"ఈ పుస్తకాలేవీ మీరు రిఫర్ చెయ్యకండీ... మీరు సిన్మాలెక్కువ చూస్తుంటారా?"
"ఓ బ్రహ్మాండంగా చూస్తుంటాను..." టక్కున హేపీగా చెప్పింది ఆ అమ్మాయి.
"అయితే-మీకు చిన్న టెస్టు... ఫస్ట్ క్వశ్చన్... దివ్యభారతి "ఫుడ్" హేబిట్సేమిటి? రెండో క్వశ్చన్... ఘరానా మొగుడు సిన్మాలో నగ్మా ఎన్ని చీరెలు మార్చెను...?"
"దివ్యభారతి... మార్నింగ్ న ఆమ్లెట్లూ, ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది... ఆ తర్వాత అరడజను కేడ్ బరీ చాక్ లెట్లు తింటుంది... మధ్యాహ్నం లైట్ వెజిటేరియన్ మీల్స్... "డాల్" ఎక్కువగా తినును... రాత్రి ఫిష్ సూప్ తో డిన్నర్... తర్వాత చాక్ లెట్లు తప్పనిసరి = నగ్మ మొత్తం యాభై ఆరు చీరలు మార్చింది...."
"యూ ఆర్ కరెక్టు... యూ ఆర్ సెలక్టెడ్... గో ఎహెడ్... దుర్యోధన బ్లస్ యూ..." దీవించాడు ఆంజనేయులు.
"నాలో అపారమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పెంచినందుకు... చాలా థాంక్సండీ..." చెప్పేసి వెనుదిరిగిన ఆ అమ్మాయిని-
"మీ పేరండి?" అడిగాడు ఆంజనేయులు.
"మేరీ మాధ్యూసే..." చిరునవ్వుతో చెప్పేసి వెళ్ళిపోయింది.
"అర్జంటుగా ఆఫీసు దగ్గర్లో ఓ గృహము చూసుకొనవలెను..." జ్ఞాపకం రావడంతో గుండె బాదుకుంటూ ఆఫీసులోంచి బయటకు పరుగెత్తాడు. ఆంజనేయులు ప్రియ మిత్రుడు ,సహవాసీ అయిన ఆనందం దగ్గరకు. ఉద్యోగాల వేటలో ఆంజనేయులు, ఆనందం ఓ నెల రోజుల క్రితం కలిశారు. ఒకడు అమలాపురం నుంచి వస్తే, ఇంకొకడు వరంగల్ దగ్గర్నించి వచ్చాడు. కలిసిన దగ్గర్నించి ప్రాణమిత్రులై పోయారు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాంతం కలిసి ఉందామని ప్రతిజ్ఞ చేసుకున్నారు. గబగబా బస్టాపుకు పరుగెత్తి బస్సెక్కి కాచిగూడ చౌరస్తాలో దిగి అక్కడున్న ఓ పుస్తకాల షాపు దగ్గరకెళ్ళి-
"ఆనందం లేడాండి..." అని ఆ ఓనర్ని అడిగాడు. ఆ ఓనర్ అటూ ఇటూ ఒకసారి చూసి, చాచి ఫడేల్మని ఆంజనేయులు దవడ మీద ఒకటిచ్చుకున్నాడు. ఇచ్చుకున్నాక-
"నీ బాబుతోనో, ఆ ఆనందంగాడితోనే చెప్పుకో పో... నిన్నెందుకు కొట్టేనో తెల్సా... ఆడ్నే ఈ దెబ్బకొడుదామనుకున్నాను... అందకుండా తప్పించుకొని పోయాడు... నువ్వు దొరికావు... ఇంకో దెబ్బ కొట్టేముందే... ఇక్కడ్నించి పారిపో..." అరిచాడు ఆ ఓనర్.
"సడన్ గా వాడెందుకు జాబ్... మానేసేడండి..." బిత్తరపోతూ అడిగాడు ఆంజనేయులు చంప తడువుకుంటూ.
"పోయేకాలం వచ్చి... రోజూ తొమ్మిదిన్నరకు షాపు తీస్తాం... ఇవాళ నాక్కొంచెం ఇంటి దగ్గర్నించి వచ్చేసరికి లేటైంది... పదికొచ్చాను... అరగంట లేటెందు కొచ్చావని నాతో తగూలాడాడు... ఓనర్ని వాడా నేనా... ఆడి దగ్గర నేను పన్చేస్తున్నానా నా దగ్గరాడు పన్చేస్తున్నాడా..." అని కసురు కోవటంతో- అక్కడ నుంచి రోడ్డు మీద కొచ్చి నారాయణగూడా వేపు నడవడం మొదలెట్టాడు ఆంజనేయులు.
