"ఏం?" ఫైలందుకుంటూ అడిగింది.
"ఇప్పటికే అన్ని రకాలలోన్స్ తీసుకున్నాడు. ఫెస్టివల్ అడ్వాన్సులు డాటర్ మేరేజ్ లోన్, బిల్డింగ్ లోన్, చాలా వున్నాయి: మళ్ళీనా?
నవ్వింది నీలవేణి. మీరీరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. మీకు యీ కంపెనీ పాలసీ తెలియదు మీకైమీరు ఎప్పుడూ నో అని రాయకండి అలా రాస్తే పి.ఎ, గారికి మేనేజర్ గారికి చిర్రెత్తుకొస్తుంది. అదిగుర్తున్నా ఆయనే రధముపై పరిగెత్తేలా చేసుకోండి మీరు. ఎస్ అని రాయలేదనుకోండి శాంక్షన్ చేసేది కాబట్టి. మీకు దొబ్బులు తప్పవు. పైగా అతను ఎ.యం.గారి రిలేటివ్? అంది మెల్లగా.
"థాంక్స్" కదలబోయాడు.
చూడండి అప్పు చేయటం మన కనీస ధర్మం. అది మన ప్రభుత్వమే మనకి నేర్పుతుంది. కొందరికి అప్పుచేయందే తోచదు అంతే.
నవ్వేడు శ్రీకర్.
"వెళుతున్నారా?"
బదులు చెప్పకుండా ఆగేడు.
రండి క్యాంటిన్ కి వెళ్ళి కాఫీ తాగొద్దాం! అఫ్ కోర్స్ పన్నెండింటికి మనందరికి టీ యిస్తారనుకోండి అయినా గంట గంట ఏదో ఒకటి పడందే బండి నడవదు.
ముఖమాటపడ్డాడు శ్రీకర్. పెన్ మూసేసి ఫెయిల్ తెరచివుంచి లేచింది నీలవేణి.
సుబ్బయ్యా! పిలిచింది అటెండర్ ని...అమ్మా అంటూ పలికాడతను. అయ్యగారడిగితే కాఫీకెళ్ళానని చెప్పు అని పలికింది విధిలేక అనుసరించాడు శ్రీకర్.
కేంటీన్ కాఫీతాగి బయటికి వచ్చి ఈ ఆఫీసులో సౌండ్రల్స్ ఎక్కువ బాగా మాట్లాడామనుకో తాటాకులు కట్టేస్తారు.
మంచి డ్రస్ వేసుకున్నావా నిక్ నేమ్స్ పెడతారు. ఎవరినీ కేర్ చెయ్యవా నీ జోలికిరారు. పై అధికారికి అనుకూలంగా వుంటే నీకు టీ, కాఫీలు టేబుల్ దగ్గరకే మోస్తారు. లేదా అటెండర్ కి కూడా లోకువే అంది హితోపదేశంలాగా.
"అంతా రాజకీయం!" అనుకుని నవ్వేశాడు శ్రీకర్.
"పదండి! ఆ ఫైల్ పని ముగించి లంచ్ లోగా పైకి పంపిద్దాం...తర్వాత మిగిలిపోయిన పనివిషయం చూద్దాం!"
తలూపి అనుసరించాడు శ్రీకర్. అతన్ని గురించి ఓ రూపం ఏర్పరుచుకుంది నీలవేణి.
6
"సంధ్యాసమయం! ప్రకృతిమాత చల్లబడుతోంది. మబ్బు కన్నెజడలో తురిమిన ఎర్రమందారంలా వున్నాడు అస్తమించబోయే భానుడు. పార్కులో సందడి మొదలయింది పిల్లలు, పెద్దలు, వయస్సులో వున్నవాళ్ళు వయసు మళ్ళినవాళ్ళు సాయంత్రం అలా షికారుకు వస్తుంటారు.
శ్రీకర్ ఒక మూలగా పొన్నాగ చెట్టుకింద పచ్చికలో వెల్లకిలా పడుకుని వినీలాకాశంలోకి చూస్తున్నాడు. ఎన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి మస్తిష్కంలో.
ఉద్యోగం సమస్య తీరింది. ఇకం మిగిలింది జ్యోతి విషయం.
వెన్నెలబొమ్మని మురిసిపోయాడు. ఆమెను పెళ్ళాడితే జీవితం ఆనందమయమవుతుందని భ్రమించాడు. పెళ్ళి విషయంలో చాలా తొందరపడ్డాడు తను. తనేకాదు ఈనాటి యువతరం చాలామటుకు పైపై మెరుగులకి భ్రమసి తప్పటడుగులు వేస్తుంది.
పెళ్ళి విషయంలో తొందరపాటు చేయకూడదు.
నూరేళ్ళ పంటను నరకప్రాయం చేసుకోకూడదు.
