ఆ ప్రతిహతంగా దశాబ్దంబట్టి సాగుతున్న అచ్యుత్ గూండా వ్యవహారాలకి మొదటిసారి అడ్డుకట్ట పడింది.
దాన్ని నమ్మాలా లేదా అన్న షాక్ నుండి తేరుకోవడానికి- అరుణాచలానికి ఒకింత సమయం పట్టింది.
"చందా అడిగాడు" నూతిలోంచి వచ్చినట్లున్నాయి మాటలు.
"ఎంత?"
"నాలుగువేల నూటపదహార్లు"
చదువు అబ్బక పోకిరిగా తిరుగుతున్నాడనుకున్న కొడుకు హఠాత్తుగా ఇంత ప్రమాదకరమైన కిరాతకుల్ని ఎలా ఎదుర్కోగలిగాడు? అరుణాచలానికి అంతా అయోమయంగా వుంది.
"ఎందుకట"
తన హస్తాలనుండి తప్పించుకోవాలని తెగ గింజుకుంటున్న ప్రధాన అనుచరుడ్ని మరింత తన పట్టులోకి లాక్కుంటూ అడిగాడు అభిరామ్.
కొడుకు ప్రధాన అనుచరుడ్ని బంధించిణ విధానాన్ని చూసిన అరుణాచలం అది తన వ్యవహృతి కాదు కదా? అని ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు.
"దసరా ఉత్సవాలకి అని ఓసారి, శ్రీరామనవమికి అని మరోసారి, దీనజన ఉద్దరణకి అని మరోసారి, అచ్యుత్ తండ్రి ఆశయాలను కొనసాగించడానికి ఇంకోసారి అనటం విన్నాను"
ఎప్పుడూ అరుణాచలమో, ఆయన భార్యో అడిగే ప్రశ్నలకి జంకుగా సమాధానాలు చెప్పే అభిరామ్ యిప్పుడు తను అడుగుతుంటే తండ్రి జంకుగా సమాధానం చెప్పడం యిద్దరికీ చిత్రంగానే అనిపిస్తోంది.
"ప్రజల్ని దోచుకునే రౌడీ వెధవలు మీరు మీకు దైవభక్తా? అందిన కైడ్కి దోచుకుని మేడలు, మిద్దెలు, కొనుక్కునే మీరు దీనజనోద్దరణ చేస్తారా?" కోపంగా ప్రశ్నిస్తూ తన పట్టు ఒకింత సడలించాడు అభిరామ్.
అతను దేగాలా ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేస్తుండగానే అభిరామ్ గాల్లోకి డైవ్ చేస్తూ అతని గుండెల మీద తన్నాడు.
మొదలు నరికిన చెట్టులా అతను విరుచుకు పడిపోయాడు.
అతని వేపుకి అభిరామ్ ఒక్కో అడుగువేస్తూ-
"నీ తండ్రి ఒక గూండా! వాడి నుండి నువ్వు వారసత్వంగా దాన్నే పొంది తండ్రి ఆశయసిద్దికి పోరాడతావా దుర్మార్గుడా....అని నేనడిగినట్లు నీ బాస్ అచ్యుత్ కి చెప్పు" అంటూ అప్పుడే లేవబోతున్న అతని మొహం మీద బలంగా తన్నాడు మరలా.
అతను ఆర్తనాదం చేస్తూ తిరిగి నేలకి కరుచుకుపోయాడు.
"వాడి తండ్రెలా చచ్చాడు? యెందుకు చచ్చాడు? తెలుసా నీకు....?" మరో రౌడీ వెధవ చేతిలో కుక్కచావు చచ్చాడు.
దానికి రంగు పులిమి వాడేదో ప్రజల కోసం చచ్చినట్లు ప్రచారం చేసుకుని మీ పబ్బం గడుపుకుంటున్నారు. వాడొక దౌర్భాగ్యుడు, నీచుడు వాడికొక ఆశయమా?
