"అందుకేనన్న మాట మీ చేతిలో ఎప్పుడూ రూపాయినాణెం వుంటుంది. ఇన్ని రోజులూ ఇది చిదంబర రహస్యంగానే వుండిపోయింది" అన్నాడు శివరామయ్య థ్రిల్లింగ్ గా ఫీలవుతూ.
రాయుడు తన గుప్పెటను తెరిచాడు. అందులో మెరుస్తున్న రూపాయి నాణెం పెద్ద వేదాంతిలా నవ్వుతున్నట్టే వుంది శివరామయ్యకు.
అంతలో ఏదో గుర్తు వచ్చినట్టు రాయుడు కదిలాడు. పక్కనున్న నీడతో "రేయ్! జెయిలుకి ఫోన్ చేయి" అన్నాడు.
అంత సడన్ గా ఆయన ఎందుకు జెయిలుకి ఫోన్ చేస్తున్నాడో శివరామయ్యకు అంతుపట్టలేదు. అయితే ఆ విషయం అడిగే ధైర్యం లేదు ఆయనకు.
* * * *
అక్కడ -
క్యాలెండర్లు రోజుల్నీ, తేదీల్నీ పుష్పించవు
కాలం ఆ నేలలో గడియారాల మొక్కలయి ప్రాణం పోసుకోదు. శబ్దాన్ని ఉరితీశారనడానికి చిహ్నంగా నిశ్శబ్దం వేయికాళ్ళ కంబళి పురుగులా అసహ్యంగా పాకుతుంటుంది- అది జెయిల్.
మూడు జిల్లాలకు సెంటర్ అయిన ఆ జెయిలులో ప్రస్తుత నాలుగువందల మందిదాకా ఖైదీలున్నారు. వాళ్ళల్లో మహిళా ఖైదీల సంఖ్య ముప్పయిదాకా వుంటుంది.
జెయిలు ఎంట్రెన్స్ లో నేమ్ బోర్డుంది. దాన్ని దాటుకుని లోనికి వెళితే చైనా ప్రహరీగోడ కనిపిస్తుంది. పడమరవేపున సిబ్బంది క్వార్టర్సు వున్నాయి గార్డు రూమ్ నుంచి ఆ యిళ్ళను వేరు చేస్తున్న పిట్టగోడ కట్టినట్టు కాకుండా పెట్టినట్టుంది.
గార్డు రూమ్ పక్కన జెయిలు ప్రవేశద్వారం వుంది. ఆ ద్వారాన్ని రెండు ఆకుపచ్చ తలుపులు మూసి వున్నాయి. వాటి మధ్యలో మనిషి దూరేంత కంతవుంది.
అప్పుడు ఉదయం ఆరుగంటలయింది.
బెయిల్ దొరికిన ఖైదీలా సూర్యుడు తూర్పు ఆకాశం నుంచి బయట పడ్డాడు.
వెంటనే సైరన్ మ్రోగింది.
వార్డర్లు ఒక్కో బ్యారెక్కుకు వెళ్ళి తలుపులు తీస్తున్నారు. తమకు దొరికే ఆ కాసింత స్వేచ్ఛకోసం లోపలున్న ఖైదీలు బయటికి ఉరుకుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకల్లా ఖైదీలను బ్యారెక్కుల నుంచి బయటికి వదులుతారు. జెయిలు ఆవరణలోనే వాళ్ళచేత రకరకాల పనులు చేయించుకుంటారు. తిరిగి సాయంకాలం ఆరుగంటలకు బ్యారెక్కులో తోసి తాళం పెడతారు ప్రపంచం చాలా ఇరుకైపోయినవాళ్ళకు జెయిలు ఆవరణే విశాలమయిన మరో ప్రపంచంలా కనిపిస్తుంది.
ఆ జెయిల్లో మొత్తం పన్నెండు బ్యారెక్కులున్నాయి. ప్రవేశ ద్వారం దాటగానే వచ్చేది ఒల్డు జైల్. దక్షిణంగా చివరనున్న రెండు అంతస్తుల మేడను న్యూజైల్ అంటారు. ఇందులో కింద నాలుగు పైన బ్యారెక్కులున్నాయి. ఈ భవనం ముందునుంచి అటూ ఇటూ రెండు వరుసల్లో పెంకులతో వేసిన ఆరు షెడ్లున్నాయి. వీటినే ఓల్డ్ జైల్ అంటారు. ఇందులో నాలుగింటిని బ్యారెక్కులుగా వుపయోగిస్తుంటే మిగిలిన రెంటిలో ఒకదాన్ని కిచెన్ గానూ, మరోదాన్ని క్రాప్ట్ రూమ్ గానూ వాడుకుంటున్నారు.
