"గుండ్రాయిలా అక్కడే కూర్చుని అన్నీ విన్నాడు. ఏరా...నువ్వు ఆ పిల్లతో ఏం చెప్పావు?" అని వాళ్ళ నాన్న అడిగితే, 'అమెరికా సంబంధం నేను చూస్తానన్నాను' అన్నాడు" అంది.
పెద్దక్క కళ్ళల్లోంచి ఇండుపగింజలలాటి కన్నీటిబొట్లు అప్పుడు రాలిపడ్డాయి. "నిజంగా అలా అన్నాడా?" అంది.
"ఆ...ఆ పిల్లకి ఎప్పుడూ పెళ్ళి ధ్యాసే. నన్ను చూసి ఏవేవో ఊహించుకునేది. దానికి నేనా బాధ్యుడ్ని? అన్నాడు. వాళ్ళ నాన్న అందరం తలో వందా వేసుకుంటాం అంతకు తగ్గ గంతని చూసి పెళ్ళిచేయండి అన్నాడు" అంది చిన్నక్క.
"మరి వాడు... నన్ను..." అని పెద్దక్క ఏదో అనబోతుంటే, "అయిందేదో అయింది ఇంక ఆ సంగతి మర్చిపో!" అని చిన్నక్క ఆపేసింది.
ఆ రోజు తర్వాత పెద్దక్క మారిపోయింది. తల దువ్వుకోవడం, శ్రద్ధగా తయారవడం మానేసింది.
నాన్న కాళ్ళకి చక్రాలు కట్టుకుని అక్కకి సంబంధాల కోసం తిరుగుతున్నాడు.
సరయూ అక్క ఓనాడు ఎక్కడికో వెళ్ళివస్తూ మధుని దార్లో కలిసి నిలదీసిందట. "నన్ను పెళ్ళి చేసుకుంటానన్నావు. ఎన్నెన్నో ఆశలు కల్పించావు. మరి మీ అమ్మా నాన్న ముందు ఏమీ ఎరగని నంగనాచిలా మాట్లాడావుట ఎందుకూ?" అందిట.
మధు నవ్వి "నేను అంటే మాత్రం నువ్వు నిజం అని ఎలా అనుకున్నావు? ఏదో ఈ రెండు నెలలూ సరదాగా ఉంటావనుకున్నాను" అన్నాడట.
పెద్దక్క చిన్నక్కతో ఈ విషయమంతా చెప్పి "ఆ నీచుడు బాగుపడడు. నన్నింత ఏడ్పించాడు. నాశనం అయిపోతాడు" అని ఏడ్చింది.
మధ్యతరగతి ఆడపిల్లకి కోర్కెలు కూడా రేషన్ అని దానికి అర్థం కాలేదేమో కానీ ఆ సంఘటనతో మా ఇద్దరికీ మాత్రం మా తాహతేవిటో అర్థం అయింది.
ఎండాకాలం సెలవులొచ్చాయి.
శివ పదోతరగతి పరీక్షలు రాశాడు. హాస్టల్ కి వెళ్ళిపోతానేమో అనగానే నాకు ఏడుపొచ్చింది.
నాకు సుబ్బలక్ష్మితో చింతపిక్కలాడడం కన్నా శివతో బొంగరాలు ఆడటం, బావి మెట్లమీద కూర్చుని అతను చెప్పే సినిమా కథలు వినడమంటేనే ఎక్కువ ఇష్టం!
మధ్య మధ్యలో అతను నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నేను బరబరా మూతి తుడిచేసుకుంటాను.
అతని ముందు కూర్చున్నప్పుడు నేను ఓ మహారాణిలా ఫీలవుతాను. పండిన బాదంకాయలూ, జామపండ్లూ, తేగలూ జేబులో పెట్టుకొచ్చి ఇచ్చేవాడు, ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు తెచ్చిన క్యాడ్ బరీస్ చాక్లెట్స్ కూడా! అతని స్నేహితులు కూడా నన్ను చాలా బాగా చూసేవాళ్ళు. రేషన్ షాప్ క్యూలో, పాలపాకెట్ల క్యూలోనూ నిలబడనిచ్చేవాళ్ళు కారు. వాళ్ళే పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. గోరింటాకు కోసుకొచ్చి పోసేవాళ్ళు. పతంగులు ఎగురవేసేటప్పుడు నన్ను ప్రత్యేకంగా చూడటానికి రమ్మని పిలిచేవాళ్ళు.
