అప్పుడు ఇండియన్ అన్నాడు. "మేం అసలు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం" అని. పాకిస్థాన్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎలా...? ఎలా ఇండియన్స్ వాళ్ళకి బుద్ధి చెప్పారు?"
చెప్పటం ఆపింది హిందూ.
"ఎలా...? చెప్పండి జస్ట్ కామన్ సెన్స్..."
ఇంజనీర్, సైంటిస్ట్ అప్పటికే బుర్ర బద్దలుకొట్టుకుంటున్నారు.
నిమిషం గడిచింది. సమాధానం లేదు ఆ ఇద్దరి నుంచి.
"సరే రేపటి ఉదయం వరకు టైమ్ ఇస్తున్నాను" అంటూ హిందూ ముసుగుపెట్టింది.
ఉదయం హిందూ ఒక్కతే లేచింది. తలుపు దగ్గరకు వేసి మొక్కలకు నీళ్ళు పోస్తుండగా ఎవరో పిలిచినట్టుగా అనిపించి తలెత్తి చూసింది. ప్రహరీగోడ అవతల నుంచి ప్రియాంక తనవైపే చూస్తోంది.
ముందు ఆశ్చర్యపోయింది.
డబ్బున్నవాళ్ళ వైపు తప్ప ఇతరులవైపు కనీసం చూట్టానికి కూడా ఇష్టపడని నియోరిచ్ గాళ్ ప్రియాంక- తనతో ఏం అవసరం పడుంటుందని ఆలోచిస్తూనే గోడ దగ్గరకు నడిచింది.
"గుడ్ మార్నింగ్... ఏమిటి పిలిచారు?" హిందూకి ప్రియాంకను పలకరించడం ఇష్టం లేకపోయినా మర్యాదకోసం అడిగింది.
"మీతో చిన్న పనివుంది...." అంది మెల్లగా ప్రియాంక. డబ్బున్న వాళ్ళు ఏదో పనిబడితే తప్ప అంత ప్రేమగా, మర్యాదగా పలకరించరని హిందూకి బాగా తెలుసు.
"ఏ పనైనా నాకు కొంత ఫీజు ఇవ్వాల్సి వుంటుంది. అందుకు ఇష్టపడితేనే నాకా పని చెప్పండి" నిర్మొహమాటంగా అంది హిందూ.
ప్రియాంక ఓ క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే తిరిగి సర్దుకుని "సరే..." అంది లోపల అసహ్యపడుతూ.
"అయితే చెప్పండి" అంది చేతులకున్న మట్టి దులుపుకుంటూ.
"ఇలా కాదు. మీరోసారి మా ఇంటికి వస్తే చెబుతాను" అంది ప్రియాంక.
"ఓ.కె! మీరు పదండి. మీ గేట్ మేన్ ఎవరినీ లోపలకు రానివ్వడు. నేను మరో పదినిమిషాల్లో వస్తాను. ఈలోపు అతనికి చెప్పండి" అంటూ హడావుడిగా లోపలకు వెళ్ళిపోయింది.
* * * *
ఆ రోజంతా అన్నం తినలేదు తిమ్మడు.
ఆపరేషన్ కి డబ్బు కావాలి. అంత డబ్బెలా వస్తుంది ఒక్కసారి?! నలుగురైదుగురు డాక్టర్స్ ని ప్రయత్నించాడు. కనీసం వాళ్ళు దగ్గరకు కూడా రానివ్వలేదు.
తిమ్మడు పిచ్చి పిచ్చిగా రోడ్లన్నీ తిరుగుతున్నాడు.
అతనికి ఈలోకంలో ఇప్పటివరకు కావాల్సిన వాళ్ళు ఇద్దరే. ఒకరు వాసమ్మ- మరొకరు సిద్ధప్ప.
వాళ్ళమ్మ చనిపోతే సిద్ధప్ప బాధపడతాడు. సిద్ధప్ప బాధపడితే తనూ బాధపడతాడు. ఎలా?
తిరుగుతూ, తిరుగుతూ తిమ్మడు ప్రియాంక వుంటున్న వీధిలోకి వచ్చాడు.
సరిగ్గా అదే సమయంలో ప్రియాంక తమ ఇంటిలోని మెయిన్ హాల్లో కూర్చునుంది.
"నా సమస్య ఏమిటో చెప్పమంటారా....?" ఆశగా చూస్తూ అంది ప్రియాంక.
కాదన్నట్లు తలూపుతూ "అతిధులకు మర్యాద చేయడం నీ విధి. నీ పని కోసం నేను బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వచ్చాను."
ప్రియాంకకు అర్ధమయింది.
"అడుక్కు తినేవాళ్ళంతా ఇంతే..." నెమ్మదిగా అనాలనుకున్నా పైకొచ్చేసాయి ఆ మాటలు.
హిందూ హర్ట్ కాలేదు. చిర్నవ్వుతో చూస్తూ "మర్యాదగా మాట్లాడటం ఒక కళ. అది అందరికీ రాదు. ముందు ఒక డజన్ ఇడ్లీ తెప్పించండి. మరో విషయం, నాకు ఇతరుల ముందు బ్రేక్ ఫాస్ట్ చేయడం ఇష్టముండదు."
