ఆ ఒంటరి ఇంట్లో నిశ్శబ్దపు గోడల మధ్య మిగిలిపోయింది వేదవతి, సత్యమూర్తి మాత్రమే.
ఇప్పుడా ఇంట్లో ఒక చిరిచాప, చిన్నదిండు, పాతబడిన దుప్పటి, మంచినీళ్ళ కూజా, ఒక స్టీల్ గ్లాసు, ఒక ప్లాస్టిక్ బకెట్, మగ్గూ, అంతే!
యుద్ధం ముగిశాక, శవాల గుట్టలు కాలాక- చెదిరిపడిన ఆయుధాల ఆనవాళ్ళు వట్టిపోయాక, మిగిలిన నిశ్శబ్ద గంగిరపు మరుభూమిలా వుందా యిల్లిప్పుడు.
ఆ ఇద్దరికీ ఎవరి గుండె చప్పుళ్ళు వారికే వినిపించేంతటి నిశ్శబ్దం ఇప్పుడా ఇంటి నాలుగు గోడల మధ్య పేరుకుపోయింది.
"జైలుకెప్పుడు వెళ్ళేది....?" ఎంతో ప్రయత్నం మీద అడిగాడు సత్యమూర్తి.
"డబ్బు చేతిలో వున్నప్పుడు జైలు రూల్స్ ని పాటించాలని జైలు సిబ్బందే చెప్పదు. చెబితే వాళ్ళ ఆదాయం పోతుంది- కాదంటావా....?" విరక్తిగా నవ్వుతూ అంది వేదవతి.
చిన్న ప్రకంపనకు లోనయ్యాడు సత్యమూర్తి. అప్పుడు సమయం ఉదయం 11.30.
* * * *
సమయం సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలు.
జైలు సింహద్వారం ముందు వేదవతి తన తమ్ముడు సత్యమూర్తితో పాటు రెండు గంటల నుంచి నిరీక్షిస్తోంది.
ఆమె నడుము చుట్టూ పైటచెంగు కైవారంలో యాభైవేలు భద్రంగా కట్టబడి వున్నాయి.
నీళ్ళు యింకిపోయి, లోతుకుపోయి గాజుగోళీల్లా ఉన్న వేదవతి కళ్ళలోతుల్లోకి జైలు సిబ్బంది పరిశీలనగా చూసి వుంటే ఆమెకి లోపలకు వెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చి వుండేవాళ్ళు కాదేమో....
సరిగ్గా నాలుగున్నరకి జైల్లో వున్న తమ వాళ్ళను కల్సుకొనేందుకు వచ్చిన విజిటర్స్ తోపాటు వేదవతి, సత్యమూర్తి లోపలకు వెళ్ళారు.
విజిటర్స్ లో ఉన్న మగవాళ్ళందర్నీ చెక్ చేసిన సిబ్బంది, ఆడవాళ్ళను చెక్ చేయలేదు .అందుకే ఆమె యాభైవేలతో లోపలకు అడుగుపెట్టింది.
"నా ఆకారం నాకెంత మేలు చేసి పెట్టిందో చూశావా తమ్ముడూ? ఈ పిచ్చిదానిలా వున్న వృద్దురాలు జైల్లోకి ఏం తెస్తుందిలే అని వదిలేశారు. అదే ఒక ఆయుధమైతే? ఇంతవరకూ కల్సిరాని కాలం ఇకపై కలిసి వస్తుందనటానికి యిదే వుదాహరణ.... త్వరగా పద...." అంది వేదవతి చిన్నగా, సత్యమూర్తికే వినిపించేలా.
కేవలం డబ్బు మాత్రమే తెచ్చి ఏం చేయగలదనే వరకే సత్యమూర్తి ఆలోచించాడు.
* * * *
4.45కి వివేక్ వచ్చి ఇనుప జల్లెడకి ఆవల నించున్నాడు.
అప్పటివరకూ అక్కడే వున్న బెంచ్ మీద కూర్చున్న వేదవతి, సత్యమూర్తి లేచి దగ్గరకు వెళ్ళారు.
వివేక్ వెంటనే తల్లిని చూడలేకపోయాడు.
అతని కళ్ళవెంట అప్రయత్నంగా నీరు....
"నువ్వు చాలా అదృష్టవంతుడివి. బాధనీ, భయాన్నీ బయటకు వెళ్ళగక్కుకునేందుకు కన్నీళ్ళింకా నీలో మిగిలివున్నాయి." అంది వేదవతి. కొడుకు తలవంచుకుని కళ్ళు వత్తుకోవడాన్ని గమనించి.
వివేక్ ఉలికిపాటుగా తలెత్తి తల్లివైపు చూశాడు.
