ఇద్దరం చాలా దగ్గర స్నేహితులైపోయినట్లు ఏవిటేవిటో మాట్లాడేసుకున్నాం.
"ఆ సుబ్బలక్ష్మీ, మీనాక్షీ, టీ.వీ. హేమమాలినీ, ఆండాళ్లూ ఏమి బావుండరు.
"అందుకే నిన్ను చూస్తే వాళ్ళకి కుళ్ళు!"
"ఎవేంజిలీనా కూడానా?" అడిగాను.
"ఆ... ఎవేంజిలీనా కూడా నీకన్నా బావుండదు!" అన్నాడు.
నాకు ఊరటగా అనిపించింది. నన్ను మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు. నాకు ఏమీ అనిపించలేదు. పరికిణీతో మూతి తుడిచేసుకొన్నాను. ఇద్దరం బావిలోంచి బయటికి వచ్చేశాం.
పెద్ద రహస్యం ఏదో నా చిన్న హృదయంలో మోస్తున్నట్లు నేను భారంగా అడుగులేశాను.
ఇంట్లో ఏదో సందడిగా ఉంది. తాతయ్య గంజి పెట్టిన ఖద్దర్ చొక్కా తొడుక్కున్నాడు. పెన్షన్ కోసం వెళ్ళేరోజున తప్ప అలా తొడుక్కోడు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు.
నాన్న ఎవరో పెద్దవాళ్ళతో అరుగుమీదే మాట్లాడ్తున్నాడు. నేను తలవంచుకుని లోపలికెళ్ళాను. లోపల పెద్దక్క పట్టుచీర కట్టుకుని జడలో కందంబమాల పెట్టుకుని చాపమీద కూర్చుని వుంది.
అమ్మ వంటింట్లో హడావిడి పడ్తోంది.
చిన్నక్క ఎక్కడా జాడలేదు!
పెద్దక్క కళ్ళు ఎత్తడంలేదు. చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. అమ్మ వంటింట్లో నుండి పకోడీలూ, జిలేబీలూ ఉన్న ప్లేట్లు పట్టుకొస్తూ "అమ్మాయికి పాటలురావుగానీ పనిపాటలు బాగా చేస్తుంది" అంది.
నన్ను చూసి "లోపలికెళ్ళి మంచినీళ్ళు పట్రా" అని పురమాయించింది.
కాసేపయ్యాక అక్కని ముందు గదిలోకి పిలిచారు. నేనూ ఆసక్తిగా కిటికీలో నుండి ఏం జరుగుతోందా అని చూశాను.
కుర్చీ మీద కూర్చున్న వాళ్ళల్లో లావుగా, నల్లగా ఉన్న ఒకతన్ని "సుబ్రహ్మణ్యం, ఏవైనా అడగాలంటే అడగవయ్యా?" అంటున్నారు.
ఆ సుబ్రహ్మణ్యం పెళ్ళి కొడుకని నాకు తెలిసింది.
"మీరు చదువు ఎందుకు ఆపేశారూ?" అతను అక్కని అడిగాడు.
"ఆసక్తి లేక" ఠకీమని చెప్పింది అక్క.
"ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేదా?" అని అడిగాడు.
"లేదు" అంది.
"మరేం చెయ్యాలనుకొంటున్నారూ?"
"అమెరికాలో ఉద్యోగంచేసే అతన్ని పెళ్లాడి ఎంచక్కా అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను"
అమ్మా, నాన్నా, పెళ్ళికొడుకూ, మధ్యవర్తీ ఒకేసారి అదిరిపడిచూశారు.
నాకు గొప్ప వినోదంగా అనిపించింది. లేకపోతే ఆ పిల్లకి ఇష్టమో కాదో ఒక్కముక్కకూడా అడగకుండా, తెలుసుకోకుండా సుబ్రహ్మణ్యంలాంటి కురూపిని మాత్రం 'పిల్ల నీకు నచ్చితే లగ్నాలు పెట్టించేసుకుందాం' అన్నట్లు మాట్లాడేసుకుంటారా? ఆడపిల్లంటే ఎంత అలుసూ!
నాన్న చప్పున తేరుకుని "ఏదో చిన్నపిల్ల. తెలిసీ తెలీక..." అంటూ సర్దిచెప్పబోయాడు.
"కాదు. నిజంగానే అంటున్నాను" అంది పెద్దక్క.
దాంతో రంగం మారిపోయింది. పకోడీల ప్లేట్లు క్రింద పెట్టేసి వాళ్ళు లేచి పోయారు.
అమ్మ అక్కని లోపలికి ఈడ్చుకొచ్చి జుట్టు పట్టుకుని కసిదీరా కొట్టింది. నాన్న వాళ్ళకి పదే పదే క్షమార్పణలు చెప్పుకుని టాక్సీ డబ్బులిచ్చి పంపించాడు.
తాతయ్య ఏవీ అర్థంకాక లోపలికి వచ్చి "ఏవైందర్రా?" అని అడిగాడు.
అక్క వెక్కిళ్ళ మధ్య రావుగారి అబ్బాయి మధు తనని పెళ్ళి చేసుకుంటానన్నాడని చెప్పేసింది. ఈసారి అందరూ డబల్ ఆశ్చర్యపోయారు. రావుగారు చాలా ధనవంతులు. వాళ్ళ ఆవిడకి ఎప్పుడూ ఒంట్లో బావుండదు. అమ్మ ఎప్పుడైనా పెద్దక్కని ఆవిడకి సాయం చెయ్యడానికి పంపిస్తుండేది!
"వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి సంబంధం సంగతి అడిగితే చెప్పుచ్చుకుకొడ్తారు!" అన్నాడు నాన్న.
"మధు నన్ను తప్ప ఎవర్నీ చేసుకోడు!" భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు చెప్పింది సరయూ.
కాళింది స్నేహితురాలింటినించి వచ్చింది. మొత్తం ఆకళింపు చేసుకుంది. అమ్మా, నాన్నా వెళ్ళి ధైర్యం చేసి రావుగారితో మాట్లాడ్డమే బావుంటుంది అంది.
అమ్మకీ ధైర్యం చాలలేదు. నాన్నతో చిన్నక్కే వెళ్ళింది. పెద్దక్క చాలా ధైర్యంగా ఉంది. ప్రేమ ఇచ్చే మొండితనం, ధైర్యం లోకంలో మరే శక్తీ ఇవ్వలేదనుకుంట.
ఇంట్లో నాన్నా వాళ్ళు తిరిగి వచ్చేదాకా శ్మశాన నిశ్శబ్దం రాజ్యం ఏలింది.
తాతయ్య ఒకటే సణుగుడు. "పిదపకాలం...పిదప బుద్ధులూ..." అంటూనూ.
అమ్మ వంట కూడా చెయ్యలేదు.
కాళింది నాన్న చెయ్యి పట్టుకుని ఆసరాగా నడిపిస్తూ లోపలికి తీసుకొచ్చింది. ఆయన నీరసం పట్టి ఏం జరిగిందో మాకు గ్రాహ్యమైంది.
నాన్న అమ్మతో "సౌదామినీ...దానికింత విషం పెట్టి మనం ఇంత తింటే బావుండేది. అంతకంటే తక్కువ అవమానం పడలేదు!" అన్నారు.
అమ్మ భోరుమని ఏడ్చింది.
కాళింది పెద్దక్కతో చెప్పింది. "మధుకి ఇంజనీర్ పిల్లనే చూశారుట. వచ్చే నెలలో పెళ్ళి చేసుకుని భార్యతో కూడా అమెరికా వెళ్ళిపోతాడుట.
కోటీశ్వరుల ఒక్కగానొక్క బిడ్డట. ఏదో చిన్నప్పటినుంచి తెలిసిన పిల్లని వేళాకోళాడుతుంటాడు. దాన్ని పట్టుకుని నిజం అనుకున్నారా...మీ తాహతెక్కడా, మా తాహతెక్కడా? ఏదో వంట సాయానికి పిలిచాం కానీ ఇంటికే ఎసరు పెడ్తారు అనుకోలేదు. తక్కువ బుద్ధులు ఎక్కడపోతాయి?" అందిట రావుగారి భార్య.
పెద్దక్క అపనమ్మకంలా "మధు ఏమన్నాడూ?" అని అడిగింది.