ఇది తను అనుభవ పూర్వకంగా నేర్చుకున్న గుణపాఠం.
తన మనసులో ముళ్ళు నాటింది జ్యోతి. తనేం చేశాడు. తను చేసింది ఒక్కటే తప్పు! ఇల్లరికం పోవడం ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎందుకు ఇల్లరికం వెళ్ళాల్సివచ్చింది? జ్యోతికోసం - జ్యోతి ప్రేమకోసం!
అందుకే తగినశాస్తి చేసింది.
తల్లిదండ్రులంటే పోనీ! కనీసం జ్యోతి అయినా మర్యాదగా ప్రవర్తించేదా? వంటినిండా అహం! మనిషి నిలువెల్లా పొగరుబోతుతనం. నాలుగు నెలల-నాలుగేళ్ళు అనుభవాన్ని రుచి చూపించింది జ్యోతి.
ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్నాడు శ్రీకర్.
"నమస్తే ఏమిటిలా వంటరిగా పడుకున్నారు?" మృదుమధురమైన ఆ గొంతుకవిని వాస్తవంలోకి వచ్చాడు. తలతిప్పి చూశాడు.
ఎదురుగా మందస్మిత వదనంతో నిలబడి వున్నది నీలవేణి.
ఆమెను చూసి ఆశ్చర్యమూ, ఆనందం కలిగింది శ్రీకర్ కి.
"రండి...కూర్చోండి" అంటూ లేచి ఆమెనాహ్వానించాడు.
ఆమె నవ్వుతూ అతనికి కాస్త దూరంలో కూర్చుంది.
నీలవేణి! అందమైన పేరు. మనిషి కూడా అందంగా అప్పుడే కోసిన తాజా రోజులా వుంటుంది. నున్నని చెక్కిళ్ళు, నొక్కుల జుత్తు. కొనదేరిన ముక్కు, సుధలూరించే అధరాలు_ఆమెను చూస్తూనే మంచి అందగత్తె అని అనుకోకుండా వుండలేరెవరూ.
ఆమె నవ్వితే చల్లగా వెన్నెలవాన కురిసినట్లు వుంటుంది.
"మీరు రోజూ ఇక్కడికి వస్తుంటారా?" శ్రీకర్ ప్రశ్నించాడు.
"ఏం మీరూ వస్తుంటారా?" నీలవేణి ఎదురు ప్రశ్న.
"మా ఇల్లు ఇక్కడే__దగ్గర. కాలక్షేపం కోసం అప్పుడప్పుడూ వస్తుంటాను" అని చెప్పాడు శ్రీకర్.
"నేనూ అంతే!" అని నవ్వింది చిన్నగా.
ఆమె నవ్వినప్పుడు విచిత్రంగా సొట్టలుపడే బుగ్గల్ని చూస్తే అతనికి యిష్టంగా వుంటుంది. ఆమెతో పరిచయం అతి స్వల్పం అయినా! ఎన్నాళ్ళనుంచో పరిచయమున్న వ్యక్తిలా మాట్లాడుతుంది కలుపుగోరుతనంగా.
కొద్దిసేపు ఆఫీసు విషయాలు మాట్లాడుకున్నారు.
ఇంతలో ఓ ఇరవై అయిదేళ్ళ యువకుడు అక్కడకు వచ్చి...
"నీలా! నీవిక్కడున్నావా? పార్కంతా గాలిస్తున్నాను నీకోసం పద__సినిమాకు టైమ్ అవుతుంది...." అని హడావిడి పెట్టేశాడు అతను.
"మా బావ శంకర్!" అని పరిచయం చేసింది నీలవేణి.
నమస్కారాలు, ప్రతి నమస్కారాలు అయ్యాయి.
"వస్తానండీ..." అంటూ లేచింది నీలవేణి. తలూపాడు శ్రీకర్.
శంకర్, నీలవేణి అలా ప్రక్క ప్రక్కన నడుస్తూ వెళుతుంటే ఎందుకో శ్రీకర్ ఎదలో సన్నని మంటలు లేచాయి. తనకు ఇష్టమైన వస్తువును ఎవరో లాక్కుపోతున్నట్లుగా అనిపించి - ఆ ఆలోచనలకు తానే విస్తుపోయాడు శ్రీకర్.
"ఏమిటిది! ఆ అమ్మాయి వాళ్ళ బావతో పిక్చర్ కెళుతుంటే తనకెందుకు జెలసీ! తను పెళ్ళయిన వాడు. తన మనసులో మరో భావం వుండకూడదు. నీలవేణి మంచి అమ్మాయి. తన సహాద్యోగి. మనసు విప్పి మాట్లాడుతుంది. మంచి స్నేహితురాలిలా. అంతే! ఆమెను గురించి మరోలా ఊహించడం పాపం! అని అక్కడితో ఆ ఆలోచనలు త్రెంచుకున్నాడు.