జైల్ ఎంట్రన్స్ లో న్యూజైల్ కు అపోజిట్ గా రెండు అంతస్తుల భవనం వుంది. ఇందులో పైభాగాన ఆఫీసర్ల గదులున్నాయి. కింద భాగంలో ఆఫీసు, విజిటర్స్ గదీ, క్యాంటీనూ దర్శనమిస్తాయి.
న్యూజైల్ మొదటి బ్యారెక్కునుంచి తిలక్ బయటికి వచ్చాడు. తోటి ఖైదీలు ఎవరికి వారు కిందకి దిగిపోతున్నారు.
అంతలో వార్డర్ ఏకాంబరం తిలక్ దగ్గరికి వచ్చాడు.
"ఏం తిలక్ బామ్మర్దీ! ఎలా వుంది జిల్లా జైల్? నువ్వేదో పెద్ద పోటుగాడివనీ నీమీద ఓ కన్నేసి వుంచమన్నాడు జెయిలర్ బామ్మర్ది ఏం కేసు? తల్లిని చంపావా? చెల్లిని చెరిచావా?"
"ఇవ్వేవి కావు. నీ పెళ్ళాని లేపుకుపోయాను. అదీ కేసు" చాలా కూల్ గా చెప్పాడు తిలక్.
కోపంతో వూగిపోయిన ఏకాంబరం లాఠీని ఎత్తి ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమోగానీ ఠక్కున దించేశాడు.
ఆరడుగుల పొడవుతో బలిష్టంగా వున్న తిలక్ ని చూసి కొంత జడిసైనా వుండవచ్చు. లేదూ అతని ముఖంలో కనిపిస్తున్న నిజాయితీకి జంకయినా వుండవచ్చు.
"ఫస్ట్ టైమ్ కాబట్టి వదిలేస్తున్నాను. మరోసారి తలబిరుసు సమాధానం చెపితే తల తిప్పేయగలను జాగ్రత్త" అన్నాడు పౌరుషంగా.
పోలీసులు అడవిలో తిరిగే పులలయితే, వార్డర్లు బోనులో వుండే సింహాలని నాలుగునెలల సబ్ జెయిల్ జీవితం నేర్పింది.
ఏకాంబరాన్ని ఇక కదిలించడం ఇష్టంలేక మౌనంగా కిందకు దిగాడు.
జెయిల్ మధ్యలో చాలా భాగం తోటను పెంచుతున్నారు. తోటకు ఓ పక్క బావి వుంది. దాని పక్కనే ముఖాలు కడుక్కునేందుకు వరుసగా వాష్ బేసిన్ లు వున్నాయి. తూర్పుగా ప్రహారీ గోడకు ఆనుకుని పది టాయ్ లెట్ గదులున్నాయి.
ఏకాంబరం తోటలో నిలబడి అరుస్తున్నాడు. "వెళ్ళి ముఖాలు కడుక్కుని తగలడండీ. టీ ఇస్తాం. మినిష్టర్ బామ్మర్దికి కూడా మీలా జరగదు."
బామ్మర్ది అనడం ఆయనకు వూతపదమని అర్థమైంది తిలక్ కి. అలాంటి పదాలను మాట్లాడటం అలవాటు చేసుకుని ఆ విధంగా తమ అహంభావన్ని చాటుతుంటారు కొందరు. ఏకాంబరం కూడా ఆ కేటగిరీలోకి వస్తాడు.
టీ తాగి కాలకృత్యాలు తీర్చుకునేసరికి టైమ్ ఏడున్నర దాటింది. అప్పటికే టిఫిన్ కోసం ఖైదీలు క్యూలో నిలుచుంటున్నారు.
ఆరుగురు ఖైదీలు రెండు పెద్ద పాత్రల్ని కిచెన్ ముందున్న చెట్టు నీడలో పెట్టారు. నలుగురు వార్డర్లు స్టూళ్ళ మీద కూర్చుని వడ్డన ప్రారంభించారు.
క్యూ కదులుతోంది.
ప్రతి ఖైదీకి రెండు చపాతీలు వేసి కుర్మాలాంటి ద్రవాన్ని పోస్తున్నారు వార్డర్లు.
న్యూజైయిల్ ముందున్న జామచెట్టునీడలో కూర్చున్నాడు దాదా. అతను అక్కడ ఓ ఖైదీ. ముప్ఫై అయిదేళ్ళ వయసులో ఎర్రగా వూగుతున్న కండలతో ఈకలు పెరికేసిన బాయిలర్ కోడిలా వున్నడతను. అసలు పేరు ఏదో వుంది కాని అందరూ దాదా అనే అంటారు. ఆరునెలలు బయటవుంటే ఇంకో ఆరునెలలు జెయిల్లో వుంటాడు. ఎక్కడన్నా జబ్బ బలంతో జల్సాగా బతికేస్తుంటాడు.