ఏడుపొచ్చింది తిలక్ కి. తను షాక్ తిన్నది అందుకోసం కాదని చెప్పడానికి వాళ్ళని కౌగిలించుకోవాలనిపించింది. జబ్బు తీవ్రతను చూసి తాను చలించిపోయానని చెప్పాలనుకున్నాడు. కానీ నోరు పెగలలేదు.
ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చున్నాడు.
ఓ మూల నుంచి వస్తున్న దుర్గంధం ముక్కులను కోస్తోంది.మరోమూల చచ్చిపోయిన కాకిలా నల్లటికుండ వుంది. దానిమీదున్న సొట్టలు పడ్డ అల్యూమినియం గ్లాసు పాలకోసం గుండెలు బాదుకుని స్పృహ తప్పిపోయిన పసిపాపలా వుంది.
"బాసూ! బాసూ!"
ఎవరో పిలుస్తున్నట్లనిపించి ద్వారంకేసి చూసాడు తిలక్.
ఇద్దరు యువకులు కమ్మీలను పట్టుకుని తనవేపు అడ్మయిరింగ్ గా చూస్తూ కనిపించారు.
లేచి ద్వారం దగ్గరికి వచ్చాడు.
"నా పేరు బుద్ధుడు. ఇతను నా స్నేహితుడు ఉత్తరుడు. మేమూ ఒకటో బ్యారెక్కే మమ్మల్ని సరిగా గమనించి ఉండవు కాబట్టి గుర్తు లేదనుకుంటా.మొత్తానికి దాదా పనిపట్టి నువు మాకంతా బాసైపోయావు" అన్నాడు ఆ ఇద్దరిలో పొడవుగా వున్న యువకుడు.
ఇంకో యువకుడు ఉత్తరుడు కాబోలు. పేరుకు తగ్గట్టే ఆడపిల్ల లవర్స్ వుండడం వలన నాజూగ్గా, అందంగా కనిపిస్తున్నాడు.
వాళ్ళిద్దరివేపూ నవ్వుతూ చూశాడు.
"ఇక మేము వస్తాం బాసూ. వార్డర్లు మమ్మల్ని యిక్కడ చూస్తే గొడవ చేస్తారు. చిన్న చిట్కాతో నిన్ను ఈ సెల్లో నుంచి బ్యారెక్కుకు మార్చే ఏర్పాటు చేస్తాంలే" అన్నాడు బుద్ధుడు.
"ఏం చేయబోతున్నావ్?"
"బాసూ! నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పమంటావా?"
"నిజమే చెప్పు"
"అయితే చెప్పను, చేసి చూపిస్తాను" అని అక్కడినుంచి కదిలాడు బుద్ధుడు. అతన్ని అనుసరించాడు ఉత్తరుడు.
ఏదో తెలియని అభిమానంతో వాళ్ళు వెళ్లినవేపే చూస్తూ నిలబడ్డాడు తిలక్.
సరిగ్గా అదే సమయానికి దాదా చెట్టుకింద పడుకుని భారతదేశ జైళ్ళ చరిత్రలో మునుపెన్నడూ జరగని దారుణం చేయడానికి ఓ పథకం వేస్తున్నాడు.
* * * *
నీలం కాంతివలన ఆ గది సముద్రంలో తేలుతున్నట్టుంది. చల్లటి రక్తాన్ని గిలకొడుతున్నట్టు వుందండీ శరీరం ఝల్లుమంటోంది.చందనం వాసనవల్ల ఆ గదంతా కొత్త వాసనేస్తోంది.
"ఏమంటున్నాడు మీ జెయిల్ సూపరింటెండెంట్?" ప్రశ్నించాడు రాయుడు ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ.
పదివేల రూపాయల ఖరీదయిన డబుల్ కాట్ మంచం వాళ్ళిద్దరి బరువును మౌనంగా భరిస్తోంది.
"ఏమయినా అనేట్టు ఆయనవుంటే నేను యిలా మీ కౌగిలిలో ఒదిగిపోయేదాన్నా? ఆయన ఓ పిచ్చిమాలోకం. కనిపించని తండ్రిని వూహించుకుంటూ భయపడిపోతుంటాడు."
రాయుడు ఆ మాటలకు బిగ్గరగా నవ్వి "అందుకే, పెళ్లాం ప్రవర్తనను బట్టి భర్త ఎలాంటివాడో చెప్పవచ్చని అంటాను నేను. నిన్ను చూసి మీ జెయిల్ సూపరింటెండెంట్ బలహీనతలేమిటో ఏకరువు పెట్టచ్చు" అన్నాడు.
"ఆ బలహీనతల్ని ఎలా క్యాష్ చేసుకోవాలో మీకు బాగా తెల్సు" అని నవ్వింది ఆమె.
