Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 7


    "జైల్లో మా వాడికి అన్నం, టిఫిన్ లాంటివి పెట్టకుండా కొన్నాళ్ళపాటు మాడ్చాలి....అందుకే ఈ డబ్బు...." అంది వేదవతి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

    వింటూనే సత్యమూర్తితోపాటు నాయుడు కూడా వులిక్కిపడ్డాడు.

    జైల్లో ఉన్న తమ వాళ్ళకి అవి అందించాలని, ఇవి అందించాలని వేడుకున్నవారిని చూశాడుగానీ- అసలుకే కడుపు మాడ్వమన్న వార్ని అంతవరకు చూడలేదు.

    అలా ఎందుకని నాయుడికి అడగాలనే వుంది.

    కానీ వేదవతి కళ్ళ లోతుల్లో కనిపిస్తున్న శాసనాధికారాన్ని చూడగానే అడగలేకపోయాడు.

    "అలాగే....ఎవరికి? అలా ఎన్నాళ్ళు? జైలు రూల్స్ వొప్పుకోవు. ప్రిజనర్స్ కౌన్సిల్ కి తెలిస్తే నాకు ముప్పని కానీ- లేదంటే మీ దగ్గర మరో ఐదువేలు తీసుకుని ఆకలితో శోషవచ్చి పడిపోయే స్థితికి తీసుకెళ్ళగలను. ఇంతకీ ఎవరతను?" ఆనందభరితుడవుతూ అన్నాడు నాయుడు.

    సరిపడినంత లంచమిస్తే జైలునే అమ్మేసేలా వున్న నాయుడ్ని చూసి అంది వేదవతి గంభీరంగా-

    "నువ్వు వృత్తిలో దారి తప్పినట్లున్నావ్- లేదంటే నీ వృత్తి ఇదికాదు- రాజకీయం- ఇండియన్ పాలిటిక్స్."

    దిమ్మతిరిగిపోయే రిటార్ట్....

    కొద్దిక్షణాలవరకు తేరుకోలేకపోయాడు నాయుడు.

    తేరుకున్నాక బలవంతం మీద నవ్వాడు.

    "వివేక్...." అని అంటూనే ఆమె గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది వేగంగా.

    సత్యమూర్తి ఆమెని అనుసరించేందుకు పరిగెత్తక తప్పలేదు.

    నాయుడు వెళుతున్న వేదవతికేసి విస్మయంగా చూస్తూ డబ్బుని జేబులోకి కుక్కుకున్నాడు.


                            *    *    *    *


    "వివేక్ ని నా కొడుకని చెప్పుకోడానికే సిగ్గుగా వుంది. ఐదడుగుల పదంగుళాల ఎత్తున్నాడు. ఎత్తుకు తగ్గ లావు-బరువు వున్నాడు. మెలితిరిగిన పటిష్టమయిన కండబలం కూడా వుంది. కానీ పిసరంత ధైర్యం, తెగువ, మొండితనం లేవు. జరిగినదాన్ని నిర్లిప్తంగా అంగీకరించటం తప్ప, ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకుందామన్న పట్టుదల లేని నిర్భాగ్యుడు- అసమర్దుడైన మంచివాడ్ని కనడంకన్నా, సమర్ధుడైన దుర్మార్గుడ్ని కనుంటే నా కోరిక నెరవేరేది. యాభయ్ వేలు చూపిస్తేనన్నా వుత్సాహపడతాడనుకున్నాను- లాభం లేకపోయింది.

    మహాకవి అన్నట్లు కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు.... నిజమే....మన దేశం కూడా ఇలా వెనుకబడి వుండటానికి కారణం వీళ్ళే. ఏ విషయాన్నీ వెంటనే తేల్చుకోలేని వృద్దులు- విషయాన్ని నాన్చి నాన్చి చావకుండా, బ్రతక్కుండా నిర్ణయం తీసుకోకుండానే, ఏమీ సాధించకుండానే చస్తారు...." నిస్పృహగా అనుకుంది వేదవతి జైలునుంచి తిరిగి వస్తూ.

    సత్యమూర్తి వినడం తప్ప అభిప్రాయం చెప్పడం ఎప్పుడో మానుకున్నాడు.

    ఆ విషయాన్ని అక్కడితో ఆలోచించటం మానేస్తుందేమోనని సత్యమూర్తి ఆలోచిస్తున్నంతలో....

