మృత్యువు జోలపాట ఆ నీరవ నిశీథిని పలకరిస్తున్నవేళ జైలు గంట పదిసార్లు మోగింది.
జైలు మొత్తం నిద్రిస్తున్నవేళ రామదాసు, వివేక్ లు మాత్రం మోకాళ్ళ మధ్య గడ్డాల్నుంచుకుని తగ్గు స్థాయిలో సంభాషించుకుంటున్నారు.
"మీకు కేన్సర్ అని తెలిసినా....ఎప్పుడు పోతారో, ఎంత కాలముంటారో తెలీకపోయినా అంత నిబ్బరంగా ఎలా వుండగలుగుతున్నారు?" వివేక్ ఆ ప్రశ్నని ఇప్పటికి పదిసార్లు వేశాడు.
"నా మృత్యువు అన్నది నాకొచ్చిన కేన్సర్ చేతుల్లో లేదు...." అన్నాడు రామదాసు నిరాసక్తంగా.
"మరి!?" వివేక్ ఆశ్చర్యపోయాడు.
"నా ప్రత్యర్ధి చేతుల్లో పొంచి వుంది."
"అతనెవరు?"
"జస్వంతరావు."
"ఆయనెవరు?"
"రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి."
బిత్తరపోయాడు వివేక్.
రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి....అంటే కేబినెట్ మినిస్టర్....కాబోయే ముఖ్యమంత్రి రామదాసుకి ప్రత్యర్దా? ఇతని చావుని అతనెలా శాసిస్తాడు?!
అదే అడిగాడు వివేక్.
"రెండు మూడు రోజుల్లోనే ఎలా అన్నదీ తెలిసిపోతుంది" అంటూ నిద్రకుపక్రమించాడు రామదాసు.
ఇతనికి నిద్రెలా పడుతుంది? అని ఆలోచిస్తూ తిరిగి చలిని మర్చిపోయాడు వివేక్.
* * * *
సూర్యా ఎన్ క్లేవ్ లోని ఒక మధ్యతరగతి ఇల్లు....
అర్దరాత్రి దాటిపోయినా ఆ ఇంట్లో ఓ మూల గదిలో లైట్ యింకా వెలుగుతూనే వుంది.
ఆ గదిలో ఓ మూల ఉన్న చిన్న టేబుల్ ముందు కూర్చుని ఓ యువతి ఏవో కాగితాల్ని శ్రద్ధగా చదువుతోంది.
ఆమె అయిదడుగుల ఆరంగుళాల ఎత్తులో వుంటుంది.
నల్లగా వుంటుంది- అందంగా వుంటుంది.
చైతన్యాన్ని ప్రోది చేసుకుని పుట్టిన రొమాంటిక్ వల్కనో అని అనిపిస్తుంది ఎవరికయినా- ఆమెని చూడగానే.
ఆమె అవయవాల పొందికలో - వైటెల్ స్టాటిస్టిక్స్ లో చూపుల్ని పారేసుకోని యువకులు బహు అరుదు. ప్రస్తుతం ఆమె అందమైన....గుండ్రటి ముఖాన్ని కారుమబ్బులాంటి ఆమె పొడవయిన, ఒత్తయిన జుత్తు వరద ప్రవాహంలా జాలువారి కప్పేస్తోంటే, ఆమె అలవోకగా వాటిని కళ్ళకు అడ్డు రాకుండా పక్కకి లాగేసుకుంటూ దీక్షగా చదువుతూనే వుంది.
ఆమె ముందేవో కోర్టు ప్రొసీడింగ్స్....అఫిడవిట్స్ .... మరేవో పేపర్ కటింగ్స్ గుట్టలుగా పడివున్నాయి.
చదువుతున్న ఆమె మధ్య మధ్యలో....
ఏవో పాయింట్స్ పక్కనే పెట్టుకున్న నోట్ బుక్ లో నోట్ చేసుకుంటోంది.
