చెవికింద జోరీగలాగా మూడిళ్ళవతల వున్న కూరల బండి సుబ్బుడు ఫుల్ సౌండ్ లో రేడియో పెట్టాడు. చౌక రకం డబ్బా రేడియో మహా ఘోరంగా పాటలు వినవస్తున్నాయి.
ఎవడో తాగొచ్చి పెళ్ళాన్ని బాత్తున్నాడు. తాగుడులో అదీ ఒక భాగం అన్నట్లు. అరుస్తూ బూతులు తిట్టడం తన వంతు అన్నట్లు "నీ చేతులు విరగ. ముదనష్టపు సచ్చినోడ!" అని ఆ భార్య అరుస్తూ మాట్లాడుతున్నది.
నరకమనేది ఒకటుందని అది ఇక్కడే వుందని మొదటిసారిగా పద్మినీ ప్రియదర్శినికి అనుభవంలోకి వచ్చింది రాత్రి మొదటి భాగంలోనే.
4
మర్నాడు.
ఉదయాన్నే నిద్ర లేచేసరికి రణగొణ ధ్వని రాళ్ళ వానతో ఆ ప్రదేశమంతా గోలగా వుంది.
రాత్రంతా దోమలు కుట్టడం దాంతో దురదపుట్టి గోక్కోటం, తిట్టుకోటం తెలియని బాధ ఏదో కోల్పోయానన్న భావన హృదయమంతా భారంగ, మధ్య మధ్య తనింట్లోని సుఖాలు, తల్లి దండ్రి ప్రేమానురాగాలు గుండెను గాయపరచి ఆ గాయాన్ని కెలికినట్లు ఏదో తెలియని దిగులు అదేదో తెలియని గుబులు. ఇది చాలక మరోరకంగా బాధించే విషయం అలా కళ్ళు మూతపడంగానే భయంకరమైన పీడకలలు.
మొత్తానికి పద్మిని ప్రియదర్శినికి ఆ రాత్రి కాళరాత్రి అయి తెల్లారింది.
తెల్లవారుఝాము అనేది అలా వుంచి తెల్లగ తెల్లారాకకూడా వాళ్ళింట్లో నిద్ర లేవదు పద్మిని. అలాంటిది ఇక్కడ ఉదయాన్నే అక్కడ జరుగుతున్న గోలకి నిద్రలేచింది. రాత్రంతా నిద్రలేక తెల్లవారుఝామున పడుకుంది. అలా పడుకుందో లేదో యిలా మెలకువ వచ్చే సంఘటన.
అయినా పూర్తిగా మెలకువరాణి పద్మిని ఇంకా తనింట్లోనే యూఫామ్ బెడ్ మీద పడుకున్నాననుకుని సాంతం కళ్ళు తెరవకుండానే "పన్నూ!" అంది.
పన్నాలమ్మ పద్మిని వాళ్ళింట్లో పనిమనిషి. ముఖ్యముగా ఏ నిమిషాన చిన్నమ్మగారికి ఏమవసరం వస్తుందోనని అందుబాటులో మసిలే మనిషి.
పనిమనిషి పన్నాలమ్మని "పన్నూ!" అని పిలుస్తుంది పద్మిని ప్రియదర్శిని. అటు నిద్ర ఇటు మెలకువగాని స్థితిలో "పన్నూ!" అని పిలిచింది సాంతం కళ్ళు తెరవకుండానే.
అక్కడే వున్న అచ్చమ్మ "ఆఁ!" అంది. ఏందబ్బా యీ పిలుపు అన్న ధోరణిలో.
"వాటీజ్ దిస్ న్యూసెన్స్!" గట్టిగా అరిచింది పద్మిని.
అదేదో చాలా పొడుగాటి ఇంగిలీసు మాట అమ్మాయిగారి నోటిలోంచి కోపంగా వినరావటం చూసి "ఓలమ్మో! ఇదేంటో నాకు తెలిసిచావదే!" అంటూ పైకే వాపోయింది అచ్చమ్మ.
పద్మిని చటుక్కున కళ్ళు తెరిచింది. ఆ వెంటనే స్ప్రింగ్ లా కుక్కి మంచంలోంచి యింతెత్తు ఎగిరిపడింది. దాంతో నడుం కలుక్కుమంది. వెంటనే "అమ్మో!" అని అరిచింది.
"ఏమయింది అమ్మాయిగారూ! ఏమయింది?" కంగారుపడుతూ అడిగింది అచ్చమ్మ.
ఒకే ఒక్క క్షణం అయోమయం అనిపించింది పద్మినికి. ఆ వెంట వెంటనే సినిమా రీళ్ళలాగా కళ్ళముందు నిన్నటి దృశ్యాలే కదులాడాయి. తను యిప్పుడు వుంది కొళ్ళగూడెంలాంటి యీ గూడెం మధ్యలో అన్న సంగతి గ్రహింపుకి వచ్చింది.