ఆమె పేరు చిత్ర. జెయిల్ సూపరింటెండెంట్ శ్రీపతి రెండవ భార్య.
ఆమె చెప్పినట్టు శ్రీపతి ఓ పిచ్చిమాలోకం.
ఆయనకు తండ్రంటే చిన్నప్పట్నుంచీ విపరీతమైన భయం. తండ్రి చనిపోయినా ఆ భయం మాత్రం పోలేదు. తనని ఎవరయినా యిబ్బంది పెడుతున్నారంటే హడలిపోతాడు. తన తండ్రే ఆ రూపంలో వచ్చి తనని సాధిస్తున్నాడని భయపడిపోతుంటాడు. ఈ భయంవల్లే ఆయన జీవితంలో ఎన్నో అమూల్యమయినవి పోగొట్టుకున్నాడు.
తండ్రి అంటే వున్న భయం వయసుతోపాటు పెరుగుతూ వచ్చిందేగానీ కొంతకూడా తగ్గలేదు.
ఆయన తండ్రి అరవిందరావు ఆజానుబాహుడు. చూస్తేనే యెవరైనా జడుసుకుంటారేమో నన్నట్టు వుండేవాడు. తల్లి చనిపోయేనాటికి శ్రీపతికి ఎనిమిదేళ్ళు.
పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని, ముద్దు చేస్తే చెడిపోతారని అరవిందరావు నమ్మకం. అందుకే ఈయన శ్రీపతిని ఎప్పుడూ దగ్గరికి చేరనిచ్చేవాడు కాదు. పైపెచ్చు చిన్న తప్పు చేసినా ఒళ్ళు చీరేసేవాడు. అందుకే తండ్రిని చూస్తేనే వణికిపోయేవాడు అతను.
పెద్దయ్యాక కూడా అంతే. తండ్రి పిలిస్తేనే భయంతో గడ్డకట్టుకుపోయేవాడు.
చివరికి శోభనం రోజు కూడా శ్రీపతిని అరవిందరావు వదిలిపెట్టలేదు.
రాత్రి పదిగంటలైంది. కొత్త పెళ్ళికొడుకు గెటప్ లో వున్న శ్రీపతి ఫస్ట్ నైట్ అనుభవం కోసం తొందరపడుతున్నాడు. అమ్మలక్కల జోక్ ల మధ్య పురోహితుడు గర్భాదానం మంత్రాలు చదివాడు. ఆ తంతు ముగిసింది.
ఇక గదిలోకి అడుగుపెడుతున్న శ్రీపతి తండ్రి పిలుపుకి అదిరిపడి ఆగాడు. వెనక్కి తిరిగి చూస్తే మేరపర్వతంలా నిలుచున్న తండ్రి.
"ఏరా! నీకు బుద్ధుందా?" గద్దించాడు ఆయన.
శ్రీపతి ఒక్క క్షణం బిక్కచచ్చిపోయాడు. తన తప్పు ఏమిటో ఎంత ఆలోచించినా తెలియడం లేదు. అందుకే తండ్రివైపు ప్లాట్ గా చూశాడు.
"ఎంత కుతిగా ఉన్నా అలా డ్రాయర్ వేసుకోకుండానే పంచె కట్టుకుని లోపలికి తగలడటమేనా? డ్రాయర్ విప్పేలోపు ఆసహ్యమోతుందని అలానే వెళుతున్నట్టున్నావ్. అది నీ భార్య. ఏదో అంత డబ్బులిచ్చి గంటకో, రెండు గంటలకో తెచ్చుకున్నది కాదు. జీవితాంతం నీతోనే వుంటుంది. కాస్త యావ తగ్గించుకుని డ్రాయర్ వేసుకు చావు"
శ్రీపతి వంగి చూసుకున్నాడు.
తొందర్లో డ్రాయర్ వేసుకోలేదన్న సంగతిని టెరికాటన్ పంచె తెల్ల మొహం వేసుకుని చాటుతోంది.
తండ్రి గుడ్లురిమి చూడటంతో అక్కడి నుంచి వెళ్ళి డ్రాయర్ వేసుకున్నాడు.తిరిగి శోభనం గదిలోకి వెళుతుంటే తండ్రి క్రూరంగా చూస్తూ వెనకనుంచి పిలుస్తున్నట్టే వుంది.
పట్టెమంచం మీద కూర్చుని ఎప్పటిలాగే తండ్రిని మనసులో తిట్టుకోవడం ప్రారంభించాడు. అతని మూడ్ అంతా ఖరాభైంది.
ఉలక్కుండా, పలక్కుండా ఏదో తనలో తానే గొణుక్కుంటున్న అతన్ని చూసి పెళ్ళికూతురి ముఖంలో పెళ్ళిలో పెద్దింటి అమ్మాయి నిముషానికో చీర మార్చినట్టు రంగులు మారాయి.