వాటిని చదువుతున్న కొద్దీ ఆమె గుండె బరువెక్కుతోంది. పదే-పదే ఆమెకి వివేక్ గుర్తుకొస్తున్నాడు- అతని అమాయకమైన ముఖం ఆ జీవంలేని కాగితాల్లో సూపర్ ఇంపోజ్ అయి కనిపిస్తున్నట్లుగా వుంది.
ఆమె అలా తెల్లవారుఝామున మూడు గంటలవరకు మేల్కొనే వుంది.
"నువ్వింకా నిద్రపోలేదా మనూ?" తల్లి పలకరింపుకి మనోజ్ఞ ఉలికిపాటుగా తలను పక్కకు తిప్పి చూసింది తప్ప, సమాధానం యివ్వలేదు.
తల్లి ఓసారి నిట్టూర్చి వెనుతిరిగింది.
మరో అరగంట గడిచింది.
"అప్పుడే లేచావా మనూ?!" అప్పుడే లేచి వచ్చిన తండ్రి గొంతుకలో ఒకింత ఆశ్చర్యం.
మనోజ్ఞ మౌనంగా లేచి నిలబడింది.
తన కనురెప్పల గోడల వెనక్కి చూస్తే- తన తండ్రి బాధపడతాడు. అందుకే అవునన్నట్టుగా, కాదన్నట్లుగా తలాడిస్తూ వెళ్ళి లైట్ తీసేసి చిరు వెలుతురులో బెడ్ మీద వాలిపోయింది భారంగా.
ఏవేవో దుఃఖభాజమైన జ్ఞాపకాల అరల్లోని పొరలు గుండె అరల్ని తట్టి లేపుతుంటే బాధగా కళ్ళు మూసుకుంది. వివేక్ ని రక్షించుకునే మార్గమేమీ లేదా?
ఏ తప్పూ చేయకుండానే ఉరికంబానికి చేరువవుతుంటే చూస్తూ వూరుకోవల్సిందేనా?
నో....నో....ఏదో చేయాలి....ఎలాగయినా రక్షించుకోవాలి....
మంచితనంతో, అమాయకత్వంతో తన గుండె తలుపుల్ని తెరిచిన తన మనోవిహారుడు వివేక్. భూమ్యాకాశాల్ని కదిలించయినా రక్షించుకోవాలి- ఆ నిర్ణయానికొచ్చాక మనోజ్ఞ ఒకింత స్థిమితపడింది.
ప్రేమ కోసం తహతహలాడటం నేరమా?
తనే మనసై ప్రేమించడం నేరమా?
అది దక్కకపోతే తన తప్పా?
దక్కని ప్రేమ విధి రూపంలో అంతులేని విషాదాన్ని నింపితే తనెలా తట్టుకు నిలిచింది?
ప్రేమ అమృతపు చినుకులై వర్షిస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు కన్నీటి బిందువుల్ని కానుకగా యిచ్చినప్పుడు జీవితం యేమవుతుంది?
కాలిపోతుంది - కూలిపోతుంది.
బండమారిపోతుంది.
దానికంతటికీ వివేక్ కారణమని తనవాళ్ళు- మనస్సులోని మాటని, ఇష్టమైన కోరికని సయితం బయటపెట్టుకోలేని అమాయకుడైన వివేక్ ఎలా కారణమవుతాడని తను-ఇన్నాళ్ళు వాదించుకోవడం జరిగింది.
ఫలించని తన ప్రేమని కాలేజీలో పాఠాలు చెప్పడంపై కేంద్రీకరించి, ఒక అధ్యాయం ముగిసిందని భావిస్తున్న దశలో, ఎడారిలాంటి తన హృదిల్ ఎక్స్ ప్లోజన్....ఎమోషనల్ ఎక్స్ ప్లోజన్....వివేక్ కి ఉరిశిక్ష పడిందని....
ఒక తల్లిని తప్ప ఈ ప్రపంచంలో నా అన్నవాళ్ళ ఆనవాళ్ళే లేకుండా ఒంటరిగా మిగిలిపోయి, మృత్యు ఘడియల్ని లెక్కించుకుంటున్న ఒకప్పటి తన ప్రియుడ్ని రక్షించుకోడం నేరమా? కాదు....ముమ్మాటికీ కాదు.