    "ఈ ప్రపంచంలో ఎవరు లక్ష్యాన్ని చేరుకుంటారో తెలుసా? ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? అనుకున్నది జరిగేవరకు నిద్రపోనివాడు. నేనీ రోజు నుంచి నిద్రపోవడం మానేస్తాను" అంది ఎటో చూస్తూ.

    ఆమె పరోక్షంగా చెప్పిందాన్ని అర్ధం చేసుకుని దిగ్ర్భాంతికి గురి అయ్యాడు సత్యమూర్తి.


                           *    *    *    *


    ఆ రోజు మధ్యాహ్నం నుంచే వర్షం, ఈదురుగాలులు ఆరంభమయ్యాయి. ఎక్కడో బంగాళాఖాతంలో బలహీనపడిన తుఫాన్ ప్రభావం- షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఖైదీలంతా తోటపని చేయాలి. జైలుకి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న కూరగాయలు, పండ్లతోటలో వాళ్ళు పని చేయాలి. అది జైలుకి సంబంధించిందే. ప్రతిరోజూ జైలుకి కూరగాయలు అక్కడి నుండే వస్తాయి.

    అయితే ఆకాశం మేఘావృతమై, పగలే చీకటి పడినట్లుగా అయిపోవడం, ఎడతెరిపిలేని వర్షం, ఈదురుగాలులు అలుముకోవడంతో ఖైదీలని జైలునుంచి కదిలించే ప్రయత్నం చేయలేదు జైలు అధికారులు. అలాంటి అనుకూల వాతావరణంలో కాకలుతీరిన ఖైదీల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం.

    అందుకే ఖైదీలంతా సెల్స్ లోనే వున్నారు.

    "ఉదయం నిన్ను కలవడానికొచ్చిన వృద్దురాలెవరు? మీ అమ్మా?"

    మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని మౌనంగా రోదిస్తున్న వివేక్ ఆ ప్రశ్నకు వులిక్కిపడి తలెత్తి చూశాడు.

    ఎదురుగా రామదాసు....తలుపు ఊచల్ని పట్టుకుని తనకేసే చూస్తూ కనిపించాడు.

    "ఎ....ఎవరూ రాలేదే....? నాకోసం ఎవరొస్తారు?" అన్నాడు తడబాటుగా వివేక్.

    రామదాసు నవ్వాడు....

    అతని నవ్వుకో....అప్పుడే అటుగా ఉధృతంగా వీచిన చలిగాలికో వులిక్కిపడ్డాడు వివేక్.

    "సివిలియన్ పొలిటీషియన్ లా చటుక్కున అబద్ధం ఆడలేదు. మీ అమ్మే ఆమె....ఏమంటోంది....?" నవ్వుతూనే ప్రశ్నించాడు రామదాసు.

    ఎవరో తన కోసం వచ్చినట్లు రామదాసుకి తెలియవచ్చు- కానీ వచ్చింది తన తల్లేనని ఎలా తెలుసు?!

    "ఈ జైల్లో ఎక్కడ ఏది జరిగినా, ఎవరు వచ్చి వెళ్ళినా నాకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ నెట్ వర్క్ నాకుంది. అదెలా అన్న మీమాంస కన్నా నా ప్రశ్నకు సమాధానమివ్వటమే నీకు మేలు" తిరిగి అన్నాడు రామదాసు.

    సమాధానం చెప్పటానికి సందేహించాడు వివేక్.

    "అంత రహస్యమా....? అంటే జైలునుంచి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డావా....?"

    "లే....లేదు....అలా చేయమని మా అమ్మ అంది. నేనే ఒప్పుకోలేదు" కంగారుగా అన్నాడు వివేక్.

    "నీ అమాయకత్వాన్నీ, నీలోని పిరికితనాన్నీ చూసైనా న్యాయమూర్తి బెనిఫిటాఫ్ డవుట్ కింద వదిలేయలేదంటే బలమైన సాక్ష్యాల్నే కోర్టులో నీ ప్రత్యర్ధులు ప్రవేశపెట్టి వుంటారు. అది సరే....మీ అమ్మెందుకు నిన్ను జైలునుంచి తప్పించుకోమంది?"

    "మ కుటుంబానికి అన్యాయం చేసినవారి మీద పాగా, ప్రతీకారాలు తీర్చుకునేందుకు."