అది నెరవేర్చడానికి మీరు కంకణబద్దులు కావటం సిగ్గులేదూ? మీ బ్రతుకుల మీద మీకే సిగ్గేయటం లేదూ?" అభిరామ్ కంఠం కంచు కంఠంలా ఆ ప్రాంతమంతటికీ వినిపిస్తుంటే చుట్టుప్రక్కల సివిలియన్స్ వెర్రి ఆనందంతో బిగుసుకుపోయారు.
"మా సంగతి నీకు తెలీదు....మేము చలివేంద్రాలు పెట్టించాం....." షాపు బయట వున్న పదిహేనుమందిలోని ఒకడు పెద్దగా అన్నాడు.
"ఎవడమ్మ మొగుడి సొమ్మురా? మీ కష్టార్జితమా? ప్రజల్ని దోచుకుని, అందులో సగం దాచుకొని, కొంత జల్సాచేసి, కొంత రౌడీమూకలకి పంచి, మిగిలిన ఐదు పైసలతో చలివేంద్రాలు పెట్టించారు? అసలు ప్రజలకి సిగ్గులేదు, ధైర్యం లేదు.....ఆత్మాభిమానం అంతకంటే లేదు....వుంటే మీలాంటి రౌడీల్ని యెప్పుడో తన్ని తగలేసేవారు.
మీరేదో గొప్పవారయినట్లు మీ గురించి, మీ వీరత్వం గురించి చెప్పుకోవడం, ఇంకా వీలయితే మీ మనిషినని అనిపించుకొని సిగ్గు లేకుండా ఆ విషయాన్ని పదిమందికీ చెప్పుకు బ్రతకటం, ఒక గాంధీ మనిషిననో, ఒక నెహ్రూ మనిషిననో, ఒక బోసు మనిషిననో చెప్పుకుంటే వాడికో విలువ! ఒక గూండా మనిషిననో, ఒక రౌడీ మనిషిననో చెప్పుకుని, ఆ ధైర్యంతో బ్రతికే జనాలకి సిగ్గులేదు."
"పెద్ద పెద్ద మాటలంటున్నావ్ మా బాస్ కి ప్రజల్లో యెంత పలుకుబడి వుందో తెలుసా? మా బాస్ మీటింగ్ పెడితే వేలమంది వస్తారు...." ఒకడు ఉద్రేకంగా అన్నాడు.
"ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ మోకాళ్ళ పైన కూడా చూపించిందని తెలిస్తే ఆ సినిమా ఆడే థియేటర్ ల దగ్గర లక్షల మంది పోగయిపోతారు. నలుగురు కొజ్జాలు ఓ చోట చేరి డాన్స్ చేస్తున్నారంటే వేలమంది పోగయిపోతారు.
ఓ చోట కొట్లాట జరుగుతోందంటే గుంపుల క్రింద చేరిపోతారు. మళయాళ సినిమా పోస్టర్ కనిపిస్తే వందలమంది ఆ పోస్టర్ ముందు మంత్రం వేసినట్లు ఆగిపోతారు.
చెప్పాగా వీళ్ళు వెర్రిబాగుల వాళ్ళు గాబట్టే మీ వృత్తిలో వున్న వాళ్ళు మీటింగ్ పెట్టినా వస్తారు. మీటింగ్ కాకముందే ఆఖరి బస్ పోతోంది లేవండి వెళదాం. ఈ రౌడీ వెధవల మీటింగ్ ఒక మీటింగేనా? అని తిట్టుకుంటూ వెళతారు అదెప్పుడన్నా విన్నారా?"
కొడుకు విశ్లేషణకు, వివరణకు రౌడీయిజం మీదున్న అవగాహనకు అరుణాచలం విస్తుపోయాడు.
తనెప్పుడూ అభిరామ్ అంతసేపు మాట్లాడగా చూడలేదు.
అచ్యుత్ అంతానికి తెర దింపడం అంత తేలిక కాదనుకున్న ఆ రౌడీలే అభిరామ్ ధైర్యానికి, తెగువకి, మొండితనానికి శిలాప్రతిమలయి పోయారు.
"మేం అంత వెధవలమే అయితే ఈ ప్రజలు మమ్మల్ని ఎలక్షన్స్ లో గెలిపించి పార్లమెంటు కెందుకు పంపిస్తున్నారు?" మరొకడు తెలివిగా ప్రశ్నించాననుకున్నాడు.