"అవును.... నా గుండె లోతుల్లోంచి ఇప్పుడు దుఃఖం పొంగుకు రావటంలేదు. పగ, ప్రతీకారాలు పరుగులు పెడుతున్నాయి. నేను సూటిగా మాట్లాడడానికే వచ్చాను. ఉరి ఎప్పుడు తీస్తున్నారు.....?" యుద్ధం ముంచుకొచ్చాక, సంధికి, రాజీకి, చర్చలకి ఆస్కారం లేదని తెలిసిన తరువాత వారియర్ లో కలిగే తెగింపే ఇప్పుడు ఆమెలో కనిపిస్తోంది.
మొన్నటివరకు కన్నీటి ప్రవాహంలో మునిగితేలిన తన తల్లేనా అలా మాట్లాడుతోంది? తను మరణ ముహూర్తానికి దగ్గరవ్వబోతున్నానని తెలిసి తట్టుకోలేక వచ్చిందనుకున్న వివేక్ షాక్ తిన్నాడు.
"విధి ఇలా వక్రించిందేం కన్నా.... మన కుటుంబం ఇలా నాశనమయిపోయిందేం బిడ్డా అని అడిగి, వాపోవటానికి వచ్చానని నువ్వు భావించి ఉంటావు. కానీ నా మాటలు విన్నాక షాక్ తిన్నావ్....కదూ.... చావు తప్పదు అనుకున్నాక ఆ చావు గురించే ఇంకా వ్యధచెందేకన్నా, ఆ లోపు సాధించవలసిన వాటిగురించే వివేకవంతుడు ఆలోచించాలి. వగచి ప్రయోజనం లేదు. చెప్పు....ఎప్పుడు విధించారు ఉరిశిక్ష....? ఏ రోజు అమలు చేస్తారు?" వేదవతి కంఠంలో స్త్రీపరమైన మృదుత్వంకానీ, భావోద్వేగంకానీ పలకటంలేదు. తలారి గొంతులోని కాఠిన్యం, అనెమోషనల్ ఫీలింగే కనిపిస్తోంది.
"ఇంకా....ఆర్డర్స్ రాలేదు...." పొర్లుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ అన్నాడు వివేక్.
"శభాష్....అంటే....విధో....భగవంతుడో....ఇంకెవరో నువ్వు పూర్తిచేయవలసి వున్న కార్యానికి గడువు ఇచ్చారన్నమాట" తనలో తాను అనుకుంటున్నట్లు అన్నా ఆ మాటలు వివేక్, సత్యమూర్తిలకి వినిపించాయి.
సడెన్ గా తన తల్లి ఏదో మాట్లాడుతోందేమిటి? మతి స్థిమితంగానీ తప్పిందా? వివేక్ విభ్రాంతికి గురయ్యాడు.
"గడువును గమ్యం చేరేందుకు ఉపయోగించుకోవాలి. పూచిక పుల్లతో సహా అమ్మి, యాభైవేలు తీసుకొచ్చాను" అంది వేదవతి ఓరగా ఒకింత దూరంగా కాపలాగా వున్న జైలు సెంట్రీనే గమనిస్తూ.
వివేక్ అర్ధంకానట్లు చూశాడు.
"అర్ధంకాలేదనుకుంటాను. ఉరిశిక్ష పడటంతో మెదడు మొద్దుబారిపోయి వుంటుంది. అది సహజమే. నువ్విప్పుడు జైలునుంచి తప్పించుకు రావాలి. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుల్ని హతమార్చాలి. అర్ధమైందా?" అంది గంభీరంగా వేదవతి.
వివేక్, సత్యమూర్తిలకి ముందామె ఏమన్నదో అర్ధంకాలేదు. అర్ధంకాగానే పక్కలో బాంబుపడ్డట్టుగా అదిరిపడ్డారు.
"జైల్లోంచి తప్పించుకొని వచ్చాక ఆయుధాలకు, పథకాలకు డబ్బు కావాలిగా. అందుకే నా శక్తిమేరకు ప్రయత్నించి యాభైవేలే తేగలిగాను. దాన్నే పొదుపుగా వాడుకుని పని సాధించాలి. అప్పుడే నీ తండ్రికి నువ్వు పెట్టిన కొరివి సార్ధకమవుతుంది."
పిచ్చిపట్టినవాడిలా చూశాడు వివేక్.
"ఈ ప్రపంచంలో ఇంతవరకు జరగని సంఘటన ఇకపై జరగాలని కోరుకుంటున్నట్లుగా ఆ వెర్రి చూపులేమిటి? ఈ యాభై వేలిస్తే ఆ పని సాధించటానికి బయట చాలామంది కిరాయి గూండాలున్నారు. కానీ శంఖంలో పోస్తేనేకదా తీర్ధమయ్యేది. చెప్పు ఎప్పుడు తప్పించుకుని బయటకొస్తావ్? బయట ఏర్పాట్లు నేను పూర్తిచేసే ప్రయత్నంలోనే వున్నాను."
వివేక్ కి ఆ షాక్ నుంచి తేరుకోవటానికి చాలాసేపే పట్టింది.