ప్రియాంక చిరాగ్గా లేచెళ్ళి పనిమనిషితో ఇడ్లీలు పంపించి పావుగంట తరువాత వచ్చింది.
హిందూ "ఇప్పుడు చెప్పు" అంది.
ప్రియాంక ఒక పేపర్ కటింగ్ తెచ్చి హిందూ ముందు పెట్టింది.
ఓసారి ప్రియాంక వైపు చూసి ఆ కటింగ్ ని చేతిలోకి తీసుకుంది.
"లక్ష రూపాయల ఖర్చుతో పాతిక లక్షల రూపాయల ఖర్చు తగ్గించగల మేధావికి గొప్ప బహుమానం..."
అనే హెడ్ లైన్ క్రింద వున్న మేటర్ ని ఐదు నిమిషాల్లోనే రెండుసార్లు చదివింది హిందూ.
ప్రియాంక ఆత్రుతగా చూస్తోంది.
ఆ పరిష్కారం మీదే కాలేజీలో తన పరువు మర్యాదలు ఆధారపడి వున్నాయి.
మరో అయిదు నిమిషాలు ఆలోచించింది హిందూ. "ఎప్పటిలోగా పరిష్కారం కావాలి?"
హిందూ మాటలకి చిరాగ్గా చూస్తూ "ఎంత త్వరగా అయితే అంత మంచిది" అంది ప్రియాంక.
"అయితే కరెక్టుగా 24 గంటల్లో చెబుతాను. నేనోసారి రేటు మాట్లాడుకోవాలి. పరిష్కారం చెప్పినందుకు రెండువేలు ఇవ్వాలి" అంది హిందూ స్థిరంగా.
"ఓ.కె! డన్...." అంటూ లేచింది ప్రియాంక.
ప్రియాంక కనీస మర్యాద కోసం కూడా ఆమె వెంట వెళ్ళలేదు.
హిందూ గేటులోంచి బయటకు వస్తుండగా ఎటో చూస్తూ వస్తూన్న తిమ్మడు ఆమె దృష్టిలో పడ్డాడు.
"హలో" అంటూ చప్పట్లు కొట్టింది వెంటనే. తిమ్మడు చూసాడు. వెంటనే గుర్తుపట్టాడు గాని, ఈమెతో నాకేం పనన్నట్లు తిరిగి నడవసాగాడు.
హిందూ వడివడిగా నడిచి తిమ్మడ్ని చేరుకుంది. మా రూమ్ ఇక్కడే ఒక్కసారి రాకూడదూ?"
ఓ క్షణం హిందూవైపు చూసి "పదండి" అన్నాడు తిమ్మడు.
ఇద్దరూ గదిలోకి వెళ్ళేసరికి అప్పుడే లేచి కూర్చున్నారు ఇంజనీర్, సైంటిస్ట్.
"పొద్దున్నే ఏ వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళావ్ తల్లీ... అవునూ, వీడెవడు?" అన్నాడు సైంటిస్ట్ తిమ్మడివైపు చూస్తూ.
వీడు అన్నందుకు తిమ్మడికి కోపం వచ్చింది.
"వీడు, వాడు అన్నావంటే మక్కెలిరగ తంతాను" అన్నాడు తిమ్మడు సైంటిస్ట్ వైపు మింగేసేటట్లు చూస్తూ.
"అతన్నేం పట్టించుకోకు తిమ్మడు..." అంది సర్ది చెబుతున్నట్లుగా హిందూ.
"ముందు ముఖాలు కడుక్కొస్తే టిఫెన్ చేద్దాం" అంది బ్యాగ్ ఓపెన్ చేస్తూ హిందూ.
ఇంజనీర్, సైంటిస్ట్ ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓ పొట్లం బయటకు తీసి దాన్ని విప్పింది. అప్పుడు కనిపించిన ఇడ్లీలను చూసి ఇద్దరూ చెంగున బాత్ రూమ్ వైపు పరుగెత్తారు.
"ఆకలి, కరువు మాలాంటోళ్ళకే అనుకున్నాను...!" ఆశ్చర్యపోయాడు తిమ్మడు.
చిర్నవ్వుతో చూసింది హిందూ.
ఆ పేపర్ ని నాలుగు భాగాలుగా చేసింది. ఒక్కోదానిలో మూడు మూడు ఇడ్లీలు పెట్టింది. ఓ క్షణం ఆలోచించి ఒకదానిలోంచి ఒకటి తీసి మరో దానిలో పెట్టింది.
అంతలో ఆ ఇద్దరూ వచ్చేశారు.
"అదేమిటి ఒక దానిలో రెండు, మరోదానిలో నాలుగు పెట్టావ్?" అన్నాడు కోపంగా సైంటిస్ట్.
హిందూ మౌనంగా వాటిని జరిపింది. ఈసారి ఇంజనీర్ కు కూడా కోపం వచ్చింది. తిమ్మడికి కూడా అర్ధం కాలేదు- తనకు నాలుగుపెట్టి, ఆమె రెండే ఎందుకు పెట్టుకుందో?