    "అంటే ఆమె వృద్దురాలు కాదు- నువ్వు వృద్దుడివన్నమాట...." నిట్టూరుస్తూ అన్నాడు రామదాసు.

    తల్లిని తలుచుకోగానే వివేక్ కళ్ళలో నీళ్ళు....అంతలో అటుగా వచ్చాడు నాయుడు. అతడ్ని చూస్తూనే వివేక్ గోడవైపు తిరిగి తలవంచుకున్నాడు.

    "ఆరోగ్యమెలా ఉంది రామదాసు....?" నాయుడు రామదాసు సెల్ దగ్గరకు వెళ్ళి ప్రశ్నించాడు.

    రామదాసు నిర్లిప్తంగా నవ్వాడు.

    ఆ నవ్వులో జీవం లేదని నాయుడికేగాదు వివేక్ కి కూడా అర్ధమైపోయింది.

    "నీ దగ్గర కావల్సినంత డబ్బుంది, జైలు జీవితం ముగియబోతోంది. కానీ అనుభవించటానికి ఆయుర్దాయమే లేదు. డాక్టర్స్ పెదవి విరిచేశారు" అన్నాడు నాయుడు తెచ్చిపెట్టుకున్న సానుభూతితో.

    నరరూప రాక్షసుడులాంటి నాయుడు అంత సౌమ్యంగా, సానుభూతిగా మాట్లాడడం కేవలం ఆశ్చర్యాన్నే కలిగిస్తే- రామదాసు ఆరోగ్యం పట్ల డాక్టర్స్ పెదవి విరవటం అన్నది షాక్ నే కలిగించింది వివేక్ లో. రామదాసు ఆయుర్దాయం పట్ల డాక్టర్స్ పెదవి విరుపు. అయినా ఆతనలాంటి భయందోళనలే లేకుండా వున్నాడే? అది సాధ్యమా?

    "నాకు నాలుగు రోజుల క్రితమే తెలిసింది. అయినా చేయగలిగిందేముంది? కానీ నీతో చిన్న పని పడబోతోంది. చేసి పెడతావా?" రామదాసు కంఠంలో ఒకింత జీర తొంగిచూసింది.

    నాయుడు మౌనంగా వుండిపోయాడు.

    "ఊరకే కాదులే" తిరిగి అన్నాడు రామదాసు.

    ఆ మాటలు చాలు నాయుడిలోంచి రియాక్షన్ బయటపడటానికి.

    "భలేవాడివయ్యా రామదాసు! నువ్వెప్పుడు ఏదడిగితే కాదన్నాను?" నవ్వుతూ అన్నాడు నాయుడు.

    "ఆ చనువుతోటే అడుగుతున్నాను....చేస్తావుగా?"

    "ష్యూర్....ఏమిటది?"

    "త్వరలోనే చెబుతాను."

    "అలాగే....కాస్త నా విషయం దృష్టిలో పెట్టుకో- పెళ్ళాం బిడ్డలు కలవాడ్ని."

    "తప్పు....తప్పు....పెళ్ళాలు, బిడ్డ కలవాడివి."

    నాయుడు గుర్రుగా చూశాడు.

    "జస్వంతరావుకి నా విషయం తెలిసిందా?"

    "తెలిసే ఉండవచ్చు- అధికారంలో వున్నవాడుగదా?"

    "అయితే తిరిగి ఏదో ప్రయత్నం చేయకుండా వుండడు."

    "ఏ ప్రయత్నాన్నయినా నీరుగార్చటానికి నేనున్నానుగా?"

    "నీ అవసరాలు తీర్చటానికి నా దగ్గర డబ్బుందిగా- ఏమంటావ్?"

    "ఆపైన నీ దయ....వస్తా...." అంటూ వివేక్ సెల్ కేసి కొద్దిక్షణాలు చూశాడు నాయుడు.

    ఇతన్నేగా అన్నం పెట్టకుండా మాడ్చవలసింది....పెట్టినా డబ్బు పెట్టకున్నా డబ్బులే....ఎవడు కనిపెట్టాడో యీ ప్రభుత్వోద్యోగాలు కానీ - గొప్ప రుచికరమైనవి. వాడికి....ఆ బ్రిటిష్ వాడికి శతకోటి వందనాలు.... అని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.

                     *    *    *    *

 Previous Page Next Page