ఈ ప్రత్యేకతలన్నీ నావయసు తెచ్చిన అందంవల్లనే అని నాకు తెలుసు. ఆ అందంపట్ల నాకు మక్కువ పెరిగింది. కళ్ళకి చివర్ల పొడుగ్గా కాటుక పెట్టేదాన్ని. జుట్టు నుదుటిమీదకి ఉంగరాలు తిప్పడం, కనుబొమలు కలిసేచోట బొట్టుపెట్టడం చేసేదాన్ని.
చిన్నక్క ఓసారి "ఏవిటీ షోకులూ? ముందు మార్కులు తెచ్చుకో" అని తిట్టింది.
దానికి ఇవన్నీ పట్టవు.
గాలివీస్తే సంతోషంతో ఒణకడం, తెల్లని వెన్నెలలో వీథులన్నీ కప్పబడినట్లు అనిపించడం, పారిజాత సుమపరిమళాలు నిద్రచెడగొట్టడం, నా ప్రతి కదలికా సృష్టి ఊపిరి బిగపట్టి చూస్తున్నట్లు ఉండడం ఇవన్నీ చిన్నక్కకి అనుభవంలేదు. అందుకే విసుక్కునేది.
ఈ వేసవి నేను చాలా సంతోషంగా గడిపాను. కానీ చివర్లో అపశృతిలా మా వీధి చివర ఇంట్లోకి ఓ కుటుంబం అద్దెకి దిగింది. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి.
బొంబాయి నుండి వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఫ్యాషన్ వుండేది. సినిమా పత్రికలో అమ్మాయిలా బట్టలు వేసుకొనేది. పెద్దగా అందంగా ఉండకపోయినా లూనా నడుపుతూ, గట్టిగా హిందీలో వాళ్ళ తమ్ముడ్ని కేకలేస్తూ, వీధంతా సందడి చేసేది.
శివా మిత్రబృందానికి చేతినిండా పని తగిలింది. ఆ అమ్మాయి తమ్ముడితో స్నేహం చేశారు. ఆ అమ్మాయితో కూడా త్వరలోనే మాట కలిపారు. ఆ అమ్మాయి శివావాళ్ళ బాదం చెట్టు ఎక్కడానికీ, శివకి ఆ అమ్మాయి లూనా నడపడానికీ అట్టే సమయం పట్టలేదు!
ఎదురింట్లోనించి నేను వాళ్ళ నాటకాలన్నీ గమనిస్తూనే వున్నాను. నాకు ఒళ్ళంతా చీమలూ జెర్రులూ పాకుతున్నట్లుగా అనిపించాయి.
శివని పట్టుకుని "ఏవిటీ నీ కొత్త స్నేహితురాలే నీకు లోకం అయిపోయిందే?" అన్నాను.
"లిల్లీనా?" అన్నాడు.
"లిల్లీనో పిల్లినో నాకు తెలీదు" అన్నాను.
మగవాళ్ళ బుద్ధులు ఇలాగే వుంటాయనీ, కొత్త కనిపిస్తే చాలు వింతగా ఉంటుందనీ నాకు అప్పుడు తెలీదు! నేను కుచ్చులజడ వేసుకుంటే చాలా బాగుందని మెచ్చుకునేవాడు ఇప్పుడు అస్తమానం ఆ పిల్ల బేబీకట్టింగ్ గురించే చెప్తున్నాడు.
"నువ్వూ లిల్లీలా ప్యాంటూ షర్టూ వేసుకుని లూనా నడపడం నేర్చుకోకూడదూ ... చూడు అన్ని పనులూ ఎంత బాగా చేసుకొస్తుందో!" అనేవాడు.
"నాలాగ చింతపిక్కలాడగలదా? మిరపకాయలు దంచగలదా? బియ్యం రవ్వ విసరగలదా? అప్పడాలు ఒత్తగలదా? గొబ్బెమ్మలు పెట్టి ఆడగలదా?" అని కోపం పట్టలేక ఉక్రోషంగా అరిచేదాన్ని.
"అవన్నీ ముసలమ్మ కబుర్లు. మోడ్రన్ గా వుండాలి" అంటూ నా మాటలు కొట్టిపారేసేవాడు.