"ఏంటి అమ్మాయిగోరూ! అలా ఎగిరిపడి అంతలా గావుకేక వేశారు?" అచ్చమ్మ అమాయకంగా అడిగింది.
"ఏదో పీడకల వచ్చిందిలే" అంతకన్నా ఏం చెప్పాలో తెలియక నడుం నవర తీసుకుంటూ నోటికొచ్చింది చెప్పింది.
"ఏంటీ! మీలాంటి గొప్పింటోరికి కూడా పీడకలలు వస్తాయన్నమాట?" వింతయిన విషయం మొదటిసారి విన్నట్లు ఆశ్చర్యపోయింది అచ్చమ్మ.
"ఏం మేం మటుకు మనుషులంకామా?" పద్మిని ఎదురు ప్రశ్న వేసింది. సాధారణంగా యిలాంటి ప్రశ్నలు బీదవాళ్ళు పెద్దింటివాళ్ళని వేస్తారు.
ఇక్కడ ప్రశ్న తిరగబడింది అంతే.
"మీరెట్టాగయినా పెద్దింటోళ్ళుకందా?" అంది అచ్చమ్మ.
"అయితే ఏంటిట?" అడిగింది పద్మిని.
"ఏవో, నాకేం తెలియదు. వదిలెయ్యండి బేగి ఒక మాట చెప్పండి అమ్మాయిగారూ" మాట మారుస్తూ అంది అచ్చమ్మ.
"అడగకుండా ఎలా చెప్పను? అడుగు"
"మీరు టిపిని ముగం కడుక్కుని తింటారా, ముగం కడుక్కోకుండానే తింటారా?"
"టిపిని అంటే..."
"ఇడ్డిలీలు, పుల్లట్టు అవన్నమాట. గొప్పింటోళ్ళు పొద్దున తింటారంట కదా?"
"ఓహో టిఫెన్ కొచ్చిన గోలన్నమాట" అనుకున్న పద్మినికి ఇడ్లీ మాట ఎత్తగానే ఆకలి గుర్తుకువచ్చింది. వీళ్ళ తిండి ఎలాగూ నయించదు. కనీసం ఇడ్లీ తినైనా పొట్ట నింపుకుంటే కాస్తనయం..." అనుకుంది.
పద్మినికి ఇడ్లీ, రవ్వట్టు ఈ రెండూ చాలా యిష్టం"
"చెప్పండి అమ్మాయిగారూ!" తొందరచేసింది అచ్చమ్మ.
"బ్రష్ చేసుకుని... అంటే పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని ఆ తర్వాత తింటానన్నమాట. ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయా?"
"ఓ...ఆవక్కటే కాదు అమ్మాయిగారూ! పుల్లట్లు, పెసర పుణుకులు, మసాలా వడలు..." లిస్ట్ చదివింది అచ్చమ్మ.
"సరేలే, ముందు బ్రష్ చేసుకోవాలి. నా దగ్గర బ్రష్ లేదు. ఎలా? అంది పద్మిని.
అమ్మాయిగారి ఖాతాలో తనూ తినొచ్చని అచ్చమ్మ ఆశ. అమ్మాయిగారు బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ ని అప్పటికప్పుడు తేవటం తనకి కుదరని పని కాబట్టి తనింటికి నాలుగిళ్ళవతల వున్న మావుళ్ళయ్య ఇంటికి లగెత్తుకు వెళ్ళి వేలు జాపి ఆ వేలుమీద పేస్టుని వేయించుకువచ్చింది. అది చూసి ముఖం చిట్లించ్చింది పద్మిని.
అదిచూసి అచ్చమ్మ ముందుచూపుతో జాగ్రత్తపడి "వేపపుల్లతో ముఖం కడుక్కుంటే మంచిదమ్మాయిగారూ! పోనీ పుల్లతో ముఖంకడుక్కుంటారా? పళ్ళపొడి తెమ్మంటారా? మేమేమో కచిక బూడిదతోను, బొగ్గుముక్కతోను ముఖం కడుక్కుంటాము" అంటూ పరిస్థితి వివరించింది.
ఇప్పటికి సర్దుకుని తర్వాత షాపింగ్ చేసేటప్పుడు తనకి కావాల్సినవన్నీ కొనుక్కు తెచ్చుకుంటే సరి... అనుకున్న పద్మిని ముఖం కడుక్కోటం పళ్ళుతోముకోవటం లాంటి ప్రప్రధమమైన పనులు పూర్తి చేసుకుంది.