Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 6

    "ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు," ముకుందరావు చటర్జీని కౌగలించు కున్నంత పనిచేస్తూ అన్నాడు.

    "దర్శనం! ఈ మాట కూడా పూర్తిచెయ్యి!" నవ్వుతూ అన్నాడు ఛటర్జీ.

    "రైలు ఎక్కడానికి వచ్చావా? రైలు దిగి వస్తున్నావా?" ముకుందరావు అడిగాడు.

    "రైలు ఎక్కించి వస్తున్నాను."

    "ఎవర్ని?"

    "బంగారు తల్లిని"

    "బంగారు తల్లా? ఆమెవరు రోయ్? మధర్ థెరిస్సా లాగా?"

    "అబ్బబ్బా! అప్పటికికాదు, ఇప్పటికి కూడా ఓ పట్టాన' నేను చెప్పింది నీకు అర్ధం కావటం లేదన్నమాట. నువ్వేం మారలేదు. కాకిపిల్ల కాకికిముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకి బంగారు తల్లులే. మా అమ్మాయి రూపంలో అప్సరస. చదువులో సరస్వతి. నేను షాలినీని, బంగారు తల్లీ అనే పిలుస్తూంటాను. నీకేమన్నా అభ్యంతరమా ముకుందం!"

    "ఓ!" అన్నాడు ముకుందరావు. "ఛీ! తన బుర్ర ఇంత పని చెయ్యకుండా పోయిందేమిటి?" అనుకున్నాడు.

    "సారీ రా! షాలిని నిజంగా బంగారు తల్లే. నేను 'షాలీ' అని పిలిచేవాడినికదా! నువ్వు షాలిని అని చెప్పక, బంగారు తల్లి అని చెప్పేసరికి ఒక్కక్షణం తడబడ్డాను. మనం కలుసుకుని చాలా రోజులు కూడా అయ్యింది. "షాలిని" ఎలా వుంది?" ముకుందరావు అడిగాడు.

    "నువ్వు సిటీ శివార్లలో వుంటివి. నేను సిటీ మధ్యలో వున్నాను. మనం కలుసుకునేదే నూటికి ఒక్కసారి సంపాదించిన డబ్బు చాలక నువ్వు ఇంకా బిజినెస్ పట్టుకుని వ్రేలాడుతున్నావ్? పోనీ నేను ఖాళీగా వున్నాకదా అని మీ యింటికి ఐదుసార్లు వచ్చాను. అప్పుడు నువ్వేమో బిజినెస్ పనిమీద టూర్ లో వున్నావు పెద్ద వాళ్ళమయ్యాక రెస్టు తీసుకోవాలోయ్!...."

    "నేను అడిగింది షాలిని సంగతి, నువ్వేమో నన్ను తూర్పారపడుతున్నావు".

    "ఏదీ ఇంకా సాంతం అందే! సాంతం మాట పూర్తి చెయ్యకముందే అడ్డు తగిలితివి వారంరోజులు శలవులు వుంటే మొన్న షాలిని వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో అటూ ఇటూ తిరుగుదాం రామ్మా" అంటే వినిపించుకుంటేనా? ఎప్పుడూ చదువూ చదువూ. పుస్తకంలోంచి తల బయటకి తియ్యదు. మెడిసిన్ చదవడమొకటే ధ్యేయంగా పెట్టుకోలేదు వీలైనన్ని గోల్డుమెడల్స్ సంపాదించాలి. అది ధ్యేయంగా పెట్టుకుంది. చదువులో ఇంతవరకూ ఫస్ట్.

    ఈ మధ్యకాలంలో మనిషిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావ్! కాస్త వళ్ళుచేసి చాలా చక్కగా వుంది. హాస్టల్ లో వున్నా అక్కడి నీళ్ళు వంటబట్టాయ్ కొంతవరకూనయం." కూతుర్ని గురించి గర్వంగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఛటర్జీ.

    "నాది వ్యాపారం బుద్దులు, నీది చదువుల బుద్ధి ప్రొఫెసర్ గా నీవెంత కృషి చేశావ్? నీకు ఆనాడే 'డాక్టరేట్' రావలసింది. ఈ వెధవ రాజకీయాలవల్ల. ప్రతిభకు తగ్గ రాణింపు వుండడం లేదు. అనామకులకి, అర్బకులకి ఆనాడు 'డాక్టరేట్ ఇచ్చి నీలాంటి వాడిని ఆనాడు పక్కకి తోసివేసారు. పోనీలే, మీ అమ్మాయయినా చదివి ఏకంగా డాక్టరే అవుతోంది. లక్ అనేది కొందరికే లభ్యమవుతుంది...." ముకుందరావ్ అన్నాడు.

