బ్రిటిషు ప్రభుత్వం - దేశీయ సంస్థానాల్లో జోక్యం కలిగించుకోమనీ - వారి స్వాతంత్ర్యాన్ని గుర్తించడం మాత్రమేకాక రక్షిస్తామని ప్రకటించింది.
అంతటి మహావిప్లవానికీ - అంతటి రక్తపాతానికీ - అంతటి బలిదానాలకూ ఫలితం నవాబులకు, మహారాజులకు దక్కింది!
ఫలితాలను పరిశీలిస్తే వెల్లడి అయ్యే విషయాలు -
1. నవాబులకూ - మహారాజులకు ఇంగ్లీషువారి దినదిన గండం విముక్తి లభించింది.
2. నవాబులు - మహారాజుల విలాసాలకూ - దౌర్జన్యాలకూ - వెర్రివేషాలకు అడ్డులేకుండాపోయింది.
మహారాజుల నవాబుల ఏహ్యజీవనాన్ని గురించీ - వారి విశృంఖలత్వాన్ని గురించీ దివాన్ జర్మనీదాస్ "మహారాజు" అనే ఒక గొప్ప గ్రంథం వ్రాశారు.
3. సంస్థానాల ప్రజలను కట్టు బానిసలను చేసి - ప్రభువుల దయా దాక్షిణ్యాలకు వదిలారు. సుమారు 90 సంవత్సరాలు సంస్థానాల ప్రజలు నిరంకుశ ప్రభువుల కింద నిత్యయాతనలు అనుభవించారు.
4. భారతదేశం రెండుగా చీలింది. ఒకటి బ్రిటిషిండియా, రెండవది దేశీయ భారతదేశం.
5. బ్రిటిషు ఇండియాను ఇంగ్లండులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పాలించింది. అక్కడి ప్రజలకు కొంత స్వేచ్ఛ - కొన్ని హక్కులు - కొంత చైతన్యం లభించింది.
6. విప్లవానికి సమిధలు దేశీయ సంస్థానాల ప్రజలు! త్యాగాలు వారివి. పారిన రక్తం వారిది. పోయిన ప్రాణాలు వారివి. కూలిన మానాభిమానాలు వారివి. బ్రిటిషు ప్రభుత్వం తెలివయింది. వారినే శిక్షించింది!
7. స్వాతంత్ర్య సమరంలో అనంత నష్టానికి గురి అయినవారు సంస్థానాల అమాయక ప్రజలు. వీరికి కటిక చీకటి మిగిలింది.
8. సంస్థానాధిపతుల క్రూరత్వానికి హద్దులు లేవు. సంస్థానాల ప్రజా సంఘం పక్షాన జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీరం వెళ్తే అతనిని విచ్చుకత్తులు పట్టి సంస్థానంలో ప్రవేశించనీయలేదు!
మహబూబ్ :
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ పర్యవసానంగా నిజాం రాజ్యానికి ఆంగ్లేయుల బెడద వదిలింది. హైదరాబాదు రాజ్యం స్వాతంత్రరాజ్యం అయింది. నామ మాత్రపు ఆంగ్లేయుల పెత్తనం తప్ప నిజాంరాజు స్వతంత్రప్రభువు.
అప్పటికి ఆంగ్లేయుల కాజేసిందిపోగా మిగిలిన హైదరాబాదు రాజ్య విస్తీర్ణం 82,698 చదరపుమైళ్లు. ఇది ఇంగ్లండు, స్కాట్లండు వైశాల్యాన్ని మించింది.
దీనిని 1. వరంగల్లు, 2. మెదక్,3. గుల్బర్గా,4. ఔరంగాబాదు సూబాలు అంటే సుమారు రాష్ట్రాలుగా విభజించారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఇందులో తెలుగువాడు నివసించు తెలంగాణ జిల్లాలు 8. అవి: 1. వరంగల్లు, 2. కరీంనగర్, 3. అదిలాబాదు, 4. నిజామాబాదు, 5. మెదకు, 6.నల్లగొండ,7.మహబూబ్ నగర్, 8. అత్రాఫ్ ఖుల్దా.
మిగిలిన 8 జిల్లాలు మరత్వాడీ - కర్ణాటకలవి.
తెలంగాణపు మొత్తం వైశాల్యం 41,502 చదరపుమైళ్లు.
హైదరాబాదు రాజ్యానికి స్వంత కరెన్సీ ఉండేది. దీనిని హాలీ సిక్కా అనేవారు. ఏడు హాలీ రూపాయలకు ఆరు బ్రిటిషు రూపాయలకు ఆరు బ్రిటిషు రూపాయలు. రాజ్యానికి స్వంత పోస్టల్ సర్వీసు, స్వంత కష్టమ్సు ఉండేవి. పరిపాలనలో సాధారణంగా ఇతరుల జోక్యం ఉండేదికాదు.
భారతదేశ వ్యాప్తంగా ఉండిన సుమారు 600 దేశీయ సంస్థానాల్లో హైదరాబాదు రాజ్యం అన్నింటికన్న పెద్దది!
ఆరవ నిజాం అఫ్జలుద్దౌలా 41 సంవత్సరాల వయస్సులో అల్లాకు ప్రియుడయినాడు. అతని తరువాత ఆరవ నిజాం మహబూబలీఖాన్ 1869లో గద్దె ఎక్కాడు. అప్పుడు అతని వయసు మూడు సంవత్సరాలు. అయితే, సమర్థుడయిన ప్రధాని సాలార్ జంగ్ నేతృత్వంలోనూ - ఆంగ్లేయుల ఛత్రచ్ఛాయలోనూ ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా పరిపాలన సాగింది.
మహబూబ్ అంటే ప్రియుడు. మహబూబ్ యుక్త వయస్కుడయి ప్రజలకు మహబూబ్ - అంటే ప్రియుడయినాడు. మహబూబ్ సాత్వికుడు. ఉదారుడు. సహృదయుడు. మతసహనం కలవాడు. కాని, పాలకుడుగా అంత సమర్థుడు కాడు. సాలార్ జంగ్ ఛత్రచ్ఛాయలో అతని బలహీనత కనిపించలేదు.
మహబూబ్ కాలంలో హైదరాబాదుకు స్థిరత్వం వచ్చింది. ఆర్థిక అనిశ్చితత దూరం అయింది. హైదరాబాదులోనికి కూడా ఆధునికత తొంగి చూచింది. రైలు వచ్చింది. విద్యుత్తు వచ్చింది. టెలిఫోను వచ్చింది. టెలిగ్రాం వచ్చింది. కొన్ని స్కూళ్లు వెలిశాయి. ఉర్దూ పత్రికలు వెలువడ్డాయి. గ్రంథాలయాలు వెలిశాయి.
సాలార్ జంగ్ గుణగ్రాహి. రత్నపరీక్ష అతనికి బాగా తెలుసు. అతడు అనేకమంది విద్వాంసులను - ప్రతిభావంతులను హైదరాబాదుకు చేర్చాడు. అలాంటివారిలో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ ఒకరు. ఛటోపాధ్యాయ బ్రహ్మసమాజి. సంస్కరణవాది. సాలార్ జంగ్ అతన్ని హైదరాబాదు కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమించాడు.
ఛటోపాధ్యాయ ఇల్లు హైదరాబాదులో బ్రహ్మసమాజ స్థావరం అయింది. అతడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా - విధవా వివాహాలకు అనుకూలంగా అనర్గళంగా మాట్లాడేవాడు. వారి ఇంటికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకూ పెరగసాగింది. అతడు ఎన్నడూ పభుత్వాన్ని విమర్శించలేదు. కాని, సంస్కరణలకు సంబంధించిన మాటలు సహితం సహించలేని కరుడు గట్టిన ఫ్యూడల్ ప్రభుత్వం అది. ప్రభుత్వం అఘోరనాథ్ ను అసహనంగా చూచింది. అతణ్ణి విప్లవకారుడు అని శంకించింది. అయినా అతడు ప్రిన్సిపాల్. సమయంకోసం నిరీక్షించింది.
సాలార్ జంగ్ గతించాడు. అతడు ప్రారంభించదలచిన రైల్వేలైను విషయంలో వివాదం ఏర్పడింది. రైల్వేలైను బ్రిటిషు వారి దయాధర్మాలమీద ఆధారపడిందనీ, దానికోసం రాజ్యంలో ఒక భాగం తాకట్టు పెట్టాల్సి వస్తుందనీ వదంతి ప్రారంభం అయింది. రైల్వేలైను విషయంలో ప్రభుత్వం యధార్థాలు దాస్తున్నదనీ - వాటిని బయట పెట్టాలనీ కొందరు నగరవాసులు కోరారు. ఛటోపాధ్యాయ దానికి నాయకత్వం వహించారు. ఛటోపాధ్యాయ ప్రభుత్వాన్నే సవాలు చేస్తున్నాడు అనుకున్నాడు నిజాం. అసలే అక్కసుగా ఉంది. తీర్చుకున్నాడు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా?