ఎవరేమనుకున్నా, ఎలా ఎదురుతిరిగినా ప్రేమని తను బ్రతికిస్తుంది. తద్వారా తనూ బ్రతుకుతుంది.
ఎన్నడూ లేని ఒక స్థిరమైన అభిప్రాయానికొచ్చిన మనోజ్ఞ ఒకింత మనశ్శాంథిగా కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల మాటున వివేక్ ని రక్షించే పథకం క్రమంగా వూపిరిపోసుకుంటోంది.
* * * *
మరుసటి రోజు సాయంత్రం నాలుగున్నరకి ఒక వ్యక్తి రామదాసుని కలిసేందుకు జైలుకొచ్చాడు.
రామదాసు ఇనుపజల్లెడ వెనుక నించుని తన కోసం వచ్చిన వ్యక్తిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు.
"ఏం కిట్టూ....ఎనీ ఇన్ ఫర్మేషన్....?" ఒకింత సందేహిస్తూ అడిగాడు రామదాసు.
"అవునన్న....జస్వంతరావు బంగ్లాలో సందడిగా వుంది. భవానీని పిలిపించారు. భవానీ కనిపించక నెలలే అయింది. మరలా హఠాత్తుగా నిన్న కనిపించాడు" ఆందోళనగా అన్నాడు కిట్టూ పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ.
"అంటే....నేనూహించింది నిజమేనన్నమాట...." నిట్టూరుస్తూ అన్నాడు రామదాసు.
"ఏంటన్నా అది?"
"భవానీ మనుషులు జైల్లోకి వచ్చే ప్రయత్నంలో వుండి వుంటారు."
"ఎందుకు?"
"నన్ను చంపటానికి."
కిట్టూ షాక్ తిన్నాడు- అయినా వెంటనే తేరుకున్నాడు.
"అయితే మేమూ లోపలికొస్తాం" ఆవేశంగా అన్నాడు కిట్టూ.
"మనవాళ్ళను పంపించు. నువ్వు లోపలకు రాకు. నీతో బయటే పని వుంది."
అదేంటన్నా....అసలే నీ ఆరోగ్యం బావోలేదు- నేను లేకపోతే ఎలా?"
"నువ్వు బయట ఉండి చేయవలసిన ముఖ్యమైన పనులున్నాయి. నాయుడు నాకు అండగా వుంటాడులే."
"ఏం చేయాలి....చెప్పన్న."
"నాలుగు రోజులాగిరా- చెబుతాను. ఇక్కడ నేనో మనిషిని చూశాను. వాడి శక్తి సామర్ధ్యాల్ని, తెలివితేటల్ని పరీక్షించి సరిపోతాడనుకుంటే- నీకు పనులు పురమాయిస్తాను...." అన్నాడు రామదాసు సాలోచనగా.
కిట్టూ ముఖంలో ఒకింత నిరాశ కనిపించింది.
"నువ్వు చేయలేవని కాదురా కిట్టూ....ఏ పనికి ఏ మనిషి సరిపోతాడో సరిగ్గా అంచనా వేయాలిగా....అందుకు...."
అయినా కిట్టూ ముఖంలో ఒకింత అలక అలముకుంది.
"స్వంత కంపెనీని ఓనర్ దగ్గరుండి చూసుకొనే విధానానికి, గవర్నమెంట్ కంపెనీని ఉద్యోగులు చూసుకొనే విధానానికి చాలా తేడా వుంటుంది. అది వ్యాపారానికి పరిమితం- అక్కడ లాభనష్టాల లెక్కలే వుంటాయి. రూపాయి పోవడమో, రావడమో. కానిందులో ప్రాణం తియ్యటమో- కోల్పోవటమో జరుగుతుంది. చిన్న పొరపాటు మొత్తం నా పథకానే నీరుగార్చి వేస్తుంది.