కుర్చీలోని వ్యక్తి గంభీరంగా అన్నాడు.

 

    అతను ఒదిగి కూర్చున్నాడు.

 

    "ఐయామ్ మారుతీరావు. ప్రొప్రయిటర్ ఆఫ్ దిస్ కంపెని" తనకు తాను పరిచయం చేసుకున్నాడాయన.

 

    ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తే కంపెనీ యజమాని అని తెలియడంతో మరింత బిగుసుకుపోయాడు అతను.

 

    ఆయన్ను పరిశీలించి చూశాడు.

 

    వయసు నలభైదాకా వుంటుంది. ఆరోగ్యం తాలూకు కళతో మెరిసిపోతున్నాడు. ఖరీదైన బట్టల్లో హుందాగా వున్నాడు.

 

    "ఏం పేరు?" అడిగాడాయన.

 

    "నరేష్"

 

    "ఏం చదువుకున్నావ్?"

 

    "ఎం.ఏ. ఫిలాసఫీ"

 

    "గుడ్. ఫిలాసఫీని ఆడపిల్లలు చదవరెందుకు?"

 

    వూహించని ప్రశ్న అది. ఇంటర్వ్యూ మొదలయిందని అర్థమైంది. ఆయన అడిగింది నిజమే. తన క్లాస్ లో ముప్పైమంది యువకులుంటే, ఇద్దరే అమ్మాయిలుండేవాళ్ళు.

 

    ఏదో చెప్పడానికి నోరు తెరచి, అది కరెక్ట్ జవాబు కాదని అనిపించడంతో తిరిగి నోరు మూశాడు అతను.

 

    స్త్రీ ఫిలాసఫర్లు ఎవరూ లేరు చరిత్రలో. సోక్రటీస్ నుంచి సార్త్ర్ వరకు అందరూ పురుషులే కదా. ప్రపంచంలో ఒక్క స్త్రీ ఫిలాసఫర్ కూడా లేదు ఎందుచేత?"

 

    అది ఇంటర్వ్యూలో రెండో ప్రశ్నని తెలుసు.

 

    ఈ ఉద్యోగం ఖచ్చితంగా తనకు రాదని గట్టిగా అనిపించింది. తెలియదన్నట్టు తలవూపాడు.

 

    ఆయన బిగ్గరగా నవ్వి చెప్పడం ప్రారంభించాడు.

 

    "స్త్రీ తన అందంవల్లో, తన గయ్యాళితనంవల్లో ఎప్పుడూ పురుషుడ్ని బాధపెడుతుంటుంది. ఈ బాధకు మూలమెక్కడ అని పురుషుడు గింజుకుపోతాడు. ఆ సంఘర్షణ నుంచే పిలాసఫీ పుడుతుంది. సోక్రటీస్ భార్య గయ్యాళి కాకుంటే ఆయన బయటికొచ్చేవాడు కాదు. ఎంచక్కా పెళ్ళాం పక్కన కూర్చుని వేరుశనగకాయలు తింటూ కబుర్లు చెప్పుకునేవాడు. పురుషుడు ఎప్పుడూ స్త్రీని బాధపెట్టలేదు. అందువల్లే స్త్రీలు ఎవరూ నిద్ర పడకమీద నుంచి లేచివెళ్ళి, బోధి వృక్షం కింద కూర్చోలేదు."

 

    అవునన్నట్టు నరేష్ తల వూపాడు.

 

    "ఏ ఇంట్లో అయినా స్త్రీలే ఎక్కువకాలం బతుకుతారు. ఎక్కడికెళ్ళినా మనకు విధవ స్త్రీలే కనపడతారు. స్త్రీకంటే పురుషుడే త్వరగా చచ్చిపోతాడు. ఎందువల్ల?" అడిగాడాయన.

 

    ఆ ప్రశ్నా నిజమే. చాలా ఇళ్ళల్లో అవ్వలే వుంటారు. తాతలు చచ్చిపోయుంటారు. ఎందువల్ల? తనకు తానె ప్రశ్నించుకున్నాడు నరేష్. జవాబు తట్టలేదు. ఆ విషయం గ్రహించిన మారుతీరావు చెప్పాడు. "స్త్రీకి ఆయుష్షు ఎక్కువ. బతికినంతకాలం పురుషుడి శక్తి పీల్చేస్తుంది స్త్రీ. సృష్టి కార్యం మాధుర్యంలోపడి తను ఎంత శక్తి కోల్పోతున్నాడో గ్రహించలేని వెధవ మగవాడు. పడకమీద కూడా పురుషుడి నుంచి తను స్వీకరిస్తుందే తప్ప ఇచ్చేదేమైనా వుందా స్త్రీ. నలభై ఏళ్ళొచ్చేసరికి మగవాడు కీళ్ళ నొప్పులతో, మోకాలి నొప్పులతో బాధ పడడం ప్రారంభిస్తాడు. ఏభై వచ్చేసరికి పడకమీద నుంచి లేవలేడు. అరవైకంతా ఠకీమని నరకం తలుపు తోసుకుని వెళ్ళిపోతాడు. వాడి శక్తినంతా పీల్చేసుకున్న అవ్వ మాత్రం లక్షణంగా ఏ ఎనభయ్యో, తొంభైవరకో బతుకుతుంది."

 Previous Page Next Page