"తప్పించుకుని పగ తీర్చుతావా లేదా అన్నదాని గురించే నీ సమాధానం వుండాలి! 'ఇంత పటిష్టమైన జైల్లోంచి తప్పించుకోవడం అంత తేలికనుకుంటున్నావా. అది నేరం కదా....? అంత ధైర్యం తెగువా నాకున్నాయా? పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండేవార్ని ఎలా హతమార్చగలను' లాంటి అర్భకపు ప్రశ్నలు వేయవద్దు. ఇప్పుడు చెప్పు సమాధానం" అంది వేదవతి గుసగుసలాడుతున్నట్లుగా.
అప్పటికే సెంట్రీ - వేదవతి, వివేక్ లవైపు ఒకింత అనుమానాస్పదంగా చూస్తున్నాడు.
కష్టాలు మనిషిని కన్నీళ్ళుగానూ, కఠిన శిలగానూ మార్చి వేస్తాయేమో....?!
కన్నీళ్ళు కార్చడం మొదటి దశ....
కఠిన శిలగా మారటం రెండవ దశ....
కన్నీళ్ళు కసిగానూ, కాఠిన్యం క్రోధంగానూ
రూపాంతరం చెందడం మూడవ దశ....
తను ఇంకా మొదటి దశలోనే వుంటే తన తల్లి మూడవ దశ అంచుకు చేరుకుంది. ఊహాతీత విపరీతం....
"సారీ....నాలో అంత ధైర్యం, తెగువ, తెలివితేటలు, స్ట్రాటజీ లేవు. నువ్వు చెప్పేది చట్టవ్యతిరేకమయిందే అయినా మన కుటుంబపరంగా న్యాయసమ్మతమయిందే. అది నాకు తెలుస్తోంది. అయినా సరే- నువ్వు చెప్పేది వింటూంటే నాకు కాళ్ళలో వణుకు వచ్చేస్తోంది. రోజుల్లెక్క పెట్టుకుంటున్న నేను నీ కోరిక నెరవేర్చలేనమ్మా! ఆ యాభయివేలు నీ శేషజీవితం కోసం వుంచుకోమని చెప్పడం తప్ప మరేం చేయలేని నిస్సహాయుడ్ని" గొణుగుతున్నట్లుగా అన్నాడు వివేక్ తల వంచుకుని.
కనీసం చేయి కూడా దూర్చటానికి వీలులేని ఇనుప జల్లెడ అడ్డుపడింది కానీ, లేదంటే వివేక్ దవడ వేదవతి చేతిదెబ్బకు వాచిపోయేదే.
ఒక్కక్షణం ఛీత్కారంగా కొడుకువైపు చూసిందావిడ. అంతే....ఆ మరుక్షణం అక్కడినుంచి విసవిసా సబ్ జైలర్ నాయుడుండే ఆఫీసువైపు సాగిపోయింది.
వివేక్ నిర్ణయంతో స్థిమితపడిన సత్యమూర్తి తన అక్కని అనుసరించాడు.
* * * *
సబ్ జైలర్ నాయుడు తన గదిలోకి వస్తున్న వేదవతిని చూసి ఏదో లాభసాటి బేరం తగిలిందనుకున్నాడు.
వేదవతి వస్తూనే బొడ్లో విడిగా దాచుకున్న వెయ్యి రూపాయలు తీసి నాయుడు టేబుల్ మీదుంచింది. నాయుడు లంచగొండే- కానీ మరీ అంత డైరెక్ట్ గా వ్యవహరించడు. అలాంటి వాడికే వేదవతి చర్య మతిపోయేలా చేసింది.
"నాకో సహాయం కావాలి" డైరెక్ట్ గా విషయంలో కెళ్ళింది.
"చెప్పమ్మ....ఏం కావాలి? జైల్లో ఉన్న మీ వాళ్ళకి మంచి భోజనము, మందులు, సిగరెట్స్, బ్లాంకెట్స్, పేపర్స్, పత్రికలు, రేడియో....ఏది కావాలన్నా దానికో రేటుంటుంది...." ఆ గదిలో ఎవరూ లేకపోవటం తన ఎదురుగా వేదవతి, సత్యమూర్తి మాత్రమే వుండటంతో నాయుడికి ధైర్యం వచ్చింది.
నాయుడికి డబ్బు అవసరం ఎప్పుడూ వుంటుంది. తను జల్సా పురుషుడు-అతని భార్యకి షాపింగ్ పిచ్చి. నాయుడు బయట చేసొచ్చే తప్పుల్ని భార్య క్షమించాలంటే, ఆమె చేసే షాపింగ్ కి అవసరమైన డబ్బుని అతను అందిస్తే చాలు. నాయుడు ప్రతిరోజూ తప్పులు చేస్తూనే వుంటాడు. వాటిని ఏ రోజుకారోజు భార్య క్షమించాలి. అంతే....ఆ భార్యాభర్తల సంబంధం అలాంటిది.