Previous Page Next Page 
జైలు పేజి 7


    శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పవళించినట్లు అతను కుడిచేతి మీద తల ఆనించి పడుకున్నాడు. శంఖు, చక్ర, గదల్లాగా అతని పక్కన నైఫ్, గన్, బాంబు వున్నారు. ఆ ముగ్గురూ ఖైదీలే. జెయిల్లో తన శిష్యరికం స్వీకరించిన తర్వాత వాళ్ళకు ఆ పేర్లు పెట్టాడు దాదా.

 

    "రేయ్! నైఫూ! నువ్వెళ్లి టిఫిన్ పట్టుకురారా!" దాదా ఆజ్ఞాపించటంతో పైకి లేచాడు నైఫు.

 

    నాలుగుప్లేట్లు తీసుకుని సరాసరి వార్డర్ల దగ్గరకి వెళ్ళాడు.

 

    నైఫ్ క్యూలో రాకుండా నేరుగా వెళ్ళడాన్ని గమనించాడు తిలక్.

 

    నాలుగుప్లేట్లలో చపాతీలు వేసి కూర్మా పోశాడు వార్డర్లు. తన పని అయిపోగానే వెనక్కి తిరిగి నడవడానికి ఉపక్రమించాడు నైఫు. అయితే తనకు అడ్డంగా ఎవరో నిలుచున్నట్టనిపించి తల పైకెత్తాడు.

 

    "ఎవరు నువ్వు?"

 

    "తిలక్ అనే ఖైదీని"

 

    "కొత్తగా వచ్చావా?" నైఫ్ వెటకారంగా చూశాడు.

 

    "అవును"

 

    "దారికడ్డం జరుగు"

 

    "నిన్ను వెళ్ళనివ్వను. మర్యాదగా ప్లేటులోని చపాతీలను తిరిగి ఇచ్చేసి క్యూలోరా. ఎక్ స్ట్రా తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా మిగిలిన వాళ్ళని వెర్రివాజమ్మలను చేసి డైరెక్టుగా వచ్చి టిఫిన్ తీసుకోవడాన్ని అనుమతించను" స్థిరంగా చెప్పాడు తిలక్.

 

    "నేను క్యూలో రావడం జరగని పని"

 

    "నీతో వాదనలు అనవసరం" తిలక్ అతని ప్లేటులోని చపాతీలను తీసి పాత్రలలో వేశాడు. తిరిగి లైన్ లో వచ్చి నిలబడ్డాడు.

 

    మరి కాసేపట్లో అక్కడ ఏం జరుగుతుందో వూహించిన వార్డర్లు, ఖైదీలు వూపిరి బిగపట్టి చూస్తున్నారు.

 

    ఇదంతా గమనించిన దాదా తన పొజిషన్ మార్చాడు. తను అవతారం మార్చాల్సిన అవసరం వచ్చిందని గ్రహించి లేచి నిలబడ్డాడు. మెల్లగా నడుచుకుంటూ క్యూ దగ్గరకి వచ్చాడు.

 

    ఈలోగా తన వంతు రావడంతో తిలక్ తన ప్లేటును ముందుకు తోశాడు.  

 

    మరుక్షణంలో ఆ ప్లేటు ప్లయింగ్ సాసర్ లా పైకి లేచి గింగుర్లు తిరుగుతూ కిందపడింది.

 

    ఇదంతా క్రీగంటతో చూసిన తిలక్ పక్కకు తిరిగి దాదావేపు చూశాడు.

 

    చూయింగ్ గమ్ నములుతూ విజయగర్వంతో నవ్వుతున్న అతను పరమ భయంకరంగా కనిపించాడు. అతని కళ్ళు తగలబడిపోతున్న పూరిళ్ళులా వున్నాయి.

 

    ఖైదీలంతా చెదిరి వాళ్ళ చుట్టూ కుస్తీ రింగ్ లా దడి కట్టారు.

 

    దాదాను ఇప్పుడు తిలక్ ఎదుర్కొంటాడా లేక భయంతో ఎదురెళ్ళి కాళ్ళమీద పడతాడా అనే సందేహం వాళ్ళ ముఖాలను వికృతంగా మార్చి వేసింది.

 

    తిలక్ దాదాకు మరింత దగ్గరగా వచ్చి శక్తినంతా కళ్ళలోకి తీసుకుని గాల్లోకి డైవ్ చేసి తన్నాడు.

 

    వూహించని ఈ దెబ్బకు దాదా మొదలు నరికిన చెట్టులా దబ్బున కింద పడ్డాడు. ఇక అతను పైకి లేచే ఛాన్స్ ఇవ్వలేదు తిలక్. దవడ మీద అటూ ఇటూ పిడిగుద్దులు గుద్దాడు. పెదవి చిట్లి రక్తం చిమ్మింది.

