Previous Page Next Page 
ఉషోదయం పేజి 6

    శారద గతుక్కుమంది. "అంత మంచి ప్రాక్టీసు వదలాలా! అంత ప్రాక్టీస్ ఎలా వదిలేయాలి" అప్రయత్నంగా అంది. "ఆయన ఇన్నాళ్ళుగా బిల్డప్ చేసినదంతా ఊరికే పోగొట్టుకుంటే ఏం లాభం! ఆయన ఇకనుంచి నే సంపాదించిందంతా నాదేనని చెప్పేశాడు. ఇంత ప్రాక్టీసు వదిలేయడం ఏమిటి" శారద ఆశ్చర్యంగా అంది.
    "నీవొకచోట నేనొకచోట ఎందుకు? ఇద్దరం కలిసిచేస్తే అంతకంటే  ఎక్కువే వస్తుంది" విసుగ్గా అన్నాడు.
    శారదకి అతనితో కలిసి పనిచేయడం అంటే ఏమిటో తెలుసు. తన మాటకి విలువ ఇవ్వడు. తన అభిప్రాయాలకి, నిర్ణయాలకి తావుండదు.... అతను చెయ్యమన్నట్టు చేస్తూ, అతను చెప్పమన్నట్టుచెప్పి, కోర్టులో వాయిదాలు కోరే అసిస్టెంట్ స్థాయికి మించి తనకో ప్రత్యేకత వుండదు. అతనికి అదే కావాలి. తను అతనికంటే ఎక్కువస్థాయిలో వుండడం అతను భరించలేడు.
    తన మాటకి ఎదురుచెపితే భరించలేడు.
    ఇద్దరూ ఒకే ప్రాక్టీస్ చేస్తూ అభిప్రాయభేదాలతో వాదులాడుకుంటూ మనస్పర్థలు పెంచుకునేకంటే తను స్వంతంగా ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. తన వ్యక్తిత్వం కాపాడుకోవాలంటే తనకి లాయరుగా వచ్చిన పేరు, స్థానం పోగొట్టకూడదు.... స్త్రీలకోసం న్యాయం చేకూర్చే కేసులని వదులుకోకూడదు.
    "వద్దులెండి, ఎవరి ప్రాక్టీసు వాళ్ళు చేసుకుందాం" నెమ్మదిగా అన్నా నిష్కర్షగానే అంది. ప్రకాష్ మొహం మాడింది.
    "అంటే నాతో కలవడం నీకు చిన్నతనమా?" ఉక్రోషంగా అన్నాడు.
    "ప్లీజ్! మీరనవసరంగా లేనిపోని అర్థాలు తీయకండి. వేరే వేరే ప్రాక్టీస్ పెట్టుకోవడం ఇద్దరికీ మంచిది" అంది సంభాషణ తుంచేస్తూ. కంచం పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది.
    కొడుకు ధుమధుమలాడే మొహం చూసి "తనన్న మాటలు తప్పుకాదురా. ఒకే ఆఫీసులో ఇద్దరూ పనిచెయ్యడం కష్టమే. ఎవరి అభిప్రాయాలు వారివి. బలవంతంగా ఇంకొకరి మీద రుద్దడం న్యాయంకాదు. తనపని తనని చేసుకోనీ" అంది సత్యవతి.
    తల్లివంక కొరకొరా చూశాడు ప్రకాష్.
    చేయి కడుక్కుని వచ్చిన శారద అతని కోపాన్ని గమనించనట్టు "నా కసలు క్రిమినల్ కేసులు తీసుకోవడం ఇష్టంలేదు. నేనా లైనులో పనిచేయలేను. ఏదో చదువుకున్నందుకు నలుగురి ఆడవాళ్ళకి నా ద్వారా న్యాయం చేయడమే నా ధ్యేయం. అంతకుమించి నాకేం వద్దు. మీ ప్రాక్టీస్ మీరు చూసుకోండి. నేను కలగచేసుకోను. నాదాన్లో మీరూ కలగచేసుకోకపోతే ఇద్దరి మధ్యా కనీసం ప్రోఫెషనల్ గా గొడవలుండవు" మాట్లాడుతూనే కంచాలు, గిన్నెలు తీసి సింక్ లో పడేసి టేబిల్ తుడిచింది.
    ఆ రోజునించి శారదమీద సాధింపులు ఎక్కువ చేశాడు. ఇంట్లో పనిలో, పిల్లాడి ఆలనాపాలనలో ఏ చిన్న లోటు దొరికినా సాధిస్తూ, శారదకి ఇల్లంటే నిర్లక్ష్యం అనేవాడు. రాను రాను అలవాటై పట్టించుకోడం మానేసింది శారద.
                                            * * *
    "హలో శారదా, నేను సునీతని. సారీ.... నిన్నంతా ఇంటికి వచ్చి సామాను సర్దుకోవడంలో బిజీగా వుండి ఫోను చెయ్యలేకపోయాను" నొచ్చుకుంటూ అంది.
    "ఓ... మీ ఇంటికి వచ్చేశావన్నమాట. ఏమంటాడు రవీంద్ర? నీతో మాట్లాడాడా?" కుతూహలంగా అడిగింది.
    "ఏమంటాడు? మొహం మాడ్చుకుని కూర్చున్నాడు. పిల్లలు డాడీ అంటూ దగ్గరికి వెళితే వాళ్ళతో సరిగానే మాట్లాడాడు. పిల్లలకివేం తెలియవుగాదా. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేశాం అని సంతోషంగా వున్నారు. డాడీ, మమ్మీ వుంటే చాలుగదా వాళ్ళకి."
    "ప్చ్, సునీతా.... ఈ డైవోర్సుల వల్ల నలిగిపోయేది పిల్లలే. వాళ్ళకి సమస్య అర్థంగాదు. ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే పాపం బెంబేలు పడిపోతారు."
    "అందుకే గదా, పిల్లలకోసమే కదా ఆడది అన్నీ సహించి పడుండడం. ఆ అసలు తీసుకునేదాకా ఈ మగాళ్ళు ఆటలాడడం... ఏదో ఇంక భరించలేని స్థితికి వస్తే నాలా ఇల్లు దాటతారు ఆడవాళ్ళు.... అదీ ఆర్థిక స్వాతంత్ర్యం వుంటే."
    "నిజమేలే! చెప్పినంత సులువుకాదు చూస్తూ భరించడం.... ఆఫీసుకి వెళ్ళడం ఆరంభించావా లేదా?"
    సోమవారం నించి వెడతాను. ఏమిటో శారదా ఇప్పుడీ ఇంట్లో వుండాలంటే ఏదో నా ఇల్లుగాదు. పరాయి ఇల్లు అనిపిస్తోంది" ఇబ్బందిగా అంది. "ఇద్దరం ఇలా ఒకరికి ఒకరు ఏం కానట్టు వుండాలంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేట్టున్నాయి."
    "ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ఇంట్లో నీ స్థానం కాపాడుకోవాలి. విడాకులయ్యే వరకూ నీకు అన్ని హక్కులూ వుంటాయి.... అవి వదులుకుంటే నీకే నష్టం. అతనికేం నీవలా వెళ్ళగానే చక్కగా రంజనిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ  అవకాశం మాత్రం ఇవ్వకు" లాయర్ గా సలహా ఇచ్చింది. సునీత నిట్టూర్చింది.
    "ఓకే, ఎనీహౌ..... థ్యాంక్స్ నీ సాయానికి" ఫోను పెట్టేసింది.
    నిజంగానే ఆ ఇంట్లో వుండడం.... మనసులు కలవక డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాక ఒకే ఇంట్లో ఇంక కలిసి బతకడం ఇబ్బందే. పడక గదులు వేరయ్యాయి. అతని సామానులన్నీ పిల్లల గదిలోకి మార్చింది. పిల్లలు, తను పెద్దరూములో పడుకుని అతనికి పిల్లల రూములో బట్టలూ అవీ మార్చింది. అది చూసి "నా రూము నాకు కావాలి, నీవే అక్కడ పడుకో" కటువుగా అన్నాడు రవీంద్ర.
    "ఆ గది పిల్లలకు, నాకు చాలదు" ముభావంగా అని తనపని తాను చేసుకోసాగింది. అన్నింటికంటే ఇబ్బంది భోజనాల దగ్గర వచ్చింది. అతన్ని భోజనానికి పిలవాలా వద్దా, అతనికి భోజనాలు పెట్టి అతని సదుపాయాలు చూడాల్సిన అవసరం తనకేమిటి! ఆ రంజనినే చూసుకోమను అనుకుంది కోపంగా. కాని మనసుకి సర్థిచెప్పలేకపోయింది. ఇంట్లో వుండగా అతనికి పెట్టకుండా తామెలా తినేయడం అన్న ఆలోచనలో పడింది.
    రవీంద్ర డ్రాయింగ్ రూమ్ లో టీ.వీ. చూస్తూ కూర్చున్నాడు. పిల్లలకి భోజనాలు వడ్డించి పిలిచింది. "డాడీ, భోజనానికి రా..." ఆరేళ్ళ స్వీటీ తండ్రి చెయ్యిపట్టి లాగుతూ పిలిచింది. మామూలుగా అలవాటు ప్రకారం లేవబోయిన రవీంద్ర చటుక్కున డైనింగ్ టేబిల్ దగ్గరున్న సునీత వంక చూశాడు.
    సునీత మొహం తిప్పుకుంది.
    "మీ మమ్మీ నాకు భోజనం పెట్టదేమో" నవ్వుతూ అన్నట్లున్నాడు రవీంద్ర.

 Previous Page Next Page