ఒకనాటి సాయంకాలం పోలీసులను తీసుకొని పోలీసు నాజమ్ ఛటోపాధ్యాయ ఇంటికి వచ్చాడు. ఒక కాగితం చూపించాడు. రైల్వేస్టేషనుకు నడవమన్నాడు. తలపాగ సహితం తీసుకోనివ్వలేదు. ఉన్నవాడిని ఉన్నట్లుగా బయటికి నడిపించారు.
అప్పటికి నాలుగేళ్ల పిల్ల అయిన అతని కూతురు సరోజిని దిగాలుపోయి చూచింది. ఈమెయే భారత కోకిల సరోజినీ నాయుడు.
అఘోరనాథుని రైల్వేస్టేషనులో గంటల తరబడి ఉంచాడు. ఇతరులను అతని దరికి చేరనీయలేదు. అప్పుడు రైలు వచ్చింది. అతనిని సెకండ్ క్లాసులో ఎక్కించారు. 12 మంది పోలీసులు అతని వెంట ఎక్కారు. కాజీపేటలో 9 గంటలు ఉంచారు. మరొక బండి ఎక్కించి హైదరాబాదు రాజ్యం దాటించి, ఊపిరి పీల్చుకున్నారు!
మహబూబ్ దివాంధత్వానికి ఇది ఉదాహరణ. సంస్థానాధీశులు అందరూ అందరే! ఏ ఒక్కడూ అసమ్మతిని సహించడు. ఇలాంటి సర్కారు క్రింద నలిగారు తెలంగాణం ప్రజలు వందలయేళ్లు!
మహబూబ్ కు ప్రియతమునిగా - ఉదారునిగా పేరు తెచ్చింది మూసీకి వచ్చిన వరద!
1908 సెప్టెంబరులో నగరంలో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం నిరంతరాయంగా కురిసింది. నదీ పరివాహక ప్రాంతంలోని 221 చెరువులు తెగినాయి. మూసీకి ఉప్పెన ప్రళయంలా వచ్చింది. నదిమీద కట్టిన నాలుగు వంతెనలను ముంచింది. సెకండుకు లక్ష ఘనపుటడుగుల నీరు ఈ నదిలో పెరిగింది.
సొగసుగా ప్రవహించిన నది ప్రళయం సృష్టించింది. హైదరాబాదును ముంచింది. 20,000 ఇళ్ళు కూలాయి. 15,000 మంది మృత్యువాత పడినారు.
ఆ ప్రళయంలో ఒకేఒక చింతచెట్టు అనేకమందిని కాపాడింది. ఉస్మానియా హాస్పిటల్ ముందు ఉన్న పార్కులో ఆ చెట్టు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచివుంది.
ఈ వినాశాన్ని చూచి మహబూబ్ కదలాడు. ఒక వెండి చేటలో పసుపూ - కుంకుమ తెచ్చి, కోపం తగ్గించుకొమ్మని మహబూబ్ నదికి నమస్కరించాడని చెప్పుకొంటారు. మహబూబ్ స్వయంగా బాధితులను పరామర్శించాడు. బాధితులకు ఉదారంగా సాయం చేశాడు. అతన్ని జాగీరుదార్లు - ధనికులు అనుసరించారు.
ఆపదలో తన ప్రజలకు వాస్తవంగా సాయంచేసి అతడు ప్రజలకు మహబూబ్ -ప్రియుడు - అయినాడు.
1911లో మహబూబ్ బేగములలో ఒకామె తన పసివాణ్ణి మహబూబ్ కు వారసునిగా ప్రకటించమని వత్తిడి తెచ్చింది. మహబూబ్ కు అది ఇష్టం లేదు. అతడు మనస్తాపానికి గురి అయినాడు. పురానీ హవేలీ నుంచి ఫలక్ నుమాకు చేరుకున్నాడు. మధువును ఆశ్రయించాడు. అతని ఆరోగ్యం దిగజారింది.