తింటుండగా ప్రియాంక తనను సాల్వ్ చేయమని చెప్పిన సమస్యను చెప్పింది.
అర్ధంకానట్లు చూసారు.
తన దగ్గరున్న కటింగ్ ఇచ్చింది వాళ్ళకు.
నలుగురూ చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. తిమ్మడికి అర్ధం కాలేదు- తనకెందుకు పిలిచి నాలుగు ఇడ్లీలు పెట్టిందో?
ఇంజనీర్ పైకే చదవడం మొదలెట్టాడు ఆ కటింగ్ ని. మొదటి రెండు వాక్యాలకే తిమ్మడు మధ్యలో అడ్డొచ్చాడు. "మేధావులకు అనుందిగా.... అంటే మగాళ్ళకేగా?" అర్ధం కానట్లు అడిగాడు.
ముగ్గురూ తిమ్మడి లాజిక్ కి ఉలిక్కిపడ్డారు. హిందూ నవ్వుతూ అంది "నీ పాయింట్ కరెక్టే. కాని మేధావులకు, సైంటిస్ట్ లకు, ఇంజనీర్లకు స్త్రీ లింగం వాడుకలో లేదు. కొన్ని మాటలు ఆడ, మగ ఇద్దరికీ వర్తిస్తాయి" అంది అతనివైపు మెచ్చుకోలుగా చూస్తూ.
ఇంజనీర్ చదువుకుంటూ వెళుతున్నాడు. తిమ్మడు ఒకవైపు వింటూనే రెండువేల గురించి ఆలోచిస్తున్నాడు.
ఇంజనీర్ పూర్తిగా చదివాడు.
"దీనికి పరిష్కారం చెబితే మనకు మూడు నెలలు ఫుడ్ దొరుకుతుంది. రెండు వేలిస్తుంది ప్రియాంక..." అంది ఇద్దరివేపు సాలోచనగా చూస్తూ.
"దీనికి పరిష్కారం లేదు..." అన్నాడు సైంటిస్ట్ వెంటనే.
"ఉంది కాని ఖర్చు ఎక్కువవుతుంది. బిల్డింగ్ బయటవేపు నుంచి ఫారెన్ లోలాగా ఓ ట్యూబ్ లిఫ్ట్ పెట్టవచ్చు..." ఇంజనీర్ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు.
హిందూ తీవ్రంగా ఆలోచిస్తుంది. నలుగురూ మౌనంగా వున్నారు.
లోతైన నిశ్శబ్దం అక్కడ.
తిమ్మడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అది చెప్పగలిగితేనే రెండు వేలొస్తాయి. ఆ రెండు వేలతో సిద్ధప్ప తల్లిని బతికించుకోవచ్చు. కాని పరిష్కారం అంత తేలిక కాదు. నిబంధనలు చాలా వున్నాయి. తిమ్మడు లేచాడు.
హిందూ తిమ్మడి వుద్దేశ్యాన్ని గ్రహించింది. "పనుందా...?" ఇంకాసేపు వుంటే బావుంటుంది గదా అన్నట్లు అడిగింది.
తిమ్మడు తిరిగి కూర్చున్నాడు.
"ఇంతకీ రాత్రి చెప్పినదానికి సమాధానం తట్టిందా...? హిందూకీ ఆ ఆలోచన, నిశ్శబ్దం నచ్చక అడిగింది.
"ఏది... మరోసారి చెప్పు...." సైంటిస్ట్ ఉక్రోషంగా చూస్తూ అడిగాడు.
మరలా చెప్పింది హిందూ.
సైంటిస్ట్ కి అర్ధంగాక "ఛీ... ఛీ... ఇదో పిచ్చి ప్రశ్న" అన్నాడు చిరాకు పడిపోతూ.
"నీకు అర్ధంకాకపోతే ఊరుకో- అంతేగాని పిచ్చి ప్రశ్న అనకు. అది మనకు పదిరూపాయలు సంపాదించి పెట్టింది. జస్ట్ కామన్ సెన్స్ వున్నవాడు చెప్పగలిగేది అది...." అంది ఇంజనీర్ ముఖంలోకి చూస్తూ.
"నేను చెప్పనా?"
తుళ్ళిపడ్డారు ముగ్గురూ తిమ్మడివైపు చూసి.
హిందూ తిమ్మడివేపు మెరుస్తున్న కళ్ళతో చూసింది. ఆ చూపుల్ని పసిగట్టిన సైంటిస్ట్ కి వంటిమీద కారం రాసినట్లయింది.
ఆరడుగుల ఎత్తులో మొరటుగా, ఓ జంతువులా కనిపిస్తున్న తిమ్మడికి హిందూ ప్రాముఖ్యం ఇవ్వడం జెలసీగా వుంది. వీడెక్కడ తగిలాడో ఈ మహాతల్లికి?
"చెప్పు. చెబితే నీకు ఐదురూపాయిలిస్తాను..." అంది హిందూ ఆసక్తిగా చూస్తూ.