"చెప్పాగా-కొజ్జాని నిలబెట్టినా, 420 గాడ్ని నిలబెట్టినా, స్మగ్లర్ ని నిలబెట్టినా ఈ జనాలు గెలిపిస్తారు. అంతమాత్రం చేత మీరూ, మీకు ఓట్లు వేసినవాళ్ళు వెధవలు కాకుండా పోరు.
కేరక్టర్ చూసే ఓట్లు వేసుంటే ఈ దేశ మెప్పుడో జపాన్ అయిపోయేది. అలా లేదు గనుకే ఇలా మగ్గి చస్తున్నాం. నైతిక విలువలు లేని వాడికి సీటు, వివేకం లేనివాడికి ఓటు హక్కు యివ్వటం మానేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోదు. అందర్నీ బాగా చితగ్గొట్టి వదిలేయండి" అన్నాడు అజ్ఞాపిస్తున్నట్లు అభిరామ్.
అంతే-ఆ తర్వాత ఆ ప్రాంతమంతా రణరంగంలా మారిపోయింది.
"తన్నండీ వెధవల్ని. వీళ్ళకు ఆశయాలు, ఆదర్శాలూనూ! ఒకడు చస్తే వాడి ఆశయ సాధనకు రక్తం ధారబోస్తానని మరో వెధవ ప్రతిజ్ఞ పూనటం మరలా చందాల మాట, మామూళ్ళు మాట వినిపించకుండా విరగ్గొట్టండి" అని ఒకరంటే-
"చేసేవన్నీ రౌడీ పనులు చెప్పేదేమో ప్రజా నాయకులమని.....మరలా తలెత్తకుండా తన్నండి వెధవల్ని" అని ఇంకొకరన్నారు.
అరుణాచలానికి భయంతో వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ తరువాత పగబట్టి అచ్యుత్ అభిరామ్ ని ఏం చేస్తాడోనని గజగజా వణికిపోయి కొడుక్కి అడ్డు వెళ్ళే ప్రయత్నం చేశాడు.
కానీ ఫలితం లేకపోయింది. కొడుకు తనకు అలివి అయేటట్లు కనిపించకపోవడంతో ఓ క్షణం దిక్కు తోచలేదాయనకు.
క్షణ క్షనైకి పోరాట ఉధృతి పెరుగుతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ఇక లాభం లేదనుకొని వడివడిగా బయటకు వచ్చి ఆటో యెక్కి యింటికి పోనివ్వమన్నాడు.
అచ్యుత్ ముఠాకి, అభిరామ్ వర్గానికి కొట్లాట జరుగుతోందని చిన్నగా చుట్టు ప్రక్కలకు ప్రాకిపోసాగింది.
ఆ వార్త విన్న వెంటనే ఎవరూ నమ్మలేకపోతున్నారు. మరికొంత మంది అది నిజంగా నిజమైతే బావుండని భావించారు.
మొట్టమొదటిసారి నగర ప్రజలకు ఎవరీ అభిరామ్ అన్న ఆసక్తి కలిగింది. ఆపైన జనం ఆ వేపుకి పరిగెత్తసాగారు.
సరిగ్గా పది నిముషాలకు ఆటో అరుణాచలం ఇంటి ముందాగింది.
దిగుతూనే అరుణాచలం ఆటోలోంచి క్రిందికి దూకి ఇంటికేసి పరుగు తీశాడు.
కూతురు మేఖల విషయం అటో యిటో తేల్చాలనుకుంటున్న ఆదిలక్ష్మి భర్త కోసం, కొడుకు కోసం యెదురు చూస్తూ అప్పటికే వరండాలో నిల్చుని వుంది.
స్కూటర్ మీద రావాల్సిన భర్త ఆటోలో రావటం, ఆటో దిగి ఇంటికేసి పరుగెత్తుకు రావటం, మొహంలో ఆందోళన, భయం చోటుచేసుకుని వుండటాన్ని గమనించి ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది.