Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 6

    తల్లి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ పోనీ, వెధవ సంబంధం. ఇంతకంటే మంచిది రానట్టు మాట్లాడుతుంది అమ్మ. పోనీ, హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది....
    ఆ తరువాత హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తనకిష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు - జ్యోతి కలల్లోకి వెళ్ళిపోయింది.
    కానీ ఆమె అంచనా తప్పయింది. ఆ రాత్రి జానకిని సూర్యనారాయణ అడిగినప్పుడు.
    "ఏమో! దానికి సంబంధం నచ్చినట్టులేదు. సరిగా జవాబు చెప్పడం లేదు" అంది నసుగుతూ.
    సూర్యనారాయణ ఆశ్చర్యంగా "నచ్చలేదూ? ఏం? ఏం వచ్చింది లోటు?" అన్నాడు.
    అప్పటికే అతని గొంతులోని తీవ్రత కనిపెట్టి - "ఏం అంటే ఏం చెప్పడం? దానికి మనసులో చాలా కోరికలే వున్నాయి. పెద్ద ఉద్యోగస్థుడు కావాలని ఉన్నట్లుంది. ఆరువందల జీతంలో ఏం బతుకు అంది. పైగా కోతిలా వున్నాడు అంటుంది" నెమ్మదిగా అంది జానకి.
    సూర్యనారాయణకి సులువుగా సంబంధం కుదిరిందన్న స్థానంలో కోపం నిల్చింది.
    "పిచ్చివేషాలు వేయవద్దనీ, ఈవిడగారి అందానికి, నా హోదాకి ఎక్కడో ఎవడో ఆకాశంనించి దిగిరాడని చెప్పు" కటువుగా అన్నాడు.
    జానకి భయంగా "చెప్పానా మాట - దాన్ని ఆలోచించనివ్వండి మళ్ళీ అడుగుతాను."
    "ఆలోచన. దానికీ ఆలోచన ఏడిస్తే అలా ఎందుకంటుంది? ఏదో పోనీ సరదాపడుతూంది. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకీ చదువు కావాలని నానా అవస్థాపడి చదువు చెప్పిస్తూంటే ఇంకా గొంతెమ్మకోరికలా? వుండు, రేపు నేను చెపుతా దానికి" అన్నాడు సూర్యనారాయణ.
    "కాస్త నెమ్మదిగా మాట్లాడండి. వయసువచ్చిన పిల్ల - అది మరీ కాదంటే ఎలా చేయగలం?"
    "ఆఁ.... నాకు తెలుసులే" విసుగ్గా అని నిద్రకి ఉపక్రమించాడు సూర్యనారాయణ. జానకి మనసులో బెంగపడుతూ పక్కమీద వాలింది.
    జానకి కాపురానికి పదిహేనోయేట వచ్చేసరికి సూర్యనారాయణకి బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగం - నూటయాభై రూపాయల జీతం. పాతికేళ్ళక్రితం నూటయాభై రూపాయల జీతంతో బతకడం కష్టం అన్పించలేదు ఆమెకి.
    ఈనాడు అలా అలా జీతం పెరిగి ఎనిమిదివందలు జీతం తెచ్చినా బతుకు కష్టమైపోయింది. బాధ్యతలు పెరిగాయి. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చదువులు, జీతాలు, బట్టలు - మండిపోయే ధరలమధ్య గుట్టుగా కాలం గడుపుకురావడమే గగనమవుతూంది. జానకి ఈనాటివారిలా పెద్ద చదువులు చదవలేదు.
    స్కూలు ఫైనలు చదివింది. సామాన్య సంసారుల ఇంట్లో పుట్టి, సామాన్య సంసారితో బ్రతుకు ముడివేసుకున్న మధ్యతరగతి ఇల్లాలు - సూర్యనారాయణతో ఆమె వైవాహిక జీవితం సుఖంగానే గడిచిపోయింది. అతనిది ప్రథమకోపం తప్ప మనసు మంచిది. ఇంటి బాధ్యత అంతా జానకి చేతిలో పెట్టేసి నిశ్చింతగా వుండేవాడు. నూటయాభై తెచ్చినప్పుడు ఆమె ఇంకా కావాలని దేనికీ వేధించలేదు. ఈనాడు ఎనిమిదివందలు చాలదని సణగలేదు.
    తమ తాహతు ఎరిగి వున్నదానితో గుట్టుగా, మర్యాదగా కాలం వెళ్ళదీస్తూ, పిల్లల కోరికలు, అలకలు, సాధింపులు అన్నీ భరిస్తూ సంసారం లాక్కువస్తూంది. ఇంట్లో తండ్రి అంటే పిల్లలకి భయం. ఏం కావాలన్నా తల్లినే సాధించేవారు.
    జ్యోతికి ముందు పుట్టినవాడు కృష్ణ. బి.కాం. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ చదువు కాగానే నెమ్మదిగా బ్యాంక్ లో ఉద్యోగం చేయించాలని అతని తాపత్రయం. జ్యోతి మొదటి సంవత్సరం బి.ఏ. జ్యోతి తరువాత గోపి మెట్రిక్. ఆఖరుది ఫోర్తుఫారం. ఈరోజుల్లో నలుగురు పిల్లలతో, ఎనిమిదివందల జీతంతో బతుకు నెట్టుకురావడం అంటే ఎంత కష్టమో జానక్కి మాత్రం తెలుసు.
    బాధ్యత ఎరుగని వయసులో పిల్లలు సినిమాలు, బట్టలు అంటూ పేచీ పెడుతుంటే అతి తెలివిగా బడ్జెట్ వేసి సంసారం లాగుతూంది. అందుకే సూర్యనారాయణకి జానకి అంటే ఇష్టం. ఆమె అప్పగించి అతను నిశ్చింతగా వున్నాడు.
    కాని ఈరోజు తను పరిష్కరించలేని సమస్యగా తయారైంది జ్యోతి విషయం! ఈ సంబంధానికే ఆరువేలు కట్నం అడుగుతున్నారు. పైన పెళ్ళి ఖర్చులు ఎంత క్లుప్తంగా చేసినా వుండనే వుంటాయి. పది పన్నెండువేలు ఎక్కుడనుంచి తేవడం? ఆ అప్పు ఎలా తీర్చడం అన్న సమస్య ఒకటి వుండనే వుంది.
    డబ్బుమాట ఏదో చేసేవారు. ముందు కూతురి ఒప్పుకునివుంటే ఈ బెంగ లేకపోను అనుకుంది జానకి
    ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపట్టింది జానక్కి.
                                      *         *         *
    ఉదయం కాఫీ తాగుతూ "జ్యోతీ" అని పిలిచాడు సూర్యనారాయణ గంభీరంగా. వంటింట్లో కాఫీ తాగుతున్న జ్యోతి గతుక్కుమంది. తల్లి వంక చురుకుగా చూసింది.
    మరోసారి తండ్రి పిలవడంతో బితుకు బితుకుమంటున్న గుండెలతో వెళ్ళింది. కూతుర్ని చూసి "కూర్చో అలా" అన్నాడు పక్కన కుర్చీ చూపించి సూర్యనారాయణ.... జ్యోతి కూర్చుంది.
    "ఊ.... నిన్న మీ అమ్మతో ఈ పెళ్ళి సంబంధం నచ్చలేదన్నావటగదా" అతని గొంతు సౌమ్యంగానే వుండటం గుర్తించి నిబ్బరం తెచ్చుకుంది జ్యోతి.
    తలవంచుకుని తల వూపింది.
    "ఏం.... ఏం నచ్చలేదూ....?" అన్నాడు. కూతురివంక సూటిగా చూస్తూ.
    జ్యోతి జవాబివ్వలేదు. తల వంచుకుంది.
    ""చెప్పుమరి. నీకేం కావాలో, నీకెందుకిది నచ్చలేదో చెపితేనేగా మాకు తెలిసేది" అనునయంగానే అడిగాడు.                                                                              

 Previous Page Next Page