    "అంతేలే! నీకు చదువంటే మొదటినుంచీ ఎలర్జీ. బిజినెస్ బిజినెస్ అంటూ ప్రాకులాడేవాడివి. ఆ బిజినెస్ లోనే పైకివచ్చావు. పిల్లలందరూ ఎలా వున్నారు?"

    "నేకష్టపడి డబ్బు పెంచుతున్నాను. ఖుషీగా వాళ్ళు ఆ డబ్బుని తుంచుతున్నారు. అన్నట్లు మనోజ్ ఎక్కడ వున్నాడు?" ముకుందరావు అడిగాడు.

    "ఎక్కడ వుండడమేమిటిరా ఇక్కడికే ట్రాన్స్ ఫరయింది. వాడికి నేనంటే చచ్చేంత ప్రేమ. నా కోసం కావాలని ట్రాన్స్ ఫర్ చేయించుకొని వస్తున్నాడు. రక్షక భటులంటే భక్షక భటులని కాకీదుస్తుల్లో క్రౌర్యం దాగి వుంటుందని అనవసరంగా అంటారోయ్! మనోజ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ అయినంత మాత్రాన వాడేమీ రాక్షసుడిగా మారలేదు అదే నిదానం, అదే మంచితనం." మనోజ్ గురించి వివరించాడు ఛటర్జీ.

    "ఒక్కో డిపార్టుమెంటుకీ ఒక్కోపేరు వుంటుందిరా ఛటర్జీ! మోసగాళ్ళు, దొంగలకన్నా పోలీస్ డిపార్టుమెంట్ కె చెడ్డపేరు ఎక్కువ." నవ్వుతూ అన్నాడు ముకుందరావ్.

    ఛటర్జీ కూడా నవ్వాడు.

    ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ స్టేషన్ బయటకి వచ్చారు.

    మరికొద్దిసేపు అక్కడే నించుని మాట్లాడుకుని ఇద్దరూ విడిపోయారు.

    వెళుతున్న ఛటర్జీని చూస్తూ అక్కడే నించుని.

    "రాత్రింబవళ్ళూ కష్టపడి బిజినెస్ ని వృద్ది చేస్తూ బోల్డు డబ్బు సంపాదిస్తున్నాను. అయినా నా పిల్లలకి నామీద గౌరవం లేదు సంపాయించటానికి మాత్రమే నేను పుట్టినట్లుగా జల్సాలు చేసి పాడవుతున్నారు. నేను అదృష్టవంతుడినా, దురదృష్టవంతుడినా? నాకన్నా ఛటర్జీనయం." అనుకున్నాడు ముకుందరావ్.

    "నిజమే!" ముకుందరావ్ అనుకున్నట్లుగా ఆ విషయంలో అదృష్టవంతుడే ఛటర్జీ. 


                                         4


    ఇంట్లో అంతా మంచి నిద్దర్లో వున్నారు.

    అంతటా నిశ్శబ్దంగా వుంది.

    కామాక్షి నిద్రపోయిందని నిర్ధారణ చేసుకుని పాండురంగం చడీ చప్పుడు కాకుండా మంచం మీద నుంచీ లేచాడు.

    సరిగ్గా అప్పుడు పన్నెండూ ఇరవై నిముషాలయింది.

    కామాక్షి నిజంగా నిద్దరపోవడం లేదు.

    దొంగ నిద్ర నటిస్తోంది.

    అర్ధరాత్రుళ్ళు భర్తలేచి, లుంగీవిప్పి పాంటూ, షర్టూ ధరించి బయటకి వెళ్ళి ఏ తెల్లవారుఝాముకో ఇంటికి రావడం కామాక్షి ఇప్పటికి రెండుసార్లు చూసి గ్రహించింది.

    భర్త అటు వెళ్ళగానే, లేచి టైము చూసేది కామాక్షి. అప్పుడు టైము పన్నెండు దాటుతూ వుండేది. అలాగే భర్త తిరిగి వచ్చిన తరువాత. బాత్ రూమ్ కి వెళ్ళే నెపంతో లేచి టైమ్ చూసేది. అప్పుడు టైము నాలుగూ నాలుగున్నర మధ్య వుండేది.

    పాండురంగం ఇంటికి వస్తూనే బాగా అలసిపోయినవాడిలాగా వెంటనే నిద్రపోయేవాడు.

    నిన్న మొన్నటి దాకా అక్కడా అక్కడా తిరిగి భోజనం విషయంలో కూడా ఒక వేళా పాళా లేకుండా, ఏదో ఒక టైమ్ కి ఇల్లు చేరేవాడు. 

 Previous Page Next Page