వీడు ఎక్కడ దొరుకుతాడని వెతకడం?... సాయంత్రం ఏడు గంటల దాకా రోడ్లన్నీ తిరిగి విద్యానగర్ చౌరస్తా దగ్గర నిలబడి అటూ ఇటూ చూడడం మొదలెట్టాడు.
అప్పుడు సడన్ గా ప్రత్యక్షమయ్యాడు ఆనందం.
"ఆ పుస్తకాల షాపులో ఉద్యోగం మానేసేవట... ఆ ఓనరు నన్ను చాచికొట్టి, నువ్వెందుకు మానేశావో చెప్పాడు... నిజంగా ఎందుకు మానేసేవురా..."
"ఫస్టు చాయ్ తాగుదాం పద... ఆ తర్వాత చెప్తాను..." పక్కనే వున్న ఇరానీ హోటల్లోకి నడిచారిద్దరు.
టీ తాగుతూ చెప్పాడు ఆనందం.
"ఆ షాపులో అన్నీ రామాయణాలు, భారతాలు, ప్రబంధాలె ఉంటాయిరా... ఈ వారం రోజులలో ఒక్కమ్మాయి రాలేదు... ఆ షాపుకి అస్సలు అమ్మాయిలు రారని నిన్ననే తెలిసింది... సడన్ గా ఎలా మానేడం... అందుకే గొడవపడ్డా..." చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు ఆనందం.
"ఇద్దరికీ జాబ్ లేకపోతే ఎలాగరా...." జాలిగా అన్నాడు ఆంజనేయులు.
"వస్తా... వస్తా... జాబ్ లేదని ఎవడన్నాడు... సంపాదించా... బ్రహ్మాండమైన జాబు సంపాదించా... ఎక్కడో తెల్సా... పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో... శివం రోడ్లో వుందది... మనకిక ఫికర్ లేదు... కాదు గానీ నీ ఇంటర్వ్యూ ఏమైందో ముందు చెప్పు...."
"ఇంటర్వ్యూ అయింది... ఉద్యోగమూ వచ్చేసినట్టే... కానీ, చిన్న 'లింక్'- ఆఫీసు దగ్గరే ఇల్లుండాలట... ఎలా...."
"అదే మాత్రం అయిదు నిమిషాల పని - పద ఎందుకిల్లు దొరకదో" అంటూ ఆనందం ఉషారుగా లేచాడు.
* * * *
మరో ఇరవై నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ ముషిరాబాద్ ఏరియాలో రెంటల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరున్నారు.
"ప్రస్తుతానికి సింగిల్ రూమ్స్ లేవు... ఒన్ మంతు ఆగి రండి... చూద్దాం..." చెప్పాడా ఏజెంట్!
"ఒన్ మంతే ఆగితే వీడెందుకట... మనమే రూమ్ కట్టెయ్యగలం... సైట్ దొరికితే... ఎర్లీ మార్నింగ్ వేట మొదలెడదాం... పద..." అన్నాడు ఆనందం.
"మరి రాత్రికి పడకెక్కడ్రా..." అడిగాడు ఆంజనేయులు.
"పడుకో... రెడీ... భోజనమూ రెడీ... పద చెప్తాను..." విద్యానగర్ చౌరస్తాలోకి తీసుకొచ్చాడు.
ఓ మెస్ లోకి నడిచాడు.
భోజనంచేసి తిరిగొస్తున్నప్పుడు అడిగాడు ఆంజనేయులు.
"మెస్ తిక్కెట్లెక్కడ సంపాదించావ్"
"అదొక కళరా శిష్యా... ఫోన్ బూత్ బాజ్ లో చేరానా... మా ఓనరు ఈ మెస్ లోనే మంత్లీ టిక్కెట్లు తీసుకుని రెండు పూట్లా భోంచేస్తాడని, చేరిన పావుగంటకే తెలుసుకొన్నాను... అంతే... ఓ ఆరు టిక్కెట్లు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. నాలుగు రోజులైనా ఉద్యోగం చేయకపోతానా అని మెస్ టిక్కెట్స్ యిచ్చాడు. మనం రోజుకో ఉద్యోగం చేస్తామని వాడికేం తెలుసు పాపం... పూటకు గతిలేని దేశంగా మార్చిన మన రాజకీయ నాయకులు జిందాబాద్... పదా అంతర్జాతీయ తెలుగు సంస్థకి..." ఆనందం ఆనందంగా అంటూ ముందుకు సాగాడు... అక్కడికి ఐదారు కిలోమీటర్లు దూరంలో వున్న ఆ గవర్నమెంటాఫీసుకి.
* * * *