 

    అప్పుడు స్పృహలోకి వచ్చాడు ఏకాంబరం. దాదా ఓడిపోవడం అతను వూహించని విషయం. తమలోని ఒకడ్ని కొట్టేస్తున్నట్టు ఫీలై ముందుకు పరుగెత్తాడు.

 

    మరుక్షణంలో సైరన్ జైల్ ఆవరణలో పొర్లుదండాలు పెడుతున్నట్లు ఆగకుండా వినిపిస్తోంది.

 

    సూపరింటెండెంట్ శ్రీపతి ఇద్దరు ఆర్మీ గార్డులతో సహా అక్కడికి వచ్చారు వార్డర్లు అలెర్ట్ అయిపోయారు.

 

    దాదాపైనున్న తిలక్ ని వార్డర్లు లాగారు.

 

    అవమానంతో డస్సిపోయిన దాదా పెదవిని తుడుచుకుంటూ మెల్లగా పైకి లేచాడు.

 

    వచ్చిన రెండ్రోజులకే దాదాను మట్టి కరిపించిన తిలక్ తినేసేటట్టు చూశాడు శ్రీపతి.

 

    "ఏమిటి నాన్సెన్స్" కటువుగా ప్రశ్నించాడు.

 

    "సార్" తిలక్ ఏదో చెప్పబోయాడు.

 

    "నో ఎక్స్ ప్లనేషన్స్. ఓ ఖైదీని అలా రక్తం వచ్చేటట్టు కొట్టటం దారుణం. ఈ క్షణం నుంచి నిన్ను ఎల్ సెల్ లోకి మారుస్తున్నాం" అని శ్రీపతి అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయాడు.

 

    ఎల్ సెల్ అంటే యేమిటో తెలియదు తిలక్ కి. అందుకే ప్లాట్ గా చూస్తూ వుండిపోయాడు.

 

    ఇద్దరు వార్డర్లు అతని చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నారు.

 

    "పద"

 

    అతను ముందుకు కదిలాడు.

 

    న్యూజెయిల్ కి పక్కగా చివరన వుంది ఎల్ - సెల్. వాళ్ళక్కడికి చేరుకోగానే ఓ వార్డర్ దానికున్న తాళం తీశాడు.

 

    తలుపు తెరిచిన చప్పుడవడంతో లోపలున్న నలుగురు ఖైదీలు ద్వారంకేసి చూశారు.

 

    తిలక్ ని లోపలికి విసురుగా తోసి తాళం పెట్టారు వార్డర్లు.

 

    ఎర్రగా, పొడవుగా, ఆరోగ్యంగా వున్న తిలక్ ని ఆ నలుగురు ఖైదీలు వింతగా చూశారు. ఫనిష్ మెంట్ మీద అతన్ని తను సెల్ లో వేసినట్టు అర్థమైంది వాళ్ళకు.

 

    బూట్లశబ్దం దూరంగా పారిపోయాక తిలక్ పరిశీలనగా చూశాడు గదిని. ఇక నుంచి తాను గడపబోయే సహఖైదీలకేసి చూపు సారించాడు.

 

    మచ్చలపాములు ఒక్కసారిగా తనమీద పడ్డట్టు జడుసుకున్నాడు.

 

    వాళ్ళు నలుగురూ కుష్టురోగులు.

 

    దేవుడో, దెయ్యమో ఆకలేసి తింటూ మధ్యలో రుచించిక అలానే వదిలేసినట్టు వాళ్ళ ముఖాల్లో సగం అవయవాలే కనిపిస్తున్నాయి. ముక్కు స్థానాన రెండు రంధ్రాలు చెట్టు తోర్రల్లా వున్నాయి. పెదవులు పగిలి పోయి మట్టిపెళ్ళల్లా బిరుసెక్కాయి. ప్రాణం లేని కళ్ళు తుఫానులో పెట్టిన దీపాల్లా కనురెప్పల చాటున మసగ్గా కదులుతున్నాయి. నుదుటి మీద గీతలు గోడలమీద పడి ఆరిపోయిన నీళ్ళ చారికల్లా అసహ్యంగా వున్నాయి.

 

    "ఏం భయ్యా! ఫనిష్ మెంటా?" ఒక వ్యక్తి అడిగాడు.

 

    మాటల్ని కూడా జబ్బు తినేసినట్టు అస్పష్టంగా వినిపించాయి అతనికి.

 

    అవునన్నట్టు తల వూపాడు.

 

    "కూర్చో భయ్యా! భయపడకు. మేమూ నీలాంటి మనుష్యులమే."